ఓడినా నెల్లూరు ఓటర్ల మదిలో నిలుస్తున్న టిఎస్సార్‌?

ఉప ఎన్నికల్లో ఓటమి పాలైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో తిక్కవరపు సుబ్బరామిరెడ్డి గెలిచారు. ఆయన పేరు నెల్లూరు జిల్లాలో మారుమ్రోగుతోంది. ఎప్పుడో నెల్లూరు వదిలేసి విశాఖలో స్థిరపడిన ఆయన జన్మభూమి రుణం తీర్చుకోవాలని సంకల్పించటం నెల్లూరు జిల్లాలో పెద్ద చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు నెల్లూరు ఎంపీ టిక్కెట్టు ఇవ్వటం యాధృచ్ఛికం. అయితే ఎన్నికల ప్రచారం ప్రారంభంలోనే తన జన్మభూమి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందన్నారు. పార్టీ తనకు టిక్కెట్టు ఇచ్చి ఓ గొప్పఅదృష్టాన్ని కల్పించిందని టిఎస్సార్‌ మనస్ఫూర్తిగా చెప్పుకున్నారు. రాజకీయనాయకులందరూ ఇలానే మాట్లాడతారని నెల్లూరు ప్రజలు ఆయన్ని నమ్మలేదు. తాను హృదయపూర్వకమైన సేవనే నమ్ముతానని అంటూ నియోజకవర్గంలో ప్రజలందరూ తనకు బంధువులని అంటూ ఆయన అభిమానంగా పలకరించారు. టిఎస్సార్‌ నెగ్గితేనే సేవ చేస్తారని, ఓడిపోతే ఇచ్చిన మాట కూడా మరిచిపోతారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేసింది. అప్పట్లోనే టిఎస్సార్‌ తాను ఆచరించగలిగినదే చెబుతానని అన్నారే తప్ప వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారానికి సమాధానం మాత్రం చెప్పలేదు. నియోజకవర్గంలో ప్రచారం చేసేటప్పుడు తన నోటితో చెప్పిన ప్రతీహామీని ఒక పద్దతి ప్రకారం రాసుకున్నారు. ఏ చిన్న హామీనీ మరిచిపోకుండా రికార్డు చేసుకున్న సుబ్బరామిరెడ్డి ఎన్నికల ఫలితాలు ప్రకటించిన పదోనిమషమే నియోజకవర్గాన్ని వదిలేశారు. అలా నెల్లూరు వదిలేసిన ఆయన అక్కడ పరిచయమైన వారిని మాత్రం పలకరిస్తూనే వచ్చారు. ఢల్లీ చేరిన వెంటనే తనకున్న రాజ్యసభ సభ్యత్వం అధికారాన్ని, పలుకుబడిని ఇచ్చిన హామీల పరిష్కారానికి ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు.     అందుకే సేవకు గెలుపు ఒక్కటే అర్హత కాదని నమ్మిన టిఎస్సార్‌  ముందుగా కేంద్రస్థాయిలో అయ్యే పనులను పూర్తి చేయదలుచుకున్నారు. దానిలో భాగంగానే శ్రీకాళహస్తి`నడికుడి రైల్వేలైన్‌ మంజూరు చేయాలని ఆయన కేంద్ర రైల్వే మంత్రిని కోరారు. ఈ రైల్వేలైను వల్ల కలిగే ప్రయోజనాలు, ఆదాయం వంటి పలు అంశాలను ఆయన విశదీకరించారు. వీలైనంత త్వరగా బడ్జెట్‌లో పెడతానని రైల్వే మంత్రి హామీ ఇచ్చేంత వరకూ తన విలువైన సమయాన్నీ అక్కడ వెచ్చించారు. దీని తరువాత  మెట్టవాసులకు సాగు,తాగునీరు సమస్యను పరిష్కరిస్తానని సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. దాని ప్రకారం సోమశిల జలాలు తరలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. ఈ జలాలు తరలిస్తే ఎన్ని ఎకరాలు సస్యశ్యామలం అవుతాయో  మ్యాప్‌పాయింట్ల సహితంగా వివరిస్తూ ముఖ్యమంత్రిని ఆకట్టుకున్నారు.  అలానే నెల్లూరులో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీకి ప్రతిపాదనలు రూపొందించాల్సిన అవసరాన్నీ సిఎంకు వివరించారు. దీని వల్ల రోడ్ల మాలిన్యం తగ్గటమే కాకుండా మురికినీటిపారుదల వ్యవస్థ మెరుగవుతుందని స్పష్టం చేశారు. పైగా, వ్యాపారకేంద్రమైన నెల్లూరులో ప్రతీసెంటరులోనూ చెత్త కాలువల్లో చేరి వర్షాకాలం రోడ్లు మడుగులవుతున్నాయని తెలిపారు. దుర్గంధం ప్రబలి ప్రధానసెంటర్లలో నిమషం నిలబడలేని పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపారు. దీంతో సిఎం ఈ రెండు ప్రతిపాదనలకు సుముఖత వ్యక్తం చేశారు. వైద్యకళాశాల లేకపోవటం వల్ల నెల్లూరు జిల్లా నుంచి వైద్యవిద్యకు ఇతర జిల్లాలకు వెళుతున్న విద్యార్థుల ఇబ్బందినీ ఆయన సవివరంగా తెలియజేశారు. ఈ వైద్యకళాశాల కట్టించాలని గతంలో పలువురు చేసిన ప్రయత్నాలనూ, అక్కడ ఉన్న న్యాయవిద్యాకళాశాల, ఇంజనీరింగు కళాశాల పరిస్థితులనూ తెలిపారు. వైద్యకళాశాల  మంజూరు చేస్తే స్థానికంగా ఉండే వైద్యుల సంఖ్య పెరిగి రోగులకు సేవలు ఎలా అందుతాయో ఆయన వివరించిన తీరు కూడా ఆకట్టుకుంది. దీని విషయంలో కూడా సహకరిస్తామని టిఎస్సార్‌ హామీని తీసుకున్నారు. తానిచ్చిన మాట ప్రకారం సొంత డబ్బుతో కళాకారుల కోసం పది కోట్ల రూపాయల విలువైన ఓపెన్‌ ఆడిటోరియం నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. పెద్దాసుపత్రిలో రోగులకు షెడ్లు కట్టించి ఇచ్చేందుకు టిఎస్సార్‌ రూ.2.50కోట్లు కేటాయించారు. త్వరలో షెడ్ల నిర్మాణం కోసం భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తరుచుగా ప్రమాదాలను ఎదుర్కొంటున్న మత్స్యకారులకు సమాచారం అందించేందుకు  ప్రత్యేకంగా ఎఫ్‌ఎం స్టేషన్‌ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ నెరవేర్చుకునేందుకు ఆయన  కేంద్ర సమాచార శాఖా మంత్రి అంబికాసోనీ నుంచి అనుమతి కోరారు.  ఇచ్చిన హామీలు నెరవేర్చటం ద్వారా నెల్లూరు ప్రజల హృదయాలను టిఎస్సార్‌ గెలుచుకున్నారు. తరువాత ఎప్పుడు(2014) ఎన్నికలు జరిగినా ఈయన వేసుకున్న గట్టిపునాది విజయలక్ష్మిని వరించి పెడుతుందని నెల్లూరు ప్రజలే చెబుతున్నారు.

స్థానిక ఎన్నికల కోసం ఎదురుచూపులు

రాష్ట్రప్రభుత్వం తాజాగా తెరపైకి తెస్తున్న స్థానిక ఎన్నికల కోసం నెల్లూరు జిల్లాలో వేలాది మంది ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తే 1754మందికి పదవులు లభిస్తాయి. జిల్లాలోని 961 పంచాయతీల్లో పదవులు లభిస్తాయి. అలానే 598 మందికి ఎంపిటిసిలుగా మండలాలను పాలించే అవకాశం లభిస్తుంది. 46 మంది జెడ్‌పిటిసి సభ్యులుగా ఎన్నికవటానికి అవకాశం ఉంటుంది.  195 మంది మున్సిపల్‌ కార్పొరేటర్లు అయ్యే ఛాన్స్‌ లభిస్తుంది. ఇంకా మండలాధ్యక్షులు, జిల్లాపరిషత్తు ఛైర్మన్లు, పంచాయతీ సర్పంచ్‌లు కూడా వీరిలోనే ఎన్నికవుతారు. అంతే కాకుండా పార్టీలకు గ్రామస్థాయి దాకా పట్టుపెరుగుతుంది. ప్రధానంగా జిల్లాలో ఈ ఎన్నికలు నెల్లూరు, కావలి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేటల్లో ఈ స్థానిక ఎన్నికల ప్రభావం కనిపిస్తుంది.

కొల్లేరులో మృత్యువాతపడ్డ రూ.50లక్షల విలువైన చేపలు

కొల్లేరు అభయారణ్యంలో రూ.50లక్షల విలువైన చేపలు మృత్యువాతపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న సమీపగ్రామాల వారు ఆ చేపలను ఏరుకుంటున్నారు. ఒక్కసారిగా భారీసంఖ్యలో గ్రామీణులు రావటంతో అటవీ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఇంత మంది ఒకేసారి రావటం వల్ల పలు అందమైన పక్షులు ఉండే పిట్టలదొడ్డిలో పక్షులు ఎగిరిపోతున్నాయి. రకరకాల రంగులతో ఆకర్షణకు మారుపేరుగా నిలిచే ఈ పక్షులు పర్యావరణానికే కొత్త అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. అటువంటి పక్షులే లేకపోతే కొల్లేరు వృథా అని ఇక్కడి స్థానికులు  చెప్పుకుంటారు. అంతటితో ఆగక కొల్లేరు అందాలను చూడటానికి వచ్చే పర్యాటకులకు తమవంతు సహాయాన్ని అందిస్తారు. అయితే మృతి చెందిన చేపలను పట్టుకెళ్లటం కోసం వీరు ఎగబడుతున్నారు. ఇలా మృతిచెందిన చేపలు తీసుకువెళ్లటం కూడా నేరమేనని రేంజర్‌ వి.రత్నకుమార్‌ హెచ్చరిస్తున్నారు. పిట్టలదొడ్డిలో ఇంకా విలువైన మత్స్యసంపద ఉందన్నారు. వందలాది మంది రావటంతో వలసపక్షులు బెదిరిపోతున్నాయని తెలిపారు. డిఆర్‌ఓ, నలుగురు బీట్‌ఆఫీసర్లు, ఇద్దరు సెక్షను ఆఫీసర్లు, బేస్‌క్యాంప్‌ సిబ్బంది, మొబైల్‌ టీమ్‌ కొల్లేరు పరిరక్షణ కోసం గస్తీ నిర్వహిస్తారని వివరించారు.

కరువురైతులపై బ్యాంకర్ల కసాయితనం

కరువురైతుల విషయంలో బ్యాంకర్లు కసాయితనంగా వ్యవహరిస్తున్నారు. తినటానికి తిండి లేకపోయినా అలవాటుపడిన వ్యవసాయం ఆపలేని రైతుల అసహాయతపై దెబ్బకొడుతున్నారు. అనంతపురం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడి రైతులను బ్యాంకర్లు తిప్పుకుంటున్నారు. కనీసం రైతుల ఖాతాల నెంబర్లు తీసుకోడానికి కూడా ఖాళీ లేదన్నట్లు బ్యాంకర్లు వ్యవహరిస్తున్నారు.  జిల్లా కలెక్టర్‌ ఆదేశాలనూ బ్యాంకర్లు బేఖాతరు చేశారు. కలెక్టర్‌ లేఖలను పట్టించుకోకుండా రైతులను బాధల్లోకి నెట్టేస్తున్నారు. ఇతర పనులతో లింక్‌పెట్టుకుని కరువురైతు కష్టాలను పెంచొద్దన్న కలెక్టర్‌ అభ్యర్థనను బ్యాంకర్లు తోసిపుచ్చారు. 2011`2012 ఆర్థికసంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన ఇన్‌పుట్‌సబ్సిడీ ఇప్పటి వరకూ రైతులకు చేరకపోవటంలోనే బ్యాంకర్ల పనితనం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఇదే అంశంపై ఒకదశలో బాధ్యతారాహిత్యమంటూ ముగ్గురు ఆర్డీఓలకు, జెడిఎలకు కలెక్టర్‌ దుర్గాదాస్‌ మెమోలు జారీ చేశారు. 2011`12 ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.398.71కోట్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకూ రూ.245కోట్లు బ్యాంకులకు పంపించామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. తాము ఆ డబ్బులో రూ.165కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని బ్యాంకుల ఉన్నతాధికారులు అంటున్నారు. అయితే వాస్తవానికి బ్యాంకర్లు ఇంకా రైతుఖాతాల నెంబర్లు పూర్తిస్థాయిలో సేకరించలేదు. కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించే ప్రతీగ్రీవెన్స్‌సెల్‌లోనూ కరువు రైతులు కలెక్టర్‌కు ఈ ఇన్‌పుట్‌సబ్సిడీ గురించే మొరపెట్టుకుంటున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్‌ ఎలా ఓటు వేస్తారు

అక్రమ ఆస్తుల కేసులో చంచల్‌గూడా జైల్లో ఉన్న జగన్‌ రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలా తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎన్నికల సమయానికి కూడా బెయిల్‌ రాకపోతే పరిస్థితి ఏంటని పార్టీవర్గాలు,  మేధావివర్గాన్ని, న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. న్యాయనిపుణుల సలహామేరకు వైయస్సార్‌ పార్టీనాయకులు జగన్‌జైల్లో ఉన్నవిషయాన్ని ఎన్నికల కమీషన్‌ కు తెలియచేసి అక్కడే ఓటింగ్‌ ఏర్పాటు చేయమనవచ్చు. రాష్ట్రపతి పోలింగ్‌ను పార్లమెంటులోనే కాక ఆయా రాష్ట్రాల అసెంబ్లీలోను నిర్వహిస్తారు కాబట్టి రాజ్యసభ , పార్లమెంటు సభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే వారి రాష్ట్రాల నుండే ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అందువల్ల జగన్‌ జైల్లో నుండి బయటకు రావడానికిగాను న్యాయస్ధానం అనుమతి తీసుకోవలసి వస్తుంది. కోర్టు దానికి సానుకూలంగా స్పందింస్తే జగన్‌ అసెంబ్లీకి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇది ఇలా వుండగా ఎవరికి ఓటువేస్తారో ఇంకా వైసిపి తేల్చుకోలేదు. కాంగ్రెస్‌ అధిష్టాన ఎంఐయం పార్టీ నాయకులు పార్లమెంటు సభ్యుడు అయిన అసవుద్దీన్‌ ఒవైసీని పంపి మతతత్వ రాజకీయాలకు ఓటు వేయకండని చెప్పించారు. అలాగే  సంగ్మా కూడా మద్దతు అడగటానికి వచ్చినప్పుడు జైలు అధికారులు అనుమతించక పోవడంతో ఆయన వైసిపి పార్టీ అధినేత్రి విజయమ్మను కలసి ఓట్లకోసం అభ్యర్థిచటం తెలిసిందే. ఇప్పటికి కూడా వైసిపి తమ ఓట్లు ఎవరికి నిర్ణయించారో ప్రకటించలేదు.

సచిన్‌ కొకొకోల ప్రకటనలు చేయవద్దు

కొత్తగా రాజ్యసభలో ప్రవేశించిన శతశతాల పరుగు వీరుడికి గట్టి చిక్కేవచ్చింది. ఇండియన్‌ క్రికెట్‌ బ్యాట్స్‌మేన్‌గా ఎంతో ఫాలోయింగ్‌ ఉన్న సచిన్‌ పిల్లలను పెద్దలను ఉత్తేజపరిచే చాలా ప్రకటనలోలో దర్శనమిస్తారు. వాటిలో ముఖ్యమైనవి బూస్ట్‌, కొకో కోలా  లాంటి  డ్రిoక్స్‌. వాటిపై సచిన్‌కి వచ్చే రాయల్టీ కోట్లలో ఉంటోంది. అయితే  సచిన్‌ ఇంకా కోలా ప్రకటనలో కనిపించ కూడదని అవి ఆరోగ్యానికి హాని తెస్తాయని స్వచ్చంద సంస్ధలు, మహిళాసంఘాలు కోరుతున్నాయి. రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కాకుండా అభిమానుల ఆరోగ్యాన్ని కూడ దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలని వారు కోరుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుల కోసం కేటాయించిన సదుపాయాలను కాదని ఎప్పుడొచ్చినా స్వంతఖర్చులతోనే రాజ్యసభకు హాజరౌతానని తేల్చిచెప్పిన  సచిన్‌ కొకొకోలా ప్రకటన విషయంలో ఏమి చేయనున్నారో వేచి చూడవలసిందే.

బిజెపిలోకి సినీనటి జయప్రద

ఇండియా సిల్వర్‌ స్త్రీన్‌ మీద అందాలతారగా ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్‌ రాయ్‌తో అభివర్ణించబడిన తార జయప్రద తన సినీజీవితం ఉన్నత శిఖరాలపై ఉండగానే రాజకీయ ప్రవేశం చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి నటసార్యభౌమ ఎన్టీరామారావు పిలుపునందుకొని తెలుగుదేశంపార్టీలో జాయిన్‌ చేశారు. ఆతరువాత జరిగిన పరిణామ క్రమంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయప్రద రాజ్యసభకు ఎన్నికయ్యారు. తదనంతరం జరిగిన ఎన్నికల్లో ఆమె సమాజ్‌ వాది పార్టీనుండి పోటీ చేసిగెలిచారు. ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీనుండి అమర్‌సింగ్‌ వెళ్లిపోవటంతో ఆమె వంటరివారిగా మిగిలిపోయారు. అయితే ప్రస్తుతానికి తాను బిజెపి నాయకులను కలిసి చెట్టపట్టా వేసుకొని తిరుగుతుండటం చూసి త్వరలో ఆమె భారతీయ జనతా పార్టీ తీర్ధం పుచ్చుకుంటారని తెలుస్తుంది. ఇప్పటికే పలువురు సినీ తారలను రాజకీయనాయకులుగా తీర్చిదిద్దిన బిజెపి జయప్రదను కూడా ఆమోదిస్తారనే అనుకుంటున్నారు.అదే జరిగితే హేమమాలిని, ధర్మేంద్ర ,శత్రుఘన్‌ సిన్హా, వినోద్‌ఖన్నా మొదలైన వారి జాబితాలోకి జయప్రద కూడా చేరతారు.

జగన్ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు జూలై 4కు వాయిదా

అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయస్థానం జూలై 4కు వాయిదా వేసింది. జగన్‌ తరపున ప్రముఖ న్యాయవాది రామ్‌ జెఠ్మలానీ, సీబీఐ తరపున అశోక్‌భాన్‌ వాదనలు వినిపించారు. సీబీఐ వాదనలు నిన్న అసంపూర్తిగా ముగియడంతో ఈరోజు కొనసాగించారు. మౌనంగా ఉండడం కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు అని రాంజెత్మలానీ సిబిఐ విచారణలో జగన్ వైఖరిని కోర్టులో సమర్థిస్తూ వాదించారు. తమకు కావాల్సిన సమాధానాలను మాత్రమే జగన్ నుంచి రాబట్టడానికి సిబిఐ ప్రయత్నాలు చేసిందని ఆయన అన్నారు. వైయస్ జగన్ అరెస్టు అక్రమమని ఆయన అన్నారు. ముగ్గురు సాక్షులను వాంగ్మూలం ఇవ్వకుండా బెదిరించారని సిబిఐ ఆరోపిస్తోందని, సిబిఐ మాటలన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేసిన వ్యక్తిని అరెస్టు చేయడాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించాలని ఆయన వాదించారు.

రాయల తెలంగాణ మాకు వద్దు: ప్రొఫెసర్ కోదండరామ్

రాయల తెలంగాణ ఏర్పాటుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గురువారమిక్కడ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ రాయల తెంలంగాణ ప్రతిపాదన తెచ్చినవారంతా తెలంగాణద్రోహులేనన్నారు. రాయల తెలంగాణకు నిరసనగా జిల్లాల్లో కాంగ్రెసు నాయకుల దిష్టిబొమ్మలు దగ్ఘం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీమ నాయకులతో కాంగ్రెసు శానససభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి కుమ్మక్కై రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారని ఆయన అన్నారు. వచ్చే నెల 7వ తేదీన జెఎసి స్టీరింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ కోసం భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. రాయల తెలంగాణ ప్రతిపాదన చేసినవారిని ద్రోహులుగా పరిగణిస్తామని ఆయన చెప్పారు.

రాష్ట్రపతి ఎన్నిక: పీఏ సంగ్మా నామినేషన్ దాఖలు

రాష్ట్రపతి అభ్యర్థిగా పీఏ సంగ్మా మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. సంగ్మా నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు నితన్ గడ్కారి, ఆపార్టీ సీనియర్ నేత ఎల్కె అద్వానీ, సుష్మాస్వరాజ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, అరుణ్ జైట్లీ, వసుంధరా రాజే, రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, సుబ్రహ్మణ్యస్వామి తదితరులు హాజరయ్యారు. ఈరోజు ఉదయం యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీకి 63 శాతం ఓటర్ల బలం ఉండగా, ప్రత్యర్థి పిఎ సంగ్మాకు 30 శాతం ఓట్ల బలం ఉంది. మిగతా ఏడు శాతం ఓట్లు గల పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయలేదు. తృణమూల్ కాంగ్రెసు, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు, తదితర పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తారనే విషయాన్ని తేల్చుకోలేదు.

11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో కొంతమంది కలెక్టర్లగానూ, మరికొంతమంది కమిషనర్లగానూ నియమిస్తూ సర్కార్ ఆదేశాలిచ్చింది.   సౌరబ్‌గౌర్ : శ్రీకాకుళంజిల్లా కలెక్టర్, సుదర్శన్‌రెడ్డి : కర్నూల్ జిల్లా కలెక్టర్, కె. రాంగోపాల్ : పంచాయతీరాజ్ కమిషనర్, అజయ్‌జైన్ : సాంకేతిక విద్యా శాఖ, ప్రదీప్ చంద్ర : పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, సంజయ్ కుమార్ : ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్, విజయ్‌కుమార్ : ఐజీ స్టాంప్స్, రిజిస్ట్రేషన్, సవ్య సాచి ఘోష్ : ఫుడ్ ప్రొసెసింగ్, చిరంజీవి చౌదరి : స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, సురేష్ కుమార్ : గుంటూరు జిల్లా కలెక్టర్, దినకర్‌బాబు : మెదక్ జిల్లా కలెక్టర్. 

హరిత బయోప్లాంట్ ఆఫీసును ధ్వంసం చేసిన స్థానికులు

కరీంనగర్ జిల్లాలోని  తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లిలో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకున్న సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఇక్కడి  హరిత బయోప్లాంట్‌  ఆఫీసుపై దాడి జరిగింది. బిస్కట్ కంపనీ కి బదులుగా బయో ప్రాడక్ట్స్ కంపనీ ని నెలకొల్పారని ఆగ్రహించిన పర్లపల్లి వాసులు ఈ దాడికి పాల్పడ్డారు. ఆందోళనకారులు హరిత బయోప్లాంట్‌ ఆఫీసు పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అక్కడ వున్న వాహనాల అద్దాలను పగులగొట్టి వాటిని ఎత్తిపడేసి  ధ్వంసం చేసారు. ఆఫీసులోని ఫర్నిచర్, కంప్యూటర్లను ముక్కలు ముక్కలుగా చేసారు. అయితే, ప్రజల ఆగ్రహానికి కారణం బయో ప్రాడక్ట్స్ కి సంబంధించిన ఈ కంపనీని జనావాసాల మధ్య నెలకొల్పడమేనని, ఎన్ని సార్లు అధికారులకు పిర్యాదు చేసినా ఈ కంపనీ ఓ ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందినదై వుండడం వల్ల అధికారులు పట్టించుకోలేదని స్థానికులు చెప్తున్నారు. ఈ ప్లాంట్ కారణంగా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని స్థానికులు వాపోతున్నారు. తాము అనారోగ్యం పాలవుతున్నామని, చర్మవ్యాధులు వస్తున్నాయని వారు చెప్పారు. ఫ్యాక్టరీని మూసివేసేవరకు తమ ఆందోళన విరమించేదిలేదన్నారు. కలెక్టర్ వచ్చి ప్లాంట్ని సీజ్ చేసేవరకు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు.

చెన్నైలో ఫ్లైఓవర్ పైనుండి పడిన బస్సు: ఒకరి మృతి

చెన్నైలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ బస్సు ప్రమాదం సంభవించింది. బ్రాడ్వే నుండి వడపళని వెళ్ళే సిటీ బస్సు (17ఎం. నెం.) జెమీనీ ఫ్లైఓవర్ మీదుగా వెళుతూ అదుపు తప్పి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయ పడ్డారు. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. బస్సు  నుంగంబాక్కం హైవే రోడ్డు వైపు ఫ్లైఓవర్ పైనుండి క్రిందికి దిగుతున్నప్పుడు  బస్సు అదుపు తప్పడంతో ఈ దుర్ఘటన సంభవించిందని స్థానికులు చెప్పారు. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

రోష్ట్రంలో మంత్రులైనా లంచం ఇవ్వాల్సిందే

మంత్రి వర్గ సహచరి నుంచే రూ. 25 కోట్ల లంచం డిమాండ్‌ చేస్తున్న జూనియర్‌ మంత్రి రాష్ట్రం అవినీతితో కంపుకొడుతోంది. కొందరు మంత్రులు బరితెగించి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో అందిన కాడికి దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలె మంత్రి పదవి పొందిన ఒక వ్యక్తి సహచర సీనియర్‌ మంత్రి పార్టనర్‌గా ఉన్న ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్‌ క్లియరెన్స్‌ కోసం అక్షరాలా రూ.25 కోట్ల రూపాయలు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది. వందలాది కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు ఫైనల్‌ స్టేజ్‌లో ఉన్న సమయంలో సంబంధిత శాఖ మంత్రి ఆ సీనియర్‌ మంత్రి పార్టనర్స్‌ నుంచి డబ్బు డిమాండ్‌ చేస్తుండడంతో సీనియర్‌ మంత్రి ఒక దశలో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.ఈ ప్రాజెక్టులో తనకు వాటా ఉన్న సంగతి చెప్పి ఫైల్‌ క్లియర్‌ చేయించాలని సీనియర్‌ మంత్రి తన పార్టనర్స్‌కు చెప్పి పంపినా ఫలితం లేకపోయింది.   ఈ సంగతి సి.ఎం. కిరణ్‌ కుమార్‌ రెడ్డి వద్ద పంచాయితీ పెట్టి తేల్చేద్దామని ఆ సీనియర్‌ మంత్రి పార్టనర్స్‌కు భరోసా ఇచ్చారు. అయితే దీనికి కూడా ఆ పార్టనర్స్‌ అంగీకరించలేదని తెలిసింది. ఇలా చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని వారు భయపడ్డారని తెలిసింది.ఈ దశలో మీరు జోక్యం చేసుకుంటే ఈ జూనియర్‌ మంత్రికి కోపం వచ్చి ఎదురుతిరిగితే మనం చేసేది ఏమీ ఉండదని , అందుకే ఆ జూనియర్‌ మంత్రి అడిగిన రూ. 25 కోట్లు ఇచ్చేయాలని వారు సీనియర్‌ మంత్రికి నచ్చజెప్పినట్లు తెలిసింది. దీంతో రూ.25 కోట్లలో తన వాటా అయిన పది కోట్లను పార్టనర్స్‌కు అప్పగించడానికి ఆ సీనియర్‌ మంత్రి నిర్ణయించారని తెలిసింది. ఈ కోస్తా ఆంధ్రాలో ఏర్పాటు చేయబోయే ఈ ప్రాజెక్టులో ఆ సీనియర్‌ మంత్రి కుమారుడు వాటా దారుడిగా ఉన్నారు. ఈ కుమారుడి మీదా, ఆమె తల్లి అయిన సీనియర్‌ మంత్రి పైనా కూడా ఆరోపణలు ఉన్నాయి.   తన మంత్రి వర్గ సహచరురాలికి ఈ ప్రాజెక్టులో వాటా ఉన్నప్పటికి జూనియర్‌ మంత్రి ఏ మాత్రం కనికరం చూపకుండా ముడుపులు అందుకోవడానికి సిద్దపడుతున్నట్లు తెలిసింది.మరో అసక్తి కరమైన విషయం ఏమిటంటే ఇటువంటి మరో ప్రాజెక్టును ఆలస్యంగా చేపట్టినప్పటికి దానికి ఇప్పటికే అన్ని అనుమతులు లభించాయి.కాని సీనియర్‌ మంత్రి పార్టనర్‌గా ఉన్న ఈ ప్రాజెక్టు మాత్రం ముందుకు సాగడం లేదు. అందుకే మిగిలిన పార్టనర్లు మంత్రి పేరు ప్రస్తావించకుండా ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోవడానికి నడుంబిగించినట్లు తెలుస్తోంది.

మంత్రులకు పార్టీ, ప్రభుత్వ ప్రచార బాధ్యత!

రాష్ట్ర మంత్రులు పది మంది కలిసి కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారబాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి రెండే సీట్లు రావటంతో పార్టీ ప్రచార బాధ్యత మంత్రుల కమిటీ చేపట్టింది. దీంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు వీరే ప్రచారం చేపట్టాలి. పది మంది సభ్యులున్న ఈ కమిటీకి మంత్రి థర్మాన ప్రసాదరావు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. కమిటీ సభ్యులుగా ఆనం రామనారాయణరెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, రఘవీరారెడ్డి, పినిపేవిశ్వరూప్‌, పితాని సత్యన్నారాయణ, డికెఅరుణ, తోటనర్సింహం, సారయ్య, రామచంద్రయ్యలు ఉన్నారు. ఈ కమిటీ ప్రధానంగా పార్టీ పరిస్థితి అథ్యయనం చేసి విశ్లేషిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ పరంగా ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే అంశాలను పరిశీలిస్తుంది. ప్రచారకార్యక్రమాలు సజావుగా సాగేందుకు దృష్టి సారిస్తుంది. 2014 ఎన్నికల సమయానికి కాంగ్రెస్‌ పార్టీకి అనుకూల వాతావరణం తీసుకురావటం ఈ కమిటీ బాధ్యత. దీని కోసం ప్రచారకార్యక్రమాలు దానికి తగ్గట్టు రూపొందించుకోవటం, వాటిని పర్యవేక్షించటం ఈ కమిటీ సభ్యులు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి సిఎం మద్దతు ఇస్తారు.

గౌతమ్‌కుమార్‌ రాజీనామా సమంజసమేనా?

రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి విసిగిన హోంశాఖ కార్యదర్శి గౌతమ్‌ కుమార్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఒకరకంగా ప్రభుత్వంలో నాటుకుపోయిన కులతత్వాన్ని చాటుతోందని ప్రతిపక్షాల విమర్శలు మిన్నంటుతున్నాయి. అదే డిజిపి దినేష్‌రెడ్డి కాకపోయుంటే? ఆయన స్థానంలో ఇంకెవరైనా ఉంటే? అన్న ప్రశ్నలను తెరపైకి తెస్తోంది. వాస్తవానికి క్యాట్‌ ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన రాష్ట్రప్రభుత్వం దాన్ని కాదని హైకోర్టులో సవాల్‌ చేయటం గౌతమ్‌కుమార్‌ను మానసికంగా కుంగదీసింది. మూడు వారాల్లోపు కొత్త డిజిపిని నియమించమని క్యాట్‌ ఆదేశాలివ్వటం న్యాయమైనదేనని మొత్తం పోలీస్‌శాఖ భావిస్తోంది. దీన్ని ప్రభుత్వం ఎందుకు తన వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుంది? డిజిపి దినేష్‌రెడ్డికి పాలకులతో ఉన్న సంబంధాలు, వ్యక్తిగతంగాను, సామాజిక కులపరంగాను ఎక్కువ అని ప్రభుత్వం సవాల్‌ చేయటంలో వెల్లడవుతోంది. సీనియర్‌ను వదిలేసి జూనియర్‌కు పదోన్నతి కల్పించటం రాష్ట్రప్రభుత్వం ప్రకటించే న్యాయమయితే తనకు ప్రతీసారి అన్యాయం జరుగుతోందన్న బాధలో గౌతమ్‌కుమార్‌ ఉండటమూ సబబే. ఏమైనా హోంశాఖ కార్యదర్శి గౌతమ్‌కుమార్‌ రాజీనామా అధికార వర్గాల్లో తీవ్రచర్చకు దారి తీసింది. ఈ రాజీనామాపత్రం ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగానికి పంపించారు. ఉద్యోగపదోన్నతుల్లో ఆశ్రితపక్షపాతం అన్న ధోరణి ప్రజలకు చేరింది. పోలీసులకూ ఇదే భావన నెలకొంది. ప్రతిపక్షాలకూ కొత్తసబ్జెక్టు దొరికింది. అయితే అవి ఎంత వరకూ ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయగలవన్నది మాత్రం తెరపైనే చూడాలి.

ఎన్నికల్లో నొక్కేసింది కక్కేయమంటున్న మంత్రి ధర్మాన

నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మాన రామదాసు ఓటమి పాలయ్యారు. ఆయన ఓటమితో కలత చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు మరో తమ్ముడు వై.కా.పా. తరుపున ధర్మానకృష్ణదాస్‌ గెలుపొందారని ఆనందించలేకపోతున్నారు. పైగా, తాను ప్రతిష్టాత్మకంగా భావించి డబ్బులు కుమ్మరిస్తే కొంచెం ఓటర్లకు పంచి మిగిలింది నొక్కేసిన కాంగ్రెస్‌ నేతల గురించి ఆరాతీశారు. ఎంత పంచారో ఎంత నొక్కారో ఓ అంచనాకు వచ్చిన తరువాత మంత్రి ధర్మాన ప్రసాదరావు నొక్కేసింది కక్కమంటున్నారట. దీంతో హతాశులైన కాంగ్రెస్‌ నేతలు ఏమి చెప్పాలో తెలియని అయోమయంలో పడుతున్నారు. తన వద్ద వివరాలు ఉన్నాయి కాబట్టి తీయమని మంత్రి డిమాండు చేస్తున్నారు. చివరికి ఒక్కసారి లెక్క తేల్చేయమని ధర్మాన ప్రసాదరావు నేతలను కోరుతున్నారు. ఇచ్చిందెంత? పంచిందెంత? లెక్క చెప్పాలి కదా అని కాంగ్రెస్‌ నేతలను ప్రశ్నిస్తున్నారు. ధర్మాన రికవరీ స్టంట్‌ చూసిన కొందరైతే ఆయనకు కనబడకుండా తప్పించుకునే ప్రయత్నాలూ ప్రారంభించారు. ఈ రికవరీ విషయం తెలిసిన నేతలు కొందరు తాము ఊర్లో లేమనీ, త్వరలో వచ్చిన తరువాత లెక్కలు చెబుతామని ఫోనులో చెప్పేస్తున్నారు. ఏమైనా సరే! ఎప్పుడొచ్చినా ఒక్కసారి లెక్క చెప్పేసి వెళ్లమ్మా అంటూ ధర్మాన వారిని మళ్లీ గడువు ఇచ్చి పిలిపిస్తున్నారు.

జగన్‌ కోప్పడినా విజయసాయిరెడ్డి కోర్టుకు వెళ్లినా ఒక్కటేనా?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి కోప్పడినా, ఆయన ఆడిటరు విజయసాయిరెడ్డి పరువు నష్టం దావా అంటూ కోర్టుకు వెళ్లినా ఒక్కటేనా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం విజయసాయిరెడ్డి చర్యల్లోనే దాగుంది. ఆయన ఈనాడు పత్రికాధిపతి రామోజీరావు, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, టిడిపి నేత దాడి వీరభద్రరావుపైనా పరువునష్టం దావా వేశారు. జగన్‌ కూడా ఈ ముగ్గురిపైనే కోపంగా ఉన్నారు. వీరి వల్లే తాను ఇరకాటంలో పడ్డానని జగన్‌ భావిస్తున్నారు. కుట్రపూరితమైన ఆరోపణలు, ఈ ఆరోపణలతో పాటు దుష్ప్రచారం, పోస్టర్ల ద్వారా, పత్రికల ద్వారా మానసిక క్షోభకు గురి చేయటం వంటి అంశాలు సాయిరెడ్డి ఫిర్యాదులో ఉన్నాయి. జగన్‌ అక్రమాస్తుల కేసులో ఎ`2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి బయటకు వచ్చినది మొదలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఆయన కోర్టులో వేసిన పరువునష్టం దావా తెలియజేస్తోంది. జగన్‌ను ఇబ్బంది పెట్టే ప్రతీ అంశాన్నీ తనకూ ఆపాదించుకునే సాయిరెడ్డి ఈ ఫిర్యాదు చేశారని తెలుగుదేశం శ్రేణుల అభిప్రాయపడుతున్నాయి. ఇటువంటి నోటీసులు ఇవ్వటం ద్వారా ఈనాడు యాజమాన్యాన్ని, తెలుగుదేశం నేతలను లొంగదీసుకోవాలని చూడటం కూడా కుట్రలాంటిదేని ఆ పార్టీ నేతలంటున్నారు. ఏమైనా జగన్‌ చెప్పినా, చెప్పకపోయినా ఆయన మనస్సులో ఉన్నది విజయసాయిరెడ్డి చర్యల్లో కనబడుతుందని మాత్రం తెలుస్తోంది. అందుకే ఇకపై విజయసాయిరెడ్డి కదలికలపై దృష్టి పెడితే జగన్‌ భవిష్యత్తు కార్యాచరణ అర్థం అవుతుందని తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు ఓ అంచనాకు వచ్చేశాయి.