నల్గొండ జిల్లాలో వైద్యం అందని ద్రాక్షేనా?
నల్గొండ జిల్లాలో వైద్యం అందని ద్రాక్ష మాదిరిగా ఉందని విమర్శలు వ్యాపిస్తున్నాయి. ఇక్కడ ఇటీవల శిశుమరణాల సంఖ్య గతంలో కన్నా ఎక్కువయ్యాయని వైద్యరంగ పరిశీలకులు వెల్లడిరచారు. ఈ జిల్లాలో 12ఏరియా ఆసుపత్రులున్నాయి. నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, దేవరకొండ, రామన్నపేట, చౌటుప్పల్, కోదాడ, హుజూర్‌నగర్, నకిరేకల్ , నాగార్జునసాగర్‌ల్లో ఏరియా ఆసుపత్రులున్నాయి. కోదాడ, ఆలేరు, రామన్నపేటల్లో అసలు చిన్నపిల్లల వైద్యులే లేరు. 37 పీహెచ్‌సీల్లో 24గంటలు వైద్యం చేస్తున్నా సౌకర్యాలు అంతంత మాత్రమే.
ఏరియా ఆసుపత్రుల్లోనూ పుట్టిన శిశువులకు ఉపయోగించే వెంటిలేటర్లు లేవు. భూవనగిరి, రామన్నపేట, హుజూర్‌నగర్, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ సూర్యాపేటల్లో నాలుగుపడకలతో న్యూబార్న్ స్టెబిలైజేషన్ యూనిట్లు మంజూరు చేశారు. వీటికి భవనాలు, గదులు నిర్మాణం చేసినా వైద్యపరికరాలు సరఫరా చేయలేదు. సూర్యాపేటలో ఇంక్యుబేటర్లు మూడుంటే రెండు పని చేయటం లేదు. మిర్యాలగూడలో నియోనెటల్ ఇంటెన్సికేర్ యూనిట్ అసలు ప్రారంభించనేలేదు. నాలుగు ఇన్‌క్యూబిలేటర్లు ఉన్నా ఉపయోగించటం లేదు. ప్రతీ ఏడాది50మంది చిన్నపిల్లల మరణిస్తున్నారని ఒక సర్వేలో తేలింది. ఆంధ్రప్రదేశ్ వైద్య మౌళికవసతుల సంస్థ ద్వారా నిధులు విడుదల చేశారే కానీ, మందులు సక్రమంగా సరఫరా చేయటం లేదు. దీంతో రోగుల బంధువులు మందులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇక్కడి వైద్యపరిస్థితులు మెరుగుపరచాలని రాష్ట్రవైద్య,ఆరోగ్యశాఖకు పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.