అవినీతి మరిచిన ధర్మాన కమిటీ?
posted on Jul 9, 2012 @ 7:06PM
అసలు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వసనీయతే కొరవడి౦దని 2012 ఉప ఎన్నికలు నిరూపించాయి. ఇదే విషయాన్ని ఆ పార్టీలో ఉన్న సీనియర్లు నమ్ముతున్నారు. కేవలం అవినీతి మంత్రులను ప్రోత్సహించటం, వారిని కాపాడేందుకు సిఎంతో సహా అందరూ ప్రయత్నించటం ఉప ఎన్నికల వైఫల్యానికి కారణమని ఓ పరిశీలనలో తేలింది. సీనియర్లు కూడా అవినీతి బాగా పెరిగిపోయిందని అథిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీనిపై అసలు స్పందనే రాలేదు. పైగా అసలు వాస్తవాలు పరిశీలించి పార్టీని, ప్రభుత్వాన్ని సరైన దారిలో నడిపించేందుకు మంత్రి థర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం అవినీతి ఛాయలకే పోలేదు. ఈ విషయమే చర్చించలేదు.
అవినీతి వల్లే సిబిఐ మంత్రులకు నోటీసులు ఇస్తోందని రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపువచ్చినా ఈ ఒక్క విషయాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదు. అవినీతికి పాల్పడిన మంత్రులే పోతారనుకుని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మౌనం వహించటం కూడా ప్రజల్లో విశ్వసనీయతను దెబ్బతీసింది. గత అనుభవాల సారాంశం కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి అథికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగితే కిలో బియ్యం రూ.1.90కు ఇస్తామని ప్రకటించారు. ఆయన మాటపై నమ్మకం లేక ఎన్టీఆర్‌కు కిలో రెండు రూపాయల బియ్యంకే పేదలు ఓట్లేసారు. ఈ ఘటన రాజకీయాల్లో తీవ్ర సంచలనమైంది. పేదల్లో ఉన్న విశ్వసనీయతను చాటుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ హయాంలో భూ పంపిణీలు సాగినందున దానిపై చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ కాలక్షేపం చేస్తే ప్రజల్లో ఉన్న కొద్దిపాటి నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం తప్పదు. తాజాగా మంత్రివర్గ ఉపసంఘం మంత్రి తోట నర్సింహం ఇంట్లో సమావేశమైంది. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికీ, పార్టీకీ సమాచారం పంపిస్తోంది. అంతేకానీ పార్టీలో పేరుకుపోయిన అవినీతి గురించి మళ్లీ ప్రస్తావించటం మరిచింది. సహచర మంత్రులపై అభిమానంతో ఈ కమిటీ ఇలానే సమావేశమైతే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర అనుభవాలను చవి చూస్తుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.