విద్యార్ధులకు మలేరియా, విషజ్వరాలు
posted on Aug 20, 2012 9:04AM
తూర్పుగోదావరి ఏజెన్సీలో రోజురోజుకూ మలేరియా ,విషజ్వరాలతో సంక్షేమ హాస్టళ్లను సిక్‌రూమ్‌లను చేశాయి. ప్రతి వసతి గృహంలోనూ రోజుకు 10 నుండి 20 మంది విద్యార్ధులు జ్వరాలబారిన పడుతున్నారు. గత ఏడాది విషజ్వరాలకు 15 మంది చనిపోయారని ప్రభుత్వ లెక్కల్లో ఉండగా మరింత ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఒక కానిస్టేబుల్‌కూడా మలేరియా బారిని పడి మృతి చెందారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి ప్రతిరోజూ 70 నుంచి 100 మంది జ్వరాలతో వస్తున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహాలతో పాటు, మైదాన ప్రాంతాల్లో కూడా విద్యార్దులు జ్వర పీడుతులుగా ఉన్నారు.తూర్పుగోదావరి జిల్లా లోని ఏడు మండలాల్లో 78 గిరిజన సంక్షేమ, ఆశ్రమ వసతి గృహాలన్నాయి. ఒక్కో వసతి గృహంలో 300 మంది విద్యార్ధులు ఉన్నారు. ఏ వసతి గృహాన్ని పరిశీలించినా కనీస వసతులలేమి,పారిశుద్యలేమి కన్పిస్తుంది.
రంపచోడవరం పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ కళాశాలలకు చెందిన 350 మంది విద్యార్ధులు దాహానికి వాగునీటినే వాడుతున్నారు.ఫలితంగా విషజ్వరాలు, మలేరియా వ్యాధికి గురి అవుతున్నారు. వసతి గృహాలన్నీ ఇలాగే ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. దేవిపట్నం మండలంలోని ఆశ్రమ పాఠశాలకూడా ఇరుకైన గదుల్లో ఉండటం, పారిశుద్యలోపం వెరసి దోమలకు నిలయంగా మారింది. అయితే ఏజెన్సీలో ఏరియా ఆసుపత్రితో పాటు మరో 18 ప్రాధమిక ఆసుపత్రులున్నాయి. వీటిలో 36 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం 18 మంది మాత్రమే ఉన్నారు.డాక్టర్ల కొరతే కాకుండా మందుల కొరత కూడా వెంటాడుతుంది. దోమలనుండి రక్షణకు దోమతెరలు పంచినా వినియోగంపై అవగాహన లేకపోవడంతో గిరిజనులు వినియోగించడం లేదు.దోమలను లార్వా దశలోనే నిర్మూలించేందుకు ఈ పాటికే స్ప్రేను 2 సారి వినియోగించవలసి ఉన్నా మలేరియా విభాగాన్ని నిధుల కొరత వెంటాడటంతో అరకొరక పనులు చేస్తున్నారు. ఏజెన్సీ ఆసుపత్రిలో కూడా మలేరియా కిట్స్ లేకపోవడంతో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఎలా ఉంటుందో అని అంచనావేసుకోవచ్చు.రోజు రోజుకీ ఆసుపత్రుల్లో మలేరియా, ఇతర విషజ్వరాలతో నిండుతున్నా అధికార యంత్రాంగంలో మాత్రం చలనం ఉండటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.