సిఎం మాటంటే మాటే...అస్సలు మాటే మార్చరు?
posted on Aug 21, 2012 8:40AM
రాష్ట్రముఖ్యమంత్రి (సిఎం) కిరణ్‌కుమార్‌రెడ్డి మాటంటే మాటే...అస్సలు మాట మార్చరు...అని ఉభయగోదావరి జిల్లాల నేతలు కసిగా పెదవులు కొరుక్కుంటున్నారు. గత నెలలో తూర్పుగోదావరి జిల్లాలో సిఎం పర్యటించి నప్పుడు, తిరుపతి ఎయిర్‌పోర్టులో చిత్తూరు నేతలతో మాట్లాడినప్పుడు సిఎం ఒకనెల రోజుల్లోపు స్థానికసంస్థల ఎన్నికలు పూర్తిచేసేద్దాం అని బలమైన హామీ ఇచ్చారు. ఈ భరోసాతో ఎదురు చూస్తూ నెల ఇట్టే గడిచిపోయింది. కానీ, ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు. కనీసం నోటిఫికేషను ఎప్పుడిస్తారు? ఎన్నికల్లో ఎంతమందికి అవకాశం ఉంటుంది? పార్టీ పదవులకు ఎంతమందిని తీసుకుంటున్నారు? వంటి అంశాలపై కూడా స్పష్టత లేదు. తాజాగా సిఎం పశ్చిమగోదావరి జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమానికి వచ్చారు. ఆ కార్యక్రమానికి మర్యాదపూర్వకంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి నేతలు వెళ్లారు. అప్పుడు అన్ని అంశాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా ప్రస్తావించారు. అప్పుడు కూడా సిఎం తూర్పుగోదావరి జిల్లాలో చెప్పినట్లే ఇంకో నెలలోపు ఈ ఎన్నికలు పూర్తిచేస్తామని ప్రకటించారు. దీంతో ఉభయ గోదావరిజిల్లా నేతలు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. సిఎం మాటంటే మాటే ఎప్పుడు ఎవరు స్థానిక ఎన్నికల గురించి ప్రస్తావించినా ఒక నెలలోపు పూర్తి చేసేస్తామంటారని ప్రతిపక్షాలు కిసుక్కుమంటున్నాయి. ఇదే స్థానిక ఎన్నికల ద్వారా తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్న తెలుగుదేశం నేతలు కూడా సిఎం మాట గురించి తెలిసి ఆశ్చర్యపోయారు. విషయమేమిటంటే ఇంకా స్థానిక ఎన్నికల నగారాకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.