మోడల్‌స్కూళ్ల నిర్మాణానికి ఇసుక గండం?
posted on Jul 2, 2012 @ 4:54PM
మోడల్‌స్కూళ్ల నిర్మాణానికి ఇసుక గండం? ఆరువేల మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం!
హైకోర్టు విధించిన నిషేధం వల్ల ఇసుక దొరక్క రంగారెడ్డి జిల్లాలో 19 మోడల్‌స్కూల్స్ నిర్మాణం ఆగిపోయింది. ఏలాగైనా ఈ విద్యాసంవత్సరంలో ఈ స్కూల్స్‌ను ప్రారంభించేయాలని నిర్ణయం తీసుకుని విద్యాశాఖ ఆరువేల మంది విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు స్వీకరించింది. ఆ ధరఖాస్తులు తీసుకున్నాక స్కూల్స్ నిర్మాణం పూర్తికాకపోవటంతో ప్రైవేటుభవనాల కోసం తిరిగి అవీ కుదరక విద్యాశాఖ మౌనం వహించింది. అయితే ఈ విద్యార్థులను ఏ స్కూల్‌లోనూ చేర్చకుండా తల్లిదండ్రులు కూడా విద్యాశాఖ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకమైంది. స్కూల్స్ ప్రారంభమై పాఠాలు కూడా చెప్పేస్తుంటే ఈ ఆరువేల మంది విద్యార్థుల గురించి విద్యాశాఖ ప్రత్యామ్నాయం వెదకాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఈ 19పాఠశాలలు విషయంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మాత్రమే జరిగాయి. ఒక్కొక్క స్కూలుకు రూ.3.02కోట్లు కేటాయించారు. 75శాతం కేంద్రం, 25శాతం రాష్ట్రం వాటాలతో స్కూలు భవనాలు నిర్మించాల్సి ఉంటే రాష్ట్రప్రభుత్వం రూపాయి కూడా మ్యాచింగ్ గ్రాంటూ మంజూరు చేయలేదు. మొత్తం 25 మోడల్ స్కూల్స్‌ను జిల్లాకు మంజూరు చేశారు. వీటిలో 19 ముందుగా ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే ఇంకా కొన్ని స్కూళ్లకు భూసేకరణ కూడా జరగలేదు. లీజుకు భవనాలు దొరక్కపోవటం, ఇసుక అందుబాటులో లేకపోవటం విద్యాశాఖను ఇబ్బందుల పాలు చేస్తోంది. అటు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏమి చెప్పాలో అర్థం కాని స్థితిలో ఆ శాఖాధికారులు మౌనం వహించారు. దీంతో తల్లిదండ్రుల ఆందోళన నానాటికీ పెరుగుతోంది. జిల్లా అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లారు. దీనిపై పైస్థాయిలో మాట్లాడి చర్యలు తీసుకుందామని వారు ఇచ్చిన సలహాతో విద్యాశాఖ ఎదురుచూపులు చూస్తోంది. ఈ స్కూళ్ల నిర్మాణం కోసమైనా ఇసుకపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని, విద్యార్థుల సమస్యను అధికారయంత్రాంగం త్వరగా తేల్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.