విద్య, వైద్యం నేతిబీర చందం...
మనిషిని ఇతర ప్రాణులనుండి వేరు చేసేది జ్ఞానం. అది విద్య ద్వారానే ప్రధానంగా వస్తుంది. అంతేకాదు మనిషి మంచిచెడుల విచక్షణ తెలుసుకుని బ్రతకడానికీ, బ్రతుకుతెరువుకోసం కూడా విద్య ఉపయోగపడుతుంది. అటువంటి విద్యకు ధనిక, పేద అన్న బేధంకాని, గ్రామాలు, నగరాలు అన్న భేదం కాని లేదు. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే విద్యను అభ్యసించాలంటే ఎల్‌కెజి నుండే వేలకు వేలు ఖర్చు తప్పనిసరి అవుతోంది. ప్రకటనలు, ప్రచార హోరుతో అందరికీ విద్య అని చెప్పే ప్రభుత్వాలు మాత్రం గ్రామీణులకు సరైన విద్యను అందించలేకపోతున్నాయి.
ఆర్థికంగా వెనుకబడిన అన్నితరగతులవారు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించడం పరిపాటి. అయితే నేడు ప్రాథమిక విద్య అంపశయ్యపై ఉందని, పాఠశాల విద్య కోసం ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నా కనీస సౌకర్యాలను కూడా కల్పించలేకపోతున్నారని పిఎసి సభ్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలోని హాల్లో పిఎసి ఛైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో ప్రభుత్వం పాఠశాల విద్యపై నిర్లక్ష్యం చూపుతోందని సభ్యులు విమర్శించారు. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల్లేరు, నీటివసతిలేదు. మరుగుదొడ్డి సౌకర్యం లేదు. మరుగు దొడ్డి ఉన్నా నీటిసమస్యతో అవి నిరుపయోగంగా మారాయి. కాంపౌండ్ వాల్స్ లేవు, కరెంటు సౌకర్యం కల్పించలేదు. కరెంటు లేక పోవడంతో కంప్యూటర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయని’ ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పాఠశాలల నిర్వహణ సరిగా లేక ప్రతి మండలంలో కనీసం ఐదు పాఠశాలలు మూతపడ్డాయన్నారు. దీని బట్టి తెలిసింది ఏంటయ్యా అంటే అందరికి విద్య అన్నది అందని ద్రాక్షే. కేవలం నేతిబీరలో నెయ్యిలాంటిది ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, అక్కడి వసతులు. పథకాలు ప్రకటనల వరకే. ఇక ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లలు విద్యావంతులు కావాలంటే ఎలా అవుతారు? ఒకవేళ వీటిపై ఎవరైనా అడిగినా ‘వెంటనే అమలుచేస్తాం’ అంటుంటారు. వెంటనే అంటే సంబంధిత శాఖల, అధికారుల, మంత్రుల దృష్టిలో మళ్ళీ వారికి అక్కడ పని పడినప్పుడో, లేదా ఎన్నికలు వచ్చినప్పుడో లేదా ముఖ్యమంత్రి గారికి సరదాగా పిల్లల్తో క్రికెట్ ఆడాలనిపించినప్పుడో అని అర్ధం చేసుకోవాలని సామాన్యులు వ్యాఖ్యానిస్తున్నారు.