బాబుకు తలనొప్పిగా మారిన బైర్రెడ్డి?
posted on Aug 20, 2012 8:50AM
నిన్నటి దాకా చంద్రబాబే తమ తొలిప్రత్యర్థి అని తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) కారాలు, మిరియాలు నూరేది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తరుపున సినీహీరో, తెలుగుదేశం నాయకుడు నందమూరి బాలకృష్ణ తాము తెలంగాణాకు అనుకూలమని లేఖ ద్వారా తెలియజేస్తామని ప్రకటన చేశారు. బాబు ప్రకటించాల్సిన విషయాన్నే బాలకృష్ణ ప్రకటించాడనుకున్న టిఆర్‌ఎస్ ఇక తెలుగుదేశం గురించి ఆలోచించటమే మానేసింది. హమ్మయ్య! అనుకుని బాబు ఆ లేఖ పనిలో పడితే సరిపోతుందనుకున్నారు. అయితే ఈ గొడవ తగ్గితే మరొకటి చేయటానికి నేనున్నాను కదా అన్నటు రాయలసీమ పరిరక్షణ సమితి ఛైర్మను బైర్రెడ్డి రాజశేఖర రెడ్డి కొంచెం ఘాటుగా స్పందించటం ప్రారంభించారు. ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కూడా కావటం గమనార్హం. అవసరమైతే తన పదవిని త్యజించైనా రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటానని బైర్రెడ్డి ప్రకటించారు. అంతటితో ఆగకుండా తెలంగాణా ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేకపోతే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేందుకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణా కోసం బాబు లేఖరాసేస్తే ఖచ్చితంగా రాయలసీమ ప్రత్యేకరాష్ట్రం గురించి కూడా అందులో రాయాలని బైర్రెడ్డి డిమాండు చేస్తున్నారు. అంతేకాకుండా సీమవాసుల మనోభావాలను అర్థం చేసుకోవాలని టిఆర్‌ఎస్ తరహాలోనే బైర్రెడ్డి పెద్ద లెక్చర్ ఇస్తున్నారట. ఏదేమైనా భవిష్యత్తులో బైర్రెడ్డిని తమ అధినేత తట్టుకోక తప్పదని తెలుగుదేశం పార్టీ సీమ నేతలు అభిప్రాయపడుతున్నారు.