పార్లమెంట్ ప్రాంగణంలో పింగళి ప్రతిమ కలేనా?
భారత దేశ స్వేచ్ఛా స్వాతంత్య్ర సార్వభౌమాధికారాలను నలుదిశలా చాటిచెప్పే జాతి జనుల హృదయ స్పందన త్రివర్ణపతాకం! దీని సృష్టికర్త మనదేశ తెలుగు వాడైన పింగళి వెంకయ్య ! కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని భట్ల పెనుమర్రు గ్రామానికి చెందిన పింగళి వెంకయ్య క్రమశిక్షణ గలిన దేశభక్తుడు! భరతమాత దాస్యవిముక్తి కోసం అవిశ్రాంతంగా పోరాడిన స్వాంతంత్య్ర సమరయోధుడు! ఈయన జాతీయ కాంగ్రెస్‌కోసం 1921లో తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులలో కూడిన ఒక జెండా రూపొందించారు. అప్పట్లో ఇది కాంగ్రెస్ అనధికార పతాకం. ఆ తర్వాత 1931లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చరంగులలో, మధ్యలో రాట్నం బొమ్మగల పతాకాన్ని కాంగ్రెస్ అధికార పతాకంగా స్వీకరించింది. స్వాతంత్య్ర సమర జైత్రయాత్రలో ప్రజలంతా ఒక్కటై నడవడానికి ఈ జెండా మంచి స్ఫూర్తిగా నిలిచింది. మనదేశానికి స్వాతంత్య్రం రావడానికి కొద్దిరోజుల ముందు దేశ జాతీయపతాకాన్ని రూపొందించే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్న పింగళి వెంకయ్య త్యాగానికీ, స్వచ్ఛతకూ, పవిత్రతకూ, సంపదకూ, అభివృద్ధికీ సంకేతంగా రూపొందించిన మువ్వెన్నెల పతాకం 1947 జులై 22 తేదీన భారత జాతీయ పతాకంగా రాజ్యంగసభ ప్రత్యేక సమావేశం ఆమోదించింది.
భారతీయుల హృదయ స్పందంగా ప్రజాజీవితంలో మమేకమై పోయిన మువ్వెన్నెల జెండాను గౌరవిస్తున్నామే తప్ప, అటువంటి అపురూప కానుకను దేశానికి అందించిన పింగిళి వార్ని గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యాడంటూ వెంకయ్యగారి స్వగ్రామమైన భట్ల పెనుమర్రు గ్రామస్తులు వాపోతున్నారు. జాతిపిత బిరుదు ఎప్పుడు వచ్చిందో ఎవరిచ్చారో ఎవ్వరికీ తెలియకపోయినా, జాతిపితగా మహాత్మాగాంధీని గౌరవించి స్మరించే మనం మన జాతీయ జెండాను రూపొందించిన పింగళి గౌరవార్థం ఏం చేస్తున్నాం? అంటూ ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదు! తన అహింసాయుధంలో దేశ విముక్తికి అహర్నిశలు కృషిచేసిన మహాత్ముని జయంతి వర్ధంతులను జాతీయ సెలవు దినాలు ప్రకటించినట్లుగానే మన జాతీయజెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతిని వర్ధంతులను జాతీయ సెలవు దినాలు ప్రకటించాలనీ, పార్లమెంటు ప్రాంగణంలో వెంకయ్య విగ్రహం ప్రతిష్టించాలని ఆగ్రామస్తులు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో హామిలిచ్చి ఆ తర్వాత మర్చిపోయే నేతలు పింగళి వెంకయ్య విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేస్తామని గతంలో అనేకసార్లు చెప్పినప్పటికీ ఇంత వరకూ అది అమలుకు నోచుకోలేదు! నేటి తరానికి స్ఫూర్తినిచ్చే ఇలాంటి విషయాల్లో అలసత్వం వహించడం ప్రతి భారతీయుడినీ ముఖ్యంగా ప్రతి తెలుగు వాడి హృదయాన్ని గాయపరుస్తోందన్నది నిజం!