అడకత్తెరలో పోకచెక్కలు ... ఎమ్‌సెట్ విద్యార్ధులు
సుప్రీంకోర్టు విద్యార్ధులందరికీ సమానమైన విద్య అందించాలని తీర్పు ఇవ్వటంతో పెరిగిన ఫీజులు ప్రభుత్వానికి ఆర్ధిక భారాన్ని, బిసి విద్యార్ధులకు ఫీజులు చెల్లించుకోలేని పరిస్థితులను కల్పించాయి. మొత్తం మీద రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్దుల పరిస్థితి అస్తవ్యస్తంగా వుంది. ఈ నేపధ్యంలో విద్యార్దుల భవిష్యత్ ప్రశ్నార్దకంగా మారింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పేదవారు ఉన్నత విద్యకు దూరం కాకూడదు అనే లక్ష్యంతో ఈ పధకాన్ని 2008లో ప్రవేశపెట్టారు. అప్పటికి రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య 1,50,000 మాత్రమే. కానీ రాను...రానూ...రీఎంబర్స్‌మెంట్ ఉండటం వల్ల దీని సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని మేధావులు చెబుతున్నారు.
ఈ సంవత్సరం ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య మూడున్నర లక్షలవరకూ ఉన్నట్లు ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇంటర్ అంటే ఇంజనీరింగ్ అనే పరిస్థితి ఏర్పడిరది. ప్రభుత్వ ఇంటర్ కాలేజీలన్నీ మూతపడి కార్పొరేట్ కాలేజీలు ఇంజనీరింగ్, ఐఐటి, కోర్సుంటూ అంటూ ఫీజులు గుంజుతున్నాయి. ప్రతి కార్పొరేట్‌కాలేజ్ సంవత్సరానికి రాష్ట్రంలోని అన్ని బ్రాంచీలతో కలిపి 350 కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నాయనేది అక్షర సత్యం. క్యాలీఫై కాని వాళ్లుకూడా ఇంజనీరింగ్‌లో జాయిన్ అవటంవల్ల డిగ్రీలో ఎవరూ చేరని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నాసిరకం ఇంజనీరింగ్ చదువుల వల్ల కేవలం 20 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. కామర్స్‌కి ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉంది కాని ఆ వైపు చూసే విద్యార్దులే లేరు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు లెక్కలేకుండా రాష్ట్రంలో 700 ప్రయివేటు కాలేజీలకు పర్మిషన్ ఇవ్వడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణం. యాజమాన్యాలు సరైన సదుపాయాలు లేకుండా ఫీజులు పెంచారన్నది ప్రభుత్వవాదన, అయితే గత ఆరేళ్లుగా 31,000 రూపాయల ఫీజులతో నెట్టుకొస్తున్నామనేది యాజమాన్యాల వాదన.
మంచి విద్య, ఎంప్లాయిమెంట్ స్కిల్స్, ఇండస్ట్రియల్ స్కిల్స్, ఫ్యాకల్టీ పెంచడం లేదని ప్రభుత్వం చెబుతుంటే ఇండస్ట్రియలిస్ట్‌లు సహకరించడంలేదని, లెక్చరర్లకి ఆరో వేతన సంఘం సిఫార్సులు వచ్చినా ఐదోవేతన సంఘం సిఫార్సులనే అమలు చేయడం కష్టంగా ఉందని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే డీమ్డ్ కాలేజీలు మాత్రం సంవత్సరానికి 1,50,000 రూపాయల ఫీజు విద్యార్ధుల నుండి వసూలు చేస్తున్నాయని వారు చెబుతున్నారు. పారిశ్రామికవేత్తలు విద్యార్దులంతా వేసవి సెలవుల్లో మాత్రమే వచ్చి ప్రాజెక్టులు చేపడతామంటున్నారని అందుకే వారిని తీసుకోలేక పోతున్నామని చెబుతున్నారు. అలాగే రిసెర్చి పేరుతో మాకు టాక్సు మినహాయింపునిస్తే విద్యార్దులను మరింత ప్రోత్సహించగలమని కూడా వారు చెబుతున్నారు. కాలం చెల్లిన కోర్సులనే కాలేజీలు అందిస్తున్నాయని, అదీ కంప్యూటర్‌సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలవల్ల యూరప్ దేశాల ప్రభావం మన మీద పడుతుందని మేధావులు చెబుతున్నారు. ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యాలు, ఉద్యోగావకాశాలు కల్పించే ఇండస్ట్రీలు వీటిమధ్యలో విద్యార్దులు వారి తల్లి,తండ్రులు సమిధలవుతున్నారు. ఏది ఏమైనా విద్యార్దులు విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వానిదే.