ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు
posted on Aug 19, 2012 @ 12:13PM
ఫీజుల ఖరారుపై రాష్ట్రప్రభుత్వానికి సంబంధం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. ఫీజుల ఖరారు వ్యవహారంలో ప్రభుత్వానికి సంబంధమేమిటని, దీనిపై ఎందుకు జోక్యం చేసుకుంటున్నారన్న హైకోర్టు సూటి ప్రశ్నకు అదనపు అడ్వొకేట్ జనరల్ సమాధానం చెప్పలేకపోయారు. దీనిపై న్యాయమూర్తి ‘మౌనంగా ఉన్నంత మాత్రాన సరిపోదు.ఫీజుల విషయంలో ఎవరేం చేస్తున్నారో... ఏం జరుగుతుందో ప్రజలంతా చూస్తున్నారు. అన్ని విషయాలు వారికి తెలుసు’ అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు బయటిశక్తుల ప్రభావానికి లోనుకాకుండా ఫీజులను ఖరారు చేయాలని ఏఎఫ్‌ఆర్‌సిని ఆదేశించారు. నిబంధనలను పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకుని ఫీజులను ఖరారు చేయాలని, కాలేజీలు సమర్పించిన ఫీజుల ప్రతిపాదనలపై నిపుణుల బృందం ఇచ్చే నివేదిక ఆధారంగానే ఫీజులు ఖరారుచేయాలని, అలాగే ఫీజుల ఖరారులో ఏకపక్షంగా వ్యవహరించరాదని కూడా ఏఎఫ్‌ఆర్‌సికి సూచించింది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం తీసుకునే ప్రతినిర్ణయం కోర్టు గుమ్మం ఎక్కి అక్కడి నుండి సంబంధిత శాఖలకు అక్షింతలో, మొట్టికాయలో పడనిదే ఆయా నిర్ణయాలు మంచిగా ప్రజలకు చేరేట్లులేవు. ‘అమ్మ పెట్టే నాలుగు పెట్టందే పని జరగదని..’ మన పెద్దలు అంటుంటారు. స్వంతలాభం కొంత చూసుకుంటు సాగే ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వం ఏదైనా అమలుచేయాలంటే కేసులు, వాయిదాలు వంటివి రాకుండా ముందుగా న్యాయనిపుణులను సంప్రదించి ఖచ్చితనిర్ణయం తీసుకుంటే మంచిదేమో! అయినా అంతముందుచూపు ఉంటే అసలు తప్పులెందుకు జరుగుతాయి? అంటున్నారు ప్రజలు.