మహారాష్ట్ర ఇసుకను కూడా వదలని ఆంధ్రా సిండికేట్లు
posted on Jul 3, 2012 @ 11:51AM
రాష్ట్రంలో మద్యం మాఫియా కన్నా ప్రమాదకరంగా తయారైన ఇసుక సిండికేట్లు పొరుగురాష్ట్రమైన మహారాష్ట్రపై కన్నేశాయి. గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రా, మహారాష్ట్ర సరిహద్దులోని మంజీరానదిలో కోట్లాది రూపాయల విలువైన ఇసుకను కొల్లగొట్టేశారు. మంజీరానదిలో ఇసుక క్వారీలను రాష్ట్రప్రభుత్వం రెండేళ్ల క్రితం నిషేధించింది. అయితే మహారాష్ట్రలో అటువంటి నిషేధం లేకపోవటంతో రాష్ట్రానికి చెందిన ఇసుక సిండికేట్లు అక్కడ వాలిపోయారు. మహారాష్ట్ర అధికార్లను లంచాలతో మేనేజ్ చేసి ఇసుకను ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. దాదాపు పదికిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న నదీ గర్భంలో ఇప్పటికే లక్షలాది టన్నుల ఇసుకను కొల్లగొట్టారు. ఇది చాలదన్నట్లు ఆంధ్రాప్రాంతంలోని నదీగర్భ ఇసుకను కూడా గుట్టుచప్పుడు కాకుండా తరలించుకుపోతున్నారు.
నదీపరివాహప్రాంతంలో సరిహద్దులు సరిగా లేకపోవటంతో ఇసుక సిండికేట్ల దోపిడీకి అంతే లేకుండా పోతోంది. ఈ ప్రాంతంలో సంయుక్తంగా సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయిద్దామని రాష్ట్ర అధికారులు కోరుతున్నప్పటికీ మహారాష్ట్ర అధికారులు పట్టించుకోవటం లేదు. మహారాష్ట్ర ఇసుక క్వారీ ద్వారా మన రాష్ట్రానికి అపారంగా నష్టం జరుగుతోంది. అక్రమంగా ఇసుక తవ్వటంతో భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. మహారాష్ట్ర క్వారీల నుంచి ప్రధానంగా మన రాష్ట్రంలోకి ఇసుక రావాణా అవుతోంది. క్వారీల వేలం ద్వారా మహారాష్ట్ర కోట్లాది రూపాయలు ఆశిస్తుండగా, ఇసుకను రవాణా చేస్తున్న భారీ వాహనాల కారణంగా ఆంధ్రాప్రాంతంలో రహదార్లు దెబ్బతింటున్నాయి.