ఉచిత విద్య ఇచ్చేవారికే మద్దతు..?!
posted on Aug 20, 2012 @ 9:43AM
విద్య వ్యాపారంగా మారిపోయిన ప్రస్తుత రోజుల్లో సామాన్యుడి చదువు ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం విద్యను వ్యాపారం చెయ్యడంతో కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు, ఇంజనీరింగ్ మెడికల్ కళశాలలు ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయని ‘సామాన్య, మధ్యతరగతి వర్గాలు మండిపడుతున్నాయి! పదిహేను సంవత్సరాల కిందటి వరకూ‘విద్య’ పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే ఉండేది! ప్రభుత్వ పెద్దలు తమ స్వార్థం కోసం విద్యారంగంలో ప్రయివేటుకు అవకాశాలు కల్పించడంతో వటుడిరతై... అంతై..అంతంతై..అన్నట్లుగా విద్యారంగాన్ని పూర్తిగా తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని ‘తాము ఆడిందల్లా ఆట పాడిందల్లా పాట’గా ఫీజుల్ని ఆకాశమంత ఎత్తుకుపెంచేశాయి!
అంతేకాకుండా పుస్తకాలు, డ్రస్సులు, బస్సులు ఇంకా మెటీరియల్స్ అంటూ దండుకుంటున్నాయి! విద్యా శాఖాధికారుల నియంత్రణ పర్యవేక్షణ పూర్తిగా కొరవడటంతో ఎల్‌కేజి ఫీజులుగా కూడా పదివేల నుంచి పాతిక వేలకు పైగానే వసూలు చేస్తూ, ప్రయివేటు పాఠశాలు హవా చేస్తున్నాయి? ఇదే క్రమంలో సాంకేతిక విద్యకు అగ్రతాంబూలం అంటూ ప్రయివేటు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలకు ఇష్టం వచ్చినట్లుగా అనుమతులు ఇచ్చెయ్యయంతో క్వాలిటీ విద్యకు కాలం చెల్లిపోయిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. క్వాలిఫైడ్ లెక్చరర్లు లేకుండా, సరైన లేబ్, లైబ్రరీ సౌకర్యం లేకుండా, సాంకేతిక విద్యామండలి ప్రమాణాలు పాటించకుండా ఉండే ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలలో ఇంతంత ఫీజులెందుకుంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డిమాండుకు మించిన కళాశాలల ఏర్పాటు వల్ల డిగ్రీ సర్టిఫికేట్‌తో బయటకొచ్చిన విద్యార్థికి ఎక్కడా సరైన ఉద్యోగం కూడా రావటం లేదని, పెరిగిపోతున్న నిరుద్యోగుల సమస్యను పరిశీలిస్తే అర్థమౌతుంది. రాజకీయ నాయకులు తమ అధికారం కోసం ప్రజల్ని ఓ పావుల్లా చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో విద్యార్థుల్ని బిచ్చగాళ్ళుగా చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఏఏటికాఏడు ఫీజురీయింబర్స్‌మెంటు కోసం ఎదురుచూస్తూ తమ చదువు ముందుకు సాగుతుందో లేదోనన్న భయాందోళనలతో విద్యార్థినీ విద్యార్థులు కాలం గడపవలసి రావడం నిజంగా శోచనీయమంటున్నారు. కేజీ నుంచి పీజీ వరకూ, ఇంజనీరింగ్ మెడికల్ వంటి అన్ని రకాల కళాశాలల్నీ పూర్తిగా ప్రభుత్వమే స్వాధీన పరచుకునే విధంగా విద్యారంగాన్ని జాతీయం చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉందని సామాన్య మధ్యతరగతి వర్గాలు భావిస్తున్నాయి! ఈ క్రమంలో విద్యారంగాన్ని పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి తెచ్చుకుని ప్రజలకు ఉచిత విద్య అందించే పార్టీని బలపరచాలని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలతోబాటు, బిసి మైనారిటీ వర్గాలు నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది! రాబోయే రోజుల్లో ప్రజలందరికీ ఉచిత విద్య వైద్య సౌకర్యాల కోసం ఉద్యమ నిర్మాణం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని జరుగుతున్న ఘటనలు సూచిస్తున్నాయి!