అన్నన్న ఎంత పనిచేశావు కొడాలి నాని
posted on Jul 10, 2012 @ 3:14PM
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఓ నాటకానికి తెరలేపారు. తెలుగుదేశం పార్టీ తరుపున గుడివాడ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాని ఇటీవల మూడు నెలల పాటు హైడ్రామా నడిపారు. ఉప ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అథినేత చంద్రబాబునాయుడును ప్రచారంలో ఉండగా కలిసిన నాని తాను తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్లనని హామీ ఇచ్చారు.
అయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాథ్యక్షురాలు విజయమ్మను నాని కలిశారు. ఈ విషయం వార్తల్లో గమనించిన తెలుగుదేశం పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ గురించి తెలియని నాని జగన్‌ను చంచల్‌గూడా జైలులో కలిశారు. అప్పుడే అక్కడ మీడియా ప్రతినిథులు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేశారు కాబట్టి వైఎస్ కాంగ్రెస్‌లోకి చేరినట్లేనా అని ప్రశ్నించింది. దీనికి ఆశ్చర్యపోయిన నాని తాను వ్యక్తిగతంగా కలిశానని, అసలు నన్ను పార్టీ సస్పెండ్ చేసిందా? అని, అంటే నేను దేశం బయట ఉన్నట్లేనా? అని ప్రశ్నించటం పత్రికల ప్రతినిధులను విస్తూపోయేలా చేసింది. ఏమీ తెలియకుండానే వై.కా.పా. నేతలను నాని కలిశారా? అని అందరూ అనుకునేలా ఈ సంఘటన జరిగింది.
ఈలోపు తెలుగుదేశం ఎమ్మెల్యే దేవినేని ఉమా ఓ సంచలన ప్రకటన చేశారు. నాని 30కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారని ఉమా ఆరోపించారు. పరిటాల రవి హంతకుల చెంత చేరిన నానిని ప్రజలు క్షమించరని ఆయన విమర్శించారు. ఈ మొత్తం ఘటనలన్నీ ఒకదాని వెంట ఒకటి పరిశీలిస్తే నాని ఎప్పటి నుంచో వై.కా.పా.లో చేరతానంటున్నారు. ఇప్పుడు చేరిపోయినట్లే. మరి ఇంత నాటకం ఎందుకు? అన్న అంశమే తేలాలి. ఇంకా నాని తెలుగుదేశం పార్టీలో ఉండటానికి ఇష్టపడితే సీను రివర్సు అవుతుంది. అప్పుడు నాటకం మళ్లీ మొదటికొస్తుంది. ఏదేమైనా మూడు నెలల నుంచి నానికి టిడిపి అథినేత చంద్రబాబు బుజ్జగించటం ద్వారా కొంత ఇమేజ్ తెచ్చిపెట్టారు. ఇప్పుడు సస్పెండ్ చేసి ఆ ఇమేజ్‌ను వై.కా.పా.లో పెంచారు. ఏమైనా నాని నాటకంలో ఇంకా ఎన్ని అంకాలు కొత్తగా తెరపై చూడాలని అంశంపై ఆసక్తి పెరుగుతోంది.