రైతులు, బి.సి.లపై దృష్టి సారిస్తున్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి

వ్యవసాయక రాష్ట్రంగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో రైతుకు బ్యాంకు రుణాలు మరింత అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వార్తే రైతును సేదతీరుస్తోంది. ఒకవైపు గిట్టుబాటుధర, వ్యవసాయ నిర్వహణభారం వంటి సమస్యలతో కుదేలవుతున్న రైతుకు అప్పులిచ్చే దళారులు చేస్తున్న దోపిడీ నుంచి బ్యాంకర్లు కొంత ఊరట కల్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రైతాంగ సమస్యలను బ్యాంకర్లకు వివరించటంతో స్పందించిన బ్యాంకర్లు తమ రుణాప్రణాళిక వివరాలను వెల్లడిరచారు. దీని ప్రకారం2012-13 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ రూ.110945 రుణాలు ప్రకటించింది. అందులో వ్యవసాయరంగానికి రూ.52972కోట్లు రుణంగా కేటాయించారు. పంటరుణాల కోసం రూ.37128కోట్లు ప్రకటించారు. వ్యవసాయానుబంధ సంఘాలకు రూ.9516కోట్ల రుణాలు అందించనున్నారు. ప్రాధాన్యతా రంగాలకు రూ.82167కోట్లు కేటాయించారు. ఈ లక్ష్యాలను అధిగమించేందుకు అధికారులు సహకరిస్తారని సిఎం తెలిపారు. రైతులకు ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా రుణం ఇచ్చేలా చూడాలని బ్యాంకర్లను కోరారు. రైతులు అసలు మాత్రమే చెల్లిస్తే ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. దీంతో పెట్టుబడి లేక సాగు ఆలస్యమైన రైతులు రాష్ట్ర ప్రభుత్వం చొరవను అభినందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఉందని, ఇటీవల ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూశాక కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు భరోసా ఇచ్చే చర్యల్లో ఇది తొలిఅడుగు అని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. ఒకవైపు రైతులు, మరోవైపు బిసీలు అండగా ఉంటే ఎన్ని ఎన్నికలైనా ఎదుర్కోవచ్చన్న ధీమా కోసమే సిఎం ఈ చర్య తీసుకున్నారని భావిస్తున్నారు. గతంలో అకాలవర్షం వల్ల నష్టపోయిన రైతులకు వైఎస్‌ రుణమాఫీని ప్రకటించినట్లే పెట్టుబడులు, నిర్వహణఖర్చులు పెరిగిన సమయంలో సిఎం కిరణ్‌ ఈ చర్య తీసుకున్నారు.

వెబ్‌సైట్‌లో బిసీ సంక్షేమం

రాష్ట్రంలో బిసీ సంక్షేమ కార్యక్రమాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ వెబ్‌సైట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. బిసీల సంక్షేమానికి అవసరమైతే బడ్జెట్‌ పెంచుతామని సిఎం హామీ ఇచ్చారు. వెనుకబడిన తరగతులకు చెందిన అన్ని కులాలకు కలిపి స్టడీసర్కిల్స్‌ జిల్లాల వారీగా నెలకొల్పుతామన్నారు. ఈ స్టడీసర్కిల్స్‌ వల్ల భవిష్యత్తులో కాంపీటేటీవ్‌ పరీక్షల్లో బిసి విద్యార్థులు మంచిమార్కులు సంపాదించి ఉద్యోగావకాశు పెంపొందించుకోవచ్చు. అటు ఉద్యోగంతో పాటు కొత్తగా వచ్చిన పథకాలు, ప్రభుత్వ ఇతర కార్యక్రమాలు ముందుగానే వారికి అర్థమయ్యేలా స్టడీసర్కిల్‌లో వివరిస్తారు. వెనుకబడిన విద్యార్థుల్లో స్టడీసర్కిల్‌ ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయమని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రభుత్వం చెప్పకపోయినా స్టడీసర్కిల్స్‌ నడుస్తున్నాయి. బిఇడి చదివిన వారి కోసం ఈ సర్కిల్స్‌ను నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా తదితర ప్రాంతాల్లో ఈ సర్కిల్స్‌ స్వచ్ఛందంగా ఎటువంటి రుసుం లేకుండా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బిసి ఉద్యోగుల్లో కొందరు స్టడీసర్కిల్‌లో చేరేందుకు ముందుగానే సిద్ధంగా ఉన్నారు.  

సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో చరమాంకం!

దేశవ్యాప్తంగా నల్లనేలగా గుర్తింపునందుకున్న సింగరేణి బొగ్గుగనుల కార్మికసంఘ గుర్తింపు ఎన్నికలు ఉప ఎన్నికల కన్నా ఘాటుగా మారి చరమాంకానికి చేరుకున్నాయి. ఇక ఓటింగే తరువాయి. ప్రచారఘట్టం ముగిసింది. ఈ ప్రచారఘట్టంలో ఉప ఎన్నికల వాతావరణాన్ని టిఆర్‌ఎస్‌, సిపిఐ నేతలు సృష్టించారు. ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకున్నారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేధోరణిలో టిఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ప్రసంగించారు. ఈయన ఈ గుర్తింపు యూనియన్‌లోనూ తెలంగాణావాదాన్ని చొప్పించారు. ఇది తప్పు అని సిపిఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. ఎఐటియుసి తరుపున నారాయణ, టిబిజికెఎస్‌ తరుపున హరీశ్‌రావు ప్రత్యక్ష విమర్శలకు దిగారు. ఈ ప్రచారం ఆద్యంతం ప్రత్యర్థులపై విమర్శలతో ప్రత్యక్ష ఎన్నికలను తలపించాయని కార్మికులు అభిప్రాయపడ్డారు. తాము స్వేచ్ఛగా అవసరమైన యూనియన్‌ను గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు.

మూసీ నది వొడ్డున మావోయిస్టుల బుల్లెట్లు?

గతంలో ఒకసారి నాటు తుపాకీ దొరికింది. ఇప్పుడేమో ఏకంగా 119 బుల్లెట్లు లభ్యమయ్యాయి. అదీ నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం రాంచంద్రాపురంలోని మూసీనది ఒడ్డున. ఈ ఒడ్డున వెదికిన పోలీసులకు 119 బుల్లెట్లు లభ్యమయ్యాయి. మరపడవలో లభ్యమైన ఈ  బుల్లెట్లును స్వాధీనపరుచుకున్న పోలీసులు ఇది నక్సలైట్ల చర్య అని భావిస్తున్నారు. మావోయిస్టులే ఈ బుల్లెట్లు దాచి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో నాటుతుపాకీ లభ్యమవటం కూడా వీరి అనుమానాన్ని బలపరుస్తోంది. అయితే ఖచ్చితమైన ఆధారాలు సేకరించాలని పోలీసులు పట్టుదలగా వెదుకులాట కొనసాగిస్తున్నారు. మావోల ప్రాబల్యమున్న ఈ నల్గొండ జిల్లాలో పోలీసులు వారిని వెదుకటం సహజం. అలానే మావోల డంప్‌లపై కూడా పోలీసులు గట్టి దృష్టి సారించారు. అందువల్ల ఎక్కడ ఏ చిన్న ఆధారం దొరికినా నక్సల్స్‌తో ఢీ కొనేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఉన్న ఈ యుద్ధవాతావరణం మావోప్రాబల్యమున్న ప్రాంతాల్లో గ్రామీణులను, గిరిజనులను వణుకు పుట్టిస్తోంది. ప్రత్యేకించి ఈ యుద్దంలో ఎక్కువ భాగం తామే దెబ్బతింటున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా మూసీనది ఒడ్డున దొరికిన ఆధారాలను బట్టి పోలీసులు విచారణ పూర్తి చేసి ఆ పరిసర ప్రాంత వాసులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.  

160 మద్యం షాపులకు నో అప్లికేషన్‌

ఇది ఓ గమ్మత్తు అయిన విషయం. రాష్ట్రంలో కోలాహలంగా మద్యం దుకాణాల లక్కీడీప్‌ కేటాయింపుల కోసం పోటీ పడుతున్నారు. అయితే 160 మద్యం దుకాణాలకు మాత్రం ఒక్క అప్లికేషను కూడా దాఖలు కాలేదు. ఇది ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా 6564 దుకాణాలకు 30వేలకు పైచిలుకు ధరఖాస్తులొచ్చాయి. ఈసారి పురుషులతో  సమానంగా మహిళలూ పోటీపడి మరీ ధరఖాస్తు చేశారు. ఇఎండి కింద ఎక్సయిజ్‌ ఖజానాకు 75కోట్ల రూపాయలు చేరింది. గతేడాదితో పోలిస్తే ఇది 50శాతం ఎక్కువ. గ్రేటర్‌హైదరాబాద్‌లో 379దుకాణాలుంటే వాటికి 470ధరఖాస్తులు వచ్చాయి. వీటిలో 70 షాపులకు మాత్రం ఒక్క ధరఖాస్తు కూడా అందలేదు. ఈ షాపుకు రూ.1.04కోట్లు లైసెన్స్‌ ఫీజు. అలానే గుంటూరు జిల్లాలో 20షాపులకు, కడప జిల్లాలో 70 నుంచి 80షాపులకు కూడా ధరఖాస్తు రాలేదు. అలానే తమ భార్యల చేత్తో ఇఎండి కట్టించటం లక్కు కలిసి వస్తుందని భావించి కొందరు మహిళలను తోడు తీసుకువచ్చారు. చిన్నచిన్న కాంట్రాక్టులు చేసేవారు, కొత్తగా ఈ వ్యాపారంలో దిగాలనుకున్న వారు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో 555 దుకాణాలకు 2178 ధరఖాస్తులు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 473షాపులకు 3243 ధరఖాస్తులు, విశాఖలో 406షాపులకు రెండువేలు, నల్గొండలో 241షాపులకు 3149, వరంగల్‌ 231షాపులకు 3000, శ్రీకాకుళం 232షాపులకు 1900, విజయనగరం 202షాపులకు 2000, ప్రకాశం 321షాపులకు 3000, ఖమ్మం 151షాపులకు 2371,కర్నూలు 194షాపులకు 620, గుంటూరు జిల్లాలో 342కు 4000, కడప జిల్లాలో 269షాపులకు 1500, నిజామాబాద్‌జిల్లాలో 142 షాపులకు 1500, నెల్లూరు 348షాపులకు 3000, అనంతపురం జిల్లాలో 236షాపులకు 2000, చిత్తూరు జిల్లాలో 458షాపులకు 1500, కృష్ణాజిల్లాలో 335షాపులకు 3000, గ్రేటర్‌హైదరాబాద్‌ 379షాపులకు 470, రంగారెడ్డి జిల్లాలో 390షాపులకు 700, మెదక్‌ 165షాపులకు 1300 ధరఖాస్తులు వచ్చాయి.  

ఎర్రచందనం స్మగ్లర్లలో వీరప్పన్‌ అనుచరులు

మన పొరుగురాష్ట్రమైన తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లాలోకి స్మగర్లు వలస వస్తున్నారు. వీరు ఎర్రచందనం ద్వారా కోట్లకు పడగలెత్తుతున్నారు. ఇటీవల తుపాకులతో తిరుగుతున్న వీరిపై అటవీశాఖ చర్యలకు దిగింది. మొత్తం 160మంది స్మగర్లను అదుపులోకి తీసుకుంది. వారితో పాటు మరో 14మందిని అరెస్టు చేసింది. స్మగ్లర్లు అందరూ తమిళనాడు నుంచి వలస వచ్చినవారే అని అటవీశాఖ గుర్తించింది. అంటే డబ్బు కోసం పొరుగురాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకున్నారన్న మాట. పైగా, ఇక్కడికి వచ్చి ఎర్రచందనం స్మగ్లింగు చేయటం వృత్తిగా ఎంచుకోవటం వెనుక కారణాలు అన్వేషిస్తే...వీరిలో కొందరు వీరప్పన్‌ అనుచరులు ఉండవచ్చనే అనుమానాలు కొత్తగా తెరపైకి వస్తున్నాయి. అంటే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో అలవాటు పడ్డ స్మగ్లర్లే ఇక్కడికి కుటుంబాలతో వచ్చేశారని తెలుస్తోంది. వీరప్పన్‌ మరణం తరువాత ఆయన అనుచరులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. ఇది జగమెరిగిన సత్యం. వాస్తవానికి స్మగ్లింగు చేసే వారు ఆ సంపాదన (తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన)ను వదులుకోలేక ఏ రాష్ట్రమెళ్లినా అదే వృత్తి ఎంచుకుంటారని నేరపరిశోధనల్లో వెల్లడవుతోంది. అదే వాస్తవమైతే అటవీశాఖ అరెస్టు చేసిన 14మంది ముందు నుంచి ఈ వృత్తికి అలవాటుపడ్డవారే. తమ రాష్ట్రంలో వాతావరణం ప్రతికూలంగా తయారవటంతో ఆంథ్రాకు, ప్రత్యేకించి చిత్తూరుకు వలస వచ్చారు. అరెస్టు చేసిన నిందితులను అటవీశాఖ విచారిస్తోంది. ఈ విచారణలో కానీ, అసలు విషయం తెలియదని, ఎట్టిపరిస్థితుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు తుపాకులు పట్టుకునే వాతావరణం లేకుండా చూడాలని తిరుపతి వాసులు కోరుతున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన కాల్పుల ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని స్మగ్లర్లను అదుపు చేయాలని అటవీశాఖకు వారు సూచిస్తున్నారు.  

హైదరాబాద్‌ లో భారీ ట్రాఫిక్‌ జామ్‌

నిన్నటివరకు ఎండల్లో వేగిపోయిన హైదరాబాద్‌ ప్రజలు ఇప్పుడు వర్షంతో బాధలు పడుతున్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జల మయం అయ్యాయి. ఆడవారు, పిల్లలు ఇల్లు చేరటానికి నానా అగచాట్లు పడ్డారు. కార్లు, బైకులు, బస్సులు అన్నీ ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుపోయాయి. రోడ్లన్నీ జలశయాల్ని గుర్తుకు తెచ్చాయి. పంజాగుట్ట, బేగం బజార్‌, తార్నాక, సికింద్రాబాద్‌,ఖైరతాబాద్‌,మెహిదీపట్నం, ఎర్రమంజిల్‌, ఓల్డుసిటీ అంతా నీరు నిలిచి పోవడంతో  ప్రజలు అవ స్థలు పడ్డారు. సికింద్రాబాద్‌,తార్నాక, చింతల్‌బస్తీ మొదలైన చోట్ల వర్షపునీరు దుకాణాల్లోకి ఇళ్లలోకి వెళ్లింది. వర్షంపడిన ప్రతిసారీ పరిస్థితి ఇలాగే వుండటం, రోడ్లు చెరువుల్లా మారి ట్రాఫిక్‌ సమస్యలు పెరగడం మ్యాన్‌హోల్స్‌ ప్రమాదకరంగా మారటం నగర వాసులను కలవర పెడుతుంది. వర్షాల ప్రారంభంలోనే ఇలా వుంటే రానున్న భారీ వర్షాలకు నగరం ఇంకెలా ఉంటుందో అని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

దున్నేవాడిదే భూమి....పండించేవాడే ఆసామి

ప్రత్యేక సెజ్‌ల పేరుతో వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి హయాంలో పారిశ్రామిక వేత్తలకు లక్షలాది ఏకరాల భూములు దోచి పెట్టారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా కొందరు పారిశ్రామిక వేత్తలు చేశారు. కడుపు మండి అవకాశం కోసం ఎదురు చూస్తున్న రైతులు ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. తమనుంచి అక్రమంగా పొందిన భూములను తిరిగి స్వాధీన పర్చుకుంటున్నారు. ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని పెదగంజాం గ్రామంలోని దళితులంతా ఐదుఎకరాల స్థలంలో ఉన్న చెత్తను తగులబెట్టి సేద్యానికి అనుగుణంగా మార్చారు. వాన్‌పిక్‌ కంపెనీ తమ భూములను లాక్కుందని బడా కంపెనీలకు తమ భూములను ధారాదత్తం చేసేదిలేదని తేల్చిచెప్పారు. వర్షాలుపడుతున్న తరుణంలోనే వరి విత్తనాలను జల్లి సాగుచేస్తామని చెప్పారు. ఈ ఐదు ఎకరాల భూమిని పదిమంది పది ముక్కలుగా చేసుకున్నారు. ప్రభుత్వం వాన్‌పిక్‌ ఒప్పందాన్ని రద్దుచేసి తమ భూమిని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. పరిశ్రమలు, కారిడార్‌లు, అభివృద్ది పేరుతో పేదలను కొట్టి బడా కంపెనీలకు భూములను అప్పగించే సంసృతిని విడనాడాలన్నారు. అయితే ఈ మద్యనే మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఇదే భూముల్లో ఏరువాక కార్వక్రమం చేపట్టటం కొసమెరుపు.

డాలర్‌ శేషాద్రా మజాకా

తిరుమల తిరుపతి ఆస్థాన ఉద్యోగి డాలర్‌ శేషాద్రి రూటే వేరు. టిటిపిలో తనకు ఎదురే లేదని మరోసారి నిరూపించుకున్నారు. రాష్ట్రంలోని ఒక ప్రముఖ వ్యక్తి వత్తిళ్లకు తల ఒగ్గిన టిటిడి ఆయన పదవీ కాలాన్ని మరోరెండు సంవత్సరాలకు పొడిగిస్తు నిర్ణయం తీసుకుంది. 1978లో టిటిడిలో ఒక సామాన్య ఉద్యోగిగా  చేరిన శేషాద్రి తిరుగులేని వ్యక్తిగా మారారు. ఇందిరాగాంధీ కాలంనుండి తన హవా కొనసాగిస్తున్న శేషాద్రి 2004-2006 లో బొక్కసం అధికారిగా ఉన్న సమయంలో 300 డాలర్లను బొక్కేసిన ప్రధాన నిందుతిడిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈయనతో ఉన్న మరికొందరు ఉద్యోగులు కేసులో ఇరుక్కున్నప్పటికీ డాలర్‌ శేశాద్రి మాత్రం చక్రం తిప్పి కేసు నుండి బయటపడ్డారు. 2006 లోనే పదవీ విరమణ చేసినప్పటికి పలుమార్లు  ఆయన  పదవిని పొడగిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంటూనే వుంది. 2009 శేషాద్రిని విధుల నుండి తప్పించాలంటూ  హైకోర్టు ఓ కేసులో తీర్పు ఇచ్చినప్పటికి తన పలుకుబడిని ఉపయోగించి కాంట్రాక్టు బేస్‌ కింద ఈయన మూడువేల జీతానికి ఏడాదిపాటు ఓయస్‌డిగా చేరారు. ఈపదవి ఆగస్టులో ముగియనుండగా మరోసారి చక్రం తిప్పిన శేశాద్రి తన పదవిని మరో రెండేళ్లు పొడిగించుకున్నారు.

కావూరిపై కారాలు నూరుతున్న పోలవరం కాగ్రెస్‌

ఇటీవల పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోవటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉప ఎన్నికల సందర్భంగా పార్టీలో ఏర్పడిన వర్గ విభేదాల ఫలితంగా కాంగ్రెస్‌ పార్టీకి ఈ దుస్దితి ఏర్పడినట్లు పలువురు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. పశ్చిమ ఏజన్సీ మెట్టప్రాంత మండలాల్లో కంచుకోటగా ఉండే కాంగ్రెస్‌ పార్టీలో అధినాయకుల ఆధిపత్య పోరులో పోలవరం ఉప ఎన్నిక కాంగ్రెస్‌ పార్టీ ఉనికికి ప్రశ్నార్ధకంగా మారింది. గతంలో రాష్ట్రంలోని అనక ప్రాంతాల్లో పార్టీలో ఎక్కువ శాతం ద్వితీయశ్రేణి నాయకుల్లో ఏర్పడే వర్గ విభేదాలను అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, ఎంపిలు, అమాత్యులు వెళ్ళి అక్కడ సమసయలను పరిష్కరించి, పార్టీ కేడర్‌లో విభేదాలు లేకుండా పరిష్కరించే పరిస్ధితులు ఉండేవి. అయితే ప్రధమ శ్రేణి నాయకుల్లోనే యిలాంటి వర్గ విభేదాలు ఏర్పడి ఆధిపత్య పోరుతో పార్టీ ఉనికికి నష్టం కలిగించే విధంగా రాజకీయాలు చేయటం, పోలవరం ఉప ఎన్నికల్లో ఘోరంగా విఫలమవ్వటం, డిపాజిట్లు కూడా దక్కకుండా మిగిలిన రాజకీయ పార్టీలకు చులకన కావటం లాంటి పరిస్ధితులను పరిశీలిస్తే పోలవరం నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీలో ఏర్పడ్డ వర్గ విభేదాలు ఏ స్ధాయిలో నెలకొని ఉన్నాయో అవగతమవుతుంది.   గత మూడు దశాబ్ధాల రాజకీయ చరిత్రలో జరిగిన పలు ఎన్నికల సందర్భంగా అభ్యర్ధిని ఎంపిక చేసి, ఒంటిచేత్తో కాంగ్రెస్‌ పార్టీకి విజయావకాశం కల్పించిన ఏజన్సీ టైగర్‌ కరాటం రాంబాబును పక్కనపెట్టి ఈ ఉప ఎన్నికల్లో అధిష్టానం పోలవరం అభ్యర్ధి ఎంపికలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించటంతో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయినట్లు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎంపికలో ఏలూరు ఎంపి కావూరి జోక్యాన్ని అధిష్టానం సమర్ధించటం, ఉప ఎన్నిక సందర్భంగా కరాటం ఎంపిక చేసిన అభ్యర్ధిని కాదని, కావూరి ఎంపిక చేసిన మహిళా అభ్యర్ధికి ప్రాధాన్యత ఇవ్వటంతో పశ్చిమ ఏజన్సీ కాంగ్రెస్‌ పార్టీలో ఇరువురి అధినాయకుల మధ్య ఏర్పడ్డ వర్గ విభేదాలకు అధిష్టానం చర్యలు మరింత ఆజ్యంపోసినట్లయ్యింది. ఈ సందర్భంగా కినుకు వహించిన కరాటం కార్యకర్తలు నిరుత్సాహానికి గురికావటం, అధినాయకులు వచ్చి కావూరిని సమర్ధిస్తూ కరాటాన్ని ఎంత బుజ్జగించినా, అధిష్టానం చర్యలను విభేదించిన కరాటం అనునాయకులు, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు చర్యల ఫలితంగానే కాంగ్రెస్‌ పార్టీ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకుండా ఓడిపోవటానికి మరో కారణంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అధిష్టానం మరియు మంత్రివర్గం బుజ్జగింపుల అనంతరం కాంగ్రెస్‌ అభ్యర్ధి విజయం కృషి చేస్తామని కరాటం హామీ ఇచ్చినా, కార్యకర్తలు కొమ్ముకాయకపోవటమే ఈ అపజయానికి మరో కారణంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.   కరాటం మరియు కావూరి మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలను తొలగించి, పోలవరం కాంగ్రెస్‌ అభ్యర్ధి నూపా పార్వతి విజయం కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, మంత్రులు వట్టి, పితానిలు కూడా పలు సందర్భాల్లో కరాటం రాంబాబును బుజ్జగించే ప్రయత్నాలు చేసినా, పోలవరం కాంగ్రెస్‌ అభ్యర్ధి గెలుపు విషయంలో న్యాయం జరగకపోవటాన్ని పరిశీలిస్తే ఏజన్సీ మెట్ట ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీలో ముదిరిన వర్గ విభేదాలు దర్పణం పడుతున్నాయి. నాయకుల్లోనే ఐక్యత లోపిస్తే కార్యకర్తలు ఆ పార్టీ విజయం కోసం ఏ విధంగా కృషి చేస్తారంటూ రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒకప్పుడు పశ్చిమ ఏజన్సీ మెట్ట ప్రాంతంలో కంచుకోటా ఉండే కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత రాజకీయ భౌతిక పరిస్ధితుల ద్వారా ఈ ఉప ఎన్నికల్లో 16 వేలు ఓట్లు గెలుచుకోవటం దురదృష్టకర పరిణామంగా కాంగ్రెస్‌ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు. పశ్చిమ ఏజన్సీలో పట్టున్న కరాటాన్ని పక్కన పెట్టి ఎంపి కావూరికి ఉప ఎన్నికల నిర్వహణా, అలాగే అభ్యర్ధి ఎంపికతో పాటు విజయాన్ని చేకూర్చే బాధ్యతలను అప్పగించటమే అధిష్టానం చేసిన తప్పిదంగా పలువురు కాంగ్రెస్‌ నాయకులు విమిర్శిస్తున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకుల్లో ఆయన పట్ల వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది.

పశ్చిమలో మసకబారుతున్న పసుపుశోభ

ఒకే సామాజిక వర్గానికి కొమ్ముకాస్తున్న అధినేత దివంగత మహానేత ఎన్టీఆర్‌ ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి ఆది నుండి కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పసుపుశోభ మసకబారుతున్నట్లు అవగతమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి ఊపిరిని, ఉత్తేజాన్ని యిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు, నాయకత్వలేమి, ఆధిపత్య పోరు ఫలితంగా ప్రజల విశ్వసనీయతను కోల్పోయింది. ఎన్టీఆర్‌ హయాంలో జిల్లాలోని ప్రజలంతా ముక్తకంఠంతో జైకొట్టిన తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం గ్రూపు రాజకీయాల నేపధ్యంలో ప్రజాభిమానం కోల్పోయింది.   ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రజలు తమ సమస్యలను ఎలా పరిష్కరించు కోవాలో? విషయ పరిజ్ఞానంతో పనులు జాప్యం పట్ల అధికారులను సైతం ఎలా నిలదీయాలో? మొదలైన విషయాలపై దేశం పార్టీ హయాంలో తెలుసుకున్న ప్రజలు ఆ పార్టీ పట్ల అప్పట్లో అభిమానాన్ని పెంచుకున్నారు. అంతేకాకుండా దేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు కూడా ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. పార్టీ పట్ల మెక్కవోని అభిమానంతో ఎన్టీఆర్‌ హయాం అనంతరం కూడా ఆ పార్టీ జెండాను ప్రజలు విడిచిపెట్టలేదు. అలాగే పరిపాలనాధక్షుడుగా చంద్రబాబుకు కూడా ప్రజలు నీరాజనాలు పలికారు. 1983, 1985 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేశం పార్టీ ప్రభంజనంతో కాంగ్రెస్‌ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. దేశం పార్టీకి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేదనుకున్న తరుణంలో జిల్లాలో ఏర్పడిన రాజకీయ సమీకరణాల ఫలితంగా కాంగ్రెస్‌ పార్టీ కొంత పుంజుకున్నా,   1989 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టిడిపికే మెజారిటీ స్ధానాలు దక్కాయి. అలాగే 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జిల్లాలోని 16 స్ధానాల్లో 15 స్ధానాలు టిడిపి కైవశం చేసుకోగా, ఒక స్ధానం అత్తిలి నుండి కనుమూరి బాపిరాజు దక్కించుకున్నారు. అలాగే 1999 సంవత్సరంలో టిడిపి హావా కొనసాగింది. అప్పుడు కూడా కొవ్వూరు స్ధానాన్ని మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్ధి జి.ఎస్‌.రావు దక్కించుకోగా, మిగిలిన స్ధానాలన్ని టిడిపి కైవశం చేసుకుంది. ఆ సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీ పట్ల వ్యతిరేకతను జీర్ణించుకున్న కోటగిరి విద్యాధరరావు చింతలపూడి అసెంబ్లీ స్ధానానికి స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీచేసి ఎన్టీఆర్‌ ప్రభంజనంలోనే విజయం సాధించారు. కొవ్వూరుకు చెందిన ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు గ్రూపును చంద్రబాబు ప్రోత్సహించారని అపోహలతో కోటగిరి, కృష్ణబాబులకు మధ్య కొనసాగిన కోల్డ్‌వార్‌ అప్పట్లో జిల్లాలోని టిడిపిని క్షేత్రస్ధాయిలో దెబ్బతీసింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఏకతాటిపై తెచ్చి ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తే, దేశం పార్టీలో గ్రూపులను సరిదిద్ధకుండా చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరించటంతో ఎన్నికల్లో టిడిపి ఘోరంగా విఫలమయ్యింది.   2004 ఎన్నికల్లో కొవ్వూరు నుండి కృష్ణబాబు, పాలకొల్లు నుండి డాక్టర్‌ బాబ్జి, నరసాపురం నుండి కొత్తపల్లి సుబ్బారాయుడు మాత్రమే దేశం పార్టీలో విజయం సాధించి పరువు దక్కిందనిపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పిఆర్‌పి ఆవిర్బవంతో కొనసాగిన కుల , సామాజిక రాజకీయాలు దాదాపు నాలుగైదు స్ధానాలలో తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయి. 9 స్ధానాల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటే, 5 స్దానాలు టిడిపి విజయం సాధించింది. పార్టీ నిర్మాణంలో మూలస్తంభాలైన సీనియర్ల సేవలను పక్కకు పెట్టడం, యువతను ప్రోత్సహించటంలో నిర్లక్ష్యం చేయటం, కష్టపడి పనిచేసే కార్యకర్తలను అలక్ష్యం చేయటంతో 2009 ఎన్నికల్లో టిడిపి కి ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రజల్లో ఓట్లు వేయించగలిగిన నాయకులను పక్కన పెట్టి, కులం, ధనం ప్రాతిపదికన నాయకులకు పగ్గాలు అప్పగించే అధినేత ఆలోచనలు దేశం పార్టీని దెబ్బతీస్తున్నాయనే విమర్శలు కూడా లేకపోలేదు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ హయాంలో మాదిరిగా అన్ని సామాజిక వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయాణం చేయటం లేదని, ఒక సామాజిక వర్గానికి మాత్రమే కొమ్ముకాస్తూ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలను విస్మరిస్తుందని, అందుకే గడచిన అసెంబ్లీ ఎన్నికల్లోను, ప్రస్తుత ఉప ఎన్నికల్లోను ప్రజలు దేశం పార్టీకి విజయాన్ని చేకూర్చలేదని పలు సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు, నాయకులు విమర్శిస్తున్నారు.

కళంకిత మంత్రులకు త్వరలో ఉద్వాసన ?

రాష్ట్రంలోని పాలక కాంగ్రెస్‌ పార్టీలో ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొన్న జరిగిన ఉప ఎన్నికల వైఫల్యాల అనంతరం ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌, పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ హైకమాండును కలిసిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికల ఫలితాల నివేదికను వారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి , రాష్ట్ర ఇన్‌చార్జ్‌ గులాంనబీ ఆజాద్‌కు అందచేశారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో తలమునకలైన నాయకులంతా మన రాష్ట్ర కాంగ్రెస్‌ పరిస్దితులు, తీరు తెన్నులు , చేపట్టవలసిన కార్యక్రమాలను రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే నిర్ణయం చేస్తామని తేల్చారు. దీనిలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కళంకితులైన మంత్రులందరికీ ఉద్యాసన చెప్పాలనుకుంటున్నారు. వీరిలో గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పొన్నాల లక్షయ్య , ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి మోపిదేవి తదితరులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి రాష్ట్ర సర్కారు పరిస్థితి గుంభనంగా ఉన్నప్పటికీ త్వరలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని నాయకులంతా ఎదురుచూస్తున్నారు.   తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు, సీమాంద్ర సీనియర్‌ నాయకులు వేరు వేరుగా ఢల్లీి నేతలను కలసి తమ తమ వాదనలు వినిపించారు. తెలంగాణ నాయకులు తెలంగాణాను ప్రకటిస్తేనే తెలంగాణ జిల్లాలో కాంగ్రెస్‌ నిలుస్తుందని చెప్పారు. కొందరు సీనియర్లు ముఖ్యమంత్రిని, బొత్స సత్యన్నారాయణను కూడా మార్చాలని, కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపాలన విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనా కేంద్రనాయకత్వం రానున్న 2014 ఎన్నికలకు అనుగుణంగా పావులు కదుపుతుందని తెలుస్తుంది.

రాష్ట్ర రైతుల ఉసురు తీస్తున్న బి.టి. పత్తి విత్తనాలు

సకాలంలో వర్షాలు,వాతావరణం,కూలీలు, మార్కెట్‌ అన్నీ కలిసొస్తేనే వ్యవసాయం లేక పోతే జూదం అని మన రైతులు బాధపడుతున్నారు. గోరు చుట్టుమీద రోకలిపోటులా పొలంలో వేసిన బిటి పత్తి విత్తనాలే సరిగ్గా మొలకెత్తక పోవడం పంటను పురుగులు ఆశించడం, ఖర్చుకు తగ్గ దిగుబడి రావకపోవడం చూస్తే దాన్ని ప్రోత్సహించిన సర్కారు రైతులజీవితాలతో ఆడుకోవటమే అవుతుంది. 2004 -2005 లో రాష్ట్ర సాగు విస్తీర్ణంలో ప్రత్తి పంట సాగు 5.70 శాతం మాత్రమే. ఆ సంవత్సరం రైతులకు సాంప్రదాయ పంటలకు రాని లాభాలను ఈ వాణిజ్య పంట ఇచ్చింది. రైతులంతా తమ బిటి విత్తనాల ప్రత్తిని తెల్లబంగారం అని మురిసిపోయారు. ఇది చూసిన చుట్టు ప్రక్క రైతులు కూడా ఈ పంట వేశారు. 2009 -10 సంవత్సరంనాటికి రైతులు సాగు విస్తీర్ణాన్ని బాగా పెంచారు. ఆ సంవత్సరం రైతులు 450 నుండి 475 క్వింటాళ్ల వరకు హెక్టారుకు పండిరచారు. అయితే వారు దానికి యాభై శాతం కంటె ఎక్కువే ఖర్చుపెట్టవలసి వచ్చింది. ఆ తరువాత అదీ లేకుండా పోయింది.   ఈ నేపధ్యంలో సాంప్రదాయ పంటలు పండిరచక పోవడంతో అపరాల కొరత ఏర్పడి పప్పుదినుసుల రేట్లు ఆకాశాన్నంటా యి. 2011 సంవత్సరంలో 33.7 లక్షల ఎకరాల్లో బి టి విత్తనాలు వేస్తే లక్ష ఎకరాల్లో పంట పురుగుల బారినపడి చేతికందకుండా పోవటంతో రైతన్నలు భారీగా నష్టపోయారు. నష్టాన్ని తట్టుకోలేని రైతులు పురుగు మందును తాగి మరణించారు. పురుగుల్ని చంపలేని పురుగు మందులు రైతుల్ని మాత్రం బలి తీసుకున్నాయి. దీనంతటికి కారణం బిటి విత్తనాలకు ఎరువులు, క్రిమికీటక నాశనలు వాడనక్కర్లేదని, ఒకే పంటతో రైతులు లాభాల బాట పట్టవచ్చని, హరిత విప్లవం అని కాకమ్మ కబుర్లు చెప్పి మెన్‌శాంటో తదితర కంపెనీలు భారత ప్రభుత్వం తో ఏర్పరుచుకున్న ఎంఒయు ఒప్పంద ఫలితమే. బి.టి.కాటన్‌ వల్ల గుంటూరు, వరంగల్‌, మెదక్‌, ప్రకాశం జిల్లా రైతులు బాగా దెబ్బతిన్నారు. మోసపోయిన రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయి బ్రతుకు భారమై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కుటుంబాలు వీధిన పడ్డాయి. ఆగ్రహించిన మెదక్‌ మహిళారైతులు బిటి విత్తనాలను రద్దు చేయాలని ప్రదర్శన చేపట్టి కలెక్టరుకు వినతి పత్రం ఇచ్చారు. ఫలితం శూన్యం.   ఇంకా ఇంకా రైతులు మోస్తూనే ఉన్నారు. కొన్ని స్వచ్చంద సేవా సంస్థలు జరిపి పరిశోధనలో బిటి విత్తనాల వాడుక వల్ల గాలి, నీరు, నేల కలుషిత మవుతున్నాయని తెలిసింది. ఈ పొలాల్లో మేసిన పశువులు చని పోతున్నాయని తేలింది. అయినా ప్రభుత్వం చలించలేదు. ఈ ఏడాది ఇంకా రాని వర్షాలు మొలకెత్తని విత్తనాలు రైతుకు గుండె బేజారెత్తించే అంశాలు. అందుకే బిటి విత్తనాల స్థానంలో అపరాలు వేయాలని రైతులను శాస్త్రవేత్తలు కోరుకుంటున్నారు. మహిళా రైతులు కూడా అటే మొగ్గు చూపుతున్నారు. పప్పుదినుసుల కొరత, వాటికిప్పుడున్న ధర కూడా రైతులకు ఆశావహంగా కనిపిస్తున్నాయి. కందులు ,పెసలు, మినుములు వంటనూనెలకు గాను నువ్వులు, వేరుశనగ లాంటి పంటలు రైతులకు మేలు సాటి వ్యవసాయంగా వుంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పంటలను పండిరచి రైతన్నలు లాభాలబాట పట్టగలరని ఆశిద్దాం.

కలెక్టర్లపై బ్లాక్‌మార్కెట్ల తనిఖీ భారం!

జిల్లా కలెక్టర్‌ విధివిధానాలు ఏమిటీ? ఈ ప్రశ్నకు పూర్తిస్థాయి సమాచారం అందించటం కష్టం. ఎందుకంటే కలెక్టర్లు ప్రభుత్వం చెప్పిన అన్ని విధులూ అమలు చేస్తారు. కానీ, వారికి జిల్లా మొత్తం పరిపాలనాభారం సమయం మిగల్చదు. అయినా సరే! అన్నింటినీ తన పరిపాలనా సామర్థ్యంతో నెగ్గుకొచ్చి కలెక్టర్‌గా మన్ననలు అందుకున్న వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ, వారిపై కొత్తభారాలూ వచ్చి చేరుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు ఖంగుతిన్నారు. ఎందుకంటే కలెక్టర్లకు ఇప్పటికే నగరపాలకసంస్థలను అప్పగించారు. అలానే మండలాలనూ వీరే పాలించాలి. ఎన్నికలు లేక పంచాయతీలూ కార్యవర్గ సభ్యుల కొరతతో అస్తవ్యస్తంగా మారిపోయాయి. ఈ తరుణంలో సిఎం చెప్పేదేంటంటే కలెక్టర్లు బ్లాక్‌మార్కెట్ల తనిఖీ బాధ్యతలు తీసుకోవాలి. దాన్ని అరికడితేనే రైతులకు విత్తనాలు కొరత, ఎరువుల కొరత ఉండవని సిఎం తేల్చేశారు. అంటే ఇంతకాలంగా బ్లాక్‌మార్కెట్లలో కలెక్టర్లు తనిఖీ చేయకపోవటం వల్లే రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నట్లుంది సిఎం ప్రసంగం. మరి ఇది నిజమేనా?

జయమణి ఇక హస్తం' వదలరు?

జ్ఞానోదయం జరగకపోతే ఓ రాజు బుద్దుడవుతాడా? ఆ కథనే ఆదర్శంగా తీసుకున్న పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యన్నారాయణ బోధలు ద్వారా ఎమ్మెల్యేల మనస్సులను మార్చేస్తున్నారట. నిన్నటి దాకా నేను రేపటి నుంచి జంప్‌జిలానీ అంటూ ఉన్న ఎమ్మెల్యే కాస్తా ఇప్పుడేమో ఈ అద్భుతమైన ‘హస్తం’ వదలలేను అంటున్నారట. అంతే కాకుండా బొత్సా ఏం మందుపెట్టారో తెలియదు కానీ, కాంగ్రెస్‌తో బంధం అస్సలు విడదీయలేనిదని ఆమె కార్యకర్తలకు చెబుతున్నారట. ఇంతకీ ఈమె ఎవరో కాదు పార్వతీపురం ఎమ్మెల్యే సవరపు జయమణి. ఇటీవల వై.కా.పా. గౌరవాథ్యక్షురాలు విజయమ్మ పాయకారావుపేట వచ్చినప్పుడు కూడా తాను వై.కా.పా.లో చేరుతున్నానని ఆమె చెప్పారు. బొబ్బిలి శాసనసభ్యుడు సుజయకృష్ణరంగారావుతో కలిసి ఆమె తాను పార్టీ మారుతున్నానని ప్రకటించారు. అయితే రంగారావు రాజీనామా చేసి వై.కా.పా.లో చేరిన తరువాత జయమణికి పీసీసీ చీఫ్‌ బొత్సా సత్యన్నారాయణ క్లాస్‌పీకారట. అంతే ఆమెకు జ్ఞానోదయమై హైదరాబాద్‌ బాట పట్టారు. ఆమె మూడు రోజులు అక్కడే ఉండి కాంగ్రెస్‌ పార్టీని వదలనని సంఫీుభావం తెలిపాక తిరిగి నియోజకవర్గానికి చేరుకుంటారు. ఇప్పుడు రంగారావు చేసిన ప్రకటనలో ఇద్దరు ఎమ్మెల్యేలు విజయనగరం జిల్లా నుంచి వై.కా.పా.లో చేరతారన్నారు. అయితే ఒకరు జయమణి. మరి రెండో వారెవరు? ఈ సస్పెన్స్‌ వీడాలంటే రంగారావు నోరు విప్పాలి. రంగారావు రెండోవ్యక్తిని ప్రకటించకుండా వదిలేసింది బొత్సా దృష్టిలో సస్పెన్స్‌ మిగులుద్దామనా? లేక నిజంగానే రెండో ఎమ్మెల్యే లేకుండానే ప్రకటించారా? ఒకవేళ ఉంటే ఆయన బొత్సాకు సన్నిహితుడా? వంటి పలు ప్రశ్నలు రాజకీయాభిలాషులను వేధిస్తున్నాయి.

‘గోరంత పెంచేసి కొండంత భారం మిగులుస్తున్న మ(మి)థ్యాహ్నభోజనపథకం’

పాఠశాలల్లో మథ్యాహ్నభోజనపథకం నిర్వహణ వ్యయం పెరిగిపోతోందన్న నిర్వాహకుల ఆందోళన తగ్గించేందుకు ప్రభుత్వం 25పైసలు పెంచింది. ఈ పెంపుదల సమాచారం అందిన తరువాత నిర్వాహకులు గోరంత పెంచి కొండంత భారాన్ని తమపై ప్రభుత్వం పెడుతోందని వాపోయారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్‌ తివారి వాస్తవపరిస్థితు లు గమనించకుండానే చర్యలు తీసుకున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నభోజనపథకంలో క్వాలిటీ ముఖ్యమని జిల్లా కలెక్టర్లు, ఇతర అథికార్లు తమపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. అథికార్ల ఒత్తిడి భరించలేక నాణ్యతను పాటిస్తున్న తమకు నిర్వహణ ఖర్చులు చాలటం లేదని మొత్తుకుంటే ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి ప్రాథమిక పాఠశాలైతే 16పైసలు, ప్రాథమికోన్నత పాఠశాలైతే 25పైసలు పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం పెరుగుతున్న ఖర్చులను ప్రభుత్వం గమనించటం లేదన్నారు. గతంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రూ.3.84 ఇచ్చేవారని, ఇప్పుడు పెంపుదల వల్ల నాలుగురూపాయలు అయిందన్నారు. అలానే ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థికి రూ.4.40 నుంచి రూ.4.65 వరకూ పెంచారు. ఓ వంద మంది విద్యార్థులున్న పాఠశాలల్లో నిర్వహణావ్యయం వేలల్లో అవుతుంటే ప్రభుత్వం పెంచిన దాని వల్ల లబ్ది ఐదొందల నుంచి 900లోపే ఉంటోందని నిర్వాహకులు వాపోతున్నారు. తమ సొంత జేబుల్లో నుంచి కొంత తీసి పెట్టే పరిస్థితి భవిష్యత్తులో అయినా మారితే బాగుండునని వారు ఆశిస్తున్నారు.

రామసముద్రం కోడిపుంజుకు ఆథార్‌కార్డు

చిత్తూరు జిల్లాలోని రామసముద్రం గ్రామంలో కోడిపుంజుకు ఆథార్‌కార్డ్‌ను మంజూరు చేశారు. పైగా, 517417 పిన్‌కోడ్‌ను ఆ కార్డుపై చిరునామాలో భాగంగా ముద్రించారు. అంతే కాకుండా సన్‌ఆఫ్‌ కోడిపెట్ట అని కూడా పేరు కింద రాసి ఉంది. 2011 జనవరి 22న ఈ కార్డు మంజూరైంది. ఆథార్‌ నెంబరు కూడా దీనిపై ముద్రించబడటం విశేషం. ఈ కార్డు డెలివరీ కోసం రామసముద్రం పోస్టుమ్యాన్‌కు చేరింది. ముందు ఆ కార్డును చూసి ఆ ఊర్లో కోడిపుంజు పేరు మీద ఎవరైనా ఉన్నారా? అని పోస్టుమ్యాన్‌ వెతికేసుకుంటూ చివరిలో మరోసారి కార్డును చూసి షాకయ్యారు. సన్‌ఆఫ్‌ కోడిపెట్ట అని రాయటం పోస్టుమ్యాన్‌ను షాక్‌కు గురిచేసింది. ఇంతకీ ఆ కార్డు ఎలా డెలివరీకి వచ్చిందో అర్థం కాలేదు. మరి ఎవరి ముఖచిత్రమూ లేకుండా కోడిపుంజు పేరిట కార్డు రావటం ఓ షాకయ్యే అంశం. అసలు ఆథార్‌కార్డుకు మనుష్యులు అటెండయితేనే ఇంకా డెలివరీ కావటం లేదని అన్ని జిల్లాల్లోనూ ఆందోళన చెందుతున్నారు. అటువంటిది కోడిపుంజు పేరు మీద అసలు కార్డు ఎలా మంజూరు చేశారు? ఆకతాయిల పనే అనుకుంటే కార్డుల మంజూరులో జరుగుతున్న అవకతవకలకు ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. రామసముద్రం అన్న గ్రామంలో ఇలా కార్డు మంజూరైందంటే ఆథార్‌కార్డ్‌ సిబ్బంది తప్పా? లేక నిర్లక్ష్యం రాజ్యమేలుతోందా? అన్న అంశం తేల్చాలని పలువురు కోరుతున్నారు.

ఆ నకిలీ బాంబుల వెనుక అసలు కథేమిటీ?

కడప జిల్లా జమ్మలమడుగులో కలకలం సృష్టించిన నకిలీబాంబుల వెనుక అసలు కథేమిటీ అన్న ఆసక్తి నెలకొంది. పోలీసుల పనితీరుకు ఇది ఒక పెద్దసవాల్‌గా నిలుస్తోంది. విధ్వంసాలు సృష్టించాలనుకునే వారు ఎంత స్వేచ్ఛగా తిరగొచ్చో ఈ నకిలీబాంబుల ఉదంతం బయటపెడుతోంది. దొరికింది నకిలీబాంబయినా పోలీసు నిఘా విభాగంలో ఉన్న డొల్లతనం బయటపడుతోంది. అలానే ప్రజల్లో పెరిగిన విధ్వంసకాలపై అవగాహనకూ ఈ సంఘటనే నిదర్శనంగా తీసుకోవచ్చు. ఎవరో ఒకరు సమాచారం ఇస్తే కానీ, పోలీసులు కళ్లు తెరవడంలేదు. ఆలస్యమైతే  జరగాల్సింది జరిగిపోతుందని నకిలీబాంబుల సంఘటన హెచ్చరిస్తోంది. ఒక బకెట్‌లో నకిలీబాంబులు పెట్టి గుర్తుతెలియని వ్యక్తులు జమ్మలమడుగులో రద్దీ ఎక్కువగా ఉండే సంజామల రోడ్డులో పెట్టారంటే దీని వెనుక ఏదో కుట్రకు తెరలేపుతున్నారని నిఘావర్గాలు ఇకనైనా గుర్తిస్తే మంచిది. ఒకసారి పెట్టినట్లే మరోసారి అసలుబాంబులను పెట్టేందుకు ఉగ్రవాదులు ఎందుకు కుట్రపన్నకూడదు? ఈసారి చూసినట్టే మరోసారి  స్థానికులు చూసి అసలుబాంబును గుర్తించలేకపోతే పరిస్థితి ఏమిటీ? ఈ రెండు ప్రశ్నల ఆధారంగా నిఘావర్గాలు దర్యాప్తు చేస్తేనే అసలు విషయం బయటకు వస్తుంది.

పరకాల కాంగ్రెస్‌కు పగ్గాల్లేవా?

కాంగ్రెస్‌పార్టీ పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యకర్తలకు , నేతలకు  మద్య వివాదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. వీరిని అదుపులో పెట్టడం పార్టీ నాయకత్వానికి పెద్ద సమస్యగా మారింది. అందుకే కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. కుర్చీలు విరిచేస్తారు. రోడ్డెక్కి వాహనాలు ఆపేసి ధర్నాలు చేసేస్తారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో  ఓటమి చవి చూసినా నేతలూ, కార్యకర్తల్లో మార్పు రాలేదేమిటీ అని పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. వరంగల్‌ జిల్లా పరకాల అసెంబ్లీకి ఇటీవలే ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పార్టీకి డిపాజిట్టు కూడా దక్కలేదు. అయినా సరే! అక్కడ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలూ, నేతలూ విర్రవీగుతూనే ఉన్నారు. ఈ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కోసం రూపొందించిన ఫ్లెక్సీలో గండ్రవెంకట రమణారెడ్డి ఫొటో చిన్నదిగా ఉన్నదంటూ ఆయన అనుచరులు రెచ్చిపోయారు. ఈ ఉప ఎన్నికల్లో మంత్రులు, కొందరు నేతలూ వై.కా.పా.కు అమ్ముడుపోయారని కొందరు కార్యకర్తలు ఆరోపించారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. కుర్చీలు గాల్లోకి లేచాయి. ఓ రణరంగ వాతావరణం సృష్టించారు. సమావేశ మందిరం వద్ద విరిగిన కుర్చీలు కాంగ్రెస్‌ క్రమశిక్షణకు సాక్ష్యమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శల గురించి పట్టించుకోని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరులు ప్రధానరహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో ప్రజలు తీవ్ర అసహనం ప్రకటించారు. కాంగ్రెస్‌ నాయకులు ఇలా చేయడం వల్లే డిపాజిట్లు కూడా కోల్పోయారని ప్రజలు విమర్శిస్తున్నారు.