బిజి మెట్రోపాలిటన్ లైఫ్‌లో మూగపోయిన రేడియో
రెండుదశాబ్ధాల క్రింద విపరీతంగా వినియోగంలో ఉన్న రేడియో తన ప్రాభవాన్ని కోల్పోయింది.ఈ మధ్యకాలంలో ఎఫ్‌ఎంఛానళ్ల సందడి ఎక్కువయ్యింది. ముఖ్యంగా నగరాల్లో ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ రద్దీ తెలుసుకోవడం కోసం ఎక్కువగా ఎఫ్.ఎం. వార్తలు వింటున్నారు. అయితే టీవీ చానళ్ల సక్సెస్‌తో పోల్చితే ఎఫ్.ఎం. రేడియో సక్సెస్ తక్కవనే చెప్పాలి. కోల్‌కత్తాలో మాత్రం రేడియో వినియోగం మిగతా నగరాలతో పోలిస్తే ఎక్కువే.హైదరాబాద్‌లో ఎఫ్‌ఎం చానళ్లు 32.7 శాతం మంది వింటున్నారని తెలుస్తోంది.
టీవీల పై ఆసక్తి
ప్రతి ఇంట్లో టివి ఉంది. కేబుల్ ప్రసారాలు వచ్చిన తర్వాత ప్రతినిముషం ఏదో ఒక కార్యక్రమంతో ఛానళ్లు సందడి చేస్తున్నాయి. టివీల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. టి.వి. పుణ్యమాని ఇప్పటికే ఇరుగుపొరుగు బంధాలు తెగిపోయాయి. నగరాల్లో అయితే పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యింది.
ఇంటర్నెట్ కనెక్షన్
ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయిపోయింది ఈ ఇంటర్నెట్ పుణ్యానే దేశవిదేశాల సమాచారాన్ని మన అరచేతిలో ఉంచుతుంది ఇంటర్నెట్. ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాల్లో పనులన్నీ ఇప్పుడు దీని సొంతం. అత్యధిక వేతనాల్ని తెచ్చిపెట్టే ఉద్యోగాలలో కంప్యూటర్ ఉద్యోగాలే ముందుంటున్నాయి. కంప్యూటర్లవాడకం నానాటికి పెరిగిపోతుంది. మూడిరట ఒక వంతు ప్రజలు కంప్యూటర్ వాడుతున్నారు. అలాగే 20 శాతం మంది ఇంటర్నెట్‌వాడుతున్నారు. భవిష్యత్‌లో ఇంటికో కంప్యూటర్ అనివార్యంగా కనిపిస్తుందని మార్కెట్ వర్గాల అంచనా.
మొబైల్ ఫోన్లదే హవా
ప్రతి ఒక్కరిచేతిలో నేడు కనిపించేది మొబైల్‌ఫోన్ .ప్రస్తుతం దేశంలోకి వందలాది మోడళ్ళ మెబైల్స్ దిగుమతి అవుతున్నాయి. మెబైల్ వాడకం దార్లు సగటున రెండు హ్యాండ్ సెట్లు వాడుతున్నట్లు అంచనా . 120 కోట్ల భారతదేశంలో జనాభాకంటే సిమ్‌కార్డులు ఎక్కువున్నాయి. మెట్రోనగరాల్లో 92 శాతం మంది సెల్‌ఫోన్లు వినియోగిస్తున్నారు. పట్టుమని పది శాతం మంది కూడా ల్యాండ్ ఫోన్లు వాడటం లేదు. సౌకర్యం, సౌలభ్యం, సేవలను దృష్టిలో ఉంచుకొని సెల్ ఫోన్ల వినియోగానికే ప్రజలు పట్టం కడుతున్నారు.
మెట్రోనగరాల అద్దె బ్రతుకులు
మెట్రోనగరాలవాసులు చాలా వరకు అద్దె ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఇల్లుకావాలని ధరఖాస్తు చేసుకున్నవారు సుమారు మూడు లక్షల మంది ఉన్నారు. వీళ్లందరికీ ఇళ్లుకాదుకదా కనీసం స్ధలం చూపటం కూడా కుదరదని అధికారులు చేతులు ఎత్తేశారు.చెన్నైలో హైదరాబాద్‌కన్నా కిరాయి ఇళ్లలో ఉండేవారు మూడు శాతం ఎక్కువ. ముంబైలో మాత్రం మిగతా మెట్రోనగరాలైన కలకత్తా చెన్నై, హైదరాబాదు, డిల్లీ లతో పోలిస్తే సొంత ఇళ్లు కలిగిన వారు అధింకంగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి.
మన నగరవాసుల పొదుపు
ఈ మధ్య మన నగరాల్లో పొదుపు పెరుగుతుంది. జల్సాలు కొంచెం తగ్గించుకోవడానికే నగరవాసులు ఇష్టపడుతున్నారు. చాలా మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. కోల్‌కత్తాలో ఎక్కువమంది బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారు. హైదరాబాద్ వాసులు బ్యాంకు ఖాతాల విషయంలో చాలా వెనుకబడి ఉన్నారు.
రవాణా వాహనాలు
హైదరాబాద్ నగరవాసులు దేశంలోని మిగిలిన మెట్రో నగరవాసుల కన్నా ఎక్కువగా వాహనాలను వినియోగిస్తున్నారు. ముంబైలో హైదరాబాదు వాసులకంటే తక్కువ ద్విచక్ర, చతుర్‌చక్ర వాహనాలు అమ్ముడవుతున్నాయి. అందుకు కారణం అక్కడ ప్రభుత్వం కల్పించే మాస్ ట్రాన్స్‌పోర్ట్ రవాణాసాధనాలేనని తెలుస్తోంది. అక్కడ రైలు మార్గం విస్తరించటం. అది చౌకగా ఉండటం ప్రధాన కారణం. అక్కడ బైకులను 15.6 శాతం, కార్లను 12 శాతం మంది మాత్రమే వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లోని సగం మంది ద్విచక్ర వాహనాలు ఉపయోగిస్తున్నారు. కార్లను కూడా ముంబై, చెన్నై, కలకత్తా వంటి నగరాల కంటే మన హైదరాబాద్ వాసులే ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో వాహనకాలుష్యం ఎక్కువగా ఉంటుంది. చెన్నైలో సైకిల్‌వాడకం ఎక్కువగా ఉంది. వీటిని ప్రభుత్వం మరింత ఎక్కువగా ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది.