సీబీఐ జేడీ లక్ష్మినారాయణపై హైకోర్టు ఆగ్రహం
posted on Jul 2, 2012 @ 5:45PM
వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ జాయింట్ డైరెక్టర్ (జేడీ) లక్ష్మినారాయణపై సోమవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాతో అన్నిసార్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని, దర్యాఫ్తు సంస్థతో మీడియాకు ఏం సంబంధమని హైకోర్టు ప్రశ్నించింది. మీడియాతో మాట్లాడటంపై ఈ నెల 9వ తేది లోగా వివరణ ఇవ్వాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ అంశంపై సిబిఐ ఖచ్చితమైన వివరణ ఇవ్వాలని సూచించింది.మీడియాతో జెడి ఫోన్‌లపై భవనం భూషణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ స్వీకరించిన కోర్టు సిబిఐ జెడికి నోటీసులు జారీ చేసింది. కాగా మీడియాతో మాట్లాడలేదని కోర్టును తప్పుదోవ పట్టించిన సిబిఐ జెడి లక్ష్మీ నారాయణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందిన భూషణ్ బి.భవనం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. సిబిఐ జెడి ఫోన్ నుంచి వెళ్లిన, ఆయన ఫోన్‌కు వచ్చిన కాల్స్, ఎస్సెమ్మెస్‌ల వివరాలను సమర్పించేలా బిఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్‌ను ఆదేశించాలంటూ ఆయన హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.