రాష్ట్ర విద్యుత్ కోతలకు గుజరాత్ గ్యాస్‌కంపెనీలే కారణమా?
posted on Jul 11, 2012 9:15AM
ప్రభుత్వాలన్నీ చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటాయేమో అని అనుకోవాలి. అసలు కాకినాడలో గ్యాస్‌ప్లాంటు కట్టి గుజరాత్‌కు గ్యాస్ సరఫరా చేస్తున్న జిఎస్‌పిసి(గుజరాత్‌స్టేట్ పెట్రోలియం కార్పొరేషను), రిలయన్స్‌ల గురించి గతంలో ఎన్నో ఆందోళనలు జరిగాయి. పీఆర్పీ కూడా గతంలో ప్రధానంగా ఈ విషయమై ఆందోళన చేసింది. ఆంథ్రప్రదేశ్‌లో వెలికితీసిన గ్యాస్‌ను గుజరాత్‌కు 62శాతం తరలిస్తుంటే ముందు ఎందుకు మౌనం వహించారు? అన్న మిలియన్‌డాలర్ల ప్రశ్నకు రాష్ట్రపాలకులు మౌనమే సమాధానం అవుతోంది. అసలు ఈ ఉత్పత్తికి వెనుక జరిగిన వాస్తవాలు ఆంథ్రప్రదేశ్ ప్రభుత్వం అంధత్వపాలనకు నిదర్శనమని విమర్శలు చెలరేగుతున్నాయి.
మొదట తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జిఎస్‌పిసి నిర్మాణం ఒప్పందం జరిగింది. దీని కార్యకలాపాలు అప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. దీనికి జతగా రిలయన్స్ కూడా తోడైంది. ఈ సంస్థ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైంది. సాక్షాత్తూ రిలయన్స్ అధినేత ముఖేష్‌అంబానీ కాకినాడ వస్తే సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, కేంద్ర పెట్రోలియం బృందం కూడా ఇక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడారే కానీ, ఆంథ్రాకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడలేదు. ఈ విషయాన్ని గుర్తించిన పీఆర్పీ నేతలు ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గ్యాస్‌ప్లాంటు ఇక్కడ పెట్టి కేవలం 38శాతం వాటాగా ఇస్తామనటం అన్యాయమని అప్పట్లోనే నిరసనకారులు స్పష్టం చేశారు. ఆ సంస్థలు 70 నుంచి 80శాతం గ్యాస్ రాష్ట్రంలోనే సరఫరా చేస్తే విద్యుత్తు కొరతే ఉండేది కాదని తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అంగీకరించారు. అప్పట్లోనే నిరసనకార్యక్రమాలకు స్పందనగానైనా ఆ కంపెనీలను రాష్ట్రప్రభుత్వం పిలిపించి మాట్లాడి ఉంటే ఇప్పుడు సమస్యే వచ్చేది కాదనేది అందరూ అంగీకరించాల్సిన విషయం. ఒకసారి ఆంథ్రలో గ్యాస్ సరఫరా పెంచమంటే సరిపోయేది. ఒక్కసారి కూడా ఆ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడకపోవటం వల్ల ఈ సమస్యను కేంద్రమే పరిష్కరించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంథ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అలుసుగా తీసుకునే ఇటువంటి కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
రాష్ట్రంలో విద్యుత్తు కోతకు అసలు కారణం గ్యాస్ ఉత్పత్తి చాలకపోవటమే. కాకినాడ నుంచి తరలిపోతున్న గ్యాస్‌లో 70శాతం కొన్నాళ్లపాటు విద్యుత్తు సరఫరాకు కేటాయిస్తే కొత్తప్లాంటులు ఏర్పాటు చేసుకునేంత వరకూ కోత విధించాల్సిన అవసరమే ఉండదు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 9,500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అయితే గ్యాస్‌ద్వారా మాత్రం 2700మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. గ్యాస్‌కొరత ఇంకో 1500మెగావాట్ల విద్యుత్తును దెబ్బతీస్తోంది. కేంద్రమంత్రి శరద్‌పవార్‌ను సహకరించాలని సిఎం కోరారు. దీనికి స్పందించిన మంత్రి పవార్ మాట్లాడుతూ పెట్రోలియం కంపెనీల వ్యవహారాలు పర్యవేక్షించే కమిటీలో తాను, ప్రణబ్‌ముఖర్జీ మాత్రమే సభ్యులమన్నారు. రాష్ట్రపతి రేసులో ఉన్న ప్రణబ్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయటంతో తాను ఒక్కడినే ఆ కమిటీలో మిగిలానని, తాను ఆంథ్రప్రదేశ్ కోసం వీలైనంత వరకూ ఈ సమస్యను పరిష్కరించేందుకు పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.