ర్యాగింగ్‌పై పోలీసుల మంచి ప్రయత్నం!

జూనియర్‌ విద్యార్థులను వేధిస్తున్న ర్యాగింగ్‌, ఈవ్‌టీజింగ్‌ సమస్యల పరిష్కారానికి పోలీసులు ఓ మంచి ప్రయత్నం చేశారు.ఈ ప్రయత్నానికి కరీంనగర్‌ జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంత పరిథిలోని గోదావరిఖని ప్రైవేటు జూనియర్‌, డిగ్రీకళాశాలలు వేదికయ్యాయి. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఎవరూ చేయని ఈ ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తుందని విద్యార్థులూ నమ్ముతున్నారు. ర్యాగింగ్‌, ఈవ్‌టీజింగ్‌ చేస్తే అమలయ్యే శిక్షల వివరాలను అమ్మాయిలకు పోలీసులే ఉపాథ్యాయుల తరహాలో విశదీకరించారు. వారి చేత ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే విద్యార్థులను కళాశాల నుంచి సస్పెండ్‌ చేయటంతో పాటు చట్టపరంగా తీసుకునే చర్యల గురించి విద్యార్థినులకు వివరించారు.   ర్యాగింగ్‌, ఈవ్‌టీజింగ్‌పై పోలీసులు రూపొందించిన ఫ్లెక్సీలను చూపుతూ విద్యార్థినులకు చట్టపరమైన అవగాహన కల్పించారు. విద్యార్థినుల సందేహాలకు ఓర్పుగా సమాధాన మిచ్చి వారిని బాధించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే తమకు తెలియజేయాలని తమ ఫోను నెంబర్లు కూడా పోలీసులు ఇచ్చారు. ఈవ్‌టీజింగ్‌ చేసేవారిని చూసి భయపడకుండా ఆత్మరక్షణ కోసం తీసుకోవాల్సిన ఇతర చర్యలనూ తెలియ జేశారు. అంతటితో ఆగకుండా పోలీసులు తాము రూపొందించిన ఫ్లెక్సీలను బస్టాండు, ప్రధానసెంటర్లలో ఏర్పాటు చేశారు. పోలీసులు చేసిన ఈ మంచి ప్రయత్నం తప్పకుండా ఫలితాలను ఇస్తుందని కళాశాలల నిర్వాహకులు, విద్యార్థినులు భావిస్తున్నారు.

ఆదివాసీల ప్రాణాలకు విలువలేదా?

బస్తర్‌గూడ ఎన్‌కౌంటర్‌ లోతుల్లో కెళితే ఆదీవాసీలు ఎన్ని విధాలుగా నష్టపోతున్నారో తెలుస్తుంది. ప్రభుత్వం, పోలీసులు, అటవీశాఖ,కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు, మావోయిస్టులు వీళ్లంతా వారి జీవన సౌలభ్యాన్ని కొల్లగొడుతున్న వారే.. .ప్రభుత్వం వారికి విద్యా,వైద్యం, ఆహారం ఏదీ అందుబాటులో ఉంచదు. పోలీసులు (కేంద్రబలగాలు)వారి ప్రాణాలను చాలా తేలిగ్గాతీసుకుంటారు. కాంట్రాక్టర్లు వారిని తల్లిఒడిలాంటి అటవినుండి తరిమేస్తున్నారు. అక్కడ వ్యవసాయం చేసేందుకు ఆదీవాసీలు కానివారు అటవీశాఖనుండి భూముల్ని లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. వారికి చెందిన భూముల్లో వారే కూలీలుగా మారుతున్నారు.ఆదీవాసీలు సాంప్రదాయ సిద్దంగా అడవిలో పండే కుంకుడు, శీకాకాయ, బీడీ ఆకు కొన్ని రకాలయిన వేర్లు , తేనే,అమ్ముకుంటూ వుంటారు. అయితే వారిని అడవిలోనికి అటవీశాఖవారు రానీయటం లేదు.కాంట్రాక్టర్లు అడవిలోని చెట్లను నరికి యూకలిప్టస్‌ లాంటి వాణిజ్య మొక్కలను నాటి ఆదీవాసీలకు బ్రతుకుతెరువు లేకుండా చేస్తున్నారు. అటవీశాఖ జులుం వీరి మీద అధికంగా ఉంది. ఆదీవాసీలు వారి దయా దాక్షిణ్యాలపై బ్రతక వలసి వస్తుంది.   అడవిబిడ్డలు అడవి దాటి కొండలకి కోనలకు ఎగబ్రాకవలసి వస్తుంది. ఈ కొండలన్నీ ఇనుము,మ్యాంగనీసు, బాక్సైటు లాంటి ఖనిజాలతో ఉన్నాయి కాబట్టి పారిశ్రామిక వేత్తల కళ్లు వాటిమీద ఉన్నాయి. ప్రభుత్వానికి పరిశ్రమలు పెట్టి కాసులు కురిపిస్తామని, ఉద్యోగాలు ఇస్తామని అడవులనుండి, కొండలనుండి వారిని తరిమి కొడుతున్నారు. ఆకలితో ,రోగాలతో వాళ్ల జనాభా రోజురోజుకూ తగ్గిపోతుంది. ఇది చాలదన్నట్లు పోలీసుల ఎన్‌కౌంటర్‌ పేరుతో అమాయకులను, ఆడవాళ్లని, పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తున్నారు.   గత ఏడేళ్లలో దాదాపు పదివేలమంది చనిపోయారని తెలుస్తుంది. ఇప్పటికే మూడువేల మంది జైళ్లలో మగ్గుతున్నారు.వీరిలో చాలా మంది మీద చార్జిషీటుకూడా పెట్టలేదు. ఇది ఆదీవాసీ బ్రతుకు చిత్రం. ఈ ఛిద్రబ్రతుకుల్లో వారి కన్నీరును తుడవటానికి, వాళ్ల బాగోగులు చూడటానికి ఎవరున్నారని ..మనం చదువుకున్న తోడేళ్లం..చదువుకొని ....ఉన్న నీతిని పోగొట్టుకున్న వాళ్లం...మనకు రూపాయలనబడే కాగితాలే తెలుసుగాని ....ప్రాణాలకు విలువేంటి అని లెక్కలువేసుకుంటాం....అందుకే వాళ్లు అడవుల్లోనూ ఉండలేక జనారణ్యాల్లోనూ చోటు లేక బిక్కుబిక్కు మంటూ చూస్తున్నారు.   వాళ్లూ మనుషులే అనుకునే ఏ కొద్దిమందో వారికోసం పరితపిస్తే ప్రభుత్వం వారిని జైళ్లలో తోస్తుంది. మొన్న జరిగిన ఎన్‌కౌంటర్‌ను పరిశీలిస్తే...ఆదీవాసీలంతా ఆరోజు రాత్రి సమావేశం అయ్యి ఎక్కడ భూమిని సాగుచేద్దామా అని సమావేశం జరుపుతున్న సమయంలో సిఆర్‌పియఫ్‌ దళాలు వారి మీద దాడికి దిగాయి.... పెద్దలు...కాస్త తెలివైన వాళ్లు పోలీసులని గుర్తించినవారు చేతులు పైకెత్తి నిలుచుండిపోయారు. పిల్లలు, ఆడవాళ్లు తుపాకీ శబ్దాలకు భయపడినవారు పరుగెత్తి ప్రాణాలను కోల్పోయారు.   అయినా టెక్నాలజి మీద ఆధారపడిన పోలీసులు రాత్రిపూట లైట్లులేకుండా ఎలా కూంబింగ్‌కి ఎలా వెళ్లారు...ఎవరేమిటో నిర్థారణకు రాకుండా చీకట్లో కాల్పులు జరపటమేనా...వాళ్లకు అడవి ఎంతవరకు తెలుసు....అక్కడికి పోలీసులు కేవలం రెండు రోజుల ముందే వచ్చి, ఈ సంఘటన జరిగే ప్రదేశానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. సిఆర్‌పియఫ్‌ దళాధిపతిగా వీరప్పన్‌ను ఫాలో చేసి చంపిన విజయకుమార్‌ ఉన్నారు. వారేమంటున్నారంటే మేము కాల్పులు జరిపే టైమ్‌లో మావోయిస్టులు ఆదీవాసీలను మానవకవచాలుగా వాడుకున్నారని అదే జరిగిఉంటే అక్కడ పోలీసులకి మావోలపై కాల్పులు జరపటం తెలీదనే చెప్పాలి. ఎందుకంటే మావోయిస్టుల వ్యూహాలను అంచనావేయగలిగే నిపుణత లేని వారు అడవుల్లో మావోయిస్టుల్ని మట్టుబెట్టటానికి వెళ్లారు....ఆదీవాసీల ప్రాణాలను తీసారు. అడవిబిడ్డల కోసం ప్రభుత్వం చేసింది శూన్యం. అమాయకులు చనిపోయిన విషయాన్ని కేంద్ర మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ కేంద్ర హోమ్‌ మినిస్టర్‌ చిదంబంకు పార్లమెంటులో అడిగే వరకు తెలియదట....ఒకవేళ అమాయకులు చనిపోతే సారీ అని దులుపుకున్నారు. ఆదీవాసీలంటే ఎంత చులకనో ఈ సంఘటనే చెబుతుంది.   ఆదీవాసీలంతా ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారనటానికి నిదర్శనం ప్రభుత్వం పంపిన నిత్యావసర వస్తువులను ఒక్కరంటే ఒక్కరు కూడా తీసుకోకుండా తిప్పి పంపడమే. దీని ద్వారా వారు గుండెకోత కంటె కడుపు మంట ఏమంత లెక్కలోనిది కాదని చెప్పకనే చెప్పారు. ఆదీవాసీలలో విద్యావ్యాప్తి కోసం రామకృష్ట మిషన్‌ 25 పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇదివరలో రామకృష్ణ మిషన్‌ స్కూల్‌దగ్గర చౌక ధరల దుకాణం ఏర్పాటు చేసేవారు .ఇప్పుడు అవి పోలీసుల క్యాంపులకు తరలించారు దానివల్ల ఆదీవాసీలు 40 కిలోమీటర్లు నడవాల్సివస్తుంది.   ఇదివరలోఆదీవాసీలకు భూమికోసం జరిగే పోరాటాలు మాత్రమే ఉండేవి...అయితే ఇప్పడు కార్పొరేట్‌ సంస్థలతో అది పోరాడ వలసి వస్తుంది. ప్రభుత్వం ధర్మల్‌ ప్లాంట్లకు , ఖనిజ పరిశ్రమలకు విపరీతంగా అనుమతులు ఇచ్చింది.ఇప్పటికే ఆదీవాసీ ప్రాంతాల్లో 22 పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఆదీవాసీల హృదయ విదారక స్థితికి కారణం, ప్రభుత్వ అలసత్యం . ఆదీవాసీల కోసం జరపవలసిన పధకాలు, హక్కులు పేపర్లమీదే ఉన్నాయి.   వారికి ప్రతిఘటించే శక్తికూడా లేదు. ఎందుకంటే ఇప్పటివరకు చత్తీస్‌ఘడ్‌లో గాని, వేరే చోట్లగాని ఆదీవాసీలకు మద్దతుగా ఒక్క బహిరంగ సభ కూడా జరగలేదు. హైదరాబాద్‌లో జరపతలపెట్టిన సభకు బాధిత కుటుంబాలు పాల్గొనటానికి వస్తే అక్కడే వారిని అరెస్టు చేసినట్లు తెలుసింది.....ఆదీవాసీలను బ్రతకనిద్దాం..ఎందుకంటె ఎప్పుడన్నా మనిషెవరు అంటే చూపటానికి వుంటారు.... మనమెలాగూ టెక్నాలజీతో మెషిన్స్‌గా బ్రతుకుతున్నాం కదా.

గుంటూరు పోలీసులు సైకో సాంబ డబ్బుకు ఆశపడ్డారా?

గొర్రె కసాయివాడిని నమ్ముతుంది. గుంటూరు పోలీసులు అమాయకంగా కనిపించే సైకో సాంబశివరావును నమ్మారు. ఒంటిమీద ఒక్క దెబ్బ పడకుండా అన్నీ నిజాలే చెప్పాశాడని తెగ సంబర పడిన పోలీసులను సైకో సాంబ భలే బకరాలను చేశాడు. నాలుగురోజులనుండి 300 మందిపోలీసులు సైకో సాంబ కోసం అడవంతా జల్లెడ పడుతున్నారు. పోలీసులకు కొండపల్లి ఖిల్లాలోని పాములు, తేళ్లు ఎక్కడ కరుస్తాయోనని భయం ఒకవైపు తేలిగ్గా ఎస్కేపయిన సైకోసాంబడిమీద కసి ఒకవైపు కలచివేస్తోంది. చిన్న చిన్న నేరాలను చేసివాళ్లమీద, నిందుతుల మీద ప్రతాపం చూపించే పోలీసుపెద్దలు సాంబడు చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. కుటుంబ జీవితం బాగోలేక అలా ప్రవర్తించాను బాబయ్య నేను కూడా మంచి కుటుంబాన్ని కలిగివుంటే అలా అయ్యేవాడినే కాదు. ఇప్పటినుండి మంచి గా మారి కలిగి సామాన్య జీవితం గడుపుతాను అంటూ అమాయకంగా చెప్పాడు. దానితో వేటగాడు వాల్మీకి అయ్యాడనుకొని పోలీసులు నమ్మారు. పోలీసు రికార్డుల్లో ఉన్నట్లు సైకోసాంబ రెండేళ్లనుండే దొంగతనాలు మొదలుపెట్టలేదంట. గత పది సంవత్సరాలుగా తను దొంగతనాలు చేస్తూనే ఉన్నానన్న సైకో దొంగతనానికి వేళ్లేముందు కిటికీలు తెరుస్తాడట. ఆతర్వాత ఇంట్లో ఆడవాళ్లే ఉన్నారా...లేకపోతే మగవాళ్లు కూడా ఉన్నారా అని ఆరా తీసి ఆడవాళ్లే ఉన్నారనేది నిర్థారణ చేసుకున్న తరువాతే ఇంటిలోకి ప్రవేశిస్తానని పోలీసులకు చెప్పాడు.   అంతేకాకుండా ఆడవాళ్లని తన పైశాచికత్వంతో హింసిస్తాడని కూడా చెప్పాడని పోలీసులు ఉటంకిస్తున్నారు. అయితే నమోదు అయిన కేసుల కంటే నమోదు కాని కేసులే ఎక్కువుంటాయని చెబితే అన్ని నిజాలే చెప్పేశాడని పోలీసులు మురిసిపోయారు...చివరికి నామీద చిన్న చిన్న కేసులే పెట్టండి నేను మారి మంచిజీవితం గడుపుతాను అని కూడా బోల్డంత అమాయకత్వం నటించేసరికి పోలీసులు మెత్తబడి అలాగే అంటూ మాటకూడా ఇచ్చేశారు.   నన్ను కొట్టినా హింసించినా లేదా జైల్లో పెట్టినా చచ్చిపోతాను అని చెబితే ఎందుకొచ్చిందిలే తంటా అనుకున్న పోలీసులు బంగారం ఎక్కడున్నది చెప్పమంటే కొండపల్లి ఖిల్లా మీద ఉంచానని తీసుకెళితే ఇస్తానన్నాడు. పది మంది పోలీసులు చేతులకు కాళ్లకు గొలుసులు వేసి వెంటబెట్టుకు వెళ్లారు. నడవటానికి ఇబ్బందిగా ఉందంటే ఒక కాలికి చేతికి వేసిన బేడీలు కూడా తీసి ఒకకాలికి చేతికి మాత్రమే ఉంచారు. పైకి వెళ్లిన తరువాత కళ్లముందే 100 మీటర్ల లోతు లోయలోకి జారిపోతుంటే పోలీసులు ఏంజరుగుతుందో తెలివిలోకి తెచ్చుకునేటప్పటికే ఉడాయించాడని చెబుతున్నారు. అయితే ఇక్కడే మరో వాదన వినిపిస్తోంది. సైకో సాంబ తన వద్ద పెద్దమొత్తంలో బంగారం, నగదు ఉన్నట్లు చెప్పడంతో వారు ఆ సంపదపై ఆశపడి అది దొరికితే దానికో ఎంతో కొంత నొక్కేయచ్చన్న ఆశతో కొండపల్లికి తీసుకువెళ్ళి కంగుతిన్నట్లు తెలిసింది. పోలీసులతో మైండ్‌ గేమ్‌ ఆడిన సైకో సాంబ పోలీసులకు దొరక్క పోయినా, ఏదో ఒక రోజు వాడి పాపం పండి వాడే దొరుకుతాడు. ఎందుకంటే పెద్ద పెద్ద నేరగాళ్లంత అలాగేదొరికారు. పరిటాల హత్యకేసులో మొద్దు శ్రీను కూడా అలాదొరకిన బాపతే కాని పోలీసులేం పట్టుకోలేదు. అప్పటివరకు ఒంటరిగాఉండే ఆడవాళ్ల పరిస్థితి ఏంటి...ఇదే ప్రశ్న పరిసర గ్రామస్తులను కూడా కంటిమీద కునుకే లేకుండా చేస్తుంది.

ఛత్తీస్ గడ్ లో యువతి నగ్నంగా చిత్రీకరించిన దుండగులు

గౌహతిలో బాలికపై జరిగిన దారుణం మరిచిపోక ముందే, ఛత్తీస్ గడ్ లో యువతిపై జరిగిన మరో దారుణం బయటపడింది. ఛత్తీస్ గడ్ లోని బిలాస్ పూర్ లో ఆకతాయి యువకులు ముఠాలుగా ఏర్పడి పర్యాటక ప్రాంతాలకి వచ్చే వారిని దోచుకుంటున్నారు. తాజాగా ఒక దారుణమైన సంఘటన బయట పడింది. ఒక యువతి తన బాయ్ ఫ్రెండ్ తో బర్త్ డే జరుపుకోవడానికి పర్యాటక ప్రాంతానికి వస్తే, తాగిన యువకులు ముగ్గురు వారి దగ్గరకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారు. వారికీ అడ్డువచ్చిన యువతి బాయ్ ఫ్రెండ్ ని కొట్టి, అతని వద్ద ఉన్న సెల్ ఫోన్, డబ్బులు తీసుకొని అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ తరువాత అమ్మాయి బట్టలు విప్పించి నగ్నంగా వీడియో చిత్రీకరించారు. ఈ ఘటనని యమ్ యమ్ యస్ రూపంలో అందరికి పంపుతున్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి పిర్యాధులు అందలేదని పోలీసులు చెబుతున్నారు.  

తిరుపతిలోకి ప్రవేశించిన కేరళ నరహంతకుడు

ఆంద్రప్రదేశ్ పోలీసులు సైకో సాంబను పట్టుకోవడానికి ముప్పుతిప్పలు పడుతుంటే, కొత్తగా మరో సైకో మన రాష్ట్రంలోకి ప్రవేశించాడు. కేరళ, తమిళనాడులో నరహంతకుడిగా చలామణి అవుతున్న ఆంటోని తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నట్లు కేరళ పోలీసులకి సమాచారం అందింది. దీంతో కేరళ పోలీసులు నరహంతకుడు ఆంటోని కోసం తిరుపతికి వచ్చారు. మొబైల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఆంటోని తిరుపతిలో ఉన్నట్లు కేరళ పోలీసులు తెలుసుకున్నారు. నరహంతకుడు ఆంటోని కోసం రేణిగుంట ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఆంటోనిపై 20కి పైగా కేసులు ఉన్నాయట, గత నెలలో ఆంటోని కేరళలోని పొల్లం జిల్లా యందువారిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పెట్రోలింగ్ వాహనంపై దాడి చేసి ఎస్‌ఐ జోయిని కత్తితో పొడవటమే కాకుండా పోలీస్‌ డ్రైవర్‌ మునియన్‌ పిళ్లైను దారుణంగా హతమార్చాడు. ఇప్పటిదాకా ఈ ఆంటోని 17 మందిని పెళ్ళి చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సైకో ఆంటోని అయినా కేరళ పోలిసులులకి త్వరగా చిక్కుతడేమో చూద్దాం!

ధర్మాన కమిటీకి కమిట్‌మెంట్‌ లేదా ?

ఉప ఎన్నికల్లో పరాజయానికి కారణాలు విశ్లేషించేందుకూ, రాష్ట్ర ప్రభుత్వానికీ, కాంగ్రెస్‌ పార్టీకీ సమన్వయంగా వ్యవహరించేందుకు మంత్రి ధర్మానప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటు అయిన మంత్రుల కమిటీ తమ మనస్సుమార్చుకుంది. ఈ కమిటీ పనితీరు బాగోలేదని సీనియర్లు, పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో తొలిసారి తమ నివేదికను ఆపేసి అసలు అందరి అభిప్రాయాలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. కమిటీ కమిట్‌మెంట్‌ లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెరిగిపోయిన అవినీతి గురించి అస్సలు చర్చించలేదని ఘాటుగా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. ప్రజల నమ్మకాన్ని సాధించేందుకు ప్రభుత్వసహాయంతో ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్న బలమైన ఆరోపణ ఈ కమిటీపై వచ్చింది.     దీనికి ఎన్టీఆర్‌ హయాంలో రూ.1.90కే కిలో బియ్యం ఇస్తామని ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దనరెడ్డి ప్రకటించిన విషయాన్ని సీనియర్లు ఉదహరించారు. అప్పట్లో రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తామన్న ఎన్టీఆర్‌నే ప్రజలు నమ్మారని వారు స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల ద్వారా పార్టీ పటిష్టమవుతుందని కమిటీ అభిప్రాయపడిరది. ఇదొక్కటీ చాలదు అవినీతి కూడా తగ్గాలని పార్టీనేతలు సూచించారు. అందుకే ఈ నెల 17న ఎంపీలు, 18న ఎమ్మెల్యేలు, 19న ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించేందుకు మంత్రివర్గకమిటీ నిశ్చయించుకుంది. మంత్రి పితాని సత్యన్నారాయణ నివాసంలో సమావేశమైన ఈ కమిటీ అకస్మాత్తుగా మనస్సు మార్చుకుని తమ నివేదికను ఈ నెల 21వతేదీ వరకూ ఆపేసింది. వచ్చిన అభిప్రాయాలు క్రోడీకరించి దాని ద్వారా సరైన సమాచారం పార్టీకి, రాష్ట్రప్రభుత్వానికి అందజేస్తామని కమిటీ ఛైర్మన్‌ ధర్మానప్రసాదరావు తెలిపారు.

ఇంటిదొంగను పట్టించిన సిసికెమేరా

ఓ ఇంటిదొంగను సిసికెమేరా పట్టిచ్చింది. దీంతో విశాఖ సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు రూ.కోటి 48లక్షల 99వేలు రికవరీ అయింది. అలానే బ్యాంకులోనే పని చేస్తున్న ఉద్యోగి దఫదఫాలుగా చేసిన దొంగతనమూ బయటపడిరది. గత నెల 29వ తేదీన బ్యాంకులో కోటి 48లక్షల 99వేల రూపాయలు గల్లంతైందని బ్యాంకు అధికారులు తెలుసుకున్నారు. తెలుసుకున్న వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో పోలీస్‌కమిషనర్‌ పూర్ణచంద్రరావు రంగంలోకి దిగారు.   పోలీసులు ఉద్యోగుల ద్వారా ముందస్తుగా వివరణలు తీసుకున్నారు. ఆ తరువాత ఎలా గల్లంతయిందని అధికారులను ప్రశ్నించారు. లాకులు యథాతథంగా ఉన్నా ఆ డబ్బు తగ్గిపోయిందని వారు వివరించారు.       దీంతో పోలీసులు బ్యాంకులోని సిబ్బందే ఈ పని చేసి ఉంటారని గుర్తించారు. బ్యాంకులో సిసికెమేరాల పనితీరును పరిశీలిస్తామని బ్యాంకు అధికారుల అనుమతిని తీసుకున్న పోలీసులు సిసికెమేరాఫుటేజీ టేపును పూర్తిగా పరిశీలించారు. విచారణలో భాగంగా పరిశీలిస్తుంటే ఒక ఉద్యోగి అనుమానాస్పందంగా పలుమార్లు వెళుతున్న తీరు బయటపడిరది. సిసికెమేరా ఫుటేజీలో ఒకసారి అతను దొంగతనం చేసినది రికార్డు కూడా అయింది. దీంతో పోలీసులు చొరవ చూపి ఆ బ్యాంకు ఉద్యోగి అభయానంద్‌పాశ్వాస్‌ను విచారించారు. అతనే దొంగతనం చేశాడని నిర్ధారణ అయింది. పలుదఫాలుగా ఈ దొంగతనం జరిగిందని ఆ డబ్బును కూడా వేరే ఉరులో ఉన్న తన మిత్రుడి ఇంట్లో దాచానని పాశ్వాస్‌ ఒప్పుకున్నాడు. వేగంగా రికవరీ చేసి ఈ మిష్టరీ చేధించినందుకు బ్యాంకు సిబ్బంది పోలీసులను అభినందించారు.  

ప్రాచీన కట్టడాలను కూల్చేస్తున్న గుప్తనిధుల బ్యాచ్‌

గుప్తనిధుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. రాయలసీమ, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ వేట సాగుతోంది. ప్రత్యేకించి కొందరు క్షుద్రపూజలు చేసేవారిని తోడు తీసుకుని ఈ వేట కొనసాగిస్తున్నారు. గుప్తనిధుల కోసం బలులు ఇవ్వటానికి కూడా వెనుకాడటం లేదు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లోని పురాతన ఆలయాల గురించి పర్యాటకశాఖ పూర్తిస్థాయిలో ప్రచారం చేయటం లేదు. దీంతో పర్యాటకుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయిబాబా మరణానంతరం పర్యాటకుల రాక తగ్గింది. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు సరిహద్దులు కలిసే ఉండటంతో ఏ జిల్లాకు వచ్చినా మిగిలిన ప్రాంతాల్లో ప్రాశస్త్యం ఉన్న ఆలయాలను పర్యాటకులు సందర్శించేవారు.     ఇప్పుడు దాదాపు రాకపోకలే తక్కువ అవటంతో దీన్ని అదునుగా తీసుకుని కొందరు ఈ గుప్తనిధుల వేట కొనసాగిస్తున్నారు. కడపజిల్లా ఒంటిమిట్ట గ్రామంలోని ప్రధానరహదారిపై రామతీర్థం దగ్గర పురాతన మండపం ఉంది. ఈ మండపం ప్రాశస్త్యం తెలిసి తాజాగా ఇక్కడ తవ్వకాలు జరిపారు. గతంలో ఇదే మండపంలోని రాతిగుబ్బను దుండగులు కదిలించారు. ఈ కదిలించిన తీరు చూసిన వారు గుప్తనిధుల వేట కోసమే కదిలించారని ఆనవాళ్లను బట్టి అర్థమవుతోంది. ఇటీవల మండపంలోని పల్లె, మాధవరంలో విగ్రహాలు చోరీకి గురవటం, గుప్తనిధుల కోసం తవ్వకాలు చూస్తున్న కడపజిల్లా వాసులు పురాతన సంపద పరిరక్షణ కోసమైనా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఎన్టీఆర్‌నే టీడీపీ నుంచి గెంటేశారు: పురందేశ్వరి

"టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు. ఆయననే పార్టీ నుంచి గెంటేశారు. తర్వాత ఎన్నికల కమిషన్ నుంచి ఎన్టీఆర్ సింహం గుర్తు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకందరికీ తెలుసు'' అని కేంద్ర సహాయ మంత్రి పురందేశ్వరి అన్నారు. విశాఖ- ముంబై కొత్త రైలు ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెను విలేకరులు టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రశ్నించారు.   తొలుత దాని గురించి అడిగినప్పుడు టీడీపీ పగ్గాలు ఎవరు చేపడతారనే అంశంతో తనకు సంబంధం లేదని, అది పార్టీకి సంబంధించిన విషయమని వ్యాఖ్యానించారు. అయితే.. నందమూరి వంశీయులే టీడీపీ పగ్గాలను చేపడతారని జరుగుతున్న ప్రచారంపై.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలిగా ఎలా స్పందిస్తారని అడిగినప్పుడు పై విధంగా సమాధానమిచ్చారు.  

ఐ.ఎ.ఎస్‌.లు ఆగ్రహిస్తే ఏమవుతుంది?

ఇప్పుడంటే ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ పెరిగి ఐటి జాబ్స్‌ వచ్చి లక్షల్లో సాలరీస్‌ ఆరునెల్లకొక సారి ఫారిన్‌ ట్రిప్‌, ఎంఎన్‌సి కంపెనీల్లో షేర్లు, కార్లు ఓప్‌....కానీ ఇవన్నీలేనప్పుడు చదువంటే సివిల్‌ సర్వీసే....పెద్ద ఉద్యోగం అంటే కలెక్టరే....వారు బుద్దిబలంలో బృహస్పతులని, పేదలపాలిటి పండువెన్నెల కురిపించే పూర్ణచంద్రులని గుర్తింపు ఉండేది. కలెక్టరు ప్రక్కనే ఎప్పుడూ తిరిగే బిళ్ళ బంట్రోతు అంటేనే ప్రజలకు గౌరవాభిమానాలు ఉండేవి. కలెక్టరు అంటే చెప్పనక్కర్లేంనంత భయం భక్తీ ఉండేవి....అలాంటి రోజుల్లో చంద్రబాబునాయుడు పరిపాలనలో జన్మభూమి కార్యక్రమం చేపట్టారు.   కలెక్టరు కూడా రోడ్లు ఊడ్చడం, మిగతా అధికారులంతా మురిగి కాల్వలు శుబ్రపరచడం మొదలైన పనులుండేవి. మేధాసంపన్నులతో లేబర్‌పనులు చేయించడం ఏంటని ప్రతిపక్షాలు ఎంత గింజుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది. అదే సమయంలో ప్రజలవద్దకే పాలన అంటూ మంత్రివర్యులంతా ఊళ్లు తిరిగేవారు. ప్రజలెవరైనా అధికారుల మీద ఆరోపణచేస్తే చాలు ఉద్యోగాన్ని హూఫ్‌ అంటూ ఊదేసేవారు ఏలినవారు. నిజానిజాలేమంటూ విచారణలేముండేవి కాదు. సదరు ఉద్యోగాధికారులంతా  పని చేసుకుందామని ఆఫీసుకు వచ్చి, ఉద్యోగాలు ఊడగొట్టుకొని ఇంటికెళ్లల్సిన పరిస్థితి ఏంటా అని గుండెనెప్పి వచ్చి పడిపోయిన వారు ఉన్నారు. పైకి పోయిన వారు ఉన్నారు. ఆతర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం గెలవలేదు. ఒక వేళ గెలిచి ఉంటే కలెక్టర్లతో రోడ్లు ఊడ్చించి, రోడ్లువూడ్చేవాళ్లతో కలెక్టరీగిరి చేయించేవారేమో....ప్రభుత్వం మారింది. ఇదివరకటి కష్టాలు కలెక్టర్లకు తప్పాయి. హమ్మయ్య అనుకున్నారు. ఇంతలో మళ్లీ ప్రభుత్వం మారలేదుకాని, ప్రభుత్వంలోని వ్యక్తులు మారారు. అంతే అంతకు ముందు ముఖ్యమంత్రికి అనుకూలంగా పనిచేశారని,లంచాలు తీసుకున్నారని,అదని, ఇదని.... ఆడ, మగని కూడా చూడకుండా తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఏతావాతా తేలేదేమిటంటే పనిచేసినా, చెయ్యకపోయినా అడకత్తెరలో పోకచెక్కల్లా నలిగిపోయేది కలెక్టర్లే అని. వాళ్లతో చాకిరీచేయించి అనుకూలంగా పనులుచేయించుకున్న మంత్రివర్గం మాత్రం సేఫ్‌. ఈ క్రమంలోనే  జైల్లో పడవేయబడిన వారికి, జైల్లోకి త్రోసేవారికి మద్య (సివిల్‌ సర్వీస్‌ల్లో ) ఎవరు గొప్పా అని ఎప్పుడూ నిరువుగప్పిన నిప్పులా ఉండే ఆధిపత్యపోరుకు తెరలేచింది. అయితే కాలం కలసిరాని కలెక్టర్లకు పోలీస్‌ఆఫీసర్లే గొప్ప అని ఒప్పుకోక తప్పింది కాదు. రాజకీయనాయకుల వల్ల అధికారులని నిలదీసే శక్తి ప్రజల్లో పెరిగింది కాని, భాద్యతయుతంగా ఉండే   ప్రజల్ని పొంపొందించలేకపోయారు. ప్రజల్లో అనార్కిజాన్ని పెంచారు.  రాజకీయనాయకుల జోక్యం అన్నిట్లో పెరిగినట్లే కలెక్టర్‌ ఆఫీసుల్లో కూడా చేరింది. అలాగే జిల్లాల్లో జనాభాపెరిగింది. అవసరాలు పెరిగాయి. వాటితోపాటు సమస్యలూనూ, కలెక్టరు మాత్రమే ఎప్పటిలాగే. ఎడిషనల్‌గా పెడదామన్న ఇప్పటికే ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా 3000 ఐఎఎస్‌ల షార్టేజీ...కాబట్టి సమస్యలతో నెట్టుకొస్తూ కలెక్టర్లూ రాత్రి పగలూ లేకుండా పనిగంటలు పెంచినా రాజకీయనాయకుల విపరీతమైన జోక్యం. పులిమీదపుట్రలా మంత్రి టిజి వెంకటేశ్‌ రెచ్చిపోయి కలెక్టర్లంతా వెధవలని, పనిచేయకుండా కుర్చీలకు అంటుకుపోతారని, అలాంటి వారిని నడిరోడ్డుమీద కాల్చేయాలనికూడా సెలవిచ్చారు. దాంతో శనివారం కలెక్టర్లంతా అత్యవసర సమావేశం ఏర్పాటు చేయవలసి వచ్చింది. వాళ్ల స్టయిల్లో వారు ఆగ్రహం వ్యక్తంచేశారనుకొండి. ప్రస్తుతానికి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపడుతుందాఅని కలెక్టర్లు ఎదురు చూస్తున్నారు. కలెక్టర్లందర్నీ ఒకే గాటను కట్టోందని కూడ వారు హెచ్చరించారు. దీన్నిబట్టి తేలేదేంటంటే ముందు మారాల్సింది రాజకీయనాయకులని, అందులోనూ ప్రజల్ని సుపరిపాలనతో మెప్పించలేక  వాళ్లను రెచ్చగొట్టే టిజి వెంకటేశ్‌ లాంటి నాయకులేనని.

మళ్ళీ విశాఖలో సుబ్బరామిరెడ్డి మకాం,పురందరేశ్వరికి టెన్షన్‌

విశాఖ నగరంలో రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు వెంకట సుబ్బరామిరెడ్డి తన ఉనికిని చాటుకుంటున్నారు. ఇటీవల నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన తనకు విశాఖలో ఉన్న సంబంధాలను మళ్ళీ  కొనసాగిస్తున్నారు. అక్కడి పార్లమెంట్‌ సభ్యురాలు, కేంద్రమంత్రి అయిన పురందరేశ్వరికి టెన్షన్‌ పుట్టిస్తున్నారు. అంతేకాకుండా విశాఖలో పేరుకుపోయిన కొన్ని సమస్యలపై తనదైన శైలిలో ఆయన స్పందిస్తున్నారు. ప్రత్యేకించి విలేకరులను పిలిచి నగరంలో కీలకమైన అంశాలపై తన అభిప్రాయాలను, తన వంతుగా చేసిన పనిని విశదీకరిస్తున్నారు. కెజిహెచ్‌  అభివృద్థి కోసం ప్రభుత్వరంగ సంస్థలు సుమారు రూ.50కోట్లు వెచ్చిస్తున్నాయి. అయితే సుబ్బరామిరెడ్డి తన వంతు కృషిగా పారిశ్రామికవేత్తల సహాయంతో రూ.30కోట్లను అదనంగా సేకరించి అభివృద్థి శాశ్వతప్రాతిపదికన ఉండేలా చూస్తున్నారు. విశాఖ విమానాశ్రయం సేవలు 24గంటలూ అందుబాటులో ఉండేలా చూడాలన్న పారిశ్రామికవేత్తల డిమాండుపై ఆయన స్పందించారు. తాను కేంద్రంలోని నేతలతో చర్చలు జరిపానని రెండు నెలల్లో పూర్తిస్థాయి సేవలు లభిస్తాయని ఆయన ప్రకటించారు. నగరవాసుల కోరికలు సాకారమవుతాయని, ప్రైవేటీకరిస్తారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టీల్‌ప్లాంటు విషయంలో కూడా తాము ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని సుబ్బరామిరెడ్డి స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ స్టీలుప్లాంటును ప్రైవేటుపరం కానీయనని ఆయన హామీ ఇచ్చారు.

నందమూరి కుటుంబంలో విభేదాలు లేవు: బాలకృష్ణ

నందమూరి కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని బాలకృష్ణ చెప్పారు. విభేదాల పేరుతో అభిమానులను చీల్చవద్దని, ఎవరి అభిమానులు వారికి ఉంటారని ఆయన అన్నారు.జూనియర్ ఎన్టీఆర్ అయినా, లోకేశ్ అయినా పార్టీకి ఎంత సమయం కేటాయించగలమన్నది వారే నిర్ణయించుకోవాలి. పార్టీ కోసం కష్టపడాలనుకొన్నవారు ఎవరైనా రావచ్చు. సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నారని చెప్పారు. గుడివాడలతో పోటీపై తాను ఇంకా ఏమీ అనుకోలేదన్నారు. పార్టీ మారాలని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీసుకొన్న నిర్ణయం స్వార్థపూరితమని వ్యాఖ్యానించారు. 'ఇతరులతో కుమ్మక్కై పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. నాయకుడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇదే నాయకుడి కింద పనిచేయడానికి ఇష్టపడి పార్టీలోకి వచ్చిన విషయం మర్చిపోతున్నారు. ఇలాంటివారికి కార్యకర్తలు గుణపాఠం చెప్పాలి. ప్రజలు కూడా ఎన్నికల్లో వారిని తిరస్కరించాలని అన్నారు.

కే.సి.ఆర్‌ కోదండరామ్‌ మధ్య పెరిగిన అగాధం

ఎవడిగోల వాడిది అన్నంట్లుంది. కెసిఆర్‌ ప్రస్తుతానికి ప్రత్యేక తెలంగాణకుఉద్యమాలు అక్కర్లేదు తెలంగాణ వచ్చేందుకు ఏమంత సమయంలేదు అన్నారు. అంతటితో ఆగకుండా పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్‌ అధిష్టానం రాష్ట్రపతి ఎన్నికలు కాగానే తెలంగాణ ఎందుకు ఇవ్వనున్నారో కూడా సావధానంగా వివరిస్తూ  వైసిపి పార్టీ దూకుడుని తగ్గించడానికి కాంగ్రెస్‌కు తెలంగాణ ఇవ్వటం తప్ప మరో గత్యంతరం లేదని సెలవిస్తున్నారు. దీనిపై జాక్‌నేత ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఇంతవరకు అలాంటి సంకేతాలు ఏమీ అందలేదని, రాష్ట్రపతి ఎన్నికలముందే ఉద్యమాన్ని ముమ్మరం చేస్తే తెలంగాణ వచ్చితీరుతుంది అంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్యా అగాధం మరింత పెరినట్లుయింది. నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపి మధుయాష్కీ ఇప్పట్లో తెలంగాణ ప్రకటించే సూచనేమీ తనవరకు రాలేదంటునన్నారు. టిజి వెంకటేశ్‌ ది మరోగోల ..మొదట రాయల్‌ తెలంగాణ రావాలన్నారు. అయితే  మాకేమీ రాయల్‌ తెలంగాణ అక్కర్లేదని తెలంగాణవాదులు తెగేసి చెప్పటంతో ఇప్పుడు మహారాయలసీమ అంటున్నారు. రాయలసీమలో నాలుగు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు కలిపి మొత్తం ఆరు జిల్లాలతో మహారాయలసీమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జెసి దివాకర్‌రెడ్డి మాత్రం రాయల్‌ తెలంగాణాకే కట్టుబడిఉన్నానన్నారు. కాంగ్రెస్‌ వాదులు, కిరణ్‌కుమార్‌రెడ్డి అధిష్టానమే చూసుకుంటుందని దాని నిర్ణయానికే కట్టుబడి ఉన్నామంటున్నారు. రాజ్యసభ సభ్యురాలైన రేణుకా చౌదరి కేంద్రం త్వరలో ఒక నిర్ణయానికి రానున్నారంటారు. ఆ నిర్ణయమేదో కూడా చెప్పరు. కావూరి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమే మంచిది నాన్చివేత ధోరణి కంటే అని అంటారు. కొందరు కాంగ్రెస్‌ నాయకులు  టిఆర్‌యస్‌ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తే తెలంగాణ ఇవ్వడం కష్టమేమీకాదంటున్నారు. ఆంద్ర జాక్‌  నేతలు భాషా రాష్ట్రంగా ఏర్పడిన మొదటి రాష్ట్రం మనదే కాబట్టి ఎప్పటికీ కలసి ఉండాల్సిందే అంటారు. తెలుగుదేశం తెలంగాణా నాయకులు తెలంగాణా మీద తేల్చకుంటే అక్కడ అడుగుపెట్టలేని పరిస్ధితిలో ఉన్నామని చంద్రబాబునాయుడ్ని త్వర పెడుతున్నారు. అయితే తెలుగుదేశంపార్టీలో ఉన్న కోస్తాంద్రలో సిట్టింగ్‌ ఎమ్మేల్యేలు జారిపోవటంతో దాన్ని చక్కపరచుకునే పనిలో  చంద్రబాబు ఉన్నారు. ఇక వైసిపి పార్టీ మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదు. కేంద్రం ఇస్తామంటే మేము వద్దనం అంటూ చేతులు దులుపుకుంది. వైసిపి గౌరవ అద్యక్షురాలైన విజయమ్మకు జగన్‌కి జరిగిన అన్యాయాన్ని జాతీయ స్ధాయిలో వినిపించి మద్దతు కూడ గట్టే పనిలో బిజీగా ఉన్నారు. కాని అస్తవస్త్యం అయిన జనజీవనాన్ని ఎవరూ పట్టించుకున్న ధాఖలాలు కనిపించడంలేదు.... ఎవరి ఉద్యమాలు, జెండాలు, ఎజెండాలు వారివే కాని సామాన్య ప్రజలకు తక్షణం కావల్సిన ధరలు అదుపులోకి తేవడం, విద్యాసంవత్సరం మొదలైనా పుస్తకాలు పంపిణీకాకపోవడం, విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, రీఎంబర్స్‌ మెంట్లు, అంధకారం అలుముకున్న ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిశ్రమలు కుదేలవ్వటంవల్ల సాటి కార్మికుల బ్రతుకులు, దుర్భరమవుతున్న సామాన్యుడి జీవనం ఎవరికీ పట్టడంలేదు. ప్రజలకు వారి సమస్యల కొరకు పాటుపడే నాయకుడికోసం భూతద్దం వేసి చూసినా ఒక్కరంటే ఒక్కరుకూడా కనబడటంలేదు.

కరెంటు కష్టాలకు రిలయన్సే కారణం?

ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ఎదుర్కొంటున్న తీవ్రమైన విద్యుత్తు కోతలకు కారణం రిలయన్సే అని తెలిసింది. రిలయన్స్‌ సంస్థ మన రాష్ట్రంలోని గ్యాస్‌ అథారిత విద్యుత్తు కేంద్రాలకు ఒప్పందాల మేరకు చేయాల్సిన గ్యాస్‌ను సరఫరా చేయలేకపోవటంతో మనకు ఈ దుస్థితి ఏర్పడిరది. రిలయన్స్‌ సంస్థ కృష్ణా`గోదావరి బేసిన్‌ నుంచి పెద్ద ఎత్తున సహజవాయువును పైపు మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోతోంది. కేజీ బేసిన్‌ ద్వారా ధీరూభాయిఅంబానీ (డి`6) బావుల నుంచి రోజుకు 13.65 మిలియన్‌ మెట్రిక్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల (ఎన్‌ఎంఎస్‌సిఎండి) గ్యాస్‌ను సరఫరా చేయాల్సి ఉండగా, రిలయన్స్‌ మాత్రం రోజుకు 6 ఎన్‌ఎంఎస్‌సిఎండి గ్యాస్‌ మాత్రమే సరఫరా చేస్తోంది. డి`6 గ్యాస్‌ ఉత్పత్తి తగ్గిపోవటం వల్లే తాము రాష్ట్రంలోని విద్యుత్తు కేంద్రాలకు తగినంత గ్యాస్‌ను సరఫరా చేయలేకపోతున్నామని రిలయన్స్‌ బుకాయిస్తోంది.       అయితే ఈ సహజవాయువు క్షేత్రాలు ఆంథ్రా తీరప్రాంతంలో ఉన్నందున మిగిలిన బావుల నుంచి ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను కూడా మన విద్యుత్తు కేంద్రాలకు సరఫరా చేయవచ్చు. కానీ, రిలయన్స్‌ అలా చేయకుండా డి`6బావుల నుంచి వచ్చే గ్యాస్‌ను మాత్రమే ఇస్తామంటోంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. రాష్ట్రప్రభుత్వానికి రిలయన్స్‌కు మధ్యన ఉన్న అవగాహన ప్రకారం కేజీ బేసిన్‌ నుంచి సరఫరా అయ్యే గ్యాస్‌లో 13.65 ఎన్‌ఎంఎస్‌సిఎండి గ్యాస్‌ను మన విద్యుత్తు కేంద్రాలకు అందజేయాలి. అంతేకానీ, కేవలం డి`6 బావుల నుంచి వచ్చే గ్యాస్‌ను మాత్రమే సరఫరా చేయాలన్న నిబంధనలేవీ లేవు. కానీ, ఈ బావిలో ఉత్పత్తి తగ్గిపోయినందున ఆంధ్రాకు సహజవాయువు సరఫరాను తగ్గించాల్సి వచ్చిందని రిలయన్స్‌ అంటోంది. ఇక్కడ మరోవాదన కూడా వినిపిస్తోంది. రిలయన్స్‌ సంస్థ కావాలనే గ్యాస్‌ ఉత్పత్తిని తగ్గించిందని, గ్యాస్‌రేట్లను పెంచేందుకే ఆ సంస్థ ఇటువంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందని విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా రిలయన్స్‌ చర్యల వల్ల రోజుకు సుమారు 1500 మెగావాట్ల విద్యుత్తుఉత్పత్తి లోటు ఏర్పడిరది. సహజవాయువు సరఫరాను పెంచాలని స్వయాన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని కోరినప్పటికీ, ఇప్పటి వరకూ ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు.

రాష్ట్రపతి వోటర్లలో 31 శాతం క్రిమినల్సే

 భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశం. ఈనెల 19వ తారీఖున మనం 13వ రాష్ట్రపతిని ఎన్నుకోబోతున్నాం. ఈ ఎన్నికకు ప్రజలంతా పరోక్షంగా మాత్రమే పాల్గొంటారు. అంటే మన ఎంఎల్‌ఏలు యంపిలు మన తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో వోట్లు వేయబోతున్నారు. ఇలా వోట్లు  వేయబోతున్న వారిలో  31 శాతం మంది క్రిమినల్స్‌ అని వారిపై అనేక కేసులు ఉన్నాయని స్వయానా వారు  సమర్పించిన అఫిడవిట్లే చెబుతున్నాయి. వీరిలో 141 మంది పై మర్డర్‌కేసులు , 90 మందిపై  కిడ్నాప్‌ కేసులు ఉన్నాయి.   మొత్తం 641 మందిపై  సీరియస్‌ క్రిమినల్‌ కేసులు  అంటే రేప్‌ , మర్డర్‌, కిడ్నాప్‌ ,దోపిడీల వంటి కేసులు ఉన్నాయి. 6 గురు ప్రజాప్రతినిధులు రేప్‌కేసుల్లో ఉన్నారు. 352 మంది మీద మర్డరు కేసులు నమోదయ్యాయి. 141 మంది మర్డరు కేసుల్లో సహా నిందితులు.145 మందిపై దొంగతనం కేసులు  ,90 మందిపై  కిడ్నాప్‌ కేసులు ఉన్నాయి. వీరిలో  75 మంది కోర్టు తీర్పులో దోపిడిదొంగలుగా నిర్ధారించబడ్డవారే. ఈ క్రిమినల్‌ పొలిటీషన్‌లలో ఎక్కవ మంది బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లకు చెందిన వారే కావడం విశేషం ప్రజాప్రతినిధుల్లో 48 శాతం మంది కోటీశ్వరులే. ఈ కోటీశ్వరుల్లో మన రాష్ట్రానికి చెందిన వారు 15 మంది ఉన్నారు. అంటే వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్దుల భవితవ్యాన్ని నేరస్తులు, కోటీశ్వరులే నిర్నయించోతున్నారన్నమాట!

జగన్‌కు మేలు చేస్తున్న కిరణ్‌కుమార్‌

రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పరోక్షంగా వై.కా.పా.అధినేత జగన్‌కు మేలు చేస్తున్నారు. 26 వివాదస్పద జీఓల జారీపై కిరణ్‌కుమార్‌రెడ్డి తన మంత్రి వర్గ సహచరులను వెనుకేసుకురావటం పరోక్షంగా జగన్‌కు ఉపయోగపడబోతోంది.  జగన్‌పై విచారణ చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు , వివాదస్పద జీఓలు జారీ చేసినందుకు ఆరుగురు మంత్రులపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు సిబిఐను ఆదేశించాయి. ఈ రెండు కేసులకు చాలా సారుప్యత ఉంది. ఈ రెండు కూడా జగన్‌ అక్రమాస్తుల కేసులకు ముడిపడి ఉన్నవే. అయితే జీఓల జారీ కేబినెట్‌ సమిష్టి నిర్ణయమని, కిడ్‌ప్రోకోలో మంత్రులెవరికీ ప్రమేయం లేదని, కిరణ్‌కుమార్‌రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఆయన తన మంత్రివర్గ సహచరులకే కాకుండా జగన్‌కు కూడా క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు అయింది. దివంగత వైఎస్‌ కూడా అప్పటి కేబినెట్‌లో భాగమేనని, అందువల్ల కిరణ్‌కుమార్‌ ప్రకటన ఆయనకు కూడా వర్తిస్తుందని, వైఎస్‌ కూడా కిడ్‌ప్రోకో కింద లబ్ది పొందలేదని భావించాల్సి ఉంటుందని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. అంతేకాక కోర్టులో కూడా జగన్‌ లాయర్లు ఈ ప్రకటనను చూపి తమ క్లయింట్‌ అమాయకుడని చెప్పడానికి ప్రయత్నించబోతున్నారు.  కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రకటన తన మంత్రివర్గ సహచరులతో పాటు జగన్‌కు కూడా ఊరట కలిగించే పరిస్థితి ఏర్పడిరది.