తెలుగుదేశానికి వంటేరు గుడ్‌బై

తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లా నాయకుడు వంటేరు వేణుగోపాలరెడ్డి రాజీనామా చేయనున్నారు. త్వరలో తన రాజీనామా పత్రాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించనున్నారు. వంటేరు వేణుగోపాలరెడ్డి నెల్లూరు పార్లమెంటరీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరుపున 2012 ఉపఎన్నికల బరిలో నిలిచారు. అప్పుడు కూడా నామినేషన్ల ఘట్టం ముగింపు దశలో తాను పోటీ నుంచి వైదొలుగుతానని వంటేరు ప్రచారంలో ఉన్న చంద్రబాబును కలిశారు. అకస్మాత్తుగా పోటీ నుంచి తప్పుకుంటే తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే మాయని మచ్చ మిగిలిపోతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.   నెల్లూరు లోక్‌సభ స్థానం పోయినా పర్వాలేదు కానీ, పోటీ చేయాల్సిందేనని వేణుగోపాలరెడ్డికి సర్దిచెప్పారు. తప్పని సరి పరిస్థితుల్లో చంద్రబాబు బలవంతంపై పోటీ చేయటానికి ఒప్పుకున్న వంటేరు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో అంతగా పాల్గొనని వేణుగోపాలరెడ్డి చివరికి తాను పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందని తెలుగుదేశం నేతలు ఆరా తీస్తున్నారు. తన రాజీనామా ఆమోదించాకే అస్సలు విషయం మీడియా ముందు బయటపెడతానని వేణుగోపాలరెడ్డి స్వయంగా ప్రకటించారు. దీంతో ఇంకేమి విషయం ఉందో అన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది. కొంపదీసి వంటేరు కూడా వైకాపా బాట పడుతున్నారా? లేక రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారా? ఏం జరగనుందో? చూద్దాం!

ఒకే రోజు హైకోర్టు రెండు సంచలనతీర్పులు

ఒకే రోజు హైకోర్టు రెండు సంచలన తీర్పులను ఇచ్చింది. దీని వల్ల ఒకరికి మోదం(ఆనందం), మరొకరికి ఖేదం అన్నట్లుంది ఫలితం. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు ఎన్నిక చెల్లదని ఆయన సమీప ప్రత్యర్థి పిటీషను దాఖలు చేశారు. ఈ కేసు పూర్వాపరాలు విచారించి రాంబాబు ఎన్నిక సక్రమంగానే జరిగిందని హైకోర్టు గుర్తించింది. కావాలనే అతనిపై కేసుపెట్టారని గమనించి ఆ పిటీషను హైకోర్టు కొట్టివేసింది. దీంతో రాంబాబు అనుచరులు విజయోత్సాహంతో గిద్దలూరులో పండుగ వాతావరణం సృష్టించారు. అలానే విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే జనార్దన్‌ థాట్‌రాజ్‌ ఎన్నికపై కొందరు సవాల్‌ చేస్తూ కోర్టులో పిటీషను దాఖలు చేశారు. థాట్‌రాజ్‌ సరైన కులధృవీకరణ సమర్పించకుండానే ఎన్నికల కమిషనుని మోసం చేశారని ప్రత్యర్థులు ఆధారాలతో సహా నిరూపించారు. జనార్దన్‌ మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు మేనల్లుడు కూడా కావడం గమనార్హం. దీంతో పూర్తిగా విచారణ జరిపిన తరువాత జనార్దన్‌ గిరిజనుడు కాదని రాష్ట్రహైకోర్టు తీర్పును వెలువరించింది. సరైన కులధృవీకరణ సమర్పించలేదని కోర్టు తప్పుపట్టింది. దీంతో టీడిపి అభ్యర్థి నిమ్మక జయరాజ్‌ అక్కడ విజయం సాధించినట్లయింది. ఈ తీర్పుతో జనార్దన్‌ థాట్‌రాజ్‌ అనుచరులు విషాదంలో మునిగిపోయారు. విజయం సాధించినా ఎమ్మెల్యే కాలేకపోయామని థాట్‌రాజ్‌ వాపోతున్నారు.

పంతం నెగ్గించుకున్న ధోనీ

గురువారం నుంచి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, కివీస్ జట్లమధ్య తొలి టెస్ట్ మ్యాచ్. ఉప్పల్ స్టేడియంలో ఆరు పిచ్ లున్నాయి. రెండు మూడు వికెట్లను హెచ్ సీఏ సిద్ధం చేసింది. కెప్టెన్ ధోనీ మాత్రం రెండో వికెట్ కావాలని పట్టుబట్టాడు. స్పిన్ వికెట్ చేతిలో ఉంటే కివీస్ ని ముప్పు తిప్పలు పెట్టొచ్చని ధోనీ భావిస్తున్నాడు. మూడో వికెట్ మీద పచ్చిక ఎక్కువగా ఉండడం, పగుళ్లు ఎక్కువగా ఉండడంవల్ల ధోనీ దాన్ని పక్కన పెట్టేశాడు. బీసీసీఐ నుంచి కూడా పెద్దఎత్తున ఒత్తిడి రావడంతో హెచ్ సీఏకి ధోనీ మాట వినక తప్పని పరిస్థితి ఎదురయ్యింది. కిందటిసారి ఈ వికెట్ మీద బౌలింగ్ లో రాణించలేకపోయిన స్పిన్నర్ హర్భజన్ బ్యాటింగ్ లో మాత్రం అదరగొట్టి సెంచరీ సాధించాడు. స్పిన్ మాయాజాలంలో ఆరితేరిన హర్భజన్ అప్పట్లో "ఈ పిచ్ ని తయారుచేసిన క్యూరేటర్ హైవేలు నిర్మించడానికి బాగా పనికొస్తాడంటూ" వ్యంగ్యాస్త్రాలుకూడా సంధించాడు. గతంలో హర్భజన్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తుపెట్టుకున్న క్యూరేటర్.. ఈ సారి మాత్రం వికెట్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నాడు.  

అన్నీ కోతలే

వర్షాలు తగ్గుముఖం పట్టడం, జలాశయాల్లో నీటిమట్టాలు కూడా అంతంతమాత్రంగానే ఉండటం, రామగుండం ఎన్టీపిసిలో ఒక యూనిట్‌ ట్రిప్‌ కావడంతో మళ్ళీ విద్యుత్‌ కోత ప్రారంభం. ఇంటి అవసరాలతోపాటు, పరిశ్రమలకు సైతం ఈ కోత ప్రారంభమయింది. ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడగా పేరుపొందిన పటాన్‌చెరులో ఆదివారం నుండి పవర్‌ హాలిడే ప్రకటించారు. రామగుండం ఎన్టీపిసిలో 550 మెగావాట్ల యూనిట్‌ ట్రిప్‌ కావడంతో  పారిశ్రామికవాడకు సరిపడినంత విద్యుత్‌ సరఫరా చేయలేకపోతున్నామని  ట్రాన్స్‌కో అధికారులు  తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తి మెరుగైన తర్వాత మళ్ళీ పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఎప్పుడు సరఫరాచేసేది చెబుతామని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు.  అప్రకటిత కోత వల్ల   ముడిపదార్ధాలు పాడైపోయి  తీవ్రంగా నష్టపోయామని  పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కోతవల్ల సుమారుగా 1075 చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమల్లో ఉత్పాదన ప్రక్రియ నిలిచిపోయిందని తెలుస్తోంది. విద్యార్ధికి ఫీజు కోత, సామాన్యులకు రేషన్‌ కోత, నిరుద్యోగులకు ఉద్యోగాల్లో కోత ఇలా... అధికారంలోకి వచ్చిన నాటి నుంచి... మళ్ళీ ఎన్నికల ముందు వరకు అన్నిటా కోతలేనా? .. ఈ కోతలకు ముగింపు ఎప్పుడా అని సామాన్యులు ఎదురు చూస్తున్నారు.

ప్యాకెట్లో డబ్బుంటే... సిక్స్‌ ప్యాక్‌ రెడీ!

యూత్‌ దేన్నయినా తొందరగా అర్ధం చేసుకుంటుంది. అంతే తొందరగా అలవాటుపడిపోతుంది. కాకుంటే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే అలవాటు చేసుకున్న వాటిని వదులుకోవడమే...! ఈ మధ్యకాలంలో ముఖ్యంగా యువకుల నోట వినిపిస్తున్న మాట సిక్స్‌ ప్యాక్‌. పదిమందిలో తాము ఒకరుగా గుర్తింపు కోసం కావచ్చు, అమ్మాయిలు తమను చూసి మెచ్చుకుని స్నేహం చేయాలన్న ఆశ కావచ్చు... చాలామంది నేడు సిక్స్‌ ప్యాక్‌ కోసం కసరత్తులు చేస్తున్నారు...! ఇలా సిక్స్‌ ప్యాక్‌లకోసం ప్రయత్నించే సినిమా హీరోలయితే చాలామందే ఉన్నారు.   సల్మాన్‌, షారుఖ్‌,  అమీర్‌ఖాన్‌ వంటి హిందీ హీరోలు ఈ ప్యాక్‌లతో అభిమానులను అలరించినవారే.. ఈ జాబితాలో తెలుగుసినిమా కూడా చేరింది. సిక్స్‌ ప్యాక్‌లతో నేటియువతరం టాలీవుడ్‌ హీరోలు అభిమానులను అలరిస్తున్నారు. ఏదిఏమైనా` ఏకొత్త అంశమైనా కొద్ది కాలం తర్వాత పాతబడిపోతుందన్నట్లుగానే... ఈ ప్యాక్‌లకు కూడా ఒకటి, రెండు సినిమాలకు తప్ప ఆ తర్వాత ఆసక్తి తగ్గుతుందనేది మామూలే...! అయినా పర్లేదు... సిక్స్‌ప్యాక్‌ కావల్సిందే అనుకుంటే మాత్రం అందుకోసం జిమ్‌లలో గంటల తరబడి కసరత్తులు చేయవలసి వస్తుంది.  అయితే సిక్స్‌ప్యాక్‌ అంటే ఇష్టమున్నా వారిశరీరకశక్తి  ఇటువంటి ఎక్సర్‌సైజ్‌లకు సహకరించకపోతే నిరాశచెందనక్కర్లేదటున్నారు దాక్టర్లు. ఇకనుండి సిక్స్‌ప్యాక్‌ కావాలంటే జిమ్‌లకు వెళ్ళనక్కరలేదని  కాసేపు ఆపరేషన్‌  చేయించుకుంటే చాలు  సిక్స్‌ప్యాక్‌ దేహం ఎవరికైనా రెడీ అని  కాస్మెటాలజిస్టులు భరోసా ఇస్తున్నారు. సర్జరీలో భాగంగా  లైపో స్కల్ప్సర్‌ తదితర టెక్నిక్‌లను వినియోగించి సిక్స్‌ప్యాక్‌ దేహం వచ్చేలా చేస్తారు. ఊబకాయంఉన్నవారు, బాగా సన్నగా, ఉండవలసిన బరువుకన్నా  బాగా తక్కువ బరువున్న వారికి ఈ సర్జరీ చేయరనీ, ఆరోగ్యంగా వున్న వారు ఈచికిత్స చేయించుకోవచ్చని కాస్మెటాలజిస్టులు వారంటున్నారు. అయితే  దీనికి  డబ్బులు కూడా దండిగానే ఖర్చవుతాయట...!.ఉత్తరాదికి చెందిన టీవీ నటులు, మోడల్స్‌, సినిమా ఛాన్స్‌లకోసం అన్వేషణ సాగిస్తున్నవారు ఇటువంటి చికిత్సలపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే` ఆపరేషన్‌తో సాధించిన సిక్స్‌ప్యాక్‌ స్థిరంగా ఎంతకాలం ఉంటుందన్నది సమాధానంలేని ప్రశ్నే...! అయినా ఫరవాలేదనుకునేవారు సిక్స్‌ప్యాకులకోసం ప్రయత్నించవచ్చు.  

అధిక విద్యుత్‌ వాడే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు జైలుశిక్ష

రాష్ట్రాలు తమకు కెటాయించిన విద్యుత్‌ వినియోగం కంటే ఎక్కువ విద్యుత్‌ను వాడుకుంటే పెనాల్టీ విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తుంది.అలాగే ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు జైలు శిక్షవిధించడం ద్వారా దీనికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.కొన్ని రాష్ట్రాలు అధికంగా విద్యుత్‌ వాడకం ద్వారా మూడు గ్రిడ్లువిఫలమై దాదాపు దేశంలోని సగభాగం అంధకారంలో చిక్కిన నేపధ్యంలోప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. విద్యుత్‌ విషయంలో నిబంధనలు పాటించని రాష్ట్రాలకు భారీ జరిమానా విధించడంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను, అధికారులను జైలు శిక్ష విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. జూలై నెలాఖరున తూర్పు, ఉత్తర, ఈశాన్య గ్రిడ్లు విఫలం అవ్వడంతో 21 రాష్ట్రాలకు విద్యుత్‌ నిలచిపోవడంతో చీకటి మయమయ్యాయి. అంతకు ముందురోజుకూడా ఉత్తరగ్రిడ్‌ విఫలమై డిల్లీతో 9 రాష్ట్రాలలో కరెంటు సేవలు ఆగిపోయాయి.   గ్రిడ్ల వైఫల్యానికి కరెంటు అధిక వినియోగమే కాకుండా, ఓవర్‌లోడ్‌వల్ల కూడా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అధిక విద్యుత్‌ వినియోగంపై నిఘావుంచేందుకు రాష్ట్ర స్ధాయిలో స్వతంత్ర నియంత్రణ సంస్థలను నెలకొల్పుతారని తెలుసింది. విద్యుత్‌ వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు 2003 ఎలక్ట్రిసిటీ యాక్టుకు పలు సవరణలు తీసుకురానున్నారు.  

రాష్ట్ర సంక్షోభాలకు కేంద్రమే కారణమా?

వాన్‌పిక్‌ వ్యవహారంలో సిబిఐ చార్జ్‌షీట్‌ పెట్టిందని నైతిక భాద్యత వహిస్తూ రాజీనామా చేసిన ధర్మాన ప్రస్తుతానికి మిగాతా మంత్రుల పరామర్శలతో ఇంటి దగ్గరే ఉన్నారు. దీనిపై స్పందించిన గవర్నర్‌ ఫైల్‌ ఇంకా నాదగ్గరకు రాలేదంటూ వస్తే చట్ట బద్దంగా వ్యవహారిస్తానని చెప్పారు. ఇంకా కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు ధర్మాన ప్రసాద్‌రావు రాజీనామాను పంపలేదనే సంకేతం పంపారు. ఇప్పుడు దీనిపై నిర్ణయం తీసుకోవలసింది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ పైనే ఉంది.  అయితే  మంత్రులు మాత్రం రాజీనామాను అంగీకరించవద్దనే ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపధ్యంలో కిల్లి కృపారాణి మరికొంత మంది, అధిష్టానాన్ని కలసి చెప్పటానికి ప్రయత్నిస్తే పట్టించుకునే వారే కరువయ్యారు. వాయిలార్‌ రవి రాజకీయాలలో ఏదైనా జరుగుతుందంటూ తప్పించుకున్నారు. పిసిసి అధ్యక్షుడిగా బొత్స ఢల్లీి వెళ్లి పరిస్థితులు వివరించి నిర్ణయాన్ని అధిష్టానికే వదిలి వేయాలని బొత్సనిర్ణయించుకున్నారు. అంటే ధర్మాన రాజీనామా అమోదించటం కిరణ్‌కు తప్పేటట్లు లేదు. అయితే ఆమోదించవద్దంటూ మంత్రుల ఒత్తిడితో అడకత్తెరలో పోకచెక్కలా అధిష్టానానికి, మంత్రులకూ మద్యనలిగిపోతున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్ధితులకు కేంద్రప్రభుత్వమే కారణమంటున్న మంత్రుల  సంఖ్య నానాటికి పెరుగుతోంది. రాష్ట్ర రాజకీయాలు పరిస్థితులపై  కేంద్రం దృష్టి పెడటం లేదని రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని మంత్రులు వాపోతున్నట్లు తెలుస్తుంది. ఏదిఏమైనా రాష్ట్రరాజకీయాలకు ఉపద్రవం ముంచుకొచ్చినట్లే అని రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు.  

ఆందోళనలకు సిద్దమవుతున్న పారిశ్రామిక వేత్తలు

రాష్ట్రంలో గాడాంధకారం రాజ్యమేలుతుంది.వర్షాభావ పరిస్థితుల్లో హైడల్‌ విద్యుత్‌ కేంద్రాలు చతికిల బడ్డాయి. ఆపై గ్యాస్‌ కొరతతో విద్యుత్‌ ఉత్పత్తిపై కారుమబ్బులు కమ్ముకున్నాయి.దీంతో ధర్మల్‌ కేంద్రాలపై ఒత్తిడి పెరిగింది. డిమాండ్‌కు సరఫరాకు మద్య విద్యుత్‌ గ్యాప్‌ ఆగాధంలా పెరిగిపోయింది. జూరాల, శ్రీశైలం, నాగారదినసాగర్‌ జలాశయాలు నిండకుండా కోతలులేని కరెంటు సాధ్యపడదని ముఖ్యమంత్రి ఇందరమ్మ బాటలో చెప్పేశారు. కరీంనగర్‌జిల్లాలోని ఎన్‌టిపిసి ధర్మల్‌ కేంద్రంతో పాటు జూరాల జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి మరింత క్షీణించడంతో రాష్ట్రంలోని విద్యుత్‌ కొరత గణనీయంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 7 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ రెండుగంటలు కూడా నాణ్యమైన విద్యుత్‌ అందించడం లేదని రైతులు అసంతృప్తిగా ఉన్నారు.    రాష్ట్రంలో తాజాగా ఏర్పడిన విద్యుత్‌ సంక్షోభంతో శనివారం రాత్రినుండి హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడలు అంధకారంలో ఉన్నాయి. దీంతో పరిశ్రమలకు సరఫరా చేస్తున్న విద్యుత్‌ పూర్తిగా స్తంభించిందని పరిశ్రమల అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి మంగళవారం వరకు ఉంటుందని ట్రాన్స్‌కో అధికారులు స్పష్టం చేశారు. అతి కష్టంమీద మంగళవారం నాటికి పారిశ్రామిక పార్కుల్లో తిరిగి విద్యుత్‌ సరఫరాచేయగలమని  ట్రాన్స్‌కో అధికారుల మాట. ఇప్పటికే పరిశ్రమల ఆర్డర్లు 50 శాతం పడిపోయాయని అలాగే 70 లక్షలమంది చిన్న పరిశ్రమల్లో పని చేసే కార్మికులు వారికుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని పాప్సియా అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు.   రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమను చర్చలకు ఆహ్వానించాలని, లేకుంటే కెజిబేసిన్‌ గ్యాసు సరఫరాను అడ్డుకుంటామని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు.రాష్ట్రంలో సాధారణ విద్యుత్‌ వచ్చేవరకు కేంద్రమంత్రులు, ఎంపిలు, ఎమ్మేల్యేల, ఎమ్మేల్సీల ఇండ్లను ముట్టడిరచాలని పరిశ్రమల అసోసియేషన్లు తెలియచేసాయి. అంతేకాకుండా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ప్రోత్సహించకూడదని కూడా అసోసియేషన్లు అభిప్రాయపడుతున్నారు.

కిరణ్ కాలం

సీఎం కి కాలం కలిసొస్తోంది. మూన్నాళ్ల ముచ్చటే అనుకున్న కుర్చీ వచ్చే ఎన్నికలదాకా పక్కాగా దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పార్టీలో సీనియర్లనుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో సీఎంని మార్చడం కొరివితో తలగోక్కోవడమే అవుతుందని అధిష్ఠానం గట్టిగా అనుకుంటోంది. అందుకే ఎవరెన్ని చెప్పినా ఇప్పుడా విషయం అవసరమా అన్నట్టుగా ఢిల్లీ పెద్దలు మాట్లాడుతున్నారు. ఎఐసీసీ ప్రథాన కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతానికి అందరి కాన్ సన్ ట్రేషన్ తలవని తలంపుగా వచ్చిపడుతున్న తలనొప్పుల్ని తప్పించుకోవడంమీదే ఉంది. వచ్చే ఎన్నికలనాటికి తప్పుల్ని తవ్వుకుని లెక్కలు చూసుకోకపోతే డిపాజిట్లు కూడా దక్కవన్న భయం కాంగ్రెస్ పెద్దల్ని వెంటాడుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ పట్ల ప్రజల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతను సొమ్ముచేసుకునే విషయంలో ప్రధాన ప్రతిపక్షపార్టీలు పూర్తిగా వెనకబడిఉన్నాయ్. కానీ.. చివరికి పిల్లిపోరు పిల్లిపోరు పిట్ట తీర్చినట్టుగా కొత్తగా పుట్టిన మరో ప్రాంతీయపార్టీ సీట్లన్నీ తన్నుకుపోతుందేమోనన్న భయం అధిష్ఠానాన్ని బలంగా వేధిస్తోంది. మొన్నటి ఉపఎన్నికల ఫలితాలు ఈ భయాన్ని మరింతగా పెంచాయి. మొన్నటిదాకా కాస్త మెతగ్గా ఉన్న సీఎం ఇప్పుడు తన పదవిని కాపాడుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. సైలెంట్ గా ఉంటూనే చేయాల్సిన పని చేసుకుపోతూ కుర్చీని కాపాడుకునేందుకు హస్తినలో గట్టిగానే చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతానికి కుర్చీలాటను పక్కనపెట్టాలని అధిష్ఠానం బలంగా నిర్ణయించడంతో కిరణ్  కుమార్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టైంది. రోగీ పాలే కోరాడు, వైద్యుడు పాలే ఇచ్చాడు అన్నట్టుగా ప్రస్తుతానికి సీఎంకి కాలం బాగా కలిసొస్తోంది.

జాతకాల పిచ్చికి కూతురు బలి

జాతకాలమీద పిచ్చినమ్మకం ప్రాణాలుకూడా తీస్తోంది. పుట్టిన బిడ్డ జాతకం బాలేదని జ్యోతిష్కుడు చెబితే చేజేతులా కన్నపిల్లల్నికూడా చంపుకుంటున్నారు. కర్నాటకలోని త్యామగొండ్లు గ్రామంలో జరిగిన ఇలాంటి ఓ దారుణం కలకలం రేపింది. పుట్టిన బిడ్డ జాతకం బాగోలేదు కనుక రెండు నెలల్లో చనిపోతావని ఓ పసికూన తండ్రికి శాస్త్రం సగం తెలిసిన జ్యోతిష్కుడొకడు చెవిలో ఊదాడు. అది విన్నదగ్గర్నుంచీ కర్కశహృదయంగల తండ్రికి నిద్రపట్టలేదు. ఏదో ఒకటి చేసి పిల్ల ప్రాణాలు తీయాలనుకున్నాడు. అనుకున్నది సాధించాడు. పాలల్లో విషం కలిపి ప్రేమగా కన్నకూతురికి పట్టేశాడు. తండ్రి ప్రేమతో మామూలు పాలే పడుతున్నాడులే అనుకుంది కన్నతల్లి. తెల్లారేసరికి నోట్లోంచి నురగలు కక్కుతూ కనిపించిన పాపను తల్లి ఆసుపత్రికి మోసుకెళ్లింది. అప్పటికే పాప చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. కసాయి  మొగుడు కన్నకూతురికి పాలుపట్టిన విషయం గుర్తొచ్చిన తల్లి.. వాణ్ణి పోలీసులకు పట్టించింది.  

మంత్రిగారికి తిక్క తలకెక్కింది

అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంవల్ల రైతులకు మేలే జరుగుతోందట. ఈ మాటలు చెప్పింది అల్లాటప్పా నేతకాదు. గల్లీల్లో తిరిగే సిల్లీ నాయకుడు కూడా కాదు. ఘనత వహించిన కేంద్రమంత్రి కూసిన కారుకూతలివి. ఈ మాటలు విన్న జనం.. కాంగ్రెస్ లో సీనియర్లకి ఎట్టాపడితే అట్టా మాట్టాడే జబ్బుండడం మామూలేలే అని సరిపెట్టుకోలేకపోతున్నారు. ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కష్టపడో, నష్టపడో కోట్లాదిమంది జనం కడుపులు నింపుతున్న రైతుల కడుపులు మంత్రిగారి మాటలకు రగిలిపోతున్నాయి. వర్షాలుపడక, కాలం కలిసిరాక, అప్పులపాలై తిప్పలు  పడుతున్న రైతన్నలకు బేణీ ప్రసాద్ మాటలు తూటాల్లా తగిలాయి. తిక్క తలకెక్కి రైతుల్ని పూచికపుల్లలా తీసిపారేస్తూ మాట్లాడిన మంత్రిగారు అధిష్ఠానం అనుగ్రహంకోసం గట్టిగానే పాకులాడుతున్నారు. 2014 ఎన్నికల నాటికి ప్రథాన కుర్చీకి ప్రథానపోటీ రాహుల్ గాంధీ, నరేంద్రమోడీల మధ్యే ఉంటుందని జోస్యంకూడా చెప్పి యువనేతపట్ల తనకున్న విధేయతను చాటుకున్నారు.

రసకందాయంలో కులరాజకీయాలు

  రాష్ట్రంలో కులరాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. వెనకబడిన వర్గాలమీద పార్టీల నేతలు ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాసినో కూసినో సీట్లు సాధించుకోవడానికి ఇదో స్టంటన్న విషయం అందరికీ తెలిసిందే.. కానీ.. నేతలు విసురుతున్న ఈ పాచిక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తోంది. ఈ విషయంలో అధికారపక్షం, విపక్షం అన్న తేడా లేదు. ఓ పక్షం నేత బీసీలకు పట్టంకడతామని ప్రకటిస్తే, మరో పక్షం నేత కేసుల్లో ఇరుక్కున్న మంత్రులను వెనకబడిన వర్గాల కార్డ్ ని అడ్డం పెట్టి వెనకేసుకొస్తున్నారు. పోటాపోటీగా వెనకబడిన వర్గాల నేతల్ని, ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు అంతా కట్టకట్టుకుని శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. నిజంగా వెనకబడిన వర్గాల మీద అంత ప్రేమే ఉంటే దిగ్గజాల్లాంటి నేతలు పోటీ చేస్తున్న స్థానాలు, పార్టీ అధ్యక్షులకు పెట్టని కోటలుగా ఉన్న స్థానాల్ని స్వచ్ఛందంగా వెనకబడిన వర్గాల అభ్యర్థులకు ఇచ్చేయొచ్చుగా..? ఎక్కడన్నా బావేగానీ వంగతోటకాడమాత్రం కాదన్నట్టుగా.. ఈ విషయం గురించి ఆలోచించాల్సివచ్చేసరికి నేతలకు మాటలు పెగలవు. న్యాయంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం కదా అని కొందరు సమాధానం చెబితే, రాబోయే రోజుల్లో దీనిగురించి ఆలోచిస్తామని మరికొందరు తెలివిగా తప్పించుకుంటారు. జనానికి అన్నీ తెలుసు. ఎవరెలాంటి వాళ్లో తెలుసు.. కానీ.. చివరికి మాత్రం నేతలు విసిరే ఇలాంటి పాచికలకు పడిపోయి చేతిలో ఉన్న “ఓటు” అనే పాశుపతాన్ని చేజేతులా చేజార్చుకుంటున్నామన్న విషయం మాత్రం ఎందుకో తోచడం లేదు. జగమే మాయ.

వట్టి ఇంట్లో మంత్రుల మంతనాలు

  వై.ఎస్ హయాంలో మంత్రి మండలి సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మంత్రుల మెడకు చుట్టుకుంటున్నాయి. కదిలిన అవినీతి తేనెతుట్టె మొదట మోపిదేవిని జైలు ఊచలు లెక్కపెట్టేలా చేసింది. ఇప్పుడు వంతు ధర్మానవరకూ వచ్చింది. తర్వాత్తర్వాత మెల్లమెల్లగా ఈ నిప్పు అందరికీ అంటుకునేలా కనిపిస్తోంది. మంత్రులకు గుండెల్లో గుబులు మొదలైంది. తమను తాము కాపాడుకోవడానికి  కీలక శాఖల్లో ఉన్న మంత్రులంతా కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు. వట్టి ఇంట్లో కీలక శాఖల్లో ఉన్న సీనియర్ మంత్రులు సమావేశమయ్యారు. ధర్మానకు సీనియర్ మంత్రులంతా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.   రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాల్ని ప్రశ్నించే అధికారం, తప్పుపట్టే అధికారం దర్యాప్తు సంస్థలకు లేదంటూ కొందరు సీనియర్ మంత్రులు వాదించారు. మరికొందరు ఈ విషయంలో సుప్రీంకోర్ట్ స్పష్టమైన మార్గనిర్దేశం చేసిందని చెప్పుకొచ్చారు. ఏది ఎలా ఉన్నా.. అమాత్యవర్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్న విషయం తాజా సమావేశంతో తేటతెల్లమైపోయింది. ఎప్పుడేం జరుగుతుందోనని, ఎప్పుడేం వినాల్సొస్తుందోనని సీనియర్ మంత్రులు హడలిపోతున్నారు.  పైకి మాత్రం తెచ్చిపెట్టుకున్న ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సుప్రీంకోర్ట్ నోటీసులు అందుకున్నమంత్రుల్లో ఎవరికీ ఏమీ జరగదని ఒకరికొకరు భరోసా ఇచ్చుకున్నారు. దీనిపై వెంటనే ముఖ్యమంత్రితోకూడా మాట్లాడాలని నిర్ణయించారు. సీబీఐ చార్జ్ షీట్ లో పేర్లున్న మంత్రులను రక్షించడానికి ప్రయత్నాలు చేయాల్సిందిపోయి, వాళ్ల వ్యవహారాన్ని అధిష్ఠానమే చూసుకుంటుందంటూ బొత్స కామెంట్ చేయడంపై సీనియర్ మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

సిజేరియన్‌ ఆపరేషను చిత్రీకరణ, వీడియో అమ్మకం?

గౌరవప్రదమైన వృత్తి వైద్యవృత్తి. అటువంటి వైద్యవృత్తిలో ద్రోహులు చేరుతున్నారని ఇటీవల విమర్శలు ఎక్కువయ్యాయి. తనను నమ్మి సిజేరియన్‌ ఆపరేషను చేయించుకునేందుకు వచ్చిన మహిళను, చేసిన ఆపరేషనును కాంపౌండర్‌ చిత్రీకరించేందుకు డాక్టరు సహకరించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అదీ ఈ చిత్రీకరణను కాంపౌండర్‌ అమ్ముకోవటంతో ఘటన వివరాలు బయటకు పొక్కాయి. దీంతో ఆపరేషను చేయించుకున్న మహిళ బంధువులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు మొత్తం ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. కాంపౌండర్‌ను అరెస్టు చేశారు. డాక్టరును విచారించారు. అదిలాబాద్‌ జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటలో ఉన్న మల్లిక ఆసుపత్రిలో ఓ గర్భిణీకి ఇటీవల సిజేరియన్‌ ఆపరేషను చేశారు. దీన్ని కాంపౌండర్‌ సెల్‌ఫోను ద్వారా చిత్రీకరించారు. ఈ వీడియో క్లిప్పింగును అమ్మేందుకు కాంపౌండర్‌ ప్రయత్నిస్తుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాంపౌండర్‌ను అరెస్టు చేశాక నర్సింగ్‌హోం డాక్టర్‌ ప్రవీణారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న గర్భిణీ బంధువులు పోలీసుస్టేషను ఎదుట ఆందోళనకు దిగారు. తమ విచారణ తరువాత నేరస్తులకు శిక్ష ఉంటుందని పోలీసులు హామీ ఇచ్చాక ఆందోళనకారులు వెనుదిరిగారు. ఈ ఘటన అదిలాబాద్‌ జిల్లాలో తీవ్రసంచలనమైంది.

రెండురాష్ట్రాల నీటి సమస్య తీర్చిన పోలీసులు?

కర్నాటక రైతులు బరి తెగించి నీటిని మళ్లించుకోవటం కోసం మూసేసిన షట్టర్లను పోలీసులు తెరిపించటంతో తుంగభద్ర నీటిపై ఆధారపడిన ఆంధ్రారైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్నాటక ఆంధ్రా సరిహద్దుల్లో తుంగభద్ర నదిపై నిర్మించిన ఎల్‌ఎల్‌సి 33వ డిస్ట్రిబ్యూషన్‌ ఛానల్‌ ఆరు షట్టరు గేట్లలో ఐదింటిని కర్నాటక రైతులు మూసేసి నీటిని మళ్లించు కుంటున్నారు. దీని వల్ల ఇదే నీటిపై ఆధారపడిన ఆంధ్రా రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. దీంతో రెండు రాష్ట్రాల రైతులు నిత్యం గొడవపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ నీటి కోసం ఎదురుచూస్తున్న మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోని, కోడుమూరు నియోజకవర్గాల రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆందోళనకు దిగారు. ప్రభుత్వయంత్రాంగంపై వీరు సమరభేరిని మోగించారు. తమకు జరుగుతున్న అన్యాయం గురించి కర్నాటక రైతులను నిలదీసేవారే కరువయ్యారని వాపోయారు. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఆ ఆయకట్టులో నీరు లేకపోతే తమ కుటుంబాలు వీధిన పడతాయని నిరసనల్లో స్వరం పెంచారు. దీంతో దిగివచ్చిన యంత్రాంగం పోలీసులను రంగంలోకి దింపింది. వారు నేరుగా ఛానల్‌ వద్దకు వెళ్లి ఐదుగేట్లు తెరిపించారు. దీంతో నీరు ఆంధ్రాప్రాంతంలోకి రావటం ఆరంభమైంది. ఆంధ్రారైతులు పోలీసులు షట్టర్లు ఎత్తివేసినందుకు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ నీరు పూర్తిగా కాలువల్లోకి ప్రవహిస్తే సాగుకు ఉపక్రమించాలని రైతులు భావిస్తున్నారు.

పంచలోహ విగ్రహాలపై కన్నేసిన స్మగ్లర్లు

నెల్లూరు జిల్లాలో దొంగల భయం నానాటికీ పెరుగుతోంది. చిన్న చిన్న దొంగతనాలు ఇక్కడ షరా మామూలే! పోలీసులూ ఈ దొంగ తనాలపై అసలు దృష్టి పెట్టలేదు. దీంతో దొంగలు రెచ్చిపోతున్నారు. పెద్దపెద్ద షాపుల్లో సినీఫక్కీలో దొంగతనాలు చేస్తున్నారు. ముదిరిపోయిన ఈ దొంగతనాల గురించి తెలిసి ఇతర రాష్ట్రాల నుంచి కొందరు వ్యాపారులు నెల్లూరు వచ్చి వెళ్తున్నారని సమాచారం. విదేశాల్లో భారతీయ పంచలోహ విగ్రహాలకు భారీగా డిమాండు ఉంది. ప్రత్యేకించి పూజలందు కున్న విగ్రహాలను విదేశీయులు ఎక్కువ డబ్బుపోసి కొంటారని సమాచారం. అందుకని వ్యాపారులు స్థానిక దొంగలను కలిసి ఆ విగ్రహాలు కోరి ఉంటారని నెల్లూరు జిల్లాలో చెప్పుకుంటున్నారు. వ్యాపారులు కోరుకున్న విధంగా దొంగతనాలు చేయటానికి దొంగలు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఇంటలిజెన్స్‌ నివేదికకు తగ్గట్టుగానే తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు మండలం లే గుంటపాడు గ్రామంలోని చెన్నకేశవస్వామిఆలయంలోని పంచలోహవిగ్రహాల దొంగతనం జరిగింది. మొత్తం 7విగ్రహాలు, మూడు తాళిబొట్లు దొంగతనం చేశారు. వీటిని ఇతరరాష్ట్రాల వారి ద్వారా తరలించేశారని సమాచారం. ఈ ఘటనపై ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు క్లూస్‌టీం రంగంలోకి దిగింది. ఈ క్లూస్‌టీం ఘటన ఆధారంగా సాక్షులను విచారించి దర్యాప్తు కొనసాగిస్తోంది.

రెడ్‌ శాండిల్‌ స్మగ్లింగ్‌ హబ్‌గా మారిన నెల్లూరుజిల్లా!

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక మూడు రాష్ట్రాల ఎర్రచందనం స్మగ్లింగు ముఠాలూ సరుకును నెల్లూరు జిల్లా మీదుగా తరలిస్తున్నాయి. నెల్లూరు జిల్లా తడ, కర్నూలు జిల్లా నుంచి ఆత్మకూరు మీదుగా ఈ స్మగ్లింగు కార్యకలాపాలు సాగుతున్నాయి. అలానే చిత్తూరు జిల్లా నుంచి కూడా నెల్లూరు మీదుగా ఈ స్మగ్లింగు సాగుతోంది. నెల్లూరు జిల్లా ఈ స్మగ్లింగుకార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని అటవీ శాఖాథికారులు గుర్తించారు. ఇక్కడ మంచికాపలా పెడితే స్మగ్లింగుకార్యకలాపాలను అదుపు చేయగలుగుతామని కూడా గుర్తించారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా అటవీశాఖాధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. దీనిలో భాగంగా తాజాగా ఆత్మకూరు మండలం వెల్లూరిపాలెం చెక్‌పోస్టు వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీశాఖాధికారులు పట్టుకున్నారు. మొత్తం 36 ఎర్రచందనం దుంగలను ఈ దాడిలో అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలను తరలిస్తున్న వాహనాన్నీ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నాలుగులక్షల రూపాయల విలువైన ఎర్రచందనం అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలానే లక్షలు, కోట్లాది రూపాయల విలువైన సరుకు త్వరలో స్వాధీనం చేసుకోగలుగుతామని అటవీశాఖాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు కేంద్రం సాగే ఈ రవాణాను అడ్డుకోవటానికి తమవంతు కృషి చేస్తామంటున్నారు.

మహిళలకు వడ్డీ మాఫీతో ప్రభుత్వానికి అదనపుభారం?

ఇకపై రాష్ట్రంలోని మహిళా సంఘాలు వడ్డీ లేని రుణాలు అనుభవించనున్నాయి. దీని వల్ల ప్రభుత్వానికి అదనపుభారం పడినా సిద్ధమేనని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఐదులక్షల రూపాయలు బ్యాంకు రుణం తీసుకుంటే ఇప్పటి వరకూ మహిళా సంఘాలు వడ్డీ కింద మూడులక్షల 70వేల రూపాయలు 60నెలల్లో చెల్లించేవి. ఇప్పుడు ఆ వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని సిఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని కోటి 40లక్షల మంది మహిళాసంఘాల్లో ఉన్నారు. ఇప్పటికే బ్యాంకర్లు, ప్రభుత్వం రూ.13వేల కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు రుణాలుగా ఇచ్చేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. ప్రభుత్వంపై 14శాతం వడ్డీభారం పడుతోందని సిఎం తెలిపారు.   రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతోనే తాము ఈ భారం మోస్తున్నామని మహిళలు గుర్తిస్తే చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్కసారిగా రాష్ట్రప్రభుత్వం వడ్డీభారం తలకెత్తుకోవటానికి సిఎం ఇందిరమ్మబాట కార్యక్రమమే దోహదపడిరదని మహిళలు భావిస్తున్నారు. మహిళా సంఘాలు చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించాకే సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారని పలు సంఘాల నేతలు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర జనాభాలో కీలకమైన (దాదాపు 50శాతం) మహిళలను ప్రభుత్వం ఆకట్టుకుంటే భవిష్యత్తులో వారి మద్దతు కాంగ్రెస్‌పార్టీకి ఉంటుందన్న నమ్మకంతోనే సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ ఆర్థికశాఖ మాత్రం మహిళాసంఘాల రుణాల వల్ల తమపై పడే భారాన్ని లెక్కిస్తున్నాయి. రంజాన్‌కానుకగా సిఎం ప్రకటించిన వరం అదనపుభారం అని శాఖ అభిప్రాయపడుతోంది.

మంత్రిపదవి గుట్టు విప్పిన సారయ్య? వైఎస్‌పై ఆగ్రహం!

బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజ్‌ సారయ్య తన మంత్రిపదవి గుట్టు విప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌ ప్రజలు తనను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాత్రం పట్టించుకోలేదని సారయ్య గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఎంత మంది తనను మంత్రి చేయమని వైఎస్‌కు సలహా ఇచ్చినా బేఖాతరు చేశారని ఆరోపించారు. వైఎస్‌ హయాంలో తనలాంటి బీసిలకు ఆదరణే ఉండేదే కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే తనకు మంత్రి పదవి అవసరం లేదన్నట్లు వైఎస్‌ వ్యవహరించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఏమైనా కానీ, వైఎస్‌ మరణానంతరం తనకు మంత్రి పదవి లభించిందని స్పష్టం చేశారు. తనకు ఎందుకు పదవి ఇవ్వలేదని వైఎస్‌ను ప్రశ్నించినా మౌనమే సమాధానంగా వచ్చేదన్నారు సారయ్య. తాను మంత్రిగా బి.సి. సంక్షేమానికి రూ.3,116 కోట్లను కేటాయించటం జరిగిందని సారయ్య చెప్పుకొచ్చారు. తాను ఎంత సమర్ధుడో తెలుసుకోవాలన్నట్లు ఈ నిధుల వివరాలను మంత్రి సారయ్య ఎపి రజకాభివృద్థి సంస్థ గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రధానకార్యాలయం ప్రారంభోత్సవ సమయంలో వెల్లడిరచారు. బీసి మంత్రిగా తాను చేసుకున్న ఘనతను చాటుకుంటూ వైఎస్‌ హయాంలో తనకు జరిగిన అన్యాయాన్ని చాటుకుంటూ ఒకవైపు గొప్పకు, మరోవైపు సానుభూతి కోసం మంత్రి ప్రయత్నించారు.