త్వరలో జిల్లాల వారీగా సామాజిక భద్రతాబోర్డులు?
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సామాజిక భద్రతాబోర్డులను జిల్లాల వారీగా ఏర్పాటు చేయనుంది. ప్రాథమిక పరిశీలన కింద రాష్ట్రసామాజిక భద్రతాబోర్డును నియిమంచింది. ఈ బోర్డు సామాజికభద్రతా పథకాల అమలును సమీక్షిస్తుంది. అలానే అవసరమైన చర్యలూ తీసుకుంటుంది. దీనిపై ప్రభుత్వం ఒక జీఓను విడుదల చేసింది. రాష్ట్రబోర్డుకు ఛైర్మన్‌గా కార్మికశాఖామంత్రిని నియమించారు. సభ్యకార్యదర్శిగా కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి, బిసి సంక్షేమం, సాంఘిక, మైనార్టీ, మత్స్య, ఎక్సయిజ్, అటవీ, పర్యావరణ, పురపాలక, స్త్రీ, శిశుసంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.
అసంఘటిత కార్మిక ప్రతినిధులుగా ఆరువిభాగాల వారితో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. వీరందరూ కార్మిక సమస్యలపై చర్చించి వీలైనంత త్వరగా రాష్ట్రబోర్డు పరిథిలో పరిష్కరిస్తారు. అయితే ఈ బోర్డు పనితీరు పరిశీలించాక జిల్లాల వారీగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ బోర్డులు ఏర్పాటు చేస్తారని తెలిసింది. ఈ బోర్డులకు జిల్లాకలెక్టర్లు ఛైర్మన్లుగానూ, జిల్లా లేబర్ కమిషనర్ కార్యదర్శిగానూ, ప్రజాప్రతినిధులు, అన్నిశాఖల జిల్లా క్యాడర్ సభ్యులుగా ఉంటారు. పరిపాలనను సులభతరం చేస్తూ కార్మికసమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించేందుకు ఈ బోర్డులు దోహదపడతాయని భావిస్తున్నారు.