భూగర్బంలోనే సమాధిఅవుతున్న గని కార్మికులు

పారిశ్రామిక వాడల్లో కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారు. యాజమాన్యం భద్రతా  నిబంధనలను గాలికి ఒదిలి మొద్దు నిద్రపోతుంది. దీనికి తార్కాణంగా ఆదిలాబాద్‌జిల్లా శ్రీరాంపురంలోని ఆర్కే 6వ గనిలో 4వ సీమ్‌ 30డిప్‌ 19వ లెవల్లో ఎర్రంశెట్టి రాజేశం (50) మరణించారు. వివరాల్లోకి వెళితే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో టబ్బు బొగ్గులను నింపిన తర్వాత ఊపిరి ఆడటం లేదని వేడిగా వుందని సహచర కార్మికులతో చెప్పి సొమ్మసిల్లిపడిపోయారు. తోటి కార్మికులు పైకి తీసుకొచ్చేటప్పటికే మృతి చెందారు. మృతుడుకి భార్య, ముగ్గురు కూతుళ్లు,కొడుకు ఉన్నారు. గాలి ఆడకే మృతిచెందాడని, తామంతా గాలిలేక చాలా బాధపడ్డామని తోటి కార్మికులు చెబుతున్నారు. మృతుని కుటుంబానికి 25 లక్షలు పరిహారం ఇవ్వాలని  టిబికెజియస్‌ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. విశాఖ ఉక్కులో జరిగిన ప్రమాదంలో వారికి అంతే పరిహారం చెల్లించారని తమకు కూడా అదేనిబంధన వర్తింప చేయాలని జియంను కోరారు. శ్రీరాంపురం జియం నాగేశ్వరరావు మేనేజ్‌మెంటుకు వివరిస్తానని తెలిపారు. సింగరేణి కార్మికులు ఏడాదికి 12 మంది మృత్యువాత పడుతున్నా మేనేజ్‌మెంట్‌ పట్టించుకోవడం లేదని కనీస రక్షణచర్యలు పాటించనందువల్లే ఊపిరాడక భూగర్బంలోనే సమాధి అవుతున్నారని కార్మికులు వాపోతున్నారు..భూగర్బపనుల్లో 284 క్యూబిక్‌ మీటర్లు వెంటిలేషన్‌ తగ్గకుండా (ఇంటెక్‌) సరఫరా చేయాలి,4.5 మీటర్లసమీపం వరకు గాలి ఉండాలని, ఒక వ్యక్తికి నిముషానికి 6 క్యూబిక్‌ మీటర్లు లేదా టన్ను బొగ్గు ఉత్పత్తికి 2.5 క్యూబిక్‌ మీటర్లచొప్పున వెంటిలేషన్‌ సరఫరా ఉండాలని మైన్స్‌ యాక్టు చెబుతుంది. వెంటిలేషన్‌ ప్రకారం గాలి సరఫరాకానందునే కార్మికులు చనిపోతున్నారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. బయట ఫ్యాన్లు పెట్టినప్పటికి గనుల్లోకి గాలిని మళ్లించడంలో అధికారులు విఫలమవుతున్నారన్నారు. విషవాయువులను అధికారులు పరిశీలించాకే అనుమతించాలి గాని ఆ దాఖలాలు లేవని కార్మికులు ఆందోళనకు గురిఅవుతున్నారు. ఇకనైనా అధికారులు తగు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.  

మెట్రోపనులను అడ్డుకుంటున్న సుల్తాన్‌ బజార్‌ ట్రేడర్స్‌

హైదరాబాద్‌నగరంలో శరవేగంతో సాగుతున్న మెట్రోపనులకు ఆటంకం కలిగే ప్రమాదం ఏర్పడిరది. సుల్తాన్‌ బజార్‌లో మెట్రోరైలు  పనులు ప్రారంభిస్తే తీవ్రపరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని సుల్తాన్‌బజార్‌ ట్రేడర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటి హెచ్చరిస్తోంది. మెట్రోరైలుఅధికారుల ఆఫీసులు , ఇండ్లు ముట్టడిస్తామని బెదిరిస్తోంది.. ఇటీవలికాలంలో ఎల్‌ ఎండ్‌ టీ హైదరాబాద్‌ మేనేజర్‌ విబి గాడ్గిల్‌ చేసిన ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన దిష్ఠిబొమ్మను ఆంధ్రబ్యాంకు చౌరస్తాలో  దహనంచేశారు. మెట్రోకారిడార్‌ 2 నిర్మాణకార్యక్రమాలను వేగవంతం చేయనున్నట్లు గాడ్గిల్‌ చేసిన ప్రకటనపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మార్కెట్‌ను నమ్ముకొన్న వందలాదిమంది వ్యాపారులు ,సిబ్బంది వీధిన పడతారని ఆందోళన వ్యక్తంచేశారు. జూబ్లీబస్‌ స్టేషన్‌నుండి ఫలక్‌నామావరకు వేయనున్న మెట్రోరైలు కారిడార్‌ 2 నిర్మాణపు పనులను వెంటనే ఆపివేయాలని సుల్తాన్‌ బజార్‌ ట్రేడర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ కోరారు. డిల్లీ బెంగుళూరు వంటి నగరాల్లో వేసిన మెట్రోరైలు మార్గం అవసరాన్ని బట్టి భూగర్బంనుండి వెళ్లేలా అక్కడి అధికారులు చర్యలు తీసుకున్న విషయం గాడ్గిల్‌ గుర్తుంచుకోవాలన్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టయినా మెట్రోరైలు నిర్మాణాలను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.

పార్టీ ప్రక్షాళన దిశగా చంద్రబాబు

ఉప ఎన్నికలలో ఒక్క సీటుకూడా తెచ్చుకోలేక చతికిల పడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చైతన్యాన్ని నింపేదుకు కష్టపడి ఓడి పోయిన వారికి కూడా చంద్రబాబు సన్మానాలు చేసిన సంగతి తెలిసిందే. అంతటితో చాలదనుకొన్న బాబు పార్టీని బలోపేతం చేయటానికి భారీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. మొదటి దిశగా పది జిల్లాల  అధ్యక్షులను ఆయన మార్చాలనుకుంటున్నారు. హైదరాబాద్‌నుండి మొదలు పెట్టాలని చూస్తున్న చంద్రబాబునాయుడు చాలా కాలంనుండి నగర అధ్యక్షుడిగా పని చేయుచున్న తీగల కృష్ణారెడికి బదులుగా బీఎన్‌రెడ్డి, కార్పొరేటర్‌ శ్రీనివాసరెడ్డి కూన వెంకటరెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో పోకల మనోహర్‌ స్థానంలో ఎమ్మేల్యే జైపాల్‌రెడ్డికి భాద్యతలు అప్పచెప్పాలని చూస్తున్నారు. విశాఖజిల్లాలో  చింతకాయల అయ్యన్న పాత్రుడి బదులుగా బండారు సత్యన్నారయణను, పశ్చిమగోదావరి జిల్లాలో తోట మహాలక్ష్మిని మార్చి మాగంటి బాబుకు అవకాశం ఇవ్వనున్నారు. గుంటూరు జిల్లా అద్యక్షుడుగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు స్ధానే మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌, మాదాల రాజేశ్వరరావు పేర్లను పరిశీలిస్తున్నారు. నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న సోమిరెడ్డి  చంద్రమోహన్ రెడ్డి  స్ధానంలో రవిచంద్రయాదవ్‌ను నియమించనున్నారు. వరంగల్‌జిల్లాలో ఉన్న రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మార్చి పరకాల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చల్లాధర్మారెడ్డిని నియమించనున్నట్లు తెలిసింది. ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గోనె హన్మంతరావుని మార్చి ఎమ్మేల్యే నగేష్‌ని నియమిస్తారని తెలుస్తోంది. ఖమ్మంజిల్లాకు గాను ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ని నియమించనున్నట్లు తెలుస్తుంది. నల్గొండ జిల్లాలో వంగాల స్వామిగౌడ్‌ను మార్చి మల్లిఖార్జున రెడ్డి, కృష్ణారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు.

శెలవుపై వెళ్ళనున్న జె.డి. లక్షీనారాయణ ?

జగన్‌ అక్రమాస్తుల కేసును విచారిస్తున్న సి.బి.ఐ. జాయింట్‌  డైరెక్టర్‌  లక్షీనారాయణ త్వరలో శెలవుపై వెళ్ల వచ్చని తెలిసింది. నిజానికి ఆయన శిక్షణ నిమిత్తం కొంతకాలం బైట ప్రదేశానికి వెళ్ళ వచ్చని మొదట ప్రచారం జరిగింది. అయితే మారిన పరిస్దితులు, ఫోన్‌ కాల్స్‌ పై హైకోర్టు కామెంట్స్‌ నేపధ్యంలో ఆయన కొంతకాలం శెలవులపై వెళ్ళవచ్చన్న ప్రచారం జరుగుతోంది. జెడి కాల్‌ లిస్టును వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సాక్షి ఛానల్‌ లో పదేపదే ప్రకటించే వరకు ప్రజలెవరికీ  లక్ష్మీనారాయణ ఐజిగా పదవిని అంతగా దుర్వినియోగం చేస్తున్నారన్న అవగాహన లేదనే చెప్పాలి. ఆసమయంలో మరో మహిళ వాసిరెడ్డి చంద్రబాల జెడి కాల్‌లిస్టులో ఉన్నారు. అదికూడా అంతగా పట్టించుకునే వారు కాదోమోగాని, ఆమె కాల్స్‌నుండి వైసిపి కి  బద్ద శత్రువైన మరో ఛానల్‌ అధిపతికి కాల్స్‌ వెళ్లటంతో సంచలనం అయింది. జెడి, ఆ ఛానల్‌ ఎదురు దాడికి దిగి హెచ్‌ఆర్సీకి చంద్రబాల ద్వారా కంప్లైంటు ఇవ్వడం మరో వివాదం అయింది. గుంటూరునుండి  భూషణ్‌ బి బవన్‌ అనే వ్యాపారి కాల్‌లిస్టును జనవరి 1, 2001 వరకు ఇవ్వవలసినదిగా కోర్టు కెక్కారు. దీనిని స్వీకరించిన ధర్మాసనం సోమవారం జెడి లక్ష్మీనారాయణ అంతసేపు మీడియాతో మాట్లాడవలసిన పనేమిటని చివాట్లు పెట్టింది.  వైసిపి నాయకుడు జగన్‌  ఏకపక్షంగా విచారణ చేపట్టారని, కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని  జెడి మీద మోపిన అభియోగాలకు సాక్ష్యం దొరికినట్లయింది. కొండ శిఖరం చేరుకోవటం కష్టమే కాని శిఖరం మీద స్థానాన్ని సుస్ధిరం చేసుకోవడం మరింత కష్టం. నిజాయితీకి, నిబద్దతకు పెట్టింది పేరన్నట్లుగా జనం హృదయాల్లో నిలచి పోవల్సిన అసాధారణ  ప్రజ్ఞా ప్రావిణ్యాలుగల ఐపియస్‌ ఆఫీసర్‌ ఇంతకు తెగించడం విచారకరం. అరాచక శక్తుల్ని వేటాడతాడనుకుంటే తనే  వేటాడబడటానికి ఆయనే మార్గం పరచుకున్నారు. వైయస్సార్‌ పార్టీ గౌరవ అధినేత విజయమ్మ జాయింట్‌డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ మీద ఇప్పటికే రాష్ట్ర డిజిపి దినేష్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈవ్యవహారాన్ని  ప్రధానమంత్రికి బుధవారం వివరించామని విజయమ్మ చెప్పారు. తగిన సాక్ష్యాధారాలు కూడా అందచేశామని చెప్పారు. జగన్‌ ప్రాణానికి ముప్పువాటిల్లే ప్రమాదం ఉందనికూడా వారు తెలియచేశారు. ఈ కేసునుండి లక్ష్మీనారాయణను తప్పించాలని కోరారు. ఒక సీబిఐ అధికారిమీద ఇంత దారుణమైన ఆరోపణలు రావడం చరిత్రలో ప్రధమం. ఇది ఆయన వృత్తి జీవితానికి తీరని కళంకం.  

రాష్ట్రంలో బిఎస్‌పిలాగా వైఎస్సార్‌సీపీ

ఉత్తర ప్రదేశ్‌లో బిఎస్‌పి పార్టీలాగా రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ తయారవుతుందనడంలో సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో బిఎస్‌పి బ్రాహ్మణులు, దళితులు కలిసి జాతీయ పార్టీలకు ధీటుగా బిఎస్‌పి ఏర్పాటయింది. ప్రస్తుతం వైఎస్‌ ఆదర్శం, బలంతో జగన్‌ పార్టీకి దళితులు, మైనార్టీలు ఆకర్షితులవుతున్నారు. ఈ రెండు వర్గాలూ కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు. దాదాపుగా వైఎస్సార్‌సిపి వీటిని కొల్లగొట్టేసింది. రెడ్లు, దళితులు, వెనుకబడిన వర్గాల వారు రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి దగ్గరవుతున్నారన్న విషయం ఉప ఎన్నికలు తేల్చిపారేశాయి. ఈ వర్గాల్లో బిసి వర్గాలను ఏదో విధంగా టాప్‌ చేయాలని టిడిపి చూస్తున్నది. కోస్తా ఆంధ్రలో ఉన్న కమ్మ, కాపు వర్గాలు కూడా వైఎస్సార్‌సీపీవైపు చూస్తుండడంతో టిడిపి ఏ వర్గాలను ఆదరిస్తుందో వేచి చూడాల్సిందే. నరసాపురం ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్‌ కుమ్మక్కయితే ఆసీటు కాంగ్రెస్‌కు దక్కింది. మరోసారి ఉప ఎన్నికలు జరగక పోతే 2014లో వైఎస్సాఆర్‌సీపీ అధికారం దిశగా పయనించే అవకాశం ఉన్నది. తెలంగాణ వాదంపై ఎటూ తేల్చక కాంగ్రెస్‌, వాదాన్ని నిలుపుకోలేక టిఆర్‌ఎస్‌, దిశా తెన్నూ తెలియక టిడిపి, ఓటు బ్యాంకు దూరమై కాంగ్రెస్‌ అధికారం దక్కేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాల ప్రాతిపదికన ప్రచారం చేస్తున్నప్పటికీ మత ఛాందసవాదంతో ఆ పార్టీ ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదు.  

అవును ! ఈ మధ్య సోనియా వింటున్నారు

అవును ఈ మధ్య సోనియా గాంధీ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల  మాటలు వింటున్నారు. గతంలో స్వయానా ముఖ్యమంత్రి, పి.సి.సి. అధ్యక్షుడు వంటి వారు వెళ్ళినా ఆమె దర్శన భాగ్యం అప్పుడప్పుడు మాత్రమే లభించేది. ఇప్పుడు పరిస్ధితి పూర్తిగా మారింది. రాష్ట్రంనుంచి ఏ కాంగ్రెస్‌ నాయకుడు వెళ్ళినా అతన్ని కలుసుకోవడానికి ఆమె ఆసక్తి చూపుతున్నారు. వారు చెప్పింది శ్రద్దగా  వింటున్నారని  కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఆనందంగా చెబుతున్నారు. ఇటీవల కాలంలో సోనియాతో కెవిపి రామచంద్రరావు చెప్పిన పలు విషయాలు సోనియా ఆసక్తిగా విన్నారట. ఆంధ్రప్రదేశ్‌లో ఒక వైపు తెలంగాణ వాదం, మరోవైపు జగన్‌ ప్రభంజనంతో ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలను సీనియర్‌ నాయకులు ఎవరు చెప్పినా సోనియా సీరియస్‌గా వినడమే కాదు, అవసరమైతే పక్కనే నోటు పుస్తకంలో రాసుకుంటున్నారట. దీంతో తెలంగాణ, జగన్మోహన్‌రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్‌ సీరియస్‌గా వ్యవహరిస్తుందని సీనియర్‌ నాయకులు భావిస్తున్నారు. మరో వైపు రాహుల్‌ గాంధీకూడా రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఆయన కూడా తరచుగా రాష్ట్ర సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. అవసరమైతే నేరుగా వారిని డిల్లీకి ఆహ్వానిస్తున్నారు.  

తెలంగాణ వచ్చే అవకాశమే లేదా

తెలంగాణా కోసం 12 ఏళ్ళ పోరాటాన్కి కాంగ్రెస్‌ మద్దతు లభించలేదని తెలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంఏర్పాటుకు కేంద్రంలోని మిత్ర పక్షాలు మద్దతు తెలుపకపోవడంతో పార్లమెంట్‌లో బిల్లు పెట్టేందుకు కాంగ్రెస్‌ వెనుకడుగు వేస్తున్నది. యుపిఎ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సమాజ్‌వాది పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఎన్‌సిపి వెనుకంజ వేస్తున్న విషయం తెలిసిందే. ఈ పార్టీలు చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తున్నారు. ఈ పార్టీల నుంచి ఆమోదం రాని పక్షంలో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టే ప్రసక్తే లేదు. దీనిని దాటవేసేందుకు కాంగ్రెస్‌ నానావిధాల తంటాలు పడుతోంది. తెలంగాణ కోసం బిల్లు పెడితే కేంద్రప్రభుత్వం కూలడం ఖాయం. ఈ భయంతోనే కాంగ్రెస్‌ బిల్లు పెట్టే ప్రసక్తే లేదని తెలుస్తోంది. ప్రతిపక్ష సవాళ్ళపై, ఆమోదాలపై అధికార పార్టీ బిల్లు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడం జరుగదు. ఈ కారణంగా 2014 వరకూ కాంగ్రెస్‌ కాలం గడిపేస్తుందనడంలో సందేహం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి తరచూ ఈ ఏడాది తెలంగాణ వస్తోంది. వచ్చే ఏడాది ఈ పండుగను తెలంగాణలో జరుపుకుందాం అంటూ ప్రకనటులు వాస్తవ దూరంగానే కనిపిస్తున్నాయి. అంతే కాదు ఇప్పట్లో తెలంగాణ విషయంలో 2009 తరువాత కేంద్రంలో ప్రతిస్పందనే లేదు. ఇకపై ఉప ఎన్నికలకు పోయే ధైర్యం చేసే యోచన గానీ, ధైర్యంగానీ టిఆర్‌ఎస్‌కు లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పరకాల ఉప ఎన్నికతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ధీటుగా టిఆర్‌ఎస్‌ లేదని స్పష్టమవుతున్నది. తెలంగాణ రావడం ఆలస్యమయితే టిఆర్‌ఎస్‌కు ప్రజల మద్దతు లభించడం కష్టమవుతుంది. వాదంపై చీలికలతో తెలంగాణ రావడం దూరమవుతుందని తెలంగాణ పోరాట పార్టీలు స్పష్టం చేసే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్‌డిఎ అధికారంలోకి వస్తే 2014లో చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా నిర్ణయం జరిగే అవకాశం ఉన్నది.  

రాష్ట్రంలో ఉపాది పధకం ఇక 100 రోజులే

రాష్ట్రంలోని గ్రామీణప్రాంత ప్రజలకు  సరైన ఉపాధిఅవకాశాలు లేక పట్టణాలలోకి వలసలు వస్తుండడంతో కేంద్రప్రభుత్వంవారికి ఉపాధి హామి పధకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పధకం ప్రకారం గ్రామీణులకు  ఏడాదిలో వందరోజుల పాటు ఉపాధి హామికల్పించారు. అయితే ఇదివరలో మన రాష్ట్రప్రభుత్వం ఈ పధకాన్ని 200రోజులకు పెంచింది. బిసి లకు 200 రోజులు, యస్‌సి, యస్‌సిలకైతే సంవత్సరం పొడుగునా పనులు పొందవచ్చని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. కాని కేంద్ర గ్రామీణాభివృద్దిశాఖ 100రోజల పని దినాల్ని 200రోజులకు పొడిగించడాన్ని ఆక్షేపించింది. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీయటమే అని వ్యాఖ్యానించింది. ఈనేపధ్యంలో ఉపాధిహామీపధకం సంచాలకులు ఎంపిడివోల సెల్‌ఫోన్లకు మెసేజ్‌ పంపారని తెలిసింది. గతంలో ఎన్‌ఆర్‌ఇజీఎస్‌  సిబ్బందికి 100 రోజుల పనిదినాలు ఉన్నట్లయితే పనిలోకి తీసుకోనక్కర్దేదని ఆదేశాలు ఉన్నాయన్నారు. 100 పనిదినాల మస్తర్‌ ఉంటే కంప్యూటర్‌ ఆ కుటుంబాల్లోని వ్యక్తుల వివరాలను నిరాకరిస్తుందని ఆయన తెలిపారు. జూలై 1 నుండే ఈ విధానం అమలులోకి వచ్చిందని  ఎంపిడివోలు అన్నారు. ఇకపై కొత్తగా ఉపాధిపధకాలకు వెళ్లాలనుకునే వారికి ఎంపిడివో కార్యాలయాలనుండే జాబ్‌కార్డు జారీ చేస్తారు. వివరాలకై స్ధానిక ఎంపిడివోలను కలవాలన్నారు.  

చిరంజీవి చిన్నబుచ్చుకున్నారు.......

ప్రజారాజ్యం పార్టీని  కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అసెంబ్లీలో బలంపెంచినా తనకు సముచిత స్థానం దక్కట్లేదని ఆయన వాపోతున్నారని తెలుస్తుంది. తనను, తనతో పాటు కాంగ్రెస్‌ లో చేరిన క్యాడర్‌ను తక్కువగా చూస్తున్నారని బాధ్యతలు ఏవీ తన క్యాడర్‌కు అప్పగించటం జరగలేనందువల్ల ఆయన మనోవ్యధ చెందుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాహుల్‌గాంధీ తనను పిలవకుండా  మిగిలిన కాంగ్రెస్‌  నాయకులను మాత్రమే పిలిపించుకోవడం ఆయనను మరింత కృంగదీసింది. అలాగే సోనియా గాంధీ తన లాగే నటి అయిన హేమమాలిని, ధర్మేంద్ర కూతురు పెళ్లికి రాలేకపోయానని సారీచెబుతూ  ఇషాడియోల్‌, భరత్‌ని డిన్నర్‌కు ఆహ్వానించి తన కొడుకుకోడలైన చరణ్‌ని, ఉపాసనని పిలవక పోవటం కూడా చిరంజీవిని బాధకు గురిచేసింది. అధిష్టానం తనను గుర్తించలేదనటానికి ఇదే నిదర్శనంగా చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పతనమయ్యే సమయంలో తాను ఎన్నో విమర్శలు ఎదుర్కోని ఆ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశానని అందుకు కాంగ్రెస్‌ తనకు పెద్దగా చేసిందేమీ లేదన్న భావనతో ఆయన ఉన్నట్లు తెలిసింది.

ఆవుపాలతో షుగర్‌కు చెక్‌ చెప్పవచ్చు

మూపురం ఉన్న ఆవుకు ప్రత్యేకమైన దాణా ఇవ్వటంద్వారా మధుమేహానికి చెక్‌ పెట్టవచ్చంటున్నారు తూర్పుగోదావరి జిల్లా మండపేటకు  చెందిన  డాక్టర్‌ ఎం సాయి బుచ్చేశ్వరరావు. ఈయన హైదరాబాదులోని అంతర్జాతీయ ఉష్టమండల వ్యవసాయపరిశోధనా సంస్థలో  ( (ఐసిఆర్‌ఐయస్‌ఎటి ) లో పనిచేస్తున్నారు. తాపేశ్వరంలోని శ్రీభక్తాంజనేయ స్వీటు షాపు, శ్రీభక్తాంజనేయ గోశాల యజమాని వీరికి సహకరిస్తున్నారు. మూపురం కలిగిన ఆవుకు 50 గ్రాముల ప్రాకృతిక మందును, 100 గ్రాముల బెల్లం, 100 గ్రాముల తవుడును తడిపి ముద్దగా చేసి ఒకరోజంతా ప్లాస్టిక్‌ డబ్బాలో పెట్టి  ఆవుకు సాధారణ దాణాతోబాటు రోజుకు ఒక సారి అందించామన్నారు. వారం రోజుల దాణా తర్వాత పాలను తీసి మధుమేహ వ్యాదిగ్రస్తులకు ఇస్తామని బుచ్చేశ్వరరావు తెలిపారు. మొదటివిడత ప్రయోగాన్ని మెదక్‌జల్లా సంగారెడ్డిలోని పవర్‌సిస్టం ఎక్విప్‌మెంట్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ గా పని చేసిన కృష్ణంరాజు తనదగ్గరవున్న గిర్‌ జాతి ఆవులకు ఈ ప్రత్యేక దాణా అందించటం ద్వారా ప్రత్యేక పాలను తయారు చేసానని ఎం సాయి బుచ్చేశ్వరరావు తెలిపారు. వారు ఆపాలను కృష్ణంరాజుకి మరి ఇద్దరు వాలంటీర్లకు అందించారన్నారు.  అయితే ఈ పాలతో పాటు వారు తీసుకోవలసిన మందులను కూడా తీసుకోవాలని వారు తెలిపారు. 20 రోజుల తర్వాత వారి షుగర్‌ లెవల్స్‌ని పరీక్షించి వారు వాడుతున్న మందులను తగ్గిస్తామని బుచ్చేశ్వరరావు చెప్పారు. షుగర్‌ లెవెల్స్‌ నార్మల్‌ లెవల్‌ కి వచ్చిన తర్వాత మందులు వాడాల్సిన పని ఉండదని ఆయన చెప్పారు. రెండవ విడత ప్రయోగానికి శ్రీభక్తాంజనేయ గోశాల యజమాని సలాది శ్రీనివాసరావు వీరికి సహకరింస్తున్నారు. శ్రీభక్తాంజనేయ గోశాలలోని ఒంగోలు జాతి ఆవులను వారు ఈ ప్రయోగానికి ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతే కాక  ఈప్రయోగం కోసం ఎంపిక చేసిన 20 మంది షుగర్‌ వ్యాదిగ్రస్తులకు రోజూ పావులీటరు పాలు, పావులీటరు పెరుగు ఉచితంగా ఇస్తామని సలాది చెప్పారు.

పవన్‌స్టార్‌ భార్య రేణూదేశాయ్‌ ఎక్కడ ?

గతనెల్లో జరిగిన చిరంజీవి కుమారుడు చరణ్‌తేజ, ఉపాసన పెళ్లిలో చాలామంది కళ్లు పవన్‌స్టార్‌తో పాటు ఆతని భార్య ఒకప్పటి హీరోయిన్‌ రేణూదేశాయ్‌, కొడుకు అకిర, కూతురు ఆధ్య కోసం ఎంతగానో వెతికాయి. కాని వారి ఆచూకి కనిపించలేదు. కారణం ఏమిటా అని కూపీ లాగితే చాలా కధ బయటికి వచ్చింది. రామ్‌చరణ్‌ నటించిన ఆరెంజ్‌ కు ప్రొడ్యూసర్‌ చిరంజీవి సోదరుడైన నాగబాబు. ఆ సినిమాకు 38 కోట్లు ఖర్చయింది. సినిమా ప్లాప్‌ వల్ల నాగబాబుకు కేవలం 20 కోట్లు మాత్రమే వచ్చాయి. దాంతో నాగబాబు అన్నయ్య చిరంజీవి దగ్గరకెళ్లి పరిస్థితిని వివరించి ఆదుకోపోతే ఆర్ధికంగా తను చాలా నష్టపోవలసి వస్తుందని మొరపెట్టుకున్నాడు. చిరంజీవి మాత్రం కూల్‌గా నీకు తెలుసుకదా చరణ్‌ అప్‌కమింగ్‌ యాక్టర్‌ అంత పెట్టుబడి ఎందుకు పెట్టావ్‌ అనడంతో నాగబాబు తమ్ముడు పనన్‌కల్యాణ్‌ దగ్గరకు వెళ్లి జరిగిందంతా వివరించాడు. అంతే పవన్‌కల్యాణ్‌ అన్న నాగబాబుకు అభయమిచ్చి డబ్బులు సర్దుబాటు చేయటంతో నాగబాబు గండం నుండి గట్టేక్కారు. కాని రేణూదేశాయ్‌ గొడవపెట్టుకుని ఉన్న డబ్బంతా ఇలా తగలేస్తే  పిల్లల సంగతేంటని, ఇప్పటికే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు స్వంత ఖర్చులతో తిరిగింది చాలదన్నట్లు  ఇంకా ఎంత పాడు చేస్తావని ఆగ్రహంతో ప్రశ్నించినట్లు తెలిసింది. ప్యాన్స్‌ పార్టీటికెట్‌ తీసుకుని ఓడిపోయి చిరంజీవి దగ్గరకు ,అల్లూ అరవింద్‌ దగ్గరకు వెళ్లి ఆదుకోమంటే వాళ్లు మోహంచాటేసారు. అప్పుడుకూడా అన్నకు చెడ్డపేరు తేకూడదని మీరే ఇచ్చారు. రేపు మన సంగతేంటి అని ఆమె  గొడవచేశారు. అసలు నన్ను కాని, నాపిల్లలను కాని ఏరోజూ మీ అన్నలు  పట్టించుకోలేదు. డబ్బంతా మాత్రం వారికే ఖర్చు చేస్తున్నారని వాదించేసరికి రేణూదేశాయ్‌ని కూల్‌చేయటానికి పవన్‌కల్యాణ్‌ హైదరాబాద్‌ ఇంటిని భార్యపేరున రిజిస్టర్‌ చేయించాడు. తర్వాత ఆమెకోరిక ప్రకారం పూనేలో ఒక ఇంటిని కొనిపెట్టారు. ప్రస్తుతం రేణూదేశాయ్‌ పిల్లలతో అక్కడ వుంటున్నారు. పవన్‌కల్యాణ్‌ షూటింగులు లేని సమయంలో అక్కడకు వెళ్లివస్తున్నారు.. చరణ్‌ ఉపాసన నిశ్చితార్ధానికి పవన్‌కల్యాణ్‌ లక్జరీకారు ఆడీని బహుమతిగా ఇవ్వటం తెలిసిందే....ఏది ఏమైనా తమ్ముడు తమ్ముడే.......

రాహుల్‌ పిలుపుతో మళ్లీ తెరపైకి సిఎం మార్పు? పాల్వాయిని పిలిచింది తెలంగాణా కోసమా?

తెలంగాణా రాజ్యసభసభ్యుడు పాల్వాయిగోవర్థనరెడ్డిని బుధవారం సాయంత్రం తనను కలవాలని ఎఐసిసి ప్రధానకార్యదర్శి రాహుల్‌గాంధీ స్వయంగా ఢల్లీ ఆహ్వానించటం రాష్ట్రంలో సంచలనమైంది. ఇప్పటి వరకూ సిఎం మార్పుపై మల్లగుల్లాలు పడుతున్న వారంతా ఇది ఖచ్చితంగా అదే అంటున్నారు. అయితే తెలంగాణాపై ఇప్పటి వరకూ కాంగ్రెస్‌ అధిష్టానం చర్చోపచర్చలు జరిపి రాయలతెలంగాణా అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. అలానైతే జాన్తానై అన్న టిఆర్‌ఎస్‌ వాదనతో కాంగ్రెస్‌కు ఈ విషయంలో ఎలా స్పందించాలో అర్థం కాలేదు. రాష్ట్రపతి ఎన్నికల తరువాత ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌, పార్టీకి విధేయుడుగా ఉన్న గోవర్థనరెడ్డిని పిలిపించారని అధికారిక సమాచారం.   కానీ, ఆ పార్టీలోనే గతంలో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నిక కూడా ఇలానే జరిగిందని గుర్తు చేస్తున్నారు. ఆల్‌రెడీ పీసిసి చీఫ్‌ బొత్సా సత్యన్నారాయణ ఢల్లీలోనే ఉండగా పాల్వాయిని పిలిపించటం రాష్ట్ర పరిణామాల్లో మార్పు కోసమేనని కాంగ్రెస్‌ నేతలు ఖరాకండిగా వాదిస్తున్నారు. దీంతో అసలు గోవర్థనరెడ్డిని ఎందుకు పిలిపించారనే విషయం అర్థం కాకుండానే పోయింది. తెలంగాణా కోసమా లేక సిఎం పదవి కోసమా అన్న విషయమై రాష్ట్రంలో రాజకీయ నాయకులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. బుధవారం సాయంత్రం రాహుల్‌గాంధీని పాల్వాయి కలిసేంత వరకూ విషయం గోప్యంగానే ఉంటుందన్నది మాత్రం ఖాయం. కాంగ్రెస్‌లో ఏదైనా సాధ్యమే అన్న ఫార్ములా అమలు జరిగితే గోవర్థనరెడ్డి కన్నా ముందే ఢల ్లీ పెద్దల ముందు కలతిరిగిన జానారెడ్డి ఇక జీవితంలో సిఎం స్థాయిని అందుకోలేరన్న వాస్తవం మాత్రం తేలుతోంది. ఏదేమైనా రాహుల్‌ పిలుపు ఓ సంచలనానికి కారణమైంది.

పాత సిండికేటే శాసిస్తోందా?

రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎక్సయిజ్‌ పాలసీని అమలు చేసినా పాత సిండికేట్‌ శాసిస్తోందని పరిస్థితులు నిరూపిస్తున్నాయి. కొత్తగా ఎంపికైన వ్యాపారులు పాతవ్యాపారుల నీడలో బతికేస్తున్నారు. ఒకవైపు బెదిరింపులు, మరోవైపు వాటాల ఎరలు చూపి కొత్తవ్యాపారుల పేరిట పాతవారే దుకాణాలు నడుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అయితే మద్యం షాపుల్లో పాత యజమానులే కనిపిస్తున్నారు. ఇదే ఒక విచిత్రమైతే సిండికేట్‌ అదిలాబాద్‌ జిల్లా దుకాణానికి ఒక్కరినే ధరఖాస్తు చేసుకునేలా శాసించింది. గతంలో 207 దుకాణాలకు ధరఖాస్తులు ఆహ్వానిస్తే వాటిలో 44 దుకాణాలకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. తాజాగా ఆ దుకాణాలకూ ధరఖాస్తులు ఆహ్వానించి రెండోతేదీ గడువు విధించారు. ఇందులో 18దుకాణాలకు ఒక్కో ధరఖాస్తు మాత్రమే వచ్చాయి. దీంతో హతాశులైన అధికారులు ఈ ధరఖాస్తులను ఖరారు చేశారు. అంటే నూతనపాలసీ ప్రకారం లాటరీ కూడా వేయకుండా సిండికేట్‌ పరోక్షంగా అడ్డుపడిరదన్న మాట. మిగిలిన 26 దుకాణాలకూ ఎవరూ ధరఖాస్తు చేసుకోలేదన్న విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ అశోక్‌ తెలిపారు. ఇలానే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుల్లో మద్యం దుకాణాలపై పాతవారే పెత్తనం చేస్తూ వాటాదారులుగా ఎక్సయిజ్‌ రికార్డుల్లోకి చేరారని సమాచారం.

ఐరాస నివేదికతో ప్రభుత్వాల్లో చలనం!

ప్రసూతి మరణాలపై ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదిక దేశవ్యాప్తంగానూ, రాష్ట్రవ్యాప్తం గానూ ప్రభుత్వాలను కుదిపేసింది. దేశంలో ప్రతిపది నిమిషాలకు ఒక ప్రసూతి మరణం సంభవిస్తోందని ఆ నివేదిక తేటతెల్లం చేస్తోంది. 2010లో దేశవ్యాప్తంగా 57వేల మంది తల్లులు ప్రాణాలు వదిలారని తేలింది. అంటే గంటకు ఆరుగురు, ప్రతిపదినిమషాలకు ఒకరు మరణించారని నివేదిక స్పష్టం చేసింది. తాజా లెక్కల ప్రకారం ప్రసూతి మరణాల రేటు లక్షమంది మహిళలకు 212 చొప్పున ఉంది. అయితే 2015 నాటికి లక్షమంది మహిళలకు 109కు తగ్గాల్సి ఉందని ఐకాస తన నివేదికలో లక్ష్యంగా నిర్ణయించింది.     కానీ 1990నాటి పరిస్థితులతో పోలిస్తే ఈ మరణాలు 47శాతం తగ్గాయని ఐకాస తన నివేదికలో అంగీకరించింది. ఈ నివేదికలను పరిశీలించిన కేంద్రప్రభుత్వం ప్రసూతి మరణాలు సంభవించకుండా సమీప పిహెచ్‌సిల్లో ఏర్పాట్లపై ప్రచారం చేయాలని సమాచారశాఖను ఆదేశించింది. దీని ఫలితంగా ప్రసవానికి పిహెచ్‌సికి వెళితే ఆర్థికంగా సహకరిస్తారని ప్రచారమూ జరుగుతోంది. ఇక రాష్ట్రప్రభుత్వాల విషయానికి వస్తే ప్రతీ ఆరోగ్య కేంద్రం వద్ద, ప్రత్యేక శిబిరాల్లోనూ తల్లి`బిడ్డ సంక్షేమం కోసం ప్రభుత్వాసుపత్రుల్లోనే కాన్పు జరగాలని ప్రచారం చేస్తోంది. ఈ నివేదిక ఆధారంగా వచ్చిన ఈ స్పందన గ్రామీణ ప్రాంతాల్లోనూ, గిరిజన తండాల్లోనూ కనిపిస్తోంది. ఇంకా ఆరోగ్య సిబ్బంది కొరత ఉన్నా గ్రామీణులు పిహెచ్‌సిలను, కార్పొరేట్‌ ఆసుపత్రుల సేవలనూ వినియోగించుకోవటానికి ముందుకు వస్తున్నారు.

మద్యం విమోచన కేంద్రాల ఏర్పాటుకు హైకోర్టు ఆదేశం!

మద్యం సేవించటం వల్ల కలిగే అనర్థాలను ప్రచారం చేసే మద్యం విమోచన కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని హైకోర్టు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశమిచ్చింది. మద్యపానం, మత్తుపదార్థాలు నిషేధించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఎం.వేణుమాథవ్‌ వేసిన ప్రజాప్రయోజనవాజ్యంపై ధర్మాసనం పైవిధంగా స్పందించింది. జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ఈ ధర్మాసనం మద్యపానం వల్ల కలిగే అనర్థాలపై చర్చించింది. న్యాయవాది ఎం.వేణుమాథవ్‌ తన ఫిర్యాదులో ఐదుజిల్లాల్లో మాత్రమే మద్యం విమోచన కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇటువంటి కేంద్రాలు అవసరమని భావించింది. ప్రత్యేకించి మత్తుపదార్థాల పట్ల అవగాహన లేని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ విమోచన కేంద్రాలు ఉపయోగపడతాయని అభిప్రాయపడిరది. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి విమోచన కేంద్రాలు పని చేస్తే అన్ని జిల్లాల్లోనూ మద్యం వల్ల అనర్థాలపై అవగాహన పెరుగుతుందని భావించి రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.   యువత మత్తు మందుకు ఎంత వరకూ అలవాటు పడ్డారో వాటి వినియోగంపై నివేదిక కూడా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన రేవ్‌పార్టీ సంఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు పైవిధంగా తీర్పు ఇచ్చింది. తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ ఆ సంఘటనకు సంబంధించి ప్రజాహితవ్యాజ్యంగా రూపొందించాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దీనిపై జస్టిస్‌ చంద్రఘోష్‌, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపడుతూ మత్తుపదార్థాల నిరోధానికి చేపట్టాల్సిన చర్యలతో నివేదిక సమర్పించాలని పోలీసుశాఖను ఆదేశించింది. న్యాయవాది వేణుమాథవ్‌ పేర్కొన్నట్లు మద్యం విమోచన కేంద్రాలున్న ఐదు జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా కూడా ఒకటి. జిల్లా కేంద్రమైన కాకినాడలో డాక్టర్‌ కొల్లి సత్యన్నారాయణ ప్రైవేటుగా ఈ మద్యం విమోచన కేంద్రాన్ని నడుపుతున్నారు.   ఈయన ప్రతీరోజూ మత్స్యకారులను, రిక్షా, ఆటో డ్రైవర్లను కలుస్తూ మద్యం వల్ల తనకు జరిగిన హాని వివరిస్తుంటారు. దీనితో పాటు హైదరాబాద్‌ మొదలుకుని అన్ని జిల్లాల్లోనూ పెద్ద సెమినార్‌లు ఎక్కడ ఏర్పాటు చేసిన డాక్టర్‌ కొల్లి తన సొంతఖర్చులతో అక్కడికి వెళ్లి మద్యం వల్ల అనర్థాలను స్లైడ్‌షోల రూపంలో విశదీకరిస్తారు. ఇప్పటి వరకూ వందకు పైగా సెమినార్లు కూడా ఈయన నిర్వహించారు. అలానే విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌ ప్రాంతాల్లో ఈ మద్యం విమోచన కేంద్రాలు నడుస్తున్నాయని సమాచారం.

త్వరలో పి.సి.సి. ప్రక్షాళన ?

ఉప ఎన్నికల్లో చేదు అనుభవాన్ని చవి చూసిన కాంగ్రెస్‌ పార్టీని పటిష్టం చేసేందుకు ఆ పార్టీ పీసిసి చీఫ్‌ బొత్సాసత్యనారాయణ, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో చర్చిస్తున్నారు. ఈ చర్చల కోసం బొత్సా ఢల్లీ చేరుకున్నారు. ప్రత్యేకించి స్థానిక ఎన్నికల్లో క్యాడర్‌ బలహీనపడటం వల్లే కాంగ్రెస్‌ ఓటమి చవిచూసిందని గుర్తించిన పీసిసి ఈ విషయాన్ని ఆజాద్‌తో చర్చించనుంది. పి.సి.సి. ని ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందన్న అభిప్రాయంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పీసిసి కొత్త కార్యవర్గ ఏర్పాటు, డిసీసీ అధ్యక్షుల నియామకం వంటి కీలకాంశాలతో బొత్సా ఢల్లీి చేరుకున్నారు. తాము ప్రతిపాదించిన అంశాల్లో మార్పులు ఏమైనా ఉంటే తెలియజేయాలని ఆజాద్‌ను బొత్సా కోరుతున్నారు. ఆజాద్‌ చెప్పిన మార్పులు చేసిన తరువాత అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి ఓ స్పష్టమైన జాబితాతోనే తిరిగి రావాలని బొత్సా భావిస్తున్నారు.   అంతే కాకుండా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా బొత్సా అడిగి తెలుసుకోనున్నారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఈ నియామకాల్లో చేయాల్సిన మార్పుల గురించి సూచించినట్లు సమాచారం. సిఎం చెప్పిన మార్పులు చేశాక బయలుదేరిన బొత్సా తుది జాబితాతో తిరిగి వస్తారని పీసిసి శ్రేణులు భావిస్తున్నాయి. సోనియాకు ఆజాద్‌ కమిటీల విషయం వివరించి జాబితాను సమగ్రంగా ఉండేలా చూస్తారు. వీరితో వాయలార్‌ రవి కూడా ఏదో ఒక సమయంలో భేటీ అయ్యే అవకాశముంది.

సినీఫక్కీలో చర్లపల్లి ఖైదీ పరారీ?

ఖైదీ సినిమాలో హీరో కదులుతున్న వాహనంలో నుంచి దూకి పరారయ్యాడు. ఇలా పారిపోయిన ఖైదీ తిరిగి విలన్‌ల ముందు ప్రత్యక్షమవుతాడు. అలానే ఇదే సినీఫక్కీలో చర్లపల్లి ఖైదీ పరారయ్యాడు. అతనూ వాహనంలో నుంచి దూకి రైల్వేగేటు వద్ద కనిపించకుండా పోయాడు. పోలీసులు వెతికివేసారి చివరికి విషయాన్ని ఉన్నతాథికార్లకు సినిమాలోలానే వివరించారు. పరారైన ఖైదీ ‘ఖైదీ’ సినిమా చూసే ఉంటాడని చర్లపల్లి రైల్వేగేటు సమీప వాసులు అంటున్నారు. లేకపోతే అంతలా పారిపోవటానికి స్ఫూర్తి ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. నిర్మల్‌కోర్టులో హాజరుపరిచి ఆ తరువాత ఖైదీని తిరిగి చర్లపల్లి తీసుకువెడుతుండగా ఈ సంఘటన జరిగింది. వెంకటేశ్వరరావు అనే ఈ ఖైదీ కదులుతున్న వాహనంలో నుంచి దూకి పరారయ్యాడు. పోలీసు వాహనంలో ఈయన్ని చర్లపల్లి జైలుకు తరలిస్తుండగా ఈ సంఘటన జరిగింది. దీంతో పోలీసులు ఖైదీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేకించి వెంకటేశ్వరరావు ఇంటి వద్ద, అతని స్నేహితుల ఇళ్ల వద్ద, ఇతర ప్రాంతాల్లోనూ మఫ్టీలో కాపలా పెట్టారని సమాచారం. మరో విషయం ఏమిటంటే ఈ ఏడాది తప్పించుకున్న రిమాండ్‌ ఖైదల్లో వెంకటేశ్వరరావు ఏడో వ్యక్తి.

రామ్‌చరణ్‌ తేజ పోలో క్లబ్‌ లోగో విడుదల

ఇష్టపడిన యువతినే పెళ్లాడిన రామ్‌చరణ్‌తేజ వివాహానంతరం హనీమూన్‌ని పూర్తి చేసుకొని తిరిగివచ్చి షూటింగ్‌ కార్యక్రమాలో బిజీగా ఉన్నప్పటికీ, కొత్తదంపతులు కొత్త బిజినెస్‌ను ప్లాన్‌ చేసుకొని ఎప్పుడు లాంచ్‌ చేద్దామా అని చూస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే త్వరలో ప్రారంభించనున్న పోలో క్లబ్‌కు సంబందించిన లోగోను మంగళవారం( జూలై 3 )సాయంత్రం తాజ్‌బంజారాలో విడుదల చేయనున్నారు. చాలామంది యువ హీరోలు ఐపియల్‌ క్రికెట్‌ స్పాన్సర్‌ చేసి లాభాల పంట పండించుకుంటున్న నేపధ్యంలో రామ్‌చరణ్‌ తేజ ఈ క్రీడను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఇంతకుముందే గుర్రపుస్వారీ చేయటంలో తనదైన ప్రతిభను మగధీర చిత్రం ద్వారా ప్రదర్శించడం తెలిసిందే. వీరు త్వరలోనే చేవేళ్లరోడ్‌ లోని అజీజ్‌ నగర్‌లో ఆర్‌ సి పోలో క్లబ్‌ ప్రారంభిస్తారు. అంతే కాక త్వరలో ఒకఫిట్‌నెస్‌ సెంటర్‌, జిమ్నాస్టిక్‌ సంటర్‌ని జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎవడు సినిమాషూటింగ్‌లో రామ్‌చరణ్‌ బిజీగా ఉన్నారు. జంజీర్‌ సినిమాద్వారా బాలీవుడ్‌లో ప్రవేశించనున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టు కోవడం అంటే ఇదే మరి..

హ్యాపీ క్లబ్‌లో పట్టుబడిన పేకాటరాయుళ్లంతా హ్యాపీయేనా!

గుంటూరు జిల్లా మంగళగిరికి ఆనుకుని వుండే హైవే 5 లో ఉన్న హ్యాపి క్లబ్‌పై పోలీసులు దాడి చేసి అనేక మంది ప్రముఖులతో సహా 450 మంది పేకాట రాయళ్ళను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఈ దాడిలో పోలీసులు 40 లక్షల నగదు కూడా స్వాధీన పర్చుకున్నారు. అయితే పోలీసులు ఎంత స్పీడ్‌గా ఈ దాడులు జరిపారో అంతే హడావిడిగా కేసును నీరుగార్చడం పలు అనుమానాలకు తావిస్తోంది.     దీనికి తోడు పోలీసులు స్వాధీన పర్చుకున్న సొమ్ము ఏమయ్యిందో తెలియడం లేదు. ఈ దాడిలో దొరికిన వారంతా ప్రముఖ రాజకీయ నాయకుల బందువులు, స్నేహితులు, విజయవాడ, గుంటూరుకు చెందిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. కొందరు సినీపరిశ్రమకు సంబందించిన పేకాట రాయుళ్ళు కూడా ఈ బృందంలో ఉన్నారని సమాచారం. వీరిని సమీపంలోని మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు ప్రవేటు వాహనాల్లో చేరవేయటానికే 2 గంటల సమయం పట్టింది. పలుకుబడిరాయుళ్ళంతా వచ్చే ఈ క్లబ్‌ మీద దాడిచేయటానికి గతంలో ఎంతోమంది పోలీసాఫీసర్లు ప్రయత్నించి విఫలం అయ్యారు.   దాంతో గుంటూరు అర్బన్‌ ఎస్‌పి పకడ్బందీగా పధకం అమలు జరపాల్సివచ్చింది. కాని వారిలో ఎవరినీ ఎందుకు అరెస్టు చేయలేదని కూపీలాగితే ఆసక్తి కరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్‌లు చూపించి తమను కోర్టులో హాజరు పరిస్తే తమ పరువు పోతుందని అదే జరిగితే పోలీసుల పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటామని కొందరు ప్రముఖులు బెదిరించినట్లు తెలిసింది. ఇదే సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన ఒక రాష్ట్రమంత్రి , పార్లమెంట్‌ సభ్యుడు రంగంలోకి దిగి జిల్లా ఎస్‌.పి.పై వత్తిడి తెచ్చి ఎటువంటి కేసులు లేకుండా చేసినట్లు తెలిసింది. పోలీసులు స్వాధీనపర్చుకున్న డబ్బు ఆచూకి మాత్రం తెలియడం లేదు .