అస్సాంలో ఏం జరుగుతోంది?
posted on Aug 19, 2012 @ 11:22AM
అస్సాంలో స్థానిక బోడో గిరిజనులకు, ముస్లిం మైనారిటీ వలసవాదులకు మధ్య జరుగుతున్న ఘర్షణలకు దేశంలో పలు రాష్ట్రాల్లో వున్న అస్సాం వాసులు భయంమాటున జీవనం సాగిస్తున్నారు. పలుచోట్ల తామున్న ప్రాంతాలను వదిలి తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అయితే ప్రభుత్వం అసలు ఘర్షణలకు మూలకారణాలను వెదికి పరిష్కారం కనుగొనకుండా మొండిగా వ్యవహరించడం వల్లే నేటి హింసలకు కారణమవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ హింసకు మూల కారణంగా భావిస్తున్న అక్రమ వలసలతో జనాభాపరంగా సమతుల్యత లోపించిన అస్సాంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్లమెంటు కూడా తనవంతు పాత్ర పోషించవలసి ఉంది.
రాష్ట్రాలు సుభిక్షంగా, ప్రశాంతంగా ఉంటేనే దేశం ప్రశాంతంగా ఉంటుంది. ఏ రాష్ట్రమైనా ప్రశాంతంగా ఉండేలా చూడవలసిన బాధ్యత అయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంపై ఉంది. శాంతిభద్రతలు వంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించనప్పుడు ఇటువంటి సంఘటనలు ఆ రాష్ట్రాన్నే కాక ఇతర రాష్ట్రాలను సైతం అలజడికి గురిచేస్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు సత్వరమే దీనికి చక్కని పరిష్కారం కనుగొనవలసి ఉంది.