జగన్‌పై మరో కేసు దాఖలు
posted on Jul 3, 2012 @ 5:23PM
అక్రమాస్తుల కేసులో అరస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిపై మంగళవారం మరో కేసు దాఖలైంది. మొదటి చార్జీషీటుకు అనుబంధ చార్జీషీటును సీబీఐ అధికారులు నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. ఒక్కో ఛార్జీ షీటు ఒక్కొక్క కంపెనీపై దాఖలు చేస్తోంది. తాజా అనుబంధ చార్జీషీటు హెటిరో డ్రగ్స్ వ్యవహారంపై ఇచ్చింది. దివంగత వైఎస్ హయాంలో లబ్దిపొందిన హెటిరో లంచం రూపంలో రూ. 35 కోట్లు పెట్టుబడులు పెట్టారని సీబీఐ చార్జీషీటులో పేర్కొంది. పిసి యాక్ట్ సెక్షన్ 9, 10, 11 క్రింద సీబీఐ అధికారులు ఈ కేసును నమోదు చేశారు. జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వాధికారులను ప్రభావితం చేశారని సిబిఐ తాజా ఛార్జీషీటులో పేర్కొంది. జగన్ కంపనీలలోకి లంచాల రూపంలో పెట్టుబడులు వచ్చాయని ఆరోపించారు. హెటెరో తదితర కంపెనీలు జగన్ కంపెనీలలో రూ.146 కోట్లు పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. ఇవన్నీ లంచాల రూపంలోనే వచ్చాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు తాము దాఖలు చేసిన ఛార్జీషీట్లలోని రూ.35 కోట్లు లంచం రూపంలోనే జగన్ కంపెనీలలోకి వచ్చాయన్నారు. ఈ సందర్భంగా సిబిఐ కోర్టుకు ఆధారాలను సమర్పించింది. ఇద్దరు సాక్ష్యులను తమ ఛార్జీషీటులో ప్రస్తావించింది. కాగా జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ ఇప్పటికే మూడు ఛార్జీషీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తొలుత మొదటి ఛార్జీషీట్ దాఖలు చేసిన సిబిఐ ఆ తర్వాత మూడింటిని అనుబంధ ఛార్జీషీట్లుగా కోర్టుకు సమర్పించింది.