ఆస్తుల వివరాలు దాచేస్తున్న ఐపీఎస్‌లకు కేంద్రహోంశాఖ హెచ్చరిక
posted on Jul 2, 2012 @ 5:01PM
ఆస్తుల వివరాలను దాచేస్తున్న 550మంది ఐపీఎస్ అధికారులకు కేంద్రహోంశాఖ కొంచెం ఘాటుగా హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 15వతేదీలోపు స్థిరాస్తుల వివరాలు(ఐపీఆర్) సమర్పించకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ ఐపీఎస్‌ల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 29మంది ఉన్నారు. ఇప్పటికి రెండుసార్లు (జనవరి 31, జూన్ 15) గడువు ఇచ్చినా మొత్తం 550మంది తమ ఆస్తుల వివరాలు పంపలేదని హోంశాఖ పేర్కొంది. 2011సంవత్సరానికి సంబంధించిన ఐపీఆర్‌లను అధికార్లు సమర్పించలేదని వివరించింది. ఈ నెల 15లోపు ఐపీఆర్‌లను సమర్పించకుంటే పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు నిలిపేస్తామని హెచ్చరించింది. దేశంలో మొత్తం 3,325మంది ఐపీఎస్‌లు ఉన్నారని తెలిపింది. అఖిలభారత సర్వీసుల నిబంధనల ప్రకారం జనవరి 31వ తేదీకల్లా అంతకు ముందు ఏడాది ఐపీఆర్‌ను సమర్పించాలి. ఉత్తరప్రదేశ్‌లో 317మంది, ఇంకో 81మంది ఐపీఎస్‌లు రిటర్న్స్ దాఖలు చేయలేదు. కర్నాటక 76, జార్కండ్ 33, ఆంధ్రప్రదేశ్ 29, జమ్మూకాశ్మీర్ 26, మహారాష్ట్ర 23, హిమాచల్ ప్రదేశ్ 20,గుజరాత్ 18, తమిళనాడు 17, ఒడిస్సా 8 మంది ఐపీఆర్ సమర్పించలేదు. ఐపీఎస్ అధికారులు స్వచ్ఛందంగా తమ ఆస్తుల వివరాలను కేంద్రహోంశాఖకు పంపించటానికి ఎందుకు సుముఖంగా లేరన్న విషయం తెలియటం లేదు. లెక్కల్లో చూపలేనంత ఆస్తులు కూడగట్టారా అన్న ప్రశ్న వీరి చర్యలను బట్టి ఉదయిస్తోంది. ఉద్యోగి అన్న ప్రతీ ఒక్కరూ ఆస్తుల వివరాలు సమర్పిస్తుంటే ఐపీఎస్‌లు ఎందుకు మినహాయింపు కోరుకుంటున్నారు? అన్న విషయంపై దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. ఒకవేళ మినహాయింపు కోరుకుని ఉంటే కనీసం దానిపైన ఒక లేఖ అయినా రాయాలి కదా! విధుల నిర్వహణలో ఎంత మునిగిపోయినా ఈ వివరాలకు కొంత సమయం కేటాయించి నివేదించకపోతే కేంద్రహోంశాఖను కించపరిచినట్లే అని ఐపీఎస్‌లు గుర్తించాలి సుమా!