నాగార్జున అగ్రీకెమ్ మూసివేత సాధ్యం కాదా ?
posted on Jul 3, 2012 @ 11:15AM
శ్రీకాకుళంలోని నాగార్జున అగ్రీకెమ్ ప్లాంటు కాలుష్యమయమైంది. దీంతో దీన్ని మూసివేయాలన్న డిమాండు తెరపైకి వచ్చింది. ప్లాంటు నుంచి ఉత్పత్తిని కూడా ఆపేశారు. ఇదే ప్లాంటులో రియాక్టర్ పేలుడు వార్త ఇటీవల యావత్తురాష్ట్రాన్ని కలవరపెట్టింది. దీనిపై ప్రభుత్వం ప్రాథమిక విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన కాలుష్యనియంత్రణాధికారులు ఫ్యాక్టరీలో ఉన్న లోపాలను గమనించారు. దీన్ని వెంటనే మూసివేయాలని నోటీసులు జారీ చేశారు. అలానే ఉత్పత్తిని ఆపేయాలని సూచించారు. ఈ రసాయనిక పరిశ్రమ యాజమాన్యం కూడా ఉత్పత్తిని ఆపేసింది. అల్లీనగరం గ్రామస్తులు ప్లాంటును మూసివేయాలన్న డిమాండుపై ధర్నా చేపట్టారు. పరిశ్రమకు తాళం వేయాలని వారు డిమాండు చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రాస్తారోకో చేవారు. దీంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. ఇదే విషయమై కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన చిలకపాలెం, ఎచర్లగ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అతితక్కువ డబ్బుకు కూలీలు దొరికే ఈ ప్రాంతాన్ని వదులుకునేందుకు యాజమాన్యం సిద్ధంగా లేదు. రవాణా వసతి కూడా అందుబాటులో ఉంది. అందుకే యాజమాన్యం గొడవ సద్దుమణిగాక కార్మికులను ఓదార్చేందుకు సిద్ధమైంది.