రిపబ్లిక్ డే , ఇండిపెండెంట్స్ డే మధ్య తేడా తెలియదా?
కార్పొరేట్ విద్యపేరుతో విలువలు లేని , దేశభక్తికి చోటులేని పాఠాలను చెబుతున్నారు. ఇప్పటి మిడిల్ స్కూలు నుండి కాలేజీ స్ధాయివరకు ఎంత మంది పిల్లలకు స్వాతంత్య్ర సమర యోధుల గురించి తెలుసు? ...ఎంత మంది దేశం కోసం ప్రాణాలర్పిస్తే ఈ దేశం స్వాతంత్య్రం సాధించిందో ఈ నాటి విద్యార్దులలో ఎంతమందికి అవగాహన వుంది? ఎల్‌కెజి నుండి ఐఐటిలు, జిప్‌మర్లు అని క్యాష్ చేసుకునే విద్యాలయాలు ఈ నాటి విద్యార్దులకు ఏం బోధిస్తున్నారు? సమాజం బాగుండాలంటే విద్యాలయాలు బాగుండాలి. విద్యాలయాలు బాగుండాలంటే గురువులు క్రమశిక్షణ, సామాజిక విలువలు తెలిసున్న వారు కావాలి. ఈ రెండు తెలియాలంటే విద్యనేర్పించే వారికి సామాజి బాద్యత ఉండాలి.ఇటీటల నిర్వహించిన ఒక సర్వేలో ఢల్లీలోని ఇంటర్, డిగ్రీస్ధాయి విద్యార్దులో చాలామందికి గణ తంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం మధ్య తేడా తెలియదని తేలింది. ఈతరం పిల్లలది టెక్నికల్ బ్రెయిన్ వారు కంప్యూటర్ గురించి లేదా ఏదైన మెషినరీ గురించి అడిగితే టక్కున సమాధానం చెబుతారు.
సినిమాల గురించయితే చెప్పనక్కర్లేదు. ఏ చానల్ చూసినా జరిగే కార్యక్రమాలన్నీ సినిమాల మీదనే కాబట్టి పిల్లలకు ఏ సినిమాలు ఏ హీరో చేశాడు దగ్గర్నుంచి ఏంత కలెక్షన్ కూడా చెప్పగలుగుతున్నారు. అంతే కాకుండా కాస్త చురకైన యువత హీరోలను ఆదర్శంగా తీసుకొని బైకు రైడిరగ్‌లతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆడపిల్లలు హీరోయిన్స్‌ను ఆదర్శంగా తీసుకొని కాస్టూమ్స్‌లో పొదుపు పాటిస్తున్నారు. ప్రభుత్వం, తల్లిదండ్రులూ, మేధావులూ, సామాజిక శాస్త్రవేత్తలు ఈ విషయంలో సరైన చర్యలు చేపట్టాలి. విద్యను వ్యాపారంగా మార్చి ఫీజులు గుంజుతుంటే తల్లి దండ్రులు ఫాల్స్ ప్రెస్టీజ్ కి పోయి లంచాలు తీసుకొని కార్పొరేట్ స్కూల్స్‌లో కట్టి పిల్లలను డబ్బును ప్రింట్ చేసే మిషన్లనుగా పెంచుతున్నారు. దేశ భక్తి ఇప్పుడు ఎందుకూ పనికి రానిదిగా మహా అయితే అది మిలట్రీకి సంబందించినవిషయంగా చూస్తున్నారు. నేషనల్ సెంటిమెంట్‌లేని చదువు ఎంత చదివినా ఫలితం శూన్యం.
ఇదివరలో పాఠశాలలో స్వాతంత్య్రదినోత్సవం, రిపబ్లిక్‌డేల సందర్బంగా దేశభక్తులకు సంబందించిన పాటలు, నృత్యరూపకాలు, ఏకాపాత్రాభినయాలు ఉండేవి. ఇప్పుడు అన్నీ సినిమా పాటలకు డాన్సులకే పరిమితమయ్యాయి. ఇప్పటికైనా స్కూళ్ల యాజమాన్యాలు దేశభక్తులకు సరైన ప్రాధాన్యత నిచ్చి విద్యార్ధులకు అవగాహన కల్పించాలి. సామాజిక సృహకలిగిన భావిభారత పౌరులను పెంపొందించుకున్నప్పుడే సమాజం పురోభివృద్ది చెందటంతో పాటు ప్రస్తుతం సమాజంలోఉన్న అవలక్షణాలైన లంచాలు, క్విడ్‌ప్రోకో, నల్లధనం,విదేశీ ఎకౌంట్లకు కాలం చెల్లుతుంది. సమసమాజం నిర్మించబడుతుంది.