వెయిట్ అండ్ సీ.. యేనా!
భయం కావచ్చు... లేదా ఇతరులు చేసిన పనులకు మేం బలి అవుతున్నామన్న బాధ కావచ్చు... ఏదేమైనా జగన్ కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సిబిఐ ఛార్జిషీటు దాఖలు చేయడం, ఆ వెంటనే ఆయన రాజీనామా, ఆయన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు సిబిఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం వెంటవెంటనే జరిగిన నేపథ్యంలో .. ధర్మాన విషయంలో జరిగింది రాబోయే కాలంలో తమకు జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్న మంత్రులు.. ధర్మాన రాజీనామాను ఆమోదించవద్దని, ఆయన ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వొద్దని ముఖ్యమంత్రికి మంత్రులనుండి ఆల్టిమేటం వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ విషయంతో తమకు అండగా ఉండని పక్షంలో పార్టీకి నష్టం జరుగుతుందని, అది అంతమంగా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తుందని తేల్చి చెప్పారు. ఇప్పటికే ధర్మాన విషయంలో డైలమాలో పడిన ముఖ్యమంత్రి.. తాజాగా 24మంది మంత్రులు అధిష్టానంపై తిరుగుబాటు చేసినట్లుగా వ్యవహరించడంతో ఆయన పూర్తి నిస్సహాయుడైనట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే ఈ తిరుగుబాటు వెనుక రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుని ఆశీస్సులు తెలుస్తోంది. క్యాబినెట్‌లోని మెజారిటీ సీనియర్ మంత్రుల డిమాండ్‌ను వారి అభిప్రాయాలను అధిష్టానం ముందు పెడతానని సముదాయించినట్లు తెలుస్తోంది... ఈ విషయాలపై మంత్రులు తమ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ధర్మాన చెప్పిన విషయంపై ఇతర మంత్రులు కూడా జోక్యం చేసుకుంటూ నాటి ముఖ్యమంత్రి వైస్ రాజశేఖరరెడ్డికి ఎవరూ ఎదురుచెప్పే అవకాశమే లేదని, వైఎస్‌కు అధిష్ఠానంలోనూ... రాష్ట్రంలోనూ పలుకుబడి ఉన్నందున మంత్రులందరూ ఒక్కో సందర్భంలో క్యాబినెట్ మీటింగుల్లోనూ ప్రేక్షకపాత్ర వహించే పరిస్థితి ఉండేదని, ఇది అధిష్టానానికి కూడా తెలుసని ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. సమావేశంలో సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న ఇతర మంత్రులు కూడా తమ తమ కేసుల వివరాలను ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన మీటింగ్‌లో వివరించినట్లు తెలుస్తోంది.
అన్నీ క్యాబినెట్ నిర్ణయాల మేరకు నిబంధనలకు అనుగుణంగానే జరిగాయని, రాష్ట్ర పారిశ్రామిక విధానానికి అనుగుణంగానే జీవోలు జారీ అయ్యాయని, అయితే ఈ జీవోల జారీతో జగన్‌కు లబ్ది పొందితే అప్పటి ముఖ్యమంత్రి వైస్ బాధ్యులవుతారు కానీ క్యాబినెట్‌లో ఉన్న తమను బాధ్యులుగా చేయటంలో ఔచిత్యం లేదని వారు పేర్కొన్నారు. అయితే, సిబిఐ తాజా ఛార్జిషీట్‌లో వైఎస్‌పేరును కూడా ప్రస్తావించడంతో కేసు ఏ మలుపులు తిరుగుతుందోనని మంత్రులు ఆందోళనలో ఉన్నారు. అయితే, ఇది సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన మంత్రుల వరకే పరిమితమవుతుందా? వైఎస్ వారసునిగా లబ్దిపొందిన జగన్‌పైకేసు మరింత బిగుసుకుంటుందా? అనేది తేలాల్సి ఉంటుంది. ఇదంతా చూస్తుంటే ఒకరిద్దరు చేసిన పాపం ఎందరికో చుట్టుకుని, కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కాయ పండి పక్వానికి వచ్చిన తర్వాత చెట్టునుండి పడక తప్పదు, లేదా ఎవరైనా కోయకతప్పదు. అప్పటివరకు వెయిట్ అండ్ సీ...యే!