రంగారెడ్డి జిల్లాకే యూత్ కాంగెస్ర్ రాష్ట్ర అధ్యక్ష పదవి
పోటా పోటీగా జరుగుతున్న యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన రవికుమార్ యాదవ్ పోటీలో ముందున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 36,000 ఓట్లున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 12,000 నుంచి 13,000 ఓట్లు తెచ్చుకున్నవారు అధ్యక్షులు కావడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది. రాష్ట్ర స్థాయిలో బరిలో 27మంది అభ్యర్థులు ఉన్నారు. వీరికి వచ్చిన ఓట్లను బట్టి రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటవుతుంది. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 850 ఓట్లకు పైగా ఉన్నాయి. ఈ బరిలో ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ కుమారుడు రవికుమార్ ప్రధాన అభ్యర్థి. గతంలో ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు, జగన్‌కు అనుకూలంగా వ్యవహరించిన వంశీచందర్‌రెడ్డికికూడా జిల్లాలోని బూత్ కమిటీలు మద్దతు పలికే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్ కూడా రంగంలో ఉన్నారు. దేవినేని నెహ్రూతనయుడు అవినాశ్, రాష్ట్ర మంత్రి ముఖేశ్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్, ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి కుమారుడు పురువర్‌రెడ్డి కూడా రంగంలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 11, 12 తేదీలలో జరగనున్న ఎన్నికల్లో రంగారెడ్డి, హైదరాబాద్ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది.
కొత్త విధానం ప్రకారం జిల్లా అధ్యక్షులు కాకుండా అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం, అనంతరం రాష్ట్ర అధ్యక్ష పదవికి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. సీనియర్ నాయకులకు మింగుడు పడని ఈ విధాన్నా యువ నేతలు ఆకళింపు చేసుకుని తమ అభ్యర్తిత్వాలను లక్ష్యంగా చేసుకుని సభ్యత్వ నమోదును చేయించడం గమనార్హం. ఈ విధంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే పోటీ ప్రభావం నెలకొని ఉన్నది. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి అభ్యర్థి రవికుమార్‌కు హోంమంత్రి సబితారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి దన్నుగా నిలుస్తున్నాడు. కార్తీక్‌రెడ్డి కోరుకుంటున్న చేవెళ్ళ పార్లమెంట్ స్థానంలో ఆయన అనుయాయుడు రణధీర్‌రెడ్డికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేవెళ్ళ పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని తలపోస్తున్న కార్తీక్‌రెడ్డికి రవికుమార్ యాదవ్‌కే మద్దతు తెలుపక తప్పని పరిస్థితి ఎదురవుతున్నది. రాష్ట్రఅధ్యక్ష పదవికి ప్రధానంగా రవికుమార్‌కు, మహబూబ్‌నగర్‌కు చెందిన వంశీచందర్ ముందున్నప్పటికీ ఓట్ల విషయంలో రాష్ట్రంలో రెండవ స్థానంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉన్నది. మొదటి స్థానంలోఉన్న నెల్లూరు నుంచి అధ్యక్షపదవి పోటీలో ఎవరూ లేరు. దీంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం అభ్యర్థికే విజయావకాశాలు ఉన్నాయి. వంశీ చందర్‌రెడ్డి కోస్తా ప్రాంతం నుంచి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కనీసం 10 నియోకవర్గ్ణాల్లో పూర్తి స్థాయి మద్దతుంటే రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడం ఖాయం. అయితే ఇప్పటి వరకూ పోటీ చేసే అభ్యర్థుల పరిధిలోని ఎమ్మెల్యే, ఎంపీలు మినహాయించి రాష్ట్రంలో ప్రముఖులెవరూ జోక్యం చేసుకోవడం లేదని తెలిసింది. కనుక అభ్యర్థుల అంగ, అర్థబలాలపైనే ఈ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.