ఓయూ హాస్టల్స్ వదలని పీజీ విద్యార్థులకు నోటీసులు
posted on Jul 2, 2012 @ 5:11PM
పీజీ పూర్తయినా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో హాస్టల్స్‌ను విద్యార్థులు వదలటం లేదు. దీంతో ఆగ్రహించిన యాజమాన్యం పోలీసుల సహాయంతో విద్యార్థులను ఒక నెలరోజుల్లోపు ఖాళీ చేయాలని గడువు ఇచ్చింది. సుమారు 20 రోజుల క్రితం పీజీ విద్యార్థులు హాస్టల్స్ ఖాళీ చేయాలని యాజమాన్యం నోటీసులు ఇచ్చింది. దీన్ని వారు బేఖాతరు చేశారు. దీంతో ఆగ్రహించిన యాజమాన్యం మహిళా హాస్టల్స్‌లోనూ విద్యుత్తు, నీటిసరఫరా నిలిపివేశారు. దీన్ని సైతం భరిస్తూ విద్యార్థులు కొనసాగుతున్నారు. ఈలోపు కొత్తగా తమకు గదులు కేటాయించాలని ప్రవేశం పొందిన విద్యార్థులు హాస్టల్స్ నిర్వాహకులను కోరారు. దీనికి స్పందించిన హాస్టల్ నిర్వాహకులు తమకు సమయం ఇస్తే గదులు కేటాయిస్తామని, సీనియర్లు ఖాళీ చేశాక ఇది సాథ్యమవుతుందని స్పష్టం చేసింది. యాజమాన్యం దృష్టికి హాస్టల్ నిర్వాహకులు ఈ సమస్యను తీసుకువెళ్లారు. ముందుగా విద్యుత్తుసరఫరా నిలిపివేశారు. ఆ తరువాత నీటివసతి ఆపుజేశారు. చివరి అస్త్రంగా నోటీసులు జారీ చేశారు. అయినా సరే! విద్యార్థులు స్పందించకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నోటీసుల్లో ఉన్న విద్యార్థులను ఖాళీ చేయాలని కోరారు. తమకు నెలరోజుల గడువు ఇప్పించాలని పీజీ పూర్తయిన విద్యార్థులు చెప్పటంతో హాస్టల్ నిర్వాహకులు అంగీకరించారు. బకాయిలు కూడా తీర్చేసి మరీ ఖాళీ చేస్తామని ఆ విద్యార్థులు హామీ ఇచ్చారు. దీంతో మరో నెలరోజుల్లో కొత్త విద్యార్థులకు గదులు కేటాయిస్తామని, అంతవరకూ ఇతర అవకాశాలు చూసుకోవాలని హాస్టల్ నిర్వాహకులు కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థులకు తెలియజేశారు. కొసమెరుపు ఏమిటంటే పీజీ పూర్తయిన విద్యార్థికి ఉద్యోగావకాశాలు కూడా యూనివర్శిటీ ద్వారానే వస్తాయి కాబట్టి సర్టిఫికేట్లు వచ్చి వాటిని రిజిష్టర్ చేసేంత వరకూ విద్యార్థులు గడువు కోరారని తెలిసింది.