ఉత్తరాంధ్రపై కన్నేసిన మావోయిస్టులు
posted on Jul 3, 2012 @ 11:58AM
ఛత్తీస్‌ఘడ్, ఒడిస్సాలో కిడ్నాప్‌లు, దాడులతో భీభత్సం సృష్టిస్తున్న మావోయిస్టులు తాజాగా ఉత్తరాంధ్రపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో చాలాకాలంగా జైళ్లలో మగ్గుతున్న తమ నాయకులను విడిపించుకోవటానికి మావోయిస్టులు ఉత్తరాంధ్రలో కిడ్నాప్‌లు జరపవచ్చనన్న సమాచారం అందటంతో ఆయా జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు ఈ జిల్లాల్లోని ఐ ఎ ఎస్ లు, లేదా ప్రజాప్రతినిధులను టార్గెట్ చేయవచ్చనన్న అనుమానాన్ని ఇంటిలిజెన్స్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో తమకు తెలియకుండా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లవద్దని పోలీసులు ప్రజాప్రతినిధులు, ఐఎఎస్ అధికారులను హెచ్చరిస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మావోయిస్టు నేత చెడ్డా భూషణాన్ని విడిపించుకోవడానికి మావోయిస్టులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఏ క్షణంలో ఎవరు దొరికినా కిడ్నాప్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది ఐటిడిఎ పిఓ శ్రీకాంత్ ప్రభాకర్, కొయ్యూరు మండలం గుజరాళ్ల పంచాయతీలో పర్యటించినప్పుడు ఆయన్ను కిడ్నాప్ చేయటానికి మావోయిస్టులు ప్రయత్నించారు. అయితే ప్రభాకర్ ఐఎఎస్ కాదని తెలుసుకుని వారు తమ కిడ్నాప్ యత్నాలను మానుకొన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కదలికలతో వారి ఆచూకీని తెలుసుకునేందుకు ఏరియల్ సర్వే ముమ్మరం చేయాలని పోలీసులు నిర్ణయించారు.