రాష్ట్రంలో వైద్యులు మందుల కొరతతో ప్రజల అగచాట్లు

రాష్ట్రంలో ఎండలు తగ్గి వర్షాలు పడటంతో వాతావరణంలో జరిగే  మార్పులు  ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అందులో భాగంగానే మన్యంలోని తండావాసులు రోగాల బారిన పడ్డారు. దేశంలో ఎక్కడాలేనన్ని మెడికల్‌ కాలేజీలు మన రాష్ట్రంలో ఉన్నాయి. సగటున సంవత్సరానికి 5600 మంది వైద్యవిద్యార్దులు ప్రవేశం పొందుతున్నారు. అయినా ఏ ఒక్క వైద్యుడూ గ్రామీణ ప్రాంతల్లో సేవలందించటానికి  సిద్దపడక పోవటంతో ఏజెన్సీ, గ్రామీణ ప్రజలకు వైద్యం అందని ద్రాక్షాగానే ఉంది.     రాష్ట్రంలోవైద్య సేవకు గాను 1000 కోట్లు అవసరం ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 300 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకుంది. అన్ని జిల్లాకేంద్రాలలోనూ, ప్రాథమిక కేంద్రాలలోనూ వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. వైద్యులు ఉన్న ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో లేక ప్రజలు అగచాట్లు పడుతున్నారు. మన్నెం పడకేసింది అనే శీర్షికతో ప్రతి సంవత్సరం వార్తాపత్రికలు, ఛానల్స్‌ ఏజన్సీలో విషజ్వరాల బారిన పడి మరణిస్తున్న విషయం ఎంత రాద్దాంతం చేసినా ప్రభుత్వం మొద్దునిద్దరలోనే ఉంది. ఎంతకీ శాశ్వత పరిష్కారానికి మొగ్గు చూపడంలేదు.   ఈ సంవత్సరం 200 కోట్ల రూపాయల మందులు అవసరం ఉండగా కేవలం 44 కోట్ల రూపాయలను ప్రభుత్వం కెటాయించింది. వర్షాలకు నీళ్లు నిలవ ఉన్న ప్రదేశాల్లో దోమలు పెరిగి, మలేరియా, ఫైలేరీయా లాంటి వ్యాధుల బారిని పడుతున్నారు. నాళాలు లీకులవటం మూలంగా కలరా, టైఫాడ్‌ విజృంభిస్తున్నాయి. దానికి గాను డిటిడి,  క్లోరిన్‌ సరఫరా వెంటనే జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. పంచాయితీ  మున్సిఫల్‌ పరిధిలోని వాటర్‌ ట్యాంకుల్లో  క్లోరినేషన్‌ జరిపించి ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తన చిత్త శుద్ది కనబరచవలసిన అవసరం ఎంతైనా ఉంది.

పబ్లిసిటీతో కొడాలి నానిని హీరో చేస్తున్న దేశం

ఒకానొకప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే హైటెక్‌ తెలివితేటలున్న పార్టీ అని అందరూ ప్రశంసించేవారు. కాలం మారింది. గేరు రివర్సయి ఇదే తెలుగుదేశం పార్టీ నేతలను కూడా తయారు చేస్తోందంటున్నారు. ఒక్క ఎన్టీఆర్‌పై వీరాభిమానం ఒలకబోసిన కొడాలి నానిని ఆ పార్టీ నేతను చేసేస్తోంది. తాను రాజీనామా చేస్తానని చెప్పకుండానే తెలుగుదేశం పార్టీ సస్పెండ్‌ చేసిందంటే నేను ఆ పార్టీలో లేనట్లే కదా అనటంలోనే నాని తనకు ఆ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో అర్థం అవుతోంది. పైపెచ్చు పెద్ద నేతకు ఇచ్చే కోట్లాది రూపాయలు తెలుగుదేశం బలంతో నెగ్గిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఇస్తున్నారని టిడిపి ప్రచారం చేస్తోంది. ఫలితంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి తెలుగుదేశమే ఒక కొత్తనేతను అప్పగించినట్లుంది. 30కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొడాలి నానిని కొనాల్సిన అవసరం వై.కా.పా.కు ఉందా? ఎమ్మెల్యే దేవినేని ఉమ ఒక్కసారి ఆలోచించాలి? ఒకే కొన్నారనే అనుకుందాం కానీ, ఆ డబ్బు తీసుకున్న వాడి కాలు నిలువదు కాబట్టి ముందుసారి చంద్రబాబు దగ్గరికి నాని రావాల్సిన అవసరమేమిటీ? ఒక్కసారి ఆలోచించాలి.     ఉమ ఆరోపించేంత వరకూ తనకు అంత రేటు ఉందని తెలియని నాని ఇప్పుడు దానికన్నా ఎక్కువ అడగాలన్న ఆలోచన కూడా తెలుగుదేశం కల్పించినట్లుంది పరిస్థితి. ఎందుకంటే కొడాలి నానికి వై.కా.పా.కు వెళితే నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఎవరో జాతకం చెప్పారని ఎందుకు అనుకోవటం లేదు. క్రమశిక్షణ ఉన్న పార్టీగా నిరూపించుకునేందుకు వై.కా.పా.గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిసిన వెంటనే దేశం సస్పెన్షన్‌ను ప్రకటించింది కదా! అంతటితో ఆగొచ్చు కదా దిష్టిబొమ్మలు తగలేసి నాని మా తెలుగుదేశం పార్టీని వదిలేశాడని ఆ పార్టీయే డప్పుకొట్టుకుని చెప్పాల్సిన అవసరమేమిటీ? ఒక్క ఎమ్మెల్యే వెళితే మైలవరం,నూజివీడు, నందిగామ, కంచికచర్ల, గుడివాడల్లో నిరసన కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేయటం అవసరమా? లేక కార్యకర్తలను నాని వెనుక వెళ్లకుండా పార్టీ తరుపున ఇంకో నేతను తయారు చేసుకోవటం అవసరమా? ఏమైనా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన తెలుగుదేశం పార్టీయే నానిని రాష్ట్రవ్యాప్తంగా నేతగా వై.కా.పా.కు అప్పగిస్తోందని రాజకీయపరిశీలకులు, అనుభవస్తులు తేలుస్తున్నారు. ఇదే నిజం కూడాను. ఇకనైనా తమపార్టీకి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన తెలుగుదేశం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని సూచనలు వస్తున్నాయి.

ఇకపై ఆన్‌లైన్‌లో పాల బుక్కింగ్‌

ఆన్‌లైన్‌లో పాలు బుకింగ్‌ చేసుకునే సదుపాయం రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లో ప్రారంభమైంది. త్వరలో ఈ సదుపాయం రాష్ట్రంలోని అన్ని నగరాలకు విస్తరిస్తుంది. ముందస్తుగా హైదరాబాద్‌నగరంలో పెరిగిన పాల అవసరాలను తీర్చేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. ఎక్కువ మొత్తంలో పాలు రోజూ కొనుగోలు చేసేవారికి ఈ ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. వెబ్‌సైట్‌లో తమ వివరాలు తెలిపి బ్యాంకు అకౌంట్‌ నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిబ్బంది పాలు సరఫరా చేస్తారు. తొలిప్రయోగంలో ఎక్కువగా పాలు వినియోగించే హోటల్స్‌, ఇస్‌క్రీమ్‌లు తయారీదారులకు ఈ ఆన్‌లైన్‌ పాల సదుపాయం ఉపయోగపడుతోందని పశుసంవర్థకశాఖామంత్రి పినిపే విశ్వరూప్‌ తెలిపారు. దీని కోసం ప్రత్యేకించి ఒక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌ వాసులు ఈ`సేవ, మీ`సేవ కౌంటర్ల ద్వారా డబ్బులు చెల్లిస్తే ఇంటికే పాలను సరఫరా చేస్తారని చెప్పారు. అలానే బ్యాంకుల ద్వారా డబ్బులు చెల్లించినా పాల సరఫరా జరుగుతుందన్నారు. అయితే పాలు పెద్దమొత్తంలో అవసరమైన వారికి తొలుత సరఫరా చేస్తున్నామని చెప్పారు. త్వరలో తక్కువ పాల అవసరమైన వారికీ సరఫరా చేస్తామని వివరించారు. పాలు సరఫరా చేసేవారికి రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండా వారు ఇంటి వద్దకే వచ్చి పాలు అందజేస్తారన్నారు.  

రాష్ట్ర విద్యుత్‌ కోతలకు గుజరాత్‌ గ్యాస్‌కంపెనీలే కారణమా?

ప్రభుత్వాలన్నీ చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటాయేమో అని అనుకోవాలి. అసలు కాకినాడలో గ్యాస్‌ప్లాంటు కట్టి గుజరాత్‌కు గ్యాస్‌ సరఫరా చేస్తున్న జిఎస్‌పిసి(గుజరాత్‌స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషను), రిలయన్స్‌ల గురించి గతంలో ఎన్నో ఆందోళనలు జరిగాయి. పీఆర్పీ కూడా గతంలో ప్రధానంగా ఈ విషయమై ఆందోళన చేసింది. ఆంథ్రప్రదేశ్‌లో వెలికితీసిన గ్యాస్‌ను గుజరాత్‌కు 62శాతం తరలిస్తుంటే ముందు ఎందుకు మౌనం వహించారు? అన్న మిలియన్‌డాలర్ల ప్రశ్నకు రాష్ట్రపాలకులు మౌనమే సమాధానం అవుతోంది. అసలు ఈ ఉత్పత్తికి వెనుక జరిగిన వాస్తవాలు ఆంథ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంధత్వపాలనకు నిదర్శనమని విమర్శలు చెలరేగుతున్నాయి.     మొదట తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జిఎస్‌పిసి నిర్మాణం ఒప్పందం జరిగింది. దీని కార్యకలాపాలు అప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. దీనికి జతగా రిలయన్స్‌ కూడా తోడైంది. ఈ సంస్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైంది. సాక్షాత్తూ రిలయన్స్‌ అధినేత ముఖేష్‌అంబానీ కాకినాడ వస్తే  సిఎం  వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కేంద్ర పెట్రోలియం బృందం కూడా ఇక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడారే కానీ, ఆంథ్రాకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడలేదు. ఈ విషయాన్ని గుర్తించిన పీఆర్పీ నేతలు ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గ్యాస్‌ప్లాంటు ఇక్కడ పెట్టి కేవలం 38శాతం వాటాగా ఇస్తామనటం అన్యాయమని అప్పట్లోనే నిరసనకారులు స్పష్టం చేశారు. ఆ సంస్థలు 70 నుంచి 80శాతం గ్యాస్‌ రాష్ట్రంలోనే సరఫరా చేస్తే  విద్యుత్తు కొరతే ఉండేది కాదని తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అంగీకరించారు. అప్పట్లోనే నిరసనకార్యక్రమాలకు స్పందనగానైనా ఆ కంపెనీలను రాష్ట్రప్రభుత్వం పిలిపించి మాట్లాడి ఉంటే ఇప్పుడు సమస్యే వచ్చేది కాదనేది అందరూ అంగీకరించాల్సిన విషయం. ఒకసారి ఆంథ్రలో గ్యాస్‌ సరఫరా పెంచమంటే సరిపోయేది. ఒక్కసారి కూడా ఆ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడకపోవటం వల్ల ఈ సమస్యను కేంద్రమే పరిష్కరించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంథ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని అలుసుగా తీసుకునే ఇటువంటి కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.   రాష్ట్రంలో విద్యుత్తు కోతకు అసలు కారణం గ్యాస్‌ ఉత్పత్తి చాలకపోవటమే. కాకినాడ నుంచి తరలిపోతున్న గ్యాస్‌లో 70శాతం కొన్నాళ్లపాటు విద్యుత్తు సరఫరాకు కేటాయిస్తే కొత్తప్లాంటులు ఏర్పాటు చేసుకునేంత వరకూ కోత విధించాల్సిన అవసరమే ఉండదు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 9,500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అయితే గ్యాస్‌ద్వారా మాత్రం 2700మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. గ్యాస్‌కొరత ఇంకో 1500మెగావాట్ల విద్యుత్తును దెబ్బతీస్తోంది. కేంద్రమంత్రి శరద్‌పవార్‌ను  సహకరించాలని సిఎం కోరారు. దీనికి స్పందించిన మంత్రి పవార్‌ మాట్లాడుతూ పెట్రోలియం కంపెనీల వ్యవహారాలు పర్యవేక్షించే కమిటీలో తాను, ప్రణబ్‌ముఖర్జీ మాత్రమే సభ్యులమన్నారు. రాష్ట్రపతి రేసులో ఉన్న ప్రణబ్‌ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయటంతో తాను ఒక్కడినే ఆ కమిటీలో మిగిలానని, తాను ఆంథ్రప్రదేశ్‌ కోసం వీలైనంత వరకూ ఈ సమస్యను పరిష్కరించేందుకు పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.  

ప్రవేటు బస్సులను స్వాధీనపర్చుకోబోతున్న ఆర్టీసీ ?

ఒకచోటనుండి మరోచోటికి ప్రయాణీకులను తీసుకు వెళ్లవలసిన ప్రైవేటు బస్సులు ఆర్టీ బస్సులు లాగా స్టేజి క్యారియర్లుగా నడిపిస్తూ ఆర్టీసికి గండకొడుతున్నారని భావించిన ఆర్టీసి ముఖ్యకార్యదర్శి లక్ష్మీ పార్ధసారధి ప్రైవేటు బస్సులన్నిటిని ఆర్టీసీ ఆధీనంలోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ఆర్టీసీ యాజమాన్యం సిద్దమైతే పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు రూపొందిస్తామని ఆమె తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1215 ఆధునిక బస్సులు, 1300 టూరిస్టు బస్సులు ఉన్నాయన్నారు. అయితే ఆర్టీసీ ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రైవేటు బస్సులకు కిలోమీటరు చొప్పున చెల్లించడమా లేదా ఏదైనా ప్రత్యేక ప్యాకేజి ప్రకటించడమా అనే విషయం పై ఆర్టీసి కసరత్తు చేస్తుంది. దీనివల్ల ఆర్టీసీ లాభాల బాట పట్టగలదని  అధికారులు భావిస్తున్నారు. ఈ మద్య రవాణాశాఖ నిర్వహించిన దాడుల కారణంగా ఆర్టీసీ ఆదాయం  రోజుకు కోటినుండి కోటిన్నర వరకు పెరగటంతో ఆర్టీసి ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రైవేటు బస్సులు లాభదాయకమైన హైదరాబాద్‌, బెంగుళూరు, షిర్టీ, ముంబాయి,పూణే, షోలాపూర్‌ లాంటి లాభదాయక రూట్లలో నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలో 3798 అద్దె బస్సులు ఉన్నాయి. అందులో చాలావరకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లే ఉన్నాయి. అదె అద్దె బస్సుల్లో  మెర్సిడెస్‌ కంపెనీ బస్సులుకూడా  ఉన్నాయి ఈ బస్సులను ఆర్టీసి పరం చేస్తే కొత్తబస్సుల కొనుగోలు భారం ఉండదని  ఆర్టీసీ భావిస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీలో వెన్నెల ఎసి స్లీపర్లు 15, గరుడ ప్లస ఎసి 40, ఏసిగరుడ 102, ఇంద్ర ఎసి 101 ,ఏసి మేఘదూత్‌ 6 ఉన్నాయి. ఇందులో వెన్నెల ప్లస్‌, గరుడ ప్లస్‌లు మాత్రమే కొత్తవి కాగా మిగిలినవన్నీ పాతవయ్యాయి. కాబట్టి ఇప్పుడు ప్రవేటు బస్సుల అప్పగింత ఆర్టీసిన లాభాలబాట పండిరచేదిగా ఉంటుందని ఆర్టీసి యాజమాన్యం భావిస్తుంది . అయితే ఈ విషయమై ప్రవేటు బస్సు యాజమాన్యం భిన్నాభిప్రాయం వ్యక్తంచేస్తుంది. ఇవన్నీ అభూతకల్పనగానే ప్రైవేటు బస్సు ఆపరేటర్ల సంఘం ప్రధాన కార్యదర్శి బోస్‌ చెబుతున్నారు. ఈ విషయమై ఆర్టీసి యాజమాన్యం తమను సంప్రదించలేదని తెలిపారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ప్రైవేటు వాహనాలను ఆర్టీసీ పరం చేసికొని నిర్వహణ చేతకాక చేతులు కాల్చుకుందని, అయినా ప్రభుత్వం అప్పగించ మంటే అప్పగిస్తామా అని అన్నారు.

కొడాలి నానిపై చంద్రబాబు ఫైర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీకి ద్రోహం చేసిన కొడాలి నానిపై కార్యకర్తలు తిరగబడాలని కూడా చంద్రబాబు పిలుపు ఇచ్చారు. జూనియర్ ఎన్.టి.ఆర్ వెంటే ఉంటానని చెప్పిన నాని పార్టీకి దూరం అయి వెన్నుపోటు పొడిచారని ఆయన విమర్శిస్తున్నారు. చంద్రబాబు పార్టీ కాడర్ లో విశ్వాసం నింపడానికి ప్రయత్నం చేసినట్లు కనబడుతోంది. మరొకరు పార్టీని వీడితో కార్యకర్తలు సహించబోరన్న భయం ఉండాలని ఆయన అభిప్రాయపడుతున్నట్లుగా కనిపిస్తుంది. కొడాలి నాని పార్టీని వీడిన నేపథ్యంలో కొణకళ్ల గుడివాడ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం వద్దకు పలువురు నాని వర్గీయులు వచ్చారు. నానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టిడిపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అర్జునుడు మాట్లాడుతుండగా నాని వర్గానికి చెందిన ఓ కార్యకర్త అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొణకళ్ల వర్గీయులు అతనిని బయటకు గెంటివేశారు.

అన్నన్న ఎంత పనిచేశావు కొడాలి నాని

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఓ నాటకానికి తెరలేపారు. తెలుగుదేశం పార్టీ తరుపున గుడివాడ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాని ఇటీవల మూడు నెలల పాటు హైడ్రామా నడిపారు. ఉప ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అథినేత చంద్రబాబునాయుడును ప్రచారంలో ఉండగా కలిసిన నాని తాను తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్లనని హామీ ఇచ్చారు.     అయితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాథ్యక్షురాలు విజయమ్మను నాని కలిశారు. ఈ విషయం వార్తల్లో గమనించిన తెలుగుదేశం పార్టీ ఆయన్ని సస్పెండ్‌ చేసింది. ఈ సస్పెన్షన్‌ గురించి తెలియని నాని జగన్‌ను చంచల్‌గూడా జైలులో కలిశారు. అప్పుడే అక్కడ మీడియా ప్రతినిథులు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ సస్పెండ్‌ చేశారు కాబట్టి వైఎస్‌ కాంగ్రెస్‌లోకి చేరినట్లేనా అని ప్రశ్నించింది. దీనికి ఆశ్చర్యపోయిన నాని తాను వ్యక్తిగతంగా కలిశానని, అసలు నన్ను పార్టీ సస్పెండ్‌ చేసిందా? అని, అంటే నేను దేశం బయట ఉన్నట్లేనా? అని ప్రశ్నించటం పత్రికల ప్రతినిధులను విస్తూపోయేలా చేసింది. ఏమీ తెలియకుండానే వై.కా.పా. నేతలను నాని కలిశారా? అని అందరూ అనుకునేలా ఈ సంఘటన జరిగింది.     ఈలోపు తెలుగుదేశం ఎమ్మెల్యే దేవినేని ఉమా ఓ సంచలన ప్రకటన చేశారు. నాని 30కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారని ఉమా ఆరోపించారు. పరిటాల రవి హంతకుల చెంత చేరిన నానిని ప్రజలు క్షమించరని ఆయన విమర్శించారు. ఈ మొత్తం ఘటనలన్నీ ఒకదాని వెంట ఒకటి పరిశీలిస్తే నాని ఎప్పటి నుంచో వై.కా.పా.లో చేరతానంటున్నారు. ఇప్పుడు చేరిపోయినట్లే. మరి ఇంత నాటకం ఎందుకు? అన్న అంశమే తేలాలి. ఇంకా నాని తెలుగుదేశం పార్టీలో ఉండటానికి ఇష్టపడితే సీను రివర్సు అవుతుంది. అప్పుడు నాటకం మళ్లీ మొదటికొస్తుంది. ఏదేమైనా మూడు నెలల నుంచి నానికి టిడిపి అథినేత చంద్రబాబు బుజ్జగించటం ద్వారా కొంత ఇమేజ్‌ తెచ్చిపెట్టారు. ఇప్పుడు సస్పెండ్‌ చేసి ఆ ఇమేజ్‌ను వై.కా.పా.లో పెంచారు. ఏమైనా నాని నాటకంలో ఇంకా ఎన్ని అంకాలు కొత్తగా తెరపై చూడాలని అంశంపై ఆసక్తి పెరుగుతోంది.

ఉద్యోగాల పేరిట మోసం?

రాష్ట్రంలో ఇటీవల ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే కార్పొరేట్‌ సంస్థల సంఖ్య పెరుగుతోంది. ఖాళీగా ఉన్న నిరుద్యోగుల వివరాలు సేకరించి వారికి ఉద్యోగం ఇప్పించేందుకు కన్సల్టేషన్‌ ఫీజు చెల్లించాలని డిమాండు చేస్తున్నారు. ఈ ఫీజు చెల్లించిన తరువాత ఉద్యోగం వస్తే ఆ కంపెనీ కూడా కొంత సొమ్ము చెల్లిస్తోంది. ఇలా కన్సల్టేషన్‌ల రూపంలో నడుస్తున్న సంస్థలు నగరంలో వేలకు వేలు పెరుగుతున్నాయి.     కార్పొరేట్‌ ట్రయినింగ్‌, కన్సల్టేషన్‌ ఖరీదైన ఫర్నీచరుతో ఈ సంస్థలు నిరుద్యోగులను నమ్మకంగా మోసం చేయగలుగుతున్నాయి. కంపెనీ నడిచినంత కాలం వీరి మోసాలు పోలీసుల దాకా వెళ్లటం లేదు. ఏ ఒక్కరోజు మూతపడినా వెంటనే నిరుద్యోగులు పోలీసులను సంప్రదించి తాము ఎంత ఫీజు చెల్లించారో చెప్పేస్తున్నారు. హైదరాబాద్‌నగరంలో ప్రతీ నెలా ఇటువంటి కేసులు కనీసం ఐదు నమోదవుతున్నాయని సమాచారం. తాజాగా కడప జిల్లాలో ఇటువంటి మోసమే వెలుగు చూసింది. ఈ కన్సల్టేషన్‌ను నమ్మి 140మంది ఫీజులు చెల్లించారు. దీని నిర్వాహకులు ఇద్దరు కేరళవాసులను పోలీసులు అరెస్టు చేశారు. లక్షా 11వేల రూపాయలు వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్‌టాప్‌, కారు కూడా స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కన్సల్టెన్సీలపై ఫిర్యాదు కోసం ఒక ప్రత్యేకసెల్‌ను నిర్వహించాలని సూచనలు వస్తున్నాయి.

కొడాలి నాని పార్టీ మార్పులో ఎన్టీఆర్ హస్తం ఉందా?

కొడాలి నాని జగన్ పార్టీలో చేరడంలో జూనియర్ ఎన్టీఆర్‌ హస్తం ఉందని ప్రచారం సాగుతుంది. నాని పార్టీ మార్పు వెనుక జూనియర్ హస్తం ఉందన్న వాదనలు ఖండించేందుకు ఆయన తన ఇంట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో నాని తనకు సన్నిహితుడే చెప్పిన జూనియర్ ఆయన పార్టీ మార్పును ఖండించలేదు. నాని పార్టీ మారడానికి గల కారణాలు తనకేం తెలుసునని, ఆయననే అడగాలని, ఆయనకు గల కారణాలు ఆయనకు ఉండవచ్చునని అన్నారు. ఆయితే కొందరు మాత్రం పార్టీ మారడానికి ముందు కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయినట్లు, తాను పార్టీ  మారాలనుకుంటున్నానని నాని చెప్పారని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ రాజికీయాల్లోకి రావడానికి మరో పదేళ్లు పడుతుంది కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ పార్టీ లోకి వెళ్లడం మంచిదని నాని భావించాడని అంటున్నారు. జగన్ పార్టీలోకి వెళ్లేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటాడని, ఆయనకి తెలిసే ఇదంతా జరిగిందని అంటున్నారు.                    

నా జీవితాంతం టిడిపికి సేవ చేస్తా: జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడాతు తాను బతికున్నంత కాలం టీడీపీతోనే ఉంటానని తెలిపారు.టీడీపీతో గానీ, నందమూరి కుటుంబంతో గానీ తనకెలాంటి గొడవలూ, మనస్పర్థలూ లేవని చెప్పారు. 28 ఏళ్లకే రాజకీయాల గురించి ఆలోచించేంత పరిస్థితి తనకు లేదని, కేవలం సినిమా ఒత్తిళ్ల వల్లే తాను పార్టీకి దూరంగా ఉన్నానని తనకు కుటుంబంతో ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. సినిమా తాను నమ్ముకున్న వృత్తి కావడంతో ప్రస్తుతం అందులో ఉన్నానని, టీడీపీ తరఫున ప్రచారం చేయడం తన బాధ్యత అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు రావాలనే క్లారిటీ తనకు లేదని తెలిపారు. పార్టీలోకి యువత రావాలని, ఇప్పటితరానికి తమ సమస్యలేంటో తెలుసు కాబట్టి వారు ముందుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలని చెప్పానన్నారు. పార్టీకి ఎప్పుడు నా అవసరం ఏ రూపంలో కావాల్సి వచ్చినా నా బాధ్యతను తీరుస్తానని మనవి చేస్తున్నా'' అని తెలిపారు.

విస్తరిస్తున్న ‘భారత్‌స్వాభిమాన్‌’ ట్రస్టు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతీనగరంలోనూ భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్టు కార్యక్రమాలు విస్తరిస్తున్నాయి. ఇది యోగాగురువు రామ్‌దేవ్‌బాబా నెలకొల్పిన ట్రస్టు. ప్రత్యేకించి ఆంధ్రరాష్ట్రంలో ఈ ట్రస్టు పతాంజలి యోగాభ్యాస శిక్షణ, ఆయుర్వేద వైద్యశాల రూపంలో ఎక్కువ మందికి చేరువవుతోంది. అతితక్కువ ఖర్చుతో మందులను అమ్మటం, నలుగురిని రప్పించుకుని ఉచిత వైద్యసేవలు అందించటం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉదయం పూట యోగాభ్యాస శిక్షణ, అనంతరం ఆసుపత్రి , ప్రత్యేకమైన సమయాల్లో భారత్‌స్వాభిమాన్‌ ట్రస్టు పేరిట అవినీతి వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నారు.   మరో పదేళ్లలోపు తమ రామ్‌దేవ్‌ బాబా మొత్తం దేశంలో మౌళికమైన మార్పు తీసుకురాగలరని ట్రస్టు సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అవినీతి ఏ స్థాయిలోనూ ఉండటానికి వీలులేదనే తమ సిద్ధాంతమే బలమైనదని ట్రస్టు సభ్యులు నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని తమ ఆసుపత్రికి వచ్చే వారికి వివరిస్తున్నారు. బ్యానర్ల రూపంలో ప్రచారంలోనూ వారు చూపుతున్నారు. అతితక్కువ ఖర్చుతో ఆరోగ్యం అన్నట్లు వీరు ఉద్యోగ, మధ్యతరగతి, పేద వర్గాలకు దగ్గరవుతున్నారు. ఇటీవల పెరిగిన ఒబేసిటీ, గ్యాస్ట్రిక్‌ వంటి సమస్యలతో వచ్చే వారిని ఆహ్వానించి వారికి ఉచిత వైద్యసేవల ద్వారా తమ ట్రస్టు కార్యకలాపాలను వివరిస్తున్నారు. ఏమైనా మరో పదేళ్లలోపు ఎక్కువ మంది పేదలకు ఈ ట్రస్టు చేరువయ్యే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి తూర్పుగోదావరి, అనంతపురం, కృష్ణా, గుంటూరు, హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి వంటి పలు ప్రాంతాల్లో ఈ ట్రస్టు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించింది.

సంపూర్ణమద్యపాన నిషేధం అసాధ్యమా?

సంపూర్ణమద్యపాన నిషేథం అన్నమాట రాష్ట్రంలోని ఏదో ఒక మూల రెండునెలలుగా వినిపిస్తోంది. పీసిసి చీఫ్‌ బొత్సా సత్యన్నారాయణ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అజెండాలో ఈ అంశం చోటు చేసుకుంటుందన్నప్పటి నుంచి మహిళలు ఉద్యమించటానికి కూడా వెనుకాడటం లేదు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలోని రాజోలు మండలంలోని ఓ గ్రామంలో మహిళలు అందరూ మద్యపానానికి వ్యతిరేకంగా ఊరేగింపు జరిపారు. వీరి తరువాత ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి మద్యపాననిషేథం పెట్టాలని ఎమ్మెల్యే భూమా కరుణాకరరెడ్డి ఆందోళన చెపట్టారు. దీని తరువాత తాజాగా అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం గాజులపల్లి గ్రామంలోని వందలాది మంది మహిళలు తమ ప్రాంతాన్ని మద్యరహితంగా తీర్చిదిద్దాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు.     బ్రాహ్మణపల్లిలోని ఎక్సయిజ్‌ సిఐ కార్యాలయాన్ని ముట్టడించారు. రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవించే తమ కుటుంబాల గురించి ప్రభుత్వం, ఎక్సయిజ్‌ శాఖలు ఆలోచించాలని, ఇంట్లో ఉన్న సరుకులు కూడా బజారుకు తెచ్చి మరీ తమ భర్తలు మద్యం తాగుతున్నారని వాపోయారు. పిల్లలకు సరిగ్గా తిండి పెట్టలేని తమ దుస్థితికి మద్యపానమే కారణమని, ఒక్క తమ గ్రామంలో నిషేధాన్ని అమలు చేయాలని మహిళలు కోరారు. ఈ మేరకు ఎక్సయిజ్‌ సిఐ గురునాథరెడ్డికి, పుట్టపర్తి రూరల్‌ ఎస్‌ఐ నగేష్‌బాబుకు వినతిపత్రం కూడా సమర్పించారు. రోజుకో ప్రాంతంలో ఇలా ఆందోళన చేపట్టేందుకు గతంలో మాదిరిగా పరిస్థితులు మారుతున్నాయి. అప్పట్లో యువకులు కూడా ఫ్యాషన్‌గా మద్యం తాగేవారు. అవే పరిస్థితులు నేడు పునరావృతం అయ్యాయి.   ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడు తొలిసంతకాన్ని మద్యపాననిషేధం ఫైలుపైనే చేయటం ఎవరూ మరిచిపోయి ఉండరు. ఆయనను అప్పట్లో ప్రేరేపించినట్లే తాజాగా గాజులపల్లి గ్రామంలోని మొత్తం మహిళలు అందరూ ఆందోళనలో పాల్గొన్నారు. ఇదే విధమైన ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుందని రాష్ట్రమహిళానేతలు భావిస్తున్నారు. తాజాగా జరిగిన మద్యం దుకాణాల కేటాయింపులో మహిళల పేరిట కొన్ని మంజూరయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మహిళలకు కేటాయించటం ఇదే తొలిసారి. గతంతో పోల్చుకుంటే ఇటీవల యువతులు కూడా మద్యం వైపు మొగ్గు చూపుతున్నారని సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంపూర్ణమద్యపాన నిషేధానికి మహిళలు ఏకతాటిపై ఉద్యమించటం అసాథ్యమని పలు పార్టీల నేతలు భావిస్తున్నారు. గతంలో యవత ఎక్కువగా ఉద్యమంలో సహకరించినందున సంపూర్ణమద్యపాన నిషేధం సాధ్యమైంది. ఇప్పుడు యువతులే మద్యం సేవిస్తుంటే వారు భారీసంఖ్యలో పాల్గొనే అవకాశాలు కనిపించటం లేదు

కృష్ణాజిల్లాలో వెలవెల పోతున్న తెలుగుదేశం పార్టీ

చంద్రబాబు శిబిరం కృష్ణాజిల్లాలో బోసిపోతుంది. బాబు ఎన్ని తీపి కబుర్లు చెప్పినా ఎమ్మేల్యేలు పార్టీలో ఉండటానికి ఇష్ట పడటం లేదు. మొన్నటికి మొన్న నూజివీడు ఎమ్మేల్యే చిన్నం రామకోటయ్య పార్టీవీడిపోతానంటూ హడావిడి చేశారు.ఆయనను సముదాయించడానికి పార్టీ అధినేత నానా తంటాలు పడాల్సి వచ్చింది. అనంతరం గుడివాడ ఎమ్మేల్యే కొడాలి నాని వైసిపి నాయకులకు దగ్గరవుతున్నాడని తెలిసి చంద్రబాబునాయుడు స్వయంగా పిలిపించుకుని మాట్లాడారు. చంద్రబాబు రీసెంటుగా ఎంతబుజ్జగించినా, నాని విలేకర్లతో మాట్లాడుతూ నా రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయించాలని తాత్వికంగా అన్నారు. కాని సోమవారం వైసిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను కలిసారు. అది తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీ గౌరవాన్ని కాపాడుకునేందుకు అప్పటికప్పుడు సస్పెండు చేశారు. ఆ తరువాత నాని చెంచల్‌గూడ జైల్లో ఉన్న వైసిపి అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ ని కలిసారు. దీనితో తెలుగుదేశం పార్టీ ప్రారంభకులైన ఎన్టీరామారావుగారి స్వంత జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉనికిని ముప్పు వచ్చింది.   చంద్రబాబునాయుడు విజయవాడలో ఫ్లైఓవర్‌ నిర్మించాలని చేసిన ధర్నాలో కూడా నూజివీడు, గుడివాడ ఎంఎల్‌ఏలు పాల్గొనక పోవటం అనేక చర్చలకు తెరతీసింది. కాగా కొడాలి నాని పార్టీ వీడటం పై తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్న సామాజిక వర్గానికి చెందిన వారే తెలుగుదేశంపై ఆసక్తి చూపటంలేదని తేలినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీలో హరికృష్ట వర్గానికి చంద్రబాబు వర్గానికి పడటంలేదని వేరేపార్టీలో ఉంటేనే పురోభివృద్ది ఉంటుదనే ఉద్ధేశంతోనే కొడాలి నాని పార్టీనుండి బయటపడ్డారని వదంతులు ఉన్నాయి. దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్‌ పార్టీలో ఉండటం మూలంగానే వారి రాజకీయ జీవితం అద్వితీయంగా ఉందని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. నాని పార్టీ మారటం వెనుక జూనియర్‌ ఎన్టీఆర్‌ పాత్ర ఉందనే ఊహలకి జూనియర్‌ ఎన్టీఆర్‌ మధ్యాహ్నం జరిపిన విలేకర్ల సమావేశం లో సమాధానం చెప్పారు. గుడివాడతో తన తాతగారైన నందమూరి తారకరామారావుకి ఎంతో అనుబంధం ఉందని అందుకనే తనకు ఆ నియోజకవర్గమంటే ప్రత్యేక అభిమానమని చెప్పారు. నాని పార్టీ మారటపై తనకేమీ తెలియదని, తను మాత్రం బ్రతికున్నంతవరకు తెలుగుదేశం పార్టీలోనే వుంటానని, చంద్రబాబు నాయుడుకి,బాలకృష్ణకి తనకు తన తండ్రికి మద్య బేదాభిప్రాయాలు లేవని జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలిపారు. అయితే తెలుగుదేశం పార్టీ లో వలసలు ఇంతటితో ఆగిపోవని, వల్లభనేని వంశీ కూడా నానీ బాటే పడతారనే నాయకులు, కార్యకర్తలు కలవర పడుతున్నారు.

పంచాయతీ ఉద్యోగుల పంట పండిరదా?

రాష్ట్రంలోని పంచాయతీ ఉద్యోగుల పంట పండిరది. ఇప్పటి వరకూ పదోన్నతులకు దూరమైన ఈ శాఖలో ప్రభుత్వం కొత్తగా పదవుల పందేరం పండిరచింది. ఐదువేల జనాభా, ఐదులక్షల వార్షికాదాయం ఆథారంగా ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తోంది. ప్రత్యేకించి స్పెషల్‌గ్రేడ్‌డిపిఓ హోదాను కల్పిస్తోంది. అంటే జిల్లా పంచాయతీ అథికారి పోస్టులో అప్‌గ్రేడ్‌ కల్పించింది. ఐదువేల జనాభా దాటిన పంచాయతీలు ఉన్న జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి...   తూర్పుగోదావరి`231, పశ్చిమగోదావరి`169, గుంటూరు`143, కృష్ణా`112, నెల్లూరు`57, ప్రకాశం`80, విశాఖ`50, విజయనగరం`32, శ్రీకాకుళం`32, కర్నూలు`100, చిత్తూరు`100, అనంతపురం`70, కడప`52, రంగారెడ్డి`77,వరంగల్‌`75, నిజామాబాద్‌`75, కరీంనగర్‌`65, నల్గొండ`65, ఖమ్మం`52, అదిలాబాద్‌`48, మహబూబ్‌నగర్‌`38 పంచాయతీలున్నాయి. అలాగే ఐదులక్షల వార్షికాదాయం దాటిన పంచాయతీల్లో పశ్చిమగోదావరి`238, తూర్పుగోదావరి`219, గుంటూరు`228, కృష్ణా`204, నెల్లూరు `106, ప్రకాశం`65 తదితరాలున్నాయి. ఈ పోస్టుల అప్‌గ్రేడేషన్‌ కూడా సిఇఓ స్థాయి, జెడిస్థాయిల్లో కల్పించారు. ఇప్పటి వరకూ పంచాయతీల్లో ఈ తరహా పదోన్నతులు ఎప్పుడూ జరగలేదని ఉద్యోగవర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతస్థాయికి ఛానల్‌ను రూపొందించిన ఖ్యాతి కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని ఉద్యోగులు కొనియాడుతున్నారు.  

టిడిపిలో ఎస్సీ వర్గీకరణపై అస్పష్టత!

తెలుగుదేశం పార్టీలో ఎస్సీ వర్గీకరణపై అస్పష్టత నెలకొంది. ఈ పార్టీ ప్రారంభం నుంచి గమనిస్తే అసలు ఈ వర్గీకరణ సమస్యకు టిడిపి అథినేత చంద్రబాబే ఆజ్యం పోశారు. ఆయన అథికారంలో ఉన్నప్పుడు ఈ వర్గీకరణ చేసేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తీవ్రమైన వ్యతిరేకతను తట్టుకోలేక, ప్రతిపాదించిన వర్గీకరణను అమలు చేయలేక చంద్రబాబు నలిగిపోయారు. మళ్లీ ఇదే సమస్యను బాబు తెలుగుదేశం పార్టీ తరుపున ఏకాభిప్రాయానికి వద్దామని లేవనెత్తారు. అసలు సమస్య లేవనెత్తగానే వస్తున్న నిరసనగళాలు బాబును ఆలోచింపజేస్తున్నాయి. ఎస్సీల్లోని మాల, మాదిగల మధ్య ఏకాభిప్రాయం సాధించలేమని ఈ వర్గీకరణ సమస్యపై నలిగిన చర్చల్లో ఎప్పుడో తేలిపోయింది. పైగా ప్రత్యేకించి సోదరులుగా ఉండాల్సిన వారి మధ్య ఎవరు ఈ సమస్య తీసుకువచ్చినా విభేదాలు సృష్టించినట్లు అయ్యింది. బాబు ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఒకరు తన ఎపిపిఎస్‌సి సభ్యత్వ అనుభవంతో సమస్య తీవ్రతను విశదీకరించారు. తెలంగాణాలో మాలల పోస్టులు, ఆంథ్రాలో మాదిగల పోస్టులు మిగిలిపోతున్నాయని సమస్యను వివరించారు. ప్రతీ జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడున్న పరిస్థితి ఆథారంగా వర్గీకరణ అమలు చేయకపోతే సమస్యలు పెరుగుతాయని ఆ మాజీ హెచ్చరించారు. దీంతో దళితుల అభ్యున్నతికి అవసరమైన కార్యాచరణ రూపొందిద్దామని చంద్రబాబు తన అస్పష్టతను అలానే ఉంచి సమావేశం ముగించారు. మాదిగ దండోరా రాష్ట్ర అథ్యక్షుడు మందాకృష్ణ వర్గీకరణను చంద్రబాబు అమలు చేయలేకపోయారని పలుమార్లు విమర్శించారు. ఈ సమావేశంలోనూ తెలుగుదేశం అస్పష్టత కొనసాగిందని తెలిస్తే మందా ఇంకెలా స్పందిస్తారో ఇంక మాటల్లో చెప్పనక్కర్లేదు.  

రాష్ట్రంలో కానరాని డిఎన్‌ఎస్‌ ఛేంజర్‌ మాల్‌వేర్‌ ప్రభావం!

ప్రపంచవ్యాప్తంగా సంచలనమైన ప్రకటన ఇది. డిఎన్‌ఎస్‌ ఛేంజర్‌ మాల్‌వేర్‌ ప్రభావం వల్ల మూడు లక్షల కంప్యూటర్లు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కోల్పోతాయని హెచ్చరిస్తూ వెబ్‌సెక్యూరిటీ సంస్థ మెకాషీ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రభావం వల్ల భారత్‌లోని 21,300కంప్యూటర్లు ఇంటర్నెట్‌కు దూరమవుతాయని పేర్కొంది. అమెరికాలో 69,500, ఇటలీలో 26,500 కంప్యూటర్లు కూడా ఇంటర్నెట్‌కు దూరమవుతాయంది. భారత్‌లో 50వేల కంప్యూటర్లు డిఎన్‌ఎస్‌ ఛేంజర్‌ మాల్‌వేర్‌ బారిన పడ్డాయని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌టీం అథికారి తెలిపారు. అయితే ఈ ప్రకటన ప్రకారం ఇప్పటివరకూ ఆంథ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎటువంటి ప్రభావమూ కనిపించలేదు. ప్రత్యేకించి తమ ఇంటర్నెట్‌ సదుపాయాన్ని ఎలా కోల్పోయామని వెబ్‌ సెక్యూరిటీని ప్రశ్నించిన వారూ లేరు. అయితే రాష్ట్రంలో కొద్దిపాటి కంప్యూటర్‌ సంబంధమున్న ఏ ఇద్దరు కనిపించినా మాత్రం ఈ మాల్‌వేర్‌ ప్రభావం తమ సంస్థలపై ఎలా ఉంటుందో చర్చించారు. వీరి చర్చల్లో కూడా ఎక్కడా దీని ప్రభావం తమపై ఉంటుందని ఎవరూ పేర్కొనకపోవటం గమనార్హం. రాష్ట్రంలో ఈ మాల్‌వేర్‌ సోకి ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కోల్పోయిన సంస్థలు అతి తక్కువేనని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. దీనికి తగ్గట్లే ఎటువంటి ఫిర్యాదులు ఇంకా రాలేదు.

ఆకట్టుకుంటున్న బెయిల్‌ ఫర్‌ స్కామ్‌పై ఫ్లెక్సీ

బెయిల్‌ ఫర్‌ స్కామ్‌ ఆథారంగా ది మూన్‌సేన గుంటూరులో ప్రజాస్వామ్యం పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్‌ ఆకట్టుకుంటోంది. దీన్ని రూపొందించిన తీరుపై కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘రౌడీ దర్బార్‌...శనక్కాయలు అమ్మే సాంబయ్య కౌన్సిలర్‌ అయ్యాడు...బెయిల్స్‌ అమ్మే రౌడీ యాదగిరి ఏమౌతాడో రేపు...ప్రజాస్వామ్యమా నీ పయనమెటు?...’’ అన్న శీర్షికతో ఈ బ్యానర్‌ను రూపొందించారు. ‘‘ఎర వేశాడు డబ్బు జడ్జికి....అమ్మాడు  బెయిల్‌ గాలికి...చిక్కాడు సాక్ష్యంతో ఎసిబికి...పోతున్నాడు చంచల్‌గూడ జైలుకు...ఊపుతున్నాడు చేతులు దేనికీ?...పెడుతున్నాడు దణ్ణం ఎవరికీ?...సాథించాడేమో బహుశా...అర్హత అసెంబ్లీకి...ఎందుకొచ్చింది ఈ అవస్థ వ్యవస్థకి...ఎవరు కారణం ఈ సంస్కృతికి...ఆలోచిస్తే తెలియదా...విజ్ఞులైన ప్రజలకు...’’ అంటూ అక్షరయుద్ధంతో ది మూన్‌సేన ప్రజాస్వామ్యంపై ప్రచారం చేస్తోంది. ప్రత్యేకించి ఈ ఫెక్సీ రూపొందించిన చిత్రాలు, డిజైన్‌ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇటువంటి ఫ్లెక్సీలు రాష్ట్రవ్యాప్తంగా పెడితే ప్రజాస్వామ్యంలో అక్రమాలను వెలుగులోకి తేవచ్చని, ఇటువంటి అక్షరసమరాల ద్వారానే సమాజంలో మార్పు రావాలని పలువురు బహిరంగంగా ప్రశంసిస్తున్నారు.

అవినీతి మరిచిన ధర్మాన కమిటీ?

అసలు కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో విశ్వసనీయతే కొరవడి౦దని 2012 ఉప ఎన్నికలు నిరూపించాయి. ఇదే విషయాన్ని ఆ పార్టీలో ఉన్న సీనియర్లు నమ్ముతున్నారు. కేవలం అవినీతి మంత్రులను ప్రోత్సహించటం, వారిని కాపాడేందుకు సిఎంతో సహా అందరూ ప్రయత్నించటం ఉప ఎన్నికల వైఫల్యానికి కారణమని ఓ పరిశీలనలో తేలింది. సీనియర్లు కూడా అవినీతి బాగా పెరిగిపోయిందని అథిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీనిపై అసలు స్పందనే రాలేదు. పైగా అసలు వాస్తవాలు పరిశీలించి పార్టీని, ప్రభుత్వాన్ని సరైన దారిలో నడిపించేందుకు మంత్రి థర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం అవినీతి ఛాయలకే పోలేదు. ఈ విషయమే చర్చించలేదు. అవినీతి వల్లే సిబిఐ మంత్రులకు నోటీసులు ఇస్తోందని రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపువచ్చినా ఈ ఒక్క విషయాన్ని కాంగ్రెస్‌ పట్టించుకోలేదు. అవినీతికి పాల్పడిన మంత్రులే పోతారనుకుని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మౌనం వహించటం కూడా ప్రజల్లో విశ్వసనీయతను దెబ్బతీసింది. గత అనుభవాల సారాంశం కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి అథికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగితే  కిలో బియ్యం రూ.1.90కు ఇస్తామని ప్రకటించారు. ఆయన మాటపై నమ్మకం లేక ఎన్టీఆర్‌కు కిలో రెండు రూపాయల బియ్యంకే పేదలు ఓట్లేసారు. ఈ ఘటన రాజకీయాల్లో తీవ్ర సంచలనమైంది. పేదల్లో ఉన్న విశ్వసనీయతను చాటుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ హయాంలో భూ పంపిణీలు సాగినందున దానిపై చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్‌ కాలక్షేపం చేస్తే ప్రజల్లో ఉన్న కొద్దిపాటి నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం తప్పదు. తాజాగా మంత్రివర్గ ఉపసంఘం మంత్రి తోట నర్సింహం ఇంట్లో సమావేశమైంది. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికీ, పార్టీకీ సమాచారం పంపిస్తోంది. అంతేకానీ పార్టీలో పేరుకుపోయిన అవినీతి గురించి మళ్లీ ప్రస్తావించటం మరిచింది. సహచర మంత్రులపై అభిమానంతో ఈ కమిటీ ఇలానే సమావేశమైతే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర అనుభవాలను చవి చూస్తుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.

కొడాలి నాని టీడీపీని వీడడానికి అసలు కారణమేంటి?

గత కొంత కాలంగా కొనసాగుతున్న సందిగ్ధత కు తెర తీస్తూ గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నాని ఈరోజు ఉదయం వైకాపా గౌరవ అధ్యక్షరాలు వై యస్ విజయమ్మ గారిని కలిశారు. నాని త్వరలోనే జగన్ పార్టీలో చేరడం ఖాయమని సంకేతాలు ఇస్తూ తెలుగు దేశం పార్టీ కూడా నానీ ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపధ్యం లో అటు జూనియర్ ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ ఇరువురు కూడా తమకు నానీ తెలుగు దేశం పార్టీని  వీడడంతో ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. లోగడ తెలుగు దేశం పార్టీ నాయకత్వపు మార్పిడికి సంబంధించి నందమూరి కుటుంబంలోనూ పార్టీలోను కొన్ని అభిప్రాయ భేదాలు వున్నాయని, అందుకే జూనియర్ నానీ ని ఎగదోస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు తండ్రీకొడుకులు జూనియర్, హరికృష్ణ వాటిని ఖండించడంతో అవి నిజం కాదని తెలుస్తోంది. నానీ కూడా ఇవేమీ కావు, గుడివాడ ఓటర్లలో ఎక్కువ శాతం బీసీలు,ఎస్సీలు వున్నారు. వాళ్ళు రాను రాను తెదేపాకు దూరమవుతున్నారు. ఈ పరిస్తితులలో తను తెలుగు దేశంలోనే వుంటే వచ్చే ఎన్నికలలో గెలవడం కష్టమని పార్టీ నుండి వెళ్లిపోతున్నానని ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అయితే, వీటితో పాటు గతంలో ఇంకో మాట కూడా వినవచ్చింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి రెడీ అవుతున్ననందమూరి బాలకృష్ణ గుడివాడ సీటు పై దృష్టి పెట్టారని, అందుకు చంద్రబాబు నాయుడు కూడా సరే అన్నారని కధనాలు వచ్చాయి. ఎన్ని కోణాలలో ఆలోచించినా, ఈ కారణమే సహేతుకంగా ఉందనీ, ఇదే అసలు  కారణమయి వుండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.