జగన్ పార్టీలోకి పెరిగిన వలసలు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మరిన్ని వలసలు, కులరాజకీయాలతో పార్టీలలో చిచ్చు
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి తనయుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుండి రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. వివిధ పార్టీల నుండి వలసల పర్వం ఆనాడే ప్రారంభమయ్యింది. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలే కాకుండా ఎన్ని ఆంక్షలు విధించినా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుండి ఆ ఎమ్మెల్యేలపై అధికార కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు చర్యలు చేపట్టడం, అనుచిత వ్యాఖ్యలు చెయ్యటం లాంటి చర్యల ఫలితంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెరిగిన సానుభూతి నేపధ్యంలో యిటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రజలు జగన్ పార్టీకి పట్టంకట్టడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం నివ్వెరపోయింది. కేంద్ర ప్రభుత్వం కుటిల రాజకీయలు, రాష్ట్ర ప్రభుత్వంలో నాయకత్వ లోపం, వర్గ విభేదాలు, అమలువుతున్న ప్రజావ్యతిరేక విధానాలు ఫలితంగా దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిరది. దివంగత నేత వైఎస్‌ఆర్ హయాంలో వివిధ సంక్షేమ పధకాల ఫలాలను పేదలు అనుభవించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలోని నాయకులు ప్రజాసమస్యలు విస్మరించి, ఆధిపత్య పోరుతో ప్రజా పాలన పట్ల వైఫల్యం చెండటంతో విసుగు చెందిన ప్రజాప్రతినిధులు ప్రత్యమ్నాయంగా తమ రాజకీయ మనుగడ కోసం జగన్ స్ధాపించిన వైఎస్‌ఆర్ సిపిలోకి పోతున్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే జగన్ పార్టీ ప్రభావం ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారిందంటే అతిశయోక్తి కావు.
సామాజిక న్యాయం పేరుతో చిరంజీవి రాజకీయ ఆరంగ్రేట్రంతో ప్రారంభమైన కుల రాజకీయల చిచ్చు నేడు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు అంటుకుంది. గతంలో ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ టిడిపిని స్ధాపించినా, అనంతరం రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా చేసేందుకు చంద్రబాబు కృషి చేసినా, అప్పట్లో ఈ సామాజిక వర్గాల గోల, కుల రాజకీయాల పోరు, ఎక్కడా వినపడలేదు. అయితే నేటి రాజకీయ పరిస్ధితులను అధ్యయనం చేస్తే పెరిగిన కుల చిచ్చు ఆయా పార్టీల ఉనికికి భంగం కలిగించే ప్రమాదం కూడా ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. యిదిలా ఉంటే కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మాత్రమే మద్ధతివ్వాలని, అలాగే రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మద్ధతివ్వాలని ఆయా పార్టీల అధినేతలు వారి వారి పార్టీలకు దిశనిర్ధేశాలను ఖారారు చేసుకుంటే, మరి భవిష్యత్‌లో ఆయా పార్టీల రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయా సామాజిక వర్గాల నియంత్రణలోనే రాజకీయ పార్టీలు ఉన్నాయనే విషయం ప్రజలకు, ప్రజాప్రతినిధులకు పూర్తిగా తెలిస్తే భవిష్యత్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని రాజకీయ వలసలు పోయే ప్రమాదం లేకపోలేదని ప్రజలంటున్నారు.