సచివాలయం ముట్టడి చంద్రబాబు, నారాయణల అరెస్టు

సోమవారం ఉదయం ఇందిరాపార్క్ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మహాధర్నా ప్రారంభించారు. ఈ ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విత్తనాలు ఇవ్వలేని ప్రభుత్వం రైతులకు ఏవిధంగా న్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు. రూ. 3 వేల కోట్లు వ డ్డీ మాఫీ ఇవ్వాల్సి ఉండగా రూ. 300 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. 10 శాతం మంది రైతులకు కూడా రుణాలు అందలేదని, పావలా వడ్డీ ఎక్కడా క న్పించడం లేదని బాబు దుయ్యబట్టారు. రైతలు వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సి వచ్చిందన్నారు. రుణాలను రీ షెడ్యూల్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అనంతరం అక్కడి నుంచి సచివాలయం ముట్టడికి చంద్రబాబునాయుడు, నారాయణలతోపాటు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్ళారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని చంద్రబాబు, నారాయణలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎన్ని అరెస్టులు చేసినా, ఇబ్బందులకు గురిచేసినా రైతుల కోసం తమ పోరాటం ఆగదని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.

రాష్ట్రానికి కొత్త హార్డ్‌వేర్‌ కంపెనీలు?

రాష్ట్ర మంత్రివర్గం ప్రకటించిన రాయితీలు కొత్తహార్డ్‌వేర్‌ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. వేలాది కోట్లతో హార్డ్‌వేర్‌ కంపెనీలు ప్రారంభిద్దామని నిర్ణయించుకున్న వారంతా ఇతర రాష్ట్రాలను వదిలి ఆంధ్రప్రదేశ్‌కు రాకతప్పదు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉన్న విద్యుత్తు కోత ఈ కంపెనీలకు ఉండబోదని ప్రభుత్వం ప్రకటించింది. ఇది కూడా కంపెనీలను ఆకర్షించేందుకు హైలైట్‌ పాయింట్‌ అని పారిశ్రామికవేత్తలంటున్నారు. అంతేకాకుండా ఒక పరిశ్రమకు అవసరమైన రుణ, భూమి వంటి అన్ని సదుపాయాల్లోనూ రాయితీలు ప్రకటించింది. దీనితో ఆగకుండా ఉద్యోగ నియామకాలకూ తమ వంతు సాయాన్ని అందిస్తోంది. అంటే రెండేళ్లలో 50మందిని నియమించటానికి రూ.2.5లక్షలు, చిన్న, మథ్యతరహా కంపెనీలు 200మందిని నియమించేందుకు పది లక్షల రూపాయలు ప్రభుత్వం సహాయం అందిస్తుంది. 2,3 స్థాయి పట్టణాల్లో పెట్టే చిన్న కంపెనీలకు భారీగా మంత్రివర్గ సాయం అందుతోంది. సాంకేతికపరిజ్ఞొనాభివృద్థి కోసం తీసుకునే పరికరాలకు మొదట సారి సబ్సిడీ కింద పది శాతం అదీ గరిష్టంగా 25లక్షల వరకూ ప్రభుత్వమే భరిస్తుంది. రెండోస్థాయి నగరాల్లో ఏర్పాటు చేసే కంపెనీలకు నూరుశాతం స్టాంపుడ్యూటీ మినహాయింపు ఇస్తారు. ఈ హార్డ్‌వేర్‌ కొత్తకంపెనీలకు వ్యాట్‌, సిఎస్‌టిల నుంచి మినహాయింపు ఇచ్చేస్తోంది. గతంలో కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఇచ్చిన రాయితీలతో పోలిస్తే ఇప్పుడు ఆంధ్రాప్రకటించిన విధానాలు చాలా బాగున్నాయని, చిన్న చిన్న పట్టణాల్లో సైతం ఈ కంపెనీలు పెట్టడం ద్వారా ప్రభుత్వ రాయితీల ఫలం ఎక్కువ అందుకోవచ్చని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లు అంటున్నాయి. సెజ్‌లు, ప్రభుత్వ భూముల్లో 25శాతం రాయితీ ప్రకటించటం కూడా హైలైట్‌గా ఉందంటున్నారు.

విశాఖతీరంలో భారీ ప్లాంటు, మత్య్స కారుల వ్యతిరేకత

విశాఖతీరంలో రూ. రెండువేల కోట్ల రూపాయల భారీప్లాంటు మరో మూడేళ్ల లోపు నిర్మించనున్నారు. హిందుస్తాన్‌ కాపర్‌స్మెల్టింగ్‌ ప్లాంటును ఇక్కడ నెలకొల్పనున్నారు. దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్టులో ఈ కంపెనీ విస్తరించేందుకు అవకాశాలు మెరుగవుతాయి. కాపర్‌వ్యాపారరంగంలో ఉన్న ఈ కంపెనీ ఇతర రంగాల్లోకి పరిచయమయ్యేందుకు విశాఖ అనువుగా ఉంటుందని ముందస్తుగా ఈ ప్లాంటుకు యోచన చేశారు. ఈ ప్లాంటు నిర్మాణానికి మూడేళ్ల సమయం పడుతుందని హెచ్‌సిఎల్‌(హిందుస్తాన్‌ కాపర్‌ లిమిటెడ్‌) సిఎండి షకీల్‌ అహ్మద్‌ తెలిపారు. ప్రస్తుతానికి సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించేందుకు కన్సల్టెన్సీ సంస్థను మాత్రం ఏర్పాటు చేశామని వివరించారు.     అయితే ఈ విశాఖతీరంలో ఏ కొత్తప్లాంటు ప్రతిపాదన చేసినా ఇటీవల వివాదాలు తెరపైకి వస్తున్నాయి. అందుకే కన్సల్టెన్సీ సంస్థ ద్వారా హెచ్‌సిఎల్‌ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తోంది. ప్రత్యేకించి మత్స్యకార ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టేందుకు భారీ సంస్థలు కృషి చేస్తున్నాయి. అందువల్ల తీరం ఖాళీ లేకుండా పోతోందని విశాఖ పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ పరిశ్రమల వల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడినా కాలుష్యం చవి చూడాల్సి వస్తోందంటున్నారు. అందుకని ముందుగానే కాలుష్యాన్ని జీరో  చేసే సాంకేతికపరికరాలతో ప్లాంటుకు ప్రతిపాదనలు రూపొందించుకోవాలని సూచిస్తున్నారు.

గిన్నీస్‌లో ఆంధ్రావిద్యార్థుల అరుదైన రికార్డు

ఆంధ్రావిద్యార్థులు లక్షన్నర మంది ఒక్కసారే ‘జనగణమన....’ అంటూ ఆలపించిన జాతీయగీతానికి గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో స్థానం లభించింది. ఈ అరుదైన సంఘటనకు విజయవాడ మాంటిస్సోరీ వేదికైంది. కృష్ణాజిల్లాలోని 320 పాఠశాలల నుంచి లక్షన్నర మంది విద్యార్థులు ఈ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 405832 నెంబరు వింతగా ఈ రికార్డునమోదైంది. రవీంద్రనాథ్‌టాగూర్‌ రచించిన జనగణ... మన జాతీయగీతానికి అరవై ఏళ్లు నిండిరది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాతృభాష, మాతృభూమి, కన్నతల్లిని ఒకేలా చూడాలని వక్తలు గజల్‌శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ కంకణాల శ్రీనివాస్‌ ఆశించారు. ఒకేసారి లక్షన్నర మంది జాతీయగీతాలాపన చేయటం విజయవాడ నగరంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఆహుతులను ఈ కార్యక్రమం అలరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ గిన్నీస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డులో ఈ కార్యక్రమం నమోదుకావటంతో వెబ్‌సైట్లలో వివరాలను చూసేందుకు పలువురు పోటీపడ్డారు.

మద్యం అనధికార అమ్మకాలు?

రాష్ట్రంలో మద్యం అనధికార అమ్మకాలు సాగుతున్నాయి. లైసెన్స్‌ ఒకరికి ఉంటే వారి చుట్టూ పది మంది పెట్టీషాపులు పెట్టి మరీ బతికేస్తున్నారు. అంతే కాకుండా దాబాలు, క్లబ్బులు కూడా  మద్యం అనధికార అమ్మకాలకు తెర లేపుతున్నాయి. అసలు రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన అన్ని ప్రాంతాల్లోనూ ఈ మద్యం అనధికారికంగా అమ్మకాలు సాగుతుంటే ఆ సమాచారం సేకరించటానికి కూడా ఎక్సయిజ్‌ అయిష్టత వ్యక్తం చేస్తోంది. సిండికేట్ల పుణ్యం ఊరికే ఉంచుకోకూడదని ఈ పెట్టీషాపులను ఎక్సయిజ్‌ వదిలేసింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు కొన్ని ప్రాంతాల్లో అనధికారిక మద్యం దుకాణాలపై దృష్టి సారించి  రాజధానిలో ఒక క్లబ్బును బయటపెట్టారు. ఈ క్లబ్బులో ఎక్సయిజ్‌ అనుమతి లేకుండా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. బోయినపల్లిలోని ఏడు ఎకరాల్లో ఫ్యామిలీక్లబ్బు ఏర్పాటు చేశారు. నేని హైటెక్‌పేరిట సాగుతున్న ఈ క్లబ్‌లో ఎక్సయిజ్‌ అనుమతి లేకుండానే మద్యం విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. అందుకే పోలీసులు ఈ క్లబ్బుపై దాడి చేసి 35మంది తాగుబోతులను అరెస్టు చేశారు. క్లబ్బు యజమాని శేఖరరెడ్డి పరారీలో ఉన్నారు. ఈ సంఘటన అనధికార మద్యం అమ్మకాలకు అద్దం పడుతోందని ఇకనైనా ఎక్సయిజ్‌ గుర్తించాలి.

ప్రత్యేక తెలంగాణాపై కాంగ్రెస్‌ మల్లగుల్లాలు?

ప్రత్యేక తెలంగాణా  అంశంపై కాంగ్రెసు పార్టీ అధిష్టానంలో  మళ్ళీ చలనం వచ్చింది. ఈ అంశం తమపార్టీపై తీవ్రప్రభావం చూపుతోందని అధిష్టానం భావిస్తోంది. ఒకవైపు తెలంగాణావాదులు, మరోవైపు సమైక్యవాదులు ఎన్నికల సమయంలో పార్టీ గెలుపును ఈ అంశం ఆధారంగా శాసిస్తున్నారని అధిష్టానం భావిస్తోంది. అందుకే దీన్ని తొందరగా తేల్చి పారేస్తే మిగతా పనులు చూసుకోవచ్చని అధిష్టానం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.  చిత్రంగా తెలగాణా, రాయలసీమలను కలిపే రాయల తెలంగాణా రాష్ట్రం గురించి ఓ మూడు రోజుల పాటు కాంగ్రెస్‌ నాయకత్వం చర్చలు నడిపింది. రాయలసీమ ఎప్పుడైతే  తమతో కలిసిందో అప్పుడే అధికారం పోయిందన్న భావనలో ఉన్న టిఆర్‌ఎస్‌ నాయకులు దీని సాధ్యాసాధ్యాలు చర్చించకుండానే అది వద్దని బ్రేక్‌ వేశారు. వారు వద్దన్నా కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం రాయలతెలంగాణావైపే మొగ్గుచూపుతోంది. ఇలా తెలంగాణాను ప్రకటించేస్తే తమకు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీతో ఉన్న సమస్య కూడా తప్పినట్లే కాంగ్రెస్‌ భావిస్తోంది. ఎందుకంటే అథికారం కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ పార్టీలు ఇప్పుడు ఉన్న సఖ్యత వదిలేసి ఘర్షణకు దిగుతారు కాబట్టి రాయల తెలంగాణా సరైన పరిష్కారంగా అధిష్టానం భావిస్తోంది. మీలో మీరే తేల్చుకోండని పరోక్షంగా తన్నుకు చావమని కాంగ్రెస్‌ అధిష్టానం సూచిస్తోంది.ఒకవైపు టి.ఆర్‌యఎస్‌.ను మరో వైపు జగన్‌ పార్టీని ఇరుకున పెట్టేందుకే కాంగ్రెస్‌ అధిష్టానం ఇటువంటి ఆలోచనలు చేస్తోందని, ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టడమే ఆ పార్టీ లక్ష్యమని తెలుస్తోంది. అయితే  టిఆర్‌ఎస్‌ నేరుగా ఈ ప్రతిపాదనను  వ్యతిరేకిస్తున్నందున కాంగ్రెస్‌ ఇంకా  మల్లగుల్లాలు పడుతోంది. అయితే ఈసారి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని నేతల తీరు స్పష్టం చేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఇచ్చిన సంకేతాలు ప్రత్యేక రాష్ట్రం ఖాయమని పరోక్షంగా అర్థం వస్తోంది.  

2014 కాంగ్రెస్‌ అజెండాలో సంపూర్ణ మద్యనిషేధం

రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాననిషేధాన్ని ప్రవేశపెట్టేందుకు 2014 ఎన్నికలను కాంగ్రెస్‌ వేదికగా భావిస్తోంది. ఇప్పటి నుంచి మ్యానిఫెస్టో రూపొందించేందుకు కూడా కాంగ్రెస్‌ ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్‌ ఇచ్చే వరంగా సంపూర్ణమద్యపాన నిషేధం అంశాన్ని ప్రకటించాలని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. తాము వ్యక్తిగతంగా కోరుకుంటున్నా ప్రభుత్వపరంగా సాధ్యమవుతుందా అన్న అంశం ఆలోచిస్తామని పీసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ ప్రకటించారు. వాస్తవానికి ఈయన కుటుంబంపై మద్యంవ్యాపార ఆరోపణలున్నాయి. అయితే తాము సంపూర్ణమద్యపాన నిషేధం కోసం ప్రభుత్వానికి ఇతర మార్గాల్లో ఆదాయాన్ని చూపుతామన్నారు. కేంద్రం అంగీకరిస్తే ఈ అంశం మ్యానిఫెస్టోలో చేరుతుందన్నారు. గతంలో వైఎస్‌ఆర్‌ రైతులకు ఉచిత విద్యుత్తు అంశంపై కేంద్రం నుంచి అనుమతి పొందారని గుర్తు చేశారు. అలానే ఇక్కడి పరిస్థితులు వివరించి తాను ఈ సంపూర్ణమద్యపాన నిషేధం అంశం మ్యానిఫెస్టోలోకి చేర్చేందుకు కృషి చేస్తానని బొత్సాబాబు శెలవిచ్చారు. గత ఎన్నికల్లో పరిస్థితులను గమనిస్తే రాష్ట్రంలో అధికారం కోసం సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని నందమూరి తారకరామారావు ప్రకటించారు. ఆయన ఎన్నికల్లో విజయం సాధించాక తొలిసంతకం కూడా ఈ ఫైలుపైనే చేశారు. ఆనాటి అనుభవాలూ, అప్పటి పరిస్థితులూ పునరావృతమయ్యాయి. ఈ అంశాన్ని ఉప ఎన్నికల్లో ఓటమి తరువాత గమనించిన పీసిసి అధ్యక్షుడు బొత్సా మీడియా ముందు ఆగలేక నోరు జారి ప్రకటించేశారు. కానీ, ఇదే గనుక బొత్సా నిజం చేయగలిగితే కాంగ్రెస్‌ మళ్లీ అథికారంలోకి వస్తుంది. అప్పట్లో మాదిరిగా చరిష్మా ఉన్న ఎన్టీఆర్‌ లేకపోయినా కాంగ్రెస్‌కు మ్యానిఫెస్టో బలం ఉందని ఈ అంశం తోడైతే ప్రకటించేయవచ్చు.

హీరోల యందు రియల్‌ హీరోలు వేరయా

 టాలీవుడ్‌లో ఓ ప్రముఖ స్టార్‌ ఒకసారి విమానంలో ప్రయాణం చేస్తుండగా దానిలో సాంకేతిక లోపంతలెత్తటంతో ఆ విమానాన్ని పైలట్‌ చాకచక్యంగా పొలాల్లో దింపారు. అప్పుడు సదరు ఆ  హీరోగారు విమాన ప్రయాణంలో జరిగిన ఒడిదుడుకుల్లో కంగారు పడి బోరున ఏడ్చారని ప్రముఖ నవలా రచయిత యండమూరి సెలవిచ్చారు. అలాగే మరో తెలుగు హీరో ఇంట్లో దొంగతనానికని ఒకడు తెగబడితే అటుగా వెళుతున్న  పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అప్పుడు సదరు హీరోగారు ఒకవేళ దొంగతనానికి వాడు ఇంట్లో ప్రవేశించి ఉంటే డబ్బులుతోపాటు నన్ను కూడా చంపేసేవాడేమోనని  అసలు రూపాన్ని బయట పెట్టారు. మరో హీరో ఓ ఫాక్షన్‌ స్టోరీ లో హీరోగా చేస్తుంటే వ్యతిరేక వర్గం హీరో ప్రయాణిస్తున్న కారుపై బాంబులు విసిరారు. అప్పుడు ఆ హీరో ఒకటే ఏడుపు .... ముందుగా తేరుకున్న ఫాక్షనిస్టే హీరోగారిని కారులోనుండి బయటకు లాగి చూస్తే ఏముంది ...కొంచెం గీరుకుపోయింది అంతే... దీన్ని బట్టి తేలేదేమంటే హీరోలంతా సినిమాలకే పరిమిత మవుతుంటారు. బయటకు వస్తే ఏముండదు.  అయితే ఈ రోజు జూబ్లిహిల్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎమ్మెల్సీలంతా పరుగుపెడుతుంటే ఒక యువ ఎమ్మెల్యే దివంగత కాంగ్రెస్‌ నాయకుడు అయిన జనార్ధన్‌రెడ్డి కుమారుడు  విష్ణువర్దన్‌రెడ్డి దట్టంగా అలుముకున్న పొగలను మంటలను లెక్కచేయకుండా సిలిండర్‌ను ఆఫ్‌ చేయడం పలువురిని ఆకట్టుకుంది. యుపిఎ తరుపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రణబ్‌ముఖర్జీ ప్రసంగం తరువాత జూబ్లీహాలులో అగ్నిప్రమాదం సంభవించింది. అదీ ఎసి గ్యాస్‌సిలెండర్‌ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. మంటలు ఉధృతంగా ఉన్న సమయంలో పీజెఆర్‌ తనయుడు విష్ణు మంటల్లోకి దూకి వస్తున్న వేడిని లెక్క చేయకుండా ఎసి సిలెండర్‌ను  ఎంతో చాకచక్యంగా ఆఫ్‌ చేశారు. దీంతో కొద్దిసేపు మంటలు వ్యాపించినా మరింత పెద్ద ప్రమాదం తప్పింది. కొద్దిసేపటికి మంటలూ శాంతించాయి. దీంతో అక్కడే ఉన్న మిగిలిన కాంగ్రెస్‌ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విష్ణును తమ భుజాల పైకెత్తి అభినందనలు తెలిపారు. చప్పట్లు కొట్టి మరీ విష్ణు సాహసాన్ని ప్రశంసించారు. హమ్మయ్య ఈ ప్రమాదం తప్పిందని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన విష్ణు స్నేహితులు కూడా ఆయన సాహసాన్ని కొనియాడారు.  నిజజీవితంలో నాయకుడంటే అతడే మరి.

రాష్ట్ర కాంగ్రెస్‌లో చిరంజీవికి పెరుగుతున్న ప్రాదాన్యత

సినీపరిశ్రమలో మెగాస్టార్‌గా అభిమానుల్ని అలరించిన చిరంజీవి తమిళనాడులోని హీరోకమ్‌ సిఎం అయిన ఎంజిఆర్‌ని,  తెలుగుదేశం పార్టీని స్ధాపించిన ఎన్టీఆర్‌ను స్పూర్తిగా తీసుకొని ప్రజారాజ్యంపార్టీని పెట్టి రాజయాలలోకి వచ్చారు. ఎక్కడ రాజకీయ సభలు పెట్టినా విరగబడివచ్చే జనం ఓట్లకు మాత్రం అంత ఇంట్రస్టు చూపలేదు. 2009 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి రాజటశేఖర్‌రెడ్డి ప్రజాసంక్షేమ పధకాల హవాలో చాలాచోట్ల కొద్ది మెజారిటీతో ఓడిపోయారు. తదనంతరం వైయస్సార్‌  మరణంతో జగన్‌వర్గం  కాంగ్రెస ్‌నుండి విడివడిరది. ఆపరిణామంలో కాంగ్రెస్‌కు అసెంబ్లీలో బలం తగ్గకుండావుంటానికి  ప్రజారాజ్యంపార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేయటం తెలిసిందే. అయితే  మహాసముద్రమైన ఆపార్టీలో అంతగా ప్రాముఖ్యంలేని వారుగానే బాధపడినప్పటికీ ఇప్పుడిప్పుడే అక్కడకూడా తనహవా పెరుగుతుండటం  చిరంజీవి భవిష్యత్‌లో నాయకుడిగా ఎదిగే అవకాశం కనిపిస్తుంది. ఇందుకు నిదర్శనంగా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో చిరంజీవికి మద్దతు నిచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే చెప్పవచ్చు. ఉప ఎన్నికల ప్రచారానికి  రామచంద్రాపురానికివెళ్లక పోయినా కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌తో గెలిచిన తోట త్రిమూర్తులు నా విజయానికి కారణం చిరంజీవేనన్నారు. నర్సాపురంనుండి కాంగ్రెస్‌ బరిలో ఎన్నికైన కొత్తపల్లి సుబ్బారాయుడుది అదే పాట. ఆతరువాత పెడన ఎమ్మేల్యేబోగి రమేష్‌ ఇంకొంచెం ముందుకెళ్లి కాబోయే ముఖ్యమంత్రి చిరంజీవే అన్నారు. అమాత్యులు రఘువీరారెడ్డి మాట్లాడుతూ చిరంజీవి నాయకత్వంలో పనిచేయటానికి నాకేమీ అభ్యతంరంలేదు అన్నారు. ఎప్పుడూ ఏదోఒక వివాదాల్లో ఉండే విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌  త్వరలో చిరంజీవికి కేంద్ర పదవి ఖాయం అని చెబుతున్నారు. కాలం ఏమిచెబుతుందో వేచి చూద్దాం.

వ్యాన్‌పిక్‌ భూములపై ఉద్యమిస్తున్న రైతాగం

వ్యాన్‌పిక్‌ భూముల కుంభకోణం నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కుదిపేస్తోంది. రైతులకు అతితక్కువ డబ్బులు ఇచ్చి వారి భూములను లాక్కున్న ఈ కుంభకోణంపై ఆందోళన వ్యక్తం చేసేవారి సంఖ్యనానాటికీ పెరుగుతోంది. అంతే కాకుండా తమ భూములు తిరిగి ఇచ్చేయాలని రైతులు ఇప్పుడు వేదికలెనెక్కి మరీ కోరుతున్నాడు. అసలు తనకు జరిగిన అన్యాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా వచ్చి సమస్య పరిష్కరించాల్సి ఉండగా రాజకీయఅనిశ్చితి కారణంగా ఆయన మౌనం వహించాడని రైతులు భావిస్తున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి కారణంగానే తమ సమస్య పరిష్కారం గురించి ముందు ప్రయత్నించిన సిఎం ఆ తరువాత ఇతర సమస్యలపై దృష్టి సారించారని రైతులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ వ్యాన్‌పిక్‌ కారణంగా భూములు కోల్పోయినవారందరూ ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరులో1600 ఎకరాల చుట్టూ ఉన్న కంచెను తొలిగించారు. ఆ తరువాత రైతులందరూ కలిసికట్టుగా బయలుదేరి వచ్చి వ్యాన్‌పిక్‌ వల్ల బాగుపడిన బడానేతలు ఇప్పుడు తిరిగి ఎన్నికైనా భవిష్యత్తులో తీవ్రపరిణామాలు ఎదుర్కోకతప్పదని రైతులు హెచ్చరించారు. ఒంగోలుశాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇతర ప్రముఖుల గురించి ఈ సందర్భంగా రైతులు గుర్తు చేసుకున్నారు. మంత్రి మోపిదేవితో పాటు శ్రీనివాసరెడ్డిని కూడా విచారించాలని సిబిఐకి రైతులు విజ్ఞప్తి చేశారు.

భూకేటాయింపుల విధానాలపై సిబిఐ ఆరా?

రాష్ట్రంలో కీలకమైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసు విచారిస్తున్న సిబిఐ మరో కొత్త అంశంపై విచారణ సాగించింది. ఈ అంశంపై కూలంకుషంగా పరిజ్ఞానం సంపాదించే దిశగా సిబిఐ కసరత్తులు చేసింది. భూకేటాయింపులపై రాష్ట్రప్రభుత్వం అనుసరించే విధానాన్ని స్వయంగా అడిగితెలుసుకుంది. దీనికోసం భూకేటాయింపులు చేసే అధికారులతోనూ, ఇతర ప్రతినిధులతోనూ సిబిఐ సంప్రదింపులు జరిపింది. దాదాపు పూర్తిస్థాయి విచారణ తలపించేలా ఎక్కువసమయాన్ని సిబిఐ కేటాయించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత ఎంత కాలంలో భూకేటాయింపులు జరుగుతాయనే విషయంపైనే సిబిఐ దృష్టి సారించింది. సచివాలయంలో దస్త్రాలు, ఫైళ్ల కదలిక, వివిధ హోదాల్లోని అధికారులు వారి అధికారం తదితర అంశాలపై సిబిఐ వివరాలు తీసుకుంది. ప్రత్యేకించి కొందరు అధికారులను దిల్‌కుషాలో ప్రశ్నించి తమ సందేహాలను తీర్చుకుంది. సిబిఐ ఇలా భూకేటాయింపుల అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించడం చూస్తుంటే మరో కొత్త సంచలనం త్వరలో తెరపైకి వస్తుందని పలువురు భావిస్తున్నారు. ఈ విచారణ ఆధారంగా ఏ కేసును పరిష్కరిస్తారోనని ఎదురు చూస్తున్నారు.

సురేఖకు ఎం.ఎల్‌.సి సీటు

పరకాల ఎన్నికల్లో ఓడి గెలిచానన్న  కొండా సురేఖ కొత్తగా ఎన్నికైన వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  ఎమ్మేల్యేల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి అలకబూని రాలేదని తెలిసింది. ఇది తెలిసిన వైసిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ హైదరాబాద్‌ లోని సురేఖ  ఇంటికెళ్లి ఎంఎల్సీ సీటు ఇస్తానని ఓదార్చినట్లు తెలిసింది. తెలంగాణాలో తమకు గట్టి మద్దతుదారులుగా వున్నందున,  కేవలం పదిహేను వందల ఓట్ల తేడాతో ఓడిపోయిన సురేఖను గౌరవనీయంగా వుంచటానికే  విజయమ్మ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని పార్టీలు లోపాయికారిగా టిఆర్‌యస్‌ కు ఓట్లు వేయడం ద్వారా తాను ఓడినట్లు సురేఖ అంటున్నారు. ఈ సందర్బంగా ఆమె త్వరలో తెలంగాణలో ఓదార్పు యాత్ర కొనసాగిస్తామని, మూడు నెలల్లో  కెసిఆర్‌ తెలంగాణ తీసుకు రాకపోతే ఆయన్ని నిలదీసే కార్యక్రమం చేపడతామని విజమయ్య చెప్పినట్లు తెలిసింది.

టి.డి.పి.రైతు ధర్ణాకు రైతులు దూరం

సత్యరమే రైతుల సమస్యలను పరిష్కరించాలనికోరుతూ  ఆదిలాబాద్‌లో  పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు  కలక్టరేట్‌వద్ద పెద్ద ఎత్తున  ధర్నాచేపట్టారు. ఎంపీ రాధోడ్‌రమేష్‌తోపాటు ఎమ్మేల్యేలు గడ్డం నగేష్‌, సుమన్‌రాధోడ్‌ మరికొంతమంది నాయకులు పాల్గొన్నారు. రైతుల పట్ల ప్రభుత్వవైఖరిని వారు ఎండగట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎరువుల ధరలను పెంచారని, విత్తనాలకై కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నా వారిని అధికారులు పట్టించుకోవడంలేదని  తెలిపారు.అధికార యంత్రాంగం దళారులకు కొమ్ముకాస్తూ రైతు సంక్షేమాన్ని విస్మరించిందని వారు అన్నారు. వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆందోళనను తీవ్రతరం చేస్తుందని వారు స్పష్టంచేశారు. అయితే ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, రైతులు దూరంగా ఉన్నారు. జిల్లా నలుమూలలనుండి నాయకులే తరలివచ్చారు. తెలంగాణవాదం బలంగావుండటం రైతులు పొలం పనుల్లో పడటంవల్ల ఈ పరిస్థితి తలెత్తిందని నాయకులు చెబుతున్నప్పటికీ కార్యకర్తలు, రైతులు హాజరవకపోవడం నాయకత్యాన్ని ఆందోళనకు గురిచేసిందని తెలుస్తుంది.  

గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపులేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని యస్‌ఎఫ్‌ఐ నాయకత్యం డిమాండు చేస్తుంది. జిల్లాల్లోని గుర్తింపులేని పాఠశాలలో కనీస ప్రమాణాలు కూడా ఉండటంలేదని, విద్యాహక్కుచట్టం కింద 25 శాతం సీట్లను స్ధానిక నిరుపేద విద్యార్థులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీే అవికూడా సక్రమంగా అడ్లిషన్లు జరగటం లేదని, దీనివల్ల నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. గుర్తింపు లేని పాఠశాలలు నడిపితే క్రిమినల్‌ చర్యలు చేపడతాయని కలెక్టర్లు, డిఇవోలు హెచ్చరికలు జారీ చేసినప్పటికి ఆయా విద్యాసంస్థల యజమానులు పట్టించుకోవడం లేదని అన్నారు. అంతేకాకుండా నిబంధనలకు విరుధంగా విద్యార్థులనుండి ఎక్కువమొత్తంలో ఫీజులను వసూలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్సందించి విద్యార్ధులు విద్యాసంవత్సరం నష్టపోకుండానే గుర్తింపులేని పాఠశాలలను మూయించాలని వారు కోరారు.

డీప్‌ డిప్రషన్‌లో శ్రీలక్ష్మి

ఆరుమాసాలుగా చెంచల్‌గూడా జైలులో ఉన్న సీనియర్‌ ఐఎఎస్‌ ఆఫీసర్‌ శ్రీలక్ష్మి డీప్‌ డిప్రషన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. తమ బందువులను, మిత్రులను కలవడానికి ఆమె ఇష్టపడడం లేదని జైలు అధికారులు తెలుపుతున్నారు. ములాఖత్‌ లో ఆమె భర్తను మాత్రమే కలుస్తున్నారని అదీ బెయిలు కోసమేనని అప్పుడప్పుడు దానికి సంబందించి లాయర్‌ను కలుస్తున్నారని అంతకు మించి ఎవరినీ కలవడానికి ఆమె ఇష్టపడనట్లు తెలుస్తుంది. చివరకు తమ పిల్లలను కూడా కలవడానికి ఆమె సుముఖంగా లేరని తెలుస్తుంది. జైలు అధికారులు ఆమెకు ప్రత్యేక హోదా కల్పించి నప్పటికీ వారు అందించిన వంటసామాగ్రితో ఆమె వండుకుని సాదా జీవితాన్ని సాగిస్తున్నారని సమాచారం. ఉదయం,సాయంత్రం వాకింగ్‌, దినపత్రికల పఠనం, ఆత్యాత్మి¸కపుస్తకపఠనం, దైవప్రార్థన ఆమె దినచర్యగా కొనసాగుతుంది. ఆమెపై ఆరోపణలు ఇంకా రుజువుకాలేదని అటుంటప్పుడు సుదీర్ఘకాలం జైలులో ఉంచడం ఎంత వరకూ సమంజసమని సాటి ఐ.ఎ.ఎస్‌. అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ప్రణబ్‌ సీఎల్పీ సమావేశం తరువాత జూబ్లీహాల్‌లో అగ్నిప్రమాదం

యుపీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మాజీ కేంద్రమంత్రి ప్రణబ్‌ముఖర్జీ ప్రచారంలో భాగంగా ఆదివారం నగరానికి వచ్చారు. జూబ్లీ హాల్‌లో సీఎల్పీ సమావేశం నిర్వహించారు. అయితే అయన సమావేశం ముగించుకుని వెళ్ళిన కాసేటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై స్పందించిన సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.తాజ్ కృష్ణాలో ప్రణబ్‌ను ముఖ్యమంత్రి కలిశారు. ప్రమాద ఘటనను వివరించారు. ప్రణబ్ ఈ ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది చిన్న ప్రమాదమే అని, అధికారులు అప్రమత్తమై చల్లార్చారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కాగా దట్టమైన పొగలు అలుముకోవడంతో జూబ్లీ హాల్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చాయి.

ఈనెల 10 నుంచి మారనున్న తత్కాల్ రిజర్వేషన్ల టైం

అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకులకు ఉపయోగకరంగా వుంటుందని ప్రవేశపెట్టిన తత్కాల్ రైల్వే రిజర్వేషన్ వల్ల సాధారణ ప్రయాణీకుల కంటే దళారులే ఎక్కువగా లాభం పొందుతున్న విషయాన్ని గుర్తించిన రైల్వేశాఖ తత్కాల్ రిజర్వేషన్ వేళల్లో మార్పుచేసింది. ఈ ప్రకారం ఇకపై ఉదయం 10 గంటల తరువాతే తత్కాల్ రిజర్వేషన్లు అందుబాటులో వుంటాయని రైల్వే అధికారులు ప్రకటించారు. తత్కాల్ రిజర్వేషన్లలో అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు రైల్వేశాఖకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఉదయం 8 గంటలకే రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో వుండడంతో దళారులు ముందుగా రిజర్వేషన్లు చేయించుకొని, అనంతరం వాటిని బ్లాక్‌లో విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ప్రయాణీకులకు వీలైన సమయాన్ని అమలు చేయాలని నిర్ణయించి, ఉదయం 10 గంటలకు మాత్రమే తత్కాల్ రిజర్వేషన్లు కౌంటర్లను తెరువనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ విధానం ఈనెల 10వ తేదీ నుంచి అమలుకానుంది. విధి నిర్వహణలో రైల్వే సిబ్బంది సెల్‌ఫోన్ వినియోగంపై కూడా రైల్వే శాఖ నిషేధం విధించింది.

మత్స్యకారులకు విజయమ్మ, షర్మిల పరామర్శ

మత్స్యకారుల సమస్యలను శాసనసభలో ప్రస్తావిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. పదిహేను రోజుల్లోగా తిక్కవానిపాలెం మత్స్యకారులకు న్యాయం జరిగేలా చూడాలని ఎన్‌టీపీసీ యాజమాన్యాన్ని విజయమ్మ డిమాండ్ చేశారు. ఎన్‌టీపీసీ వల్ల బాధితులైన మత్స్యకారులను పరామర్శించేందుకు విజయమ్మ, షర్మిల ఈరోజు ఉదయం విశాఖ జిల్లాలోని తిక్కవానిపాలెం వచ్చారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. ఎన్‌టీపీసీ వల్ల మత్స్యకారులు బాధితులుగా మారారని, వారికి న్యాయం అందించేందుకు యాజమాన్యం సత్వరం చర్యలు చేపట్టాలని కోరారు. తిక్కవానిపాలెం బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. వారి తరఫున వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని ఆమె హెచ్చరించారు. బాధితులందరికీ ప్రభుత్వం ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు. మత్య్సకార కుటుంబాలను ఆమె పరామర్శించారు. మత్స్యకారులు విజయమ్మకు వినతి పత్రాన్ని సమర్పించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల పక్షాన నిలుస్తుందని విజయమ్మ మత్స్యకారులకు భరోసా ఇచ్చారు.

చిరంజీవికి కేంద్రమంత్రి ఇస్తే ఫలితాలు వేరేల ఉండేవి: లగడపాటి

ఎంపీ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినట్టయితే, ఉప ఎన్నికల ఫలితాలు మరోవిధంగా ఉండేవని చెప్పుకొచ్చారు. వైఎస్ కుమారుడు కదా..పిల్లవాడు కదా..అనే భావనతోనే ఇన్నాళ్లు వైఎస్సార్ సీపీ నేత జగన్‌ను చూసీ చూడనట్లు వదిలేశామన్నారు. కానీ, నెలరోజులుగా ఆయన పార్టీని తమ నేతలు దీటుగా ఎదుర్కొంటున్నారని, ఈ వైఖరి మరో రెండేళ్లు కొనసాగితే పార్టీ బలోపేతం కావడం ఖాయమని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై వచ్చే ఆగస్టు నాటికి స్పష్టత వస్తుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం వ్యాఖ్యలు కూడా ఇవే సంకేతాలు ఇచ్చినట్టు భావిస్తున్నానన్నారు. 2014 ఎన్నికల్లో సమైక్యవాదమో, తెలంగాణ వాదమో కాక కాంగ్రెస్‌వాదంతో ముందుకు వెళతామని లగడపాటి వ్యాఖ్యానించారు.