ఈడి వేలికేసిన ముడిని కాలికేస్తున్న జగన్
posted on Jul 3, 2012 @ 12:32PM
వేలికి ముడేస్తే కాలికి ముడేసేవాడుంటాడని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి నిరూపించారు. అత్యంత తెలివైన వ్యక్తిగా పేరొందిన జగన్ తెలివితేటలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సిబిఐ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై కౌంటర్‌పిటీషన్ పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇటీవల అక్రమాస్తుల కేసులో జగన్ సిబిఐ ద్వారా కస్టడీలోకి వచ్చి చెంచల్‌గూడా జైలులో ఉన్నారు. సిబిఐ విచారించిన తరువాత కేంద్ర సంస్థ అయిన ఈడి కూడా రంగంలోకి దిగింది. ఇదే కేసులో జగన్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఈడి దాదాపు 15రోజుల క్రితమే సిబిఐ కోర్టును కోరింది. అయితే కోర్టు ఈ నెల 6వతేదీన తీర్పు ఇవ్వనుంది. ఈలోపు జగన్ తరుపున కౌంటర్ పిటీషన్ దాఖలు చేశారు. జగన్ తరుపున న్యాయవాది అశోక్‌రెడ్డి వాదించారు. ఈడి కోరినట్లు తాను ఇప్పుడు జగతి పబ్లికేషన్స్‌కు ఛైర్మన్‌నో, డైరెక్టర్‌నో కాదని జగన్ తన కౌంటర్‌లో పేర్కొన్నారు. జగతిపబ్లికేషన్స్‌లోకి హవాలా రూపంలో పెట్టుబడులు వచ్చాయని, దీనిపై జగన్‌ను విచారించాలని ఈడి కోర్టుకు విన్నవించింది. జగతి పబ్లికేషన్స్‌కు తాను ఇస్పుడు జైలులోకి వచ్చాక డైరెక్టర్ కాదని స్పష్టం చేశారు. తనను విచారించేందుకు అనుమతి ఇవ్వరాదని జగన్ సిబిఐ కోర్టును కోరారు. ఈడి దాఖలు చేసిన ఫిర్యాదు మెయింటనబుల్ కాదని జగన్ పేర్కొన్నారు. తాను ప్రస్తుతం జైలులో ఉన్నందున తనకు కంపెనీ వ్యవహారాలేవీ తెలియవన్నారు. తనకు ఫెమా, పిఎంఎల్ చట్టం వర్తించదని జగన్ పేర్కొన్నారు. ఇలా ఈడి ఒక ముడి వేలికేస్తే జగన్ కాలికి వేశారు. ఈడి తరుపున న్యాయవాది సుభాష్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలూ విన్న నాంపల్లి సిబిఐకోర్టు న్యాయమూర్తి ఈ నెల 6న తీర్పు ఇస్తామని కేసును వాయిదా వేశారు.