సంపూర్ణమద్యపాన నిషేధం అసాధ్యమా?
posted on Jul 10, 2012 9:03AM
సంపూర్ణమద్యపాన నిషేథం అన్నమాట రాష్ట్రంలోని ఏదో ఒక మూల రెండునెలలుగా వినిపిస్తోంది. పీసిసి చీఫ్ బొత్సా సత్యన్నారాయణ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అజెండాలో ఈ అంశం చోటు చేసుకుంటుందన్నప్పటి నుంచి మహిళలు ఉద్యమించటానికి కూడా వెనుకాడటం లేదు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలోని రాజోలు మండలంలోని ఓ గ్రామంలో మహిళలు అందరూ మద్యపానానికి వ్యతిరేకంగా ఊరేగింపు జరిపారు. వీరి తరువాత ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి మద్యపాననిషేథం పెట్టాలని ఎమ్మెల్యే భూమా కరుణాకరరెడ్డి ఆందోళన చెపట్టారు. దీని తరువాత తాజాగా అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం గాజులపల్లి గ్రామంలోని వందలాది మంది మహిళలు తమ ప్రాంతాన్ని మద్యరహితంగా తీర్చిదిద్దాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు.
బ్రాహ్మణపల్లిలోని ఎక్సయిజ్ సిఐ కార్యాలయాన్ని ముట్టడించారు. రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవించే తమ కుటుంబాల గురించి ప్రభుత్వం, ఎక్సయిజ్ శాఖలు ఆలోచించాలని, ఇంట్లో ఉన్న సరుకులు కూడా బజారుకు తెచ్చి మరీ తమ భర్తలు మద్యం తాగుతున్నారని వాపోయారు. పిల్లలకు సరిగ్గా తిండి పెట్టలేని తమ దుస్థితికి మద్యపానమే కారణమని, ఒక్క తమ గ్రామంలో నిషేధాన్ని అమలు చేయాలని మహిళలు కోరారు. ఈ మేరకు ఎక్సయిజ్ సిఐ గురునాథరెడ్డికి, పుట్టపర్తి రూరల్ ఎస్‌ఐ నగేష్‌బాబుకు వినతిపత్రం కూడా సమర్పించారు. రోజుకో ప్రాంతంలో ఇలా ఆందోళన చేపట్టేందుకు గతంలో మాదిరిగా పరిస్థితులు మారుతున్నాయి. అప్పట్లో యువకులు కూడా ఫ్యాషన్‌గా మద్యం తాగేవారు. అవే పరిస్థితులు నేడు పునరావృతం అయ్యాయి.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడు తొలిసంతకాన్ని మద్యపాననిషేధం ఫైలుపైనే చేయటం ఎవరూ మరిచిపోయి ఉండరు. ఆయనను అప్పట్లో ప్రేరేపించినట్లే తాజాగా గాజులపల్లి గ్రామంలోని మొత్తం మహిళలు అందరూ ఆందోళనలో పాల్గొన్నారు. ఇదే విధమైన ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుందని రాష్ట్రమహిళానేతలు భావిస్తున్నారు. తాజాగా జరిగిన మద్యం దుకాణాల కేటాయింపులో మహిళల పేరిట కొన్ని మంజూరయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మహిళలకు కేటాయించటం ఇదే తొలిసారి. గతంతో పోల్చుకుంటే ఇటీవల యువతులు కూడా మద్యం వైపు మొగ్గు చూపుతున్నారని సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంపూర్ణమద్యపాన నిషేధానికి మహిళలు ఏకతాటిపై ఉద్యమించటం అసాథ్యమని పలు పార్టీల నేతలు భావిస్తున్నారు. గతంలో యవత ఎక్కువగా ఉద్యమంలో సహకరించినందున సంపూర్ణమద్యపాన నిషేధం సాధ్యమైంది. ఇప్పుడు యువతులే మద్యం సేవిస్తుంటే వారు భారీసంఖ్యలో పాల్గొనే అవకాశాలు కనిపించటం లేదు