పడగ విప్పిన అరాచకం! ప్రక్షాళన చెయ్యడం అవసరం!
రాష్ట్రంలో అరాచకం తాండవం చేస్తోంది...! అవినీతి, లంచగొండితనం, బరితెగింపుధోరణి, జవాబుదారీ లేని వ్యవహారశైలి రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్నాయి...! ప్రజలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వ పెద్దలే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొవడం... అధికార రక్షణే ధ్యేయంగా అమాత్యులు తమ పూర్తి సమయాన్ని కేటాయిస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం, అధికార పక్షాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజాసమస్యలు పట్టనట్లుగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తూండటం... ప్రజారక్షణ కోసం ఏర్పాటైన పోలీసువ్యవస్థ చోద్యం చూస్తూండటం... న్యాయపరిరక్షణా వ్యవస్థకు సైతం అవినీతి చెదలు పట్టడం.... రాష్ట్రాన్ని ఆటవిక సమాజంలోకి నెట్టేస్తున్నాయి! అవును... ఈ సమాజం ఎటు పోతోంది? మన రాష్ట్ర భవిష్యత్‌నడక ఎలా ఉంటుంది?` ఆలోచించాలంటేనే భయమేస్తుంది...!
ఎటుచూసినా అవినీతి జడలు విప్పింది! ప్రజలకు సుద్దులు చెప్పాల్సిన పెద్దలు తమ స్వలాభంకోసం యధేచ్ఛగా పాల్బడిన అవినీతి చర్యలకు ఫలితం అమాయకపు ప్రజలు అనుభవించాల్సి వస్తోంది! రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్డుప్రమాదాలే` వాహనాలకు ఫిట్‌నెస్ ఉండదు...! దేశంలో ఇంకెక్కడా లేనన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మనరాష్ట్రంలోనే చాలా కాలేజీల్లో ప్రాథమిక సౌకర్యాలే ఉండవు...! రాష్ట్రంలో విచ్చలవిడిగా కార్పొరేట్ విద్యావ్యాపారం` అబద్ధాల ప్రచారంతో తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నవైనం ! పచ్చని పసిడి పంటలతో ప్రజల ఆకలిని సంపూర్ణంగా తీర్చగలిగే సారవంతమైన భూమి పొలాలకు విద్యుత్ ఉండదు, నీటికి దిక్కుండదు...! మార్కెట్లో మినరల్ వాటర్‌బాటిళ్ళు వెక్కిరింపు...! పండిన పంట పొరుగు రాష్ట్రాలకు రవాణా` మన రాష్ట్రంలో ధరల విశృంఖల వీర విహారం! మన రాష్ట్రంలో ఉత్పత్తయిన విద్యుత్, గ్యాస్ పక్కరాష్ట్రాలకు సరఫరా.. చిమ్మ చీకట్లో రాష్ట్ర జనం జాగారం! అప్పుడెప్పుడో వాడుకున్నారంటూ ఇప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తున్న భారీ సర్‌ఛార్జీలు..! ప్రభుత్వ వైద్యశాలల ఆలనా పాలనా పక్కన పెట్టి, ప్రయివేటు మేలుకోసం ఆడంబరంగా ప్రవేశపెట్టిన ఆర్యోగ్యశ్రీ నిధుల కొరతతో నిర్వీర్యమైపోయిన సర్కారు ఆస్పత్రులు! వందలాది మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నా చలించని అధికార గణం...!
ప్రభుత్వభూములు ప్రయివేటుపరం కృతజ్ఞతా పూర్వ కానుక ప్రయివేటు పెట్టుబడిగా రూపాంతరం! చేవ్రాలు చేసిన అమాత్యుల ‘హస్తా’లకు అవినీతి మరకలు! చెంచల్ గూడా జైలు గదులు విఐపిలతో సందడి! తప్పును ఒప్పుచెయ్యడం కోసం నిందితులకు ప్రభుత్వమే న్యాయసహాయం కల్పించడానికి కంకణ బద్ధం! పెద్దయ్య పెద్దరికం చూసి ఎదురు మాటడలేక బుద్ధిగా చేవ్రాలు చేశామంటూ సర్దిచెప్పుకోవాలని చూసినా ఆస్తుల అసలు చిట్టా విప్పితే అసలు బండారం సత్యపీఠంపైనే వెల్లడౌతుంది! తప్పును తప్పంటూ వేలెత్తి చూపిన పరిశోధనా బృందానికి మరకలంటించ చూసిన కాల్‌డేటా సేకరణ అధికారమద్దతు అస్సల్లేకుండానే జరిగిందా? ప్రశ్నార్థకమే! నిస్పక్షపాతంగా న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తులు రూపాయిలగని కోసం పాపాల చిట్టాను ఆవలకు నెట్టి చటుక్కున బెయిలిచ్చి ఇంచక్కా జయిలూచలు లెక్కెయ్యడం న్యాయం కోసం ఇంక్కెక్కడి కెళ్ళాలన్న సందేహం ప్రజల్లో బలంగా నాటుకునేలా చేసింది!
సమాజానికి సరైన మార్గ నిర్దేశకత్వం చెయ్యాల్సిన బాధ్యతాయిత తెలుగు ఛానెళ్ళు కొన్నయితే` పగలంతా విలువల గురించి వల్లిస్తూ అర్థరాత్రి మద్దెలదరువన్నట్లు రాత్రి 11గం.లకు పచ్చిశృంగార నీతి పాఠాలు వివరిస్తూ విలువల వలువలు వలిచేస్తున్నాయి! రియాలటీషోల పేరుతో పసిపిల్లల మనసుల్ని కలుషితం చేస్తున్న ‘విచిత్ర విన్యాసాలు’ ఏ పెద్దవాళ్ళకీ కనిపించడమే లేదు! క్రైం కార్యక్రమాలు క్రిమినల్స్‌కు చక్కటి తర్ఫీదునిచ్చే ఇన్స్‌పిరేషన్ ప్రోగ్రాములయ్యాయనడం విశ్లేషకులు చేస్తున్న ఆరోపణ! ఆర్టీసి కండక్టరు చిల్లర మాయాజాలం, ఆటోరిక్షావాలాల దందాగిరీ, జేబుదొంగల హస్తలాఘవం, దొంగనోట్ల చెలామణీ, ఈవ్ టీజింగ్, పబ్బుల పచ్చి శృంగారం, విచ్చల విడిగా వ్యభిచారం, అత్యాచారం, హత్య, దోపిడీ, చదవకుండానే చేతికొచ్చే డిగ్రీ సర్టిఫికెట్లు, పెరిగిపోతున్న ఇంటద్దెలు, సరఫరాకాని తాగునీరు, అడ్డగోలుగా లైసెన్సులు పొంది బళ్ళూగుళ్ళూ అనే తేడాలేకుండా జనావాసాల మధ్య వెలసి ‘రా రమ్మంటూ’ సాదరంగా ఆహ్వానించే బార్లూ బీర్లు, నియంత్రణలేని కూరల ధరలు, మళ్ళీ విజృంభిస్తున్న మట్కాలు, హుక్కాలూ, నెంబర్లూ, మాదక ద్రవ్యాలూ, ఆఫీసు వేళల్లో కుర్చీల్లో కనిపించని అధికారులు, చదువుకునే పసిపిల్లలపై వికృత చేష్టలకు పాల్పడుతున్న టీచర్లు, పుట్టుకొస్తున్న కొత్తబాబాలు., రేష్ షాపుల్లో దొరకని తిండిగింజలు, కడుపులో కాళ్ళు పెట్టుకొని నిస్తేజంగా శూన్యంలోకి చూస్తున్న సామాన్యుడి కళ్ళు.. రాష్ట్రంలో అరాచకం ప్రబలిందనడానికి నిలువెత్తు సాక్ష్యాలు! మంత్రులంతా అవినీతి ఆరోపణలతో కేబనేట్‌కి దూరమైతే అధికారం నిలుపుకునేదెలా? అంటూ మల్లగుల్లాలు పడటంతోనే కాలం వెళ్ళబుచ్చుతూ పరిపాలనా వ్యవస్థను అస్థవస్థం చేస్తున్న అధికారపార్టీ ఇందుకు బదులివ్వాల్సి ఉంటుంది...! అరాచకం మరింత ముదరక ముందే ప్రజాసంక్షేమంకోసం ప్రక్షాళనా కార్యక్రమం తక్షణం చేపట్టవలసి ఉంటుంది...!