జె.డి.లక్ష్మీనారాయణ ఆస్తులపై కన్నేసిన జగన్‌

సి.బి.ఐ . జాయింట్‌ డైరక్టర్‌ లక్ష్మీనారాయణ కాల్‌ లిస్ట్‌ను ప్రపంచానికి వెల్లడి చేసి ఆయనను ఇరుకున పెట్టిన జగన్‌ శిబిరం ఇప్పుడు ఆయన ఆస్తులపై కన్నేసినట్లు తెలిసింది. లక్ష్మీనారాయణ గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు ? అక్కడ ఆయనకు గాని  ఆయన బంధువులకు గాని ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఆయనకు ఆయా ప్రాంతాల్లో ఎవరైనా విరోధులు ఉన్నారా? అన్న విషయాలను ఆరా తీస్తున్నారు. దీనికై జగన్‌ శిబిరం ఒక ప్రైవేట్‌ డిటెక్టీవ్‌ ఏజెన్సీని నియమించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.     లక్ష్మీనారాయణ మహరాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో పోలీస్‌ సూపరింటిండెంట్‌గా పని చేశారు. కొంతకాలం యాంటి టెర్రరిజం స్క్వాడ్‌లో పని చేశారు.  ఆయన పని చేసిన జిల్లాలో ఆయనకు గాని ఆయన బంధువుల పేరిట గాని ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఆయనను వ్యతిరేకించిన వారెవరైనా ఉన్నారా అన్న విషయాలు ఆరా తీస్తున్నారు. సమాచార హక్కు చట్టంక్రింద ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు లక్షీ నారాయణ ప్రకటించిన ఆస్తులపై సమాచారం కోరినట్లు తెలిసింది. మహరాష్ట్రలో ఆయనకు కొద్ది పాటి ఆస్తులు ఉన్నట్లు తెలిసింది.   అయితే వాటి విలువ ఎంత?  దీని కొనుగోలులో ఏమైనా అవకతవకలు జరిగాయా ? ఈ ఆస్తులు కొన్నప్పుడు వాటి మార్కెట్‌ విలువ ఎంత? రిజిస్ట్రేషన్‌ను ఎంతకు చేశారు. ఎవరి వద్ద కొనుగోలు చేశారు ? అన్న వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ లావదేవీల్లో ఏ చిన్నపాటి లోపం కనిపించినా దానిపై  నానా యాగీ చేసి ఆయనను ఇరుకున పెట్టాలని జగన్‌ శిబిరం ఆశిస్తోంది. లక్ష్మీనారాయణ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నారు. ఆయన ఈనెల 16 వ తేదీన తిరిగి ఇండియా రానున్నారు. ఆయన వచ్చేలోగా ఏదైనా సెన్సేషన్‌ క్రియేట్‌ చేయాలనే తలంపుతో జగన్‌ శిబిరం ఉంది.

కాంగ్రెస్‌, ‘దేశం‘ కు షాకివ్వబోతున్న ఆ ఎనిమిది మంది ఎం.ఎల్‌.ఎ.లు ఎవరు ?

ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అవుతుందో వాడే...... పండుగాడు అనే డైలాగ్‌ మహేష్‌ బాబుతో పోకిరి  సినిమాలో పూరీజగన్నాద్‌ చెప్పించినా ప్రస్తుత రాజకీయాలలోకి ఇదే స్టయిల్‌ మెయింటిన్‌ చేస్తున్నారు వైసిపి అధ్యక్షులు వైయస్‌ జగన్‌. తనకంటూ వ్యక్తిగత ఇమేజ్‌ లేదు. తండ్రినుండి వచ్చిన ప్రజాకర్షక పధకాలను వారసత్వ ఓట్లగా మార్చుకోవడమే తప్ప. తనేం పెద్ద వక్తకాదు. రాజకీయ అనుభవశాలి అంతకన్నాకాదు. తన బలం కన్నా ప్రత్యర్థుల బలహీనతలే ఆయన ఆయుధంగా వాడుకుంటున్నారు. మొన్నజరిగిన ఉప ఎన్నికల్లో 18 సీట్లలో 15 సీట్లు గెలుచుకొని, తెలంగాణాలో నువ్వానేనా అనే పోటీనిచ్చిన జగన్‌ పార్టీ, అత్యధిక మెజారీటీతో పార్లమెంటు స్ధానాన్ని సంపాదించుకొని 10 జనపథ్‌ రోడ్డులోని దేశానికి కాబోయే ప్రిన్స్‌కి నిద్రలేకుండా చేశారు. ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్‌ నుండి ఎవ్వరు వెళ్లినా బిజీగా ఉన్నామంటూ నెలలు తరబడి తిప్పే రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, చిదంబరం, మొదలైన వాళ్లంతా ఇప్పుడు ఎవ్వరు ఎప్పుడెళ్లినా, ఒక్కరుగా అయినా సరే, గుంపుగా అయినా సరే రండి రండి అంటూ ఆహ్వానం పలుకుతున్నారు. ఆరోడ్డులో ఎవరైనా ఎపి నుండి వచ్చినట్లనిపించినా  పలకరిస్తున్నారు. అలా అయిపోయింది వారి పరిస్థితి. మంతనాలు, రిపోర్టులు, సర్వేలతో  కుస్తీ పడుతున్నారు. ఇదే గాలి 2014 లో కూడా వీస్తే పరిస్ధితి ఏంటా అని నిద్రలేకుండా గడిపే పరిస్థితి డిల్లీ పెద్దలకు పట్టింది. రాష్ట్రంలో ప్రధాన పతిపక్షమైన  తెలుగుదేశం పార్టీని  కూడా కోలుకోలేని దెబ్బ తీసాడు జగన్‌ . అసలే మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటికూడా అసెంబ్లీ స్థానాలను గెలుచుకోలేకపోయామన్న బాధలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. గోరు చుట్టుపై రోకటి పోటులాగా  ఆపరేషన్‌ ఆకర్ష పేరుతో  తెలుగుదేశం పార్టీ లోని నాయకుల్నందర్నీ వైసిపి పార్టీలోకి లాగే ప్రక్రియ కొనసాగిస్తున్నారు జగన్‌. తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు, కుటుంబపోరుతో సతమతమవుతున్న చంద్రబాబునాయుడికి  ఈ వ్యవహారం మూలిగే నక్కపై తాటికాయపడినట్లు అయ్యింది. తెలుగుదేశం పార్టీకి సెంటుమెంటు స్ధానమైన గుడివాడ నియోజకవర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ ఫిరాయించడంతో తెలుగుదేశంలో గగ్గోలు మొదలైంది. పార్టీ నిర్లక్ష్యంచేస్తుందని, తను జూనియర్‌ యన్టీఆర్‌ ద్వారా  తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందువల్లే  చంద్రబాబునాయుడు ప్రక్కన పెడుతున్నారని, యస్‌,సి., బిసిల ఓట్లు వైసిపికి ఉన్నాయి కాబట్టి వైసిపి లోకెళుతున్నానని నాని ఎన్ని మాటలు చెప్పినా ఒక్కటి మాత్రం నిజం గెలుపుగుర్రాన్ని ఎవరు ఒదులుకుంటారు. ప్రస్తుతానికి ప్రజాకర్షక పార్టీ వైసిపి అని మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. దాంతో నాయకులంతా ఆ పార్టీలోకి వెళ్ళడానికి క్యూ కడుతున్నారు. అదేంటో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఇంతే. తెలుగుదేశం నుండే ఎక్కువ వలసలు జరిగాయి. తెలుగుదేశం పార్టీలో ఇక్కడితో నాయకులు జంప్‌లు ఆగిపోవని అధిష్టానానికి తెలుసు. అందుకే అంత రభస. కృష్ణాజిల్లాలో ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మేల్యేలు పార్టీ వీడటానికి సిద్దంగా ఉన్నారనే విషయమే నాయకులను కలవర పరుస్తోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాలో కూడా పరిస్థితి ఇందుకు విరుద్దంగా ఏమీ లేదని నాయకులకు ఉప్పందుతుండటంతో తెలుగుదేశం నాయకులకు కంటికి నిద్ర కరువయ్యింది. ఈ మూడు జిల్లాల నుంచి కనీసం ఎనిమిది మంది కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు చెందిన శాసన సభ్యులు జగన్‌ పంచన చేరడానికి గ్రీన్‌ సిగ్నల్‌ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది దాంతో చంద్రబాబుని పరామర్శించడానికి బాలకృష్ట పని కట్టుకొని వచ్చి పరిస్థితిని పరీక్షించవలసి వచ్చింది. అసలే రెండుకళ్ల సిద్దాంతంతో తెలంగాణకు దూరం అయిన చంద్రబాబుకు ఆంద్రలో కూడా ఓట్లు పడని పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు. కాంగ్రెస్‌ పరిస్థితి అంతే. ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి నాయకులు సైలెంట్‌గా ఉన్నారు. రాబోయే ఎన్నికలకు ఎలాగా అని ముందుచూపున్న వారంతా వాళ్ల పిల్లల్ని వైసిపికి పంపుతున్నారు. దానికి తార్కాణం తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి కుమార్తె  వైసిపిలో చేరారు. రాజమండ్రి కి చెందిన మంత్రి పినిపే విశ్వరూప్‌ తనయుడిది అదేతీరు. కాంగ్రెస్‌ నాయకుడు దివంగత జనార్దన్‌రెడ్డి (పిజెఆర్‌) కుమార్తె విజయకూడా చెంచల్‌గూడ జైలులో జగన్‌ ను కలిసారు. ఇప్పుడు అధికార కాంగ్రెస్‌ పార్టీలో అంతగా వలసలు లేక పోయినా వచ్చే ఎన్నికలనాటికి తీవ్రత హెచ్చయ్యే ప్రమాదం లేకపోలేదు. మునిగిపోయే ఓటి పడవల్లో ఉండటానికి ఎవరూ ఇష్టపడటం లేదు. ఒక్కడంటే ఒక్కడు అదీ చెంచల్‌గూడ జైల్లో నుంచి మహా మహానాయకుల్ని మట్టికరిపిస్తున్నారు.  

చంచల్‌ గూడాజైలులో ములాఖత్‌కు ముడుపు చెల్లించాల్సిందే

హైదరాబాద్‌లోని చంచల్‌ గూడా జైలు పలువురు వి.ఐ.పి. ఖైదీలతో కళకళలాడుతోంది. ఈ వి.ఐ.పి.  ఖైదీల పుణ్యమాని జైలు అధికారులు నాలుగు కాసులు వెనుకేసుకోగలుగుతున్నారు. ఈ ఖైదీలకు వారు కోరుకునే ఫుడ్‌ చేయించుకుని తినే ఫెసిలిటీ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకుంటున్న వి.ఐ.పి. ఖైదీల్లో కొందరు జైల్లో విందు భోజనాలు తయారు చేయించుకుంటున్నారు.ఈ  పసందైన విందు బోజనాలను అతిధి ఖైదీలతో పాటు  జైలు ఆధికారులు కూడా ఆరగించి బ్రేవ్‌మని తేన్చుతూ అన్నదాతా సుఖీభవ అంటూ  ఆశీర్వదిస్తున్నారు.      ఎక్కడైనా బావేగాని వంగతోటకాడ బావ కాదన్నట్లు ముడుపులు పుచ్చుకునే విషయంలో మాత్రం జైలు అధికారులు ఏమాత్రం సెంటిమెంట్‌కు, స్నేహనికి తావివ్వడం లేదు. వి.ఐ.పి. ములాఖత్‌కు వచ్చేవారిని  ముడుపులు చెల్లిస్తేనే లోనికి అనుమతిస్తున్నారు. తమ జైల్లో వి.ఐ.పి.లు ఎప్పుడోగాని రారని, అటువంటి వారిని చూడటానికి వచ్చేవారి నుంచి తృణమో , ఫణమో ఆశించడంలో తప్పేమి లేదన్నని జైలు సిబ్బంది అభిప్రాయం. జైలులో మగ్గుతున్న నూకారపు సూర్యప్రకాశరావును చూడటానికి పలువురు ములాఖత్‌కు వస్తుండడంతో జైలు సిబ్బంది వారిని ఆపివేశారు. దీంతో వారు నెలకు ఇంత చొప్పున ఇస్తామని బేరం కుదుర్చుకున్న తర్వాత  నూకారపు భార్య, కూతురితో పాటు మరి కొందరిని లోనికి రెగ్యులర్‌గా అనుమతిస్తున్నారు.

బి.సి. పార్టీ ఏర్పాటుకు జైలులోనే సన్నాహలు చేస్తున్న నూకారపు

రాష్ట్రంలో మరో బి.సి .పార్టీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు  జరుగుతున్నాయి. బ్యాంకును మోసం చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నూకారపు సూర్యప్రకాశరావు మరో కొత్త బిసి పార్టీ పెట్టే దిశలో ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తున్నది. నేటి దినపత్రిక సూర్య అధినేత అయిన ప్రకాశరావు టెలివిజన్‌ ఛానల్‌ కూడా ప్రారంభించేందుకు ఆయన అనుయాయులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ డిసెంబర్‌లోగా టివి ఛానల్‌  ప్రారంభమవుతుందని, అనంతరం కొత్త పార్టీని లాంచ్‌ చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.     ఇప్పటికే ఆయన జైలులోనే తన పత్రిక బ్యూరో ఇన్‌చార్జిలతో సమాలోచించినట్లు సమాచారం. శిక్షా కాలం పూర్తికాకముందే తాను బయటకు వస్తానని, సూర్య దినపత్రికకు బడుగుల పత్రిక అని పేరున్నదని, దీనిని ఆసరాగా చేసుకుని పార్టీ పెడితే భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆయన బ్యూరో ఇన్‌చార్జిలను ఆడిగినట్లు తెలిసింది. అయితే టిడిపి బడుగుల బాటను అనుసరించడం, మిగిలిన పార్టీలూ బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని బిసి సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య కోరిన విషయం తెలిసిందే. అయితే బి.సి.ల కోసం కాసానిజ్ఞానేశ్వర్‌ మన పార్టీ స్ధాపించి బి.సి.లను ఉద్దరించాలనుకున్నారు. దీని కోసం న్యూస్‌ ఛానల్‌ కూడా ప్రారంభించాలను కున్నారు.చివరకు ఆయన పార్టీని నట్టేట ముంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ స్థాపించాలన్న నూకారపు ఆశయం ఏమేరకు అమలవుతుందో చూడాలి.  

కిరణ్‌ సర్కార్‌కు ముప్పుగా మారిన పవర్‌ కట్స్‌

ప్రభుత్యానికి ముందుచూపు లేక రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయింది. చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని స్వర్ణాంద్రప్రదేశ్‌ గాను, దివంగత ముఖ్యమంత్రి హరితాంద్రప్రదేశ్‌గాను మార్చాలని ఎంతగానో ప్రయత్నించారు. అయితే ఇప్పుడున్న కిరణ్‌కుమార్‌ ప్రభుత్వం మాత్రం రాష్ట్రాన్ని అంధకారాంద్రప్రదేశ్‌ గా మార్చింది. మన రాష్ట్రానికి 11,352 మెగావాట్ల విద్యుత్‌ అవసరం వుండగా 90142 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి మాత్రమే అవుతుంది.  మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు అడ్డగోలుగా గోదావరి , కృష్ణాజలకు అడ్డుగా ప్రాజెక్టులు కట్టి  రాష్ట్రంలోకి  జలాలను రాకుండా అడ్డుకున్నారు. దీనికి తోడు వర్షాభావ పరిస్థుతులతో జలాశయాలు నిండుకోవండటంతో జల విద్యుత్‌ తగ్గిపోయింది.      మన రాష్ట్రంలో ఉన్న బొగ్గు ఆధారిత పవర్‌ ప్లాంటులన్నీ ఎప్పటివో కాబట్టి వాటి రిపేర్లకే ఎక్కువ సమయం కేటాయించ వలసివస్తుంది. దాంతో రాష్ట్రంలో 8 ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలన్నుప్పటికి అవసరాలకు సరిపడా విద్యుత్‌ను   ఉత్పత్తి చేయటంలో  వెనుకబడిపోయాం. రిలయన్స్‌, గుజరాత్‌ గ్యాస్‌  సంస్థలు వారి రాష్ట్ర ప్రయోజనాలకే ఎక్కువ ప్రాముఖ్యల నిస్తూ మన రాష్ట్రవాటాగా రావలసిన భాగాన్ని రాకుండా చేస్తున్నాయి దీంతో . గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాలకు గ్యాస్‌ సరఫరా సరిగా లేనంనదున విద్యుత్‌ ఉత్పత్తి మరింత తగ్గింది.  ప్రభుత్వ మెతకవైఖరే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. అధికారుల ముందుచూపులేకుండా ఇప్పుడు ఏకంగా కోతలు విధించడం విడ్డూరం. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిపాలన మరింత కష్టాలను ఎదుర్కోవలసివస్తుంది. ఇప్పటికే  కరెంటు కోతలవల్ల పరిశ్రమలు మూత పడ్డాయి. కార్మికులు దీంతో విపత్కర పరిస్థితులకు లోనవుతున్నారు. ఒకప్ఫుడు పరిశ్రమలు పెడతామని బారులు తీరిన పారిశ్రామిక వేత్తలంతా రాష్ట్రాన్ని వదిలి పోయారు.     పల్లెల్లో రాత్రి 6నుండి ఉదయం 6వరకు కరెంటు లేక పోవడంతో రాత్రిపూట దోమలకు బలై ప్రజలు మలేరియా, ఫైలేరియా వంటి రోగాలు పడిన పడి ఆసుపత్రులకు సమయాన్ని , ధనాన్ని వ్యయపరచవలసి వస్తుంది. డిల్లీ హైదరాబాదుకు  రాష్ట్ర ి నాయకులు ఎన్ని సార్లు తిరిగినా ఎవ్వరూ కరెంటు సమస్యపై  కేంద్రాన్ని సహాయం కోరడం జరగటం లేదు. స్వప్రయోజనాలకే ప్రాముఖ్యత నిస్తూ, ప్రజలగురించి ఆలోచించడం మానేశారు. గడచిన మూడు సంవత్సరాలనుండి సరైన నాయకత్వంలేని కారణంగా ఆంద్రప్రదేశ్‌ అన్ని రంగాలలోనూ విపరీత మైన నిర్లక్ష్యానికి గురైందనటానికి ఇదొక ఉదాహరణ. దీనివల్ల పల్లె ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.హాస్పటల్‌ సేవలకు ప్రమాదం వాటిల్లుంతుంది. ప్రజారంజక ప్రభుత్వాలు కానందుకే ఇలాంటి పరిస్ధితులు దాపురించాయని ప్రజలు వాపోతున్నారు. రానున్న ఉపద్రవాన్ని పసిగట్టి ప్రత్యామ్నాయ యత్నాలుగా పవన  విద్యుత్‌ను, సోలార్‌ ఎనర్జీని ప్రమోట్‌ చేయటం  జరగలేదు. ప్రతిపక్షాలు దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నాయే తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పేరులోనే కిరణాలు గాని, రాష్ట్రం మొత్తం కటిక చీకటే. విద్యుత్‌ సమస్య కిరణ్‌ ప్రభుత్వ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తోంది. అయినా ఆయన ఏమి చేయలేని నిస్సహాయ స్దితిలో ఉన్నారు.

ఎన్టీఆర్ ఆఫీసుపై దాడి: హరికృష్ణ వివరణ

ఫిలింనగర్‌లోని జూనియర్ ఎన్టీఆర్ ఆఫీసుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈదాడిలో ఆఫీసు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో కార్యాలయం వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా బాద్షా సినిమా షూటింగ్ నిమిత్తం జూ.ఎన్టీఆర్ ఇటలీలో ఉన్నారు. దాడి గురించి తెలిసిన హరికృష్ణ కార్యాలయానికి వచ్చి పరిస్థితులను సమీక్షించారు. అయితే దీనిపై రాజ్యసభ సభ్యుడు ఎన్.టి.ఆర్.కుమారుడు హరికృష్ణ దాడి ఘటనను ఆకతాయిల పనిగా పేర్కొన్నారు. దీనిని కుటుంబాల మధ్య తగాదాగా భావించరాదని, అలా మార్చవద్దని హరికృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే దాడి చేసి తెలుగుదేశం పార్టీ పైన జూనియర్‌ను రెచ్చగొట్టే విధంగా కుతంత్రాలకు పాల్పడుతున్నారని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. జూనియర్ కార్యాలయంపై దాడి చేసిన దుండగులను అరెస్టు చేయాలని వారు కోరుతున్నారు.

ఓ తెలంగాణా ఓ కేసీఆర్‌ కథ

ఇదేమిటీ? ఓ తెలంగాణా...ఓ కేసీఆర్‌ కథ అంటారు అనుకుంటే పొరబాటే. ఈ కేసీఆర్‌ ఎవరో కాదు టిఆర్‌ఎస్‌ అథినేత. ఈయన తెలుగుదేశం పార్టీని వదిలి తెలంగాణా రాష్ట్రసమితి పార్టీ అథినేతగా మారినప్పటి నుంచి ప్రత్యేక తెలంగాణా పాటనే పాడుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు తుమ్మినా, దగ్గినా కూడా అది తెలంగాణా ఇచ్చేసేందుకే అని ఈయన సంబరపడుతుంటారు. దేనికోసమైతే తాము పార్టీ పెట్టారో ఆ లక్ష్యం త్వరలోనే నెరవేరుతుందన్న ఆశావాదం ఆయనికి గ్లూకోజు అందుకే సుగర్‌ వచ్చినా లెక్కచేయరు. ఎప్పుడు తెలంగాణా వస్తుందా అని భార్య భర్త కోసం గుమ్మంలో ఎదురుచూసినట్లే కేసీఆర్‌ కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. అందని ద్రాక్షపండు పుల్లన అన్నట్లు ఆయన తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన సమైక్యవాదులంటే కారాలు, మిరియాలు నూరేందుకు పార్టీలో ఒక పదవి ఇచ్చి మరీ హరీశ్‌రావును ప్రోత్సహిస్తున్నారు. కేసీఆర్‌ మాట హరీశ్‌రావు నొటెంట అని అందరూ అనుకుంటూ ఉంటారు. తెలంగాణా గురించి ఎవరూ అనుకోనప్పుడే మూడు నెలల్లో వచ్చేస్తుందని ఒకసారి, ఆరు నెలల్లో వచ్చేస్తుందని మరోసారి జోస్యాలు చెబుతూ కాలం గడిపేస్తుంటారు.     ఇదే తెలంగాణా పేరు చెప్పి తమ నేతలతో చేయించిన రాజీనామాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం కాదు కానీ ఉప ఎన్నికలు మాత్రం వస్తుంటాయి. అలాంటి ఉప ఎన్నికల్లో ఒకసారి బిజెపి చేతిలో ఒక అసెంబ్లీ స్థానాన్ని నష్టపోయారు కూడా. ఈయన హయాంలోనే ఇటీవల 2012 ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం తెలంగాణాలోని ఒక్క పరకాల అసెంబ్లీలో జరిగిన ఈ ఎన్నికల్లో కేవలం 1500ఓట్ల మెజార్టీతో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి భిక్షపతిని గెలిపించుకోవటానికి మొత్తం టిఆర్‌ఎస్‌ అంతా చెమటలు కక్కేసింది. ఒకదశలో ఓడిపోతామన్న బాధ, భయం టిఆర్‌ఎస్‌కు ఏర్పడిరది. కేసీఆర్‌ది ఐరన్‌ టంగ్‌ అన్నట్లు సునాయసంగా తెలంగాణావాదంపై గెలవాల్సిన ఈయన  పార్టీకి చావుతప్పి కన్నులొట్టపోయింది. ఏ సమైక్యవాద పార్టీ వల్ల తెలంగాణా రాదని ప్రచారం చేసి ఓటెయ్యవద్దని ప్రజలను హెచ్చరించారో ఆ వైఎస్‌ఆర్‌ కాంగ్రేస్‌ పార్టీ అభ్యర్థి కొండాసురేఖ టిఆర్‌ఎస్‌ నేతలకు ముచ్చెమటలు పోయించారు. ఆ చెమటలను తుడిచేసుకుని తెలంగాణావాదం గెలిచిందని హరీశరావు చేత ప్రచారం చేయించారు. ఇంకో విశేషమేమిటంటే ఈయన ఇంకేముంది తెలంగాణా వచ్చేసిందని అంటారో అప్పుడు అది ఖచ్చితంగా రాదు. ఈ ఇష్యూని పక్కకు తప్పించి వేరే సమస్యను ముందుకు  తీసుకురావటానికి కాంగ్రెస్‌ పార్టీ అలవాటు పడడింది. అందుకే ఇంకేముంది తెలంగాణా వచ్చేస్తుందని రాజీనామాలు చేసేయమంటే ఎన్నికలే వస్తున్నాయని కేసీఆర్‌ను సొంత పార్టీ ప్రతినిధులే విమర్శిస్తున్నారు. తాజాగా రెండు రోజుల నుంచి తెలంగాణా వచ్చేసిందని కేసీఆర్‌ చంకలు గుద్దుకోవటం చూసి మరేమవుతుందో అని టిఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కేసీఆర్‌ ఉత్సాహపడితే తెలంగాణా వస్తుందా? కేంద్రంలోని అందరూ తెలంగాణా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి కదా! ఏమైనా  నిరంతరం కొనసాగే ఈ కథకు టైటిల్‌ సరిపోయిందనుకుంటా. కథ కూడా ఇంకా సాగుతూనే ఉంది.

డీబీర్స్‌ గనుల తవ్వకాల నుంచి తప్పుకుంది?

వజ్రాలు, బాక్సయిట్‌, క్రోమ్‌ఖనిజం, ఇనుము, మాంగనీసు, విలువైన రాళ్లు, సీసం, జింకు, బంగారం వంటి గనులు తవ్వగలమని చెప్పి అనుమతి కోరిన డీబీర్స్‌ సంస్థ ఏడాది తిరగకుండానే తమకు ఇచ్చిన అనుమతి రద్దు చేయమని రాత పూర్వకంగా కోరింది. తాజాగా ప్రభుత్వమూ అనుమతులను రద్దు చేసింది. దీని వెనుక అసలు కథేమిటీ? అన్న ప్రశ్న తెరవెనుక పాత్రలను పరిచయం చేస్తోంది. ఇప్పటి వరకూ గనుల అక్రమతవ్వకాల్లో మాఫియాగా చెలామణి అవుతున్న కొందరు డీబీర్స్‌ సంస్థ నిర్వాహకులను బెదిరించారని ఒక కొత్తసమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ బెదిరింపుల కారణంగా తమకు వ్యాపారంలో మిగిలేదానికన్నా టెన్షన్‌ ఎక్కువ భరించాల్సి ఉంటుందనే ఈ తవ్వకాల నుంచి డీబీర్స్‌ తప్పుకుందంటున్నారు. అందుకే తమకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కూడా ఆ సంస్థ రాతపూర్వకంగా కోరింది.   2009 ఆగస్టులో డీబీర్స్‌ కంపెనీ తమకు 153.3 కిలోమీటర్లు అక్షాంశాలు, రేఖాంశాలు నిర్దేశిస్తూ గనుల తవ్వకాలకు అనుమతి కోరింది. మూడేళ్ల పాటు గనుల తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తరువాత 2010 జనవరిలోనే తాము తవ్వకాలు జరపలేమని, అనుమతులు రద్దు చేయమని ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకుంది. అనంతపురం, కడప జిల్లాల్లో ఈ కంపెనీ తీసుకున్న గనుల ప్రాంతంలో అసలు ఏమి లభ్యమయ్యే అవకాశం ఉంది? అన్న విషయం మాత్రం ఆ కంపెనీ తేల్చలేదు. తనకున్న అర్హతలు పేర్కొన్న ఈ కంపెనీ ఆ ప్రాంతంలో తామనుకున్నట్లు ఫలానా ఖనిజం లేనందున తవ్వకాలు జరపలేకపోతున్నామని ప్రకటించలేదు. విలువైన సంపద ఉన్నందున ఈ కంపెనీ నిర్వాహకులను బెదిరించారా? లేక నిర్వహణభారం ఎక్కువై స్వయంగా తప్పుకోవాలనుకుందా? వంటి పలు రకాల సందేహాలు డీబీర్స్‌ అనుమతుల రద్దు కోరటంలోనే వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ కంపెనీ కోరినట్లే ప్రభుత్వం అనుమతులను రద్దు చేసింది. ఓసారి ఈ ప్రాంతం మైనింగ్‌నిపుణుల  సహకారంతో పరిశీలించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా అనుమతులు ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు.

అవినీతి ఇఓ రామచంద్రమోహన్‌ బదిలీ?

గుడిని, గుడిలో లింగాన్ని మింగేసే ప్రబుద్ధులు ఉంటారని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఇఓ రామచంద్రమోహన్‌ విధులను పరిశీలిస్తే అనుమానించక తప్పదు. అందుకే చేతివాటం తిరిగిన ఈయన్ని ప్రశాంతంగా తప్పించాలని భద్రాచలం బదిలీ చేశారట. పూర్తిగా దేవాదాయశాఖ నుంచి ఈయన్ని తప్పించారని సమాచారం. అయితే ఇఓ తాజాగా సక్రమంగా విధులకు హాజరుకాలేదని వంకపెట్టి 3వగ్రేడ్‌ వ్రతపురోహితుడు పోచినపెద్ది రాథాకృష్ణను సస్పెండ్‌ చేశారు. ఇఓ  తాను చేసిన తప్పులు కప్పిపుచ్చుకుని పేదబ్రాహ్మణుడిపై పడ్డాడేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.  దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగడిరచిన తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో అవకతవకలపై ఇటీవల భారీగానే దుమారం లేస్తోంది. కొత్తగా ఆలయనిర్మాణం పూర్తి చేసిన ఇఓ బాగా లాభపడ్డారని ఆందోళనలు ఎక్కువయ్యాయి. అంతేకాకుండా తన భార్య, పిల్లల పేరిట వ్రతమండపాలు కట్టించేందుకూ ఈయన వెనుకాడలేదు. అంటే దాతల సొమ్ముతో తాను సోకు చేసుకుందామని ప్రయత్నించారు. అంతేకాకుండా లెక్కల్లో లేని విదేశీడబ్బును కూడా ఈయన కూడబెట్టారని ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి.     గతేడాది అమెరికా వెళ్లి భక్తుల నుంచి కొంత సొమ్ము ఈయన తన తాలూకూవారి అకౌంట్లలోకి లాగేశారని సమాచారం. అలానే నిర్మాణం వాస్తవ ఎస్టిమేట్లు కూడా ఎప్పుడో దాటించేశారని కూడా ఈయనపై ఆరోపణలున్నాయి. అయితే ఈయన్ని బదిలీ చేస్తున్నందుకు దేవస్థాన పురోహితులు, సిబ్బంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి కళ్యాణం వచ్చినా, ఇతర ఏ కార్యక్రమం చేపట్టినా ఆర్‌ఎన్‌ఐ కూడా లేని, అసలు నిబంధనల ప్రకారం వచ్చి ప్రకటన కూడా కలెక్ట్‌ చేయలేని పత్రికల పేరిట బిల్లులు కూడా చేసేశారని తెలిసింది. అంతేకాకుండా దేవస్థానంలో పెద్దగా అవసరం లేదని పాత ఇఓలు తొలగించిన పోస్టులను తిరిగి నియమించి గొప్పగా చూపే ప్రయత్నంలో ఇఓ విజయవంతమయ్యారని తెలిసింది. దానిలో భాగంగానే ఓ పిఆర్‌ఓ పోస్టును ఆయన గొప్పగా చూపుతున్నారు. ప్రతీపనికీ పిఆర్‌ఓను ముందు చూపుతున్నారు. ఒకరకంగా ఇఓ రామచంద్రమోహన్‌ తనకు బదులుగా ఏజెంటుగా పిఆర్‌ఓను వాడుతున్నారని విమర్శలు ఎక్కువయ్యాయి. గురివింద గింజ ఎక్కిరింతలా ఆయన తన అథికారాన్ని చిన్న ఉద్యోగుల ముందు ప్రదర్శిస్తూనే వచ్చారు. ఇక వ్రతపురోహితుడు పోచిపెద్ది రాథాకృష్ణ అన్నవరంలో పురోహిత యూనియన్‌ కోసం డబ్బులు వసూలు చేశారట. దానిలో ఇఓగారి వాటా అందనందుకే ఆయన్ని సస్పెండ్‌ చేశారని, అలానే ఇఓ సొంతపనులకు రాథాకృష్ణ ఒకసారి నో అన్నందుకు ఈ సస్పెన్షన్‌ విధించారని సమాచారం. ఇంకా వేరే కారణం ఉన్నా ఉండొచ్చని ఆ దేవస్థానంలోని ఇతర ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. ఇలా ఇఓ ఇష్టానుసారంగా అన్నవరం దేవస్థానాన్ని వినియోగించుకుంటున్నారని ఆరోపణలు ఎక్కువయ్యాయి. మరి ఆయనపై చర్య తీసుకునేందుకు దేవాదాయశాఖ సిద్ధంగా ఉందా?

ఇక అన్నీ కోతలే

గ్యాస్‌సరఫరా కోసం వేరొకరితో ఒప్పందం చేసుకున్నాం త్వరలో విద్యుత్తు సరఫరా పరిస్థితి మెరుగవుతుందని రాష్ట్రముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కానీ, ట్రాన్స్‌కో ఎండి హీరాలాల్‌ సమారియా కోతవేళలు నిర్ధారించారు. ఈ రెండు అంశాలూ భిన్నంగానే ఉన్నాయి. ముఖ్యమంత్రి మాటలు కూడా కోతలతో పోల్చాలా? లేక ట్రాన్స్‌కో ఎండీ అమలు చేసే కోతలు అనుభవించాలా? అన్న మీమాంస రాష్ట్రంలోని ప్రజలకు ఏర్పడిరది. రాష్ట్రంలోని అన్ని డిస్కమ్‌లతో ఎండి సమావేశమై కోతల వేళలను నిర్ధారించారు. తిరుపతి, వరంగల్‌, విశాఖనగరాల్లో రోజుకు మూడుగంటల కోత విధిస్తారు. రైతులకు ఏడు గంటల పాటు విద్యుత్తును నిరంతరంగా సరఫరా చేస్తారు. జిల్లా కేంద్రాల్లో రోజుకు ఐదుగంటల పాటు విద్యుత్తు కోత ఉంటుంది. గ్రామీణప్రాంతాల్లో సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరుగంటల వరకూ విద్యుత్తు సరఫరా చేస్తారు. పట్టణాలు, పురపాలకసంఘాలు, మండలాలులో రోజుకు ఆరుగంటలు కోత విధిస్తారు.     పరిశ్రమలకు వారానికి మూడు రోజుల చొప్పున నెలకు 12రోజులు విద్యుత్తు సరఫరా ఉండదు. చిన్నతరహాపరిశ్రమలకు వారానికి రెండు రోజుల చొప్పున నెలకు 8రోజులు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తారు. రైసుమిల్లులు, గిడ్డంగులు, కోళ్లఫారాలు వంటి వాటికి 40శాతం విద్యుత్తుకోత ఉంటుంది. ఇలా ఒక కోత ప్రణాళికను రూపొందించిన ఏకైక ప్రభుత్వంగా కిరణ్‌సర్కారును ప్రజలు గుర్తిస్తున్నారు. ఇప్పటికే నిరంతర విద్యుత్తు ఉంటుందన్న నమ్మకంతో ఏర్పాటు చేసిన కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. కోట్లాది రూపాయల పెట్టుబడి నష్టపోయారు. ఇక ఈ కోతల్లో ఇంకెంత నష్టం వస్తుందో భవిష్యత్తులోనే లెక్కలు చూడాలి. రాష్ట్రప్రభుత్వం కొత్త విద్యుత్తు ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ప్రణాళిక వేయనంత కాలం కరెంటు విషయంలో ఇంకా గడ్డురోజులు చవి చూడాల్సిందేనని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు తప్పవని హెచ్చరిస్తున్నాయి.  

నాని వ్యవహారంలో తెలుగుదేశం తొందరపడిందా?

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని సస్పెండ్‌ చేసి తెలుగుదేశం పార్టీ తొందరపడిందా? ఈ ప్రశ్న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చలకు దారి తీస్తోంది. ఏ నలుగురు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు.  క్రమశిక్షణ ఉన్న పార్టీ అని నిరూపించుకునేందుకు నానిపై సస్పెన్షన్‌ వేటు వేయటం ద్వారా తెలుగుదేశం పార్టీ తహతహలాడుతోందని అర్థమవుతోందని కొందరు తేల్చేస్తున్నారు.  వై.కా.పా. గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలవగానే ఒకే ఒక్క నిమషం వ్యవథిలో తెలుగుదేశం పార్టీ నానిని సస్పెండ్‌ చేసిందని ప్రకటన విడుదలైంది. ఒక్కనిమషంలోనే ఈ ప్రకటన జారీచేయటం, జైలు వద్ద జగన్‌ను కలిశాక నానిని విలేకరులు ప్రశ్నించారు. తనను సస్పెండ్‌ చేయటమేమిటీ? అంటే నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేనా? అని నాని విలేకరులను ఎదురు ప్రశ్నించటం మొదలుకుని గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వరకూ అన్ని అంశాలూ చర్చల్లో పాల్గొనే వారు ప్రస్తావిస్తున్నారు.   తానే స్వయంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతానంటే వద్దని ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న టిడిపి అథినేత చంద్రబాబు బుజ్జగించిన సంఘటన మరిచిపోయారా అని నాని ప్రశ్నించారు. చంద్రబాబు తనని నమ్మకద్రోహి అంటూ వ్యాఖ్యానిస్తు ఆగ్రహం వ్యక్తం చేయటాన్ని నాని ఖండిరచారు. ఈ ఖండన కూడా చర్చలో పాల్గొనేవారికి ఆసక్తికర అంశంగా మారింది. ఎందుకంటే దీనిపై నాని వివరణ ఇస్తూ చంద్రబాబు చంద్రగిరి నుంచి పారిపోయి వచ్చినందున తనను కూడా అలానే భావించారని ఆరోపించారు.  తనపై కార్యకర్తలను రెచ్చగొట్టడం చాలా దారుణమని నాని రివర్సులో ఎదురుతిరగటం చర్చలో ప్రముఖ అంశంగా మారుతోంది. ప్రత్యేకించి ఒక్క కృష్ణా జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా తెలుగుదేశం శ్రేణులు నాని వై.కా.పా. తీర్థం పుచ్చుకున్నానని ప్రకటిస్తే నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్ధమయ్యారు. ఈలోపు నాని తాను తెలుగుదేశంలోనే కొనసాగుతానని ప్రకటిస్తూ పార్టీ చంద్రబాబుకు సొంతమా అని ఎదురు ప్రశ్నించటం చర్చల్లో పాల్గొన్న వారు గతపరిస్థితుల విశ్లేషణకు దారి తీస్తోంది.   తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు నుంచి చంద్రబాబు పార్టీని సొంతం చేసుకున్న గతం గురించి నాని ప్రకటన వల్ల ఆ పార్టీ నేతలు కూడా ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలానే నాని తాను హరికృష్ణ వల్ల తెలుగుదేశం పార్టీలో చేరానని, ఎన్టీఆర్‌ తనను ఎమ్మెల్యే చేశాడని చెప్పటం ఆయన విథేయతను చాటుకున్నట్లుందని చర్చల్లో ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబును ఎదిరించి మరీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానని, సస్పెన్షన్‌ ఎత్తివేయకపోతే ఊరుకోనని నాని హెచ్చరించారు. ఈ హెచ్చరిక కూడా నాని తన హక్కుని చాటుకున్నట్లు ఉందని పలువురు అంటున్నారు.  రూ.30కోట్లకు నాని అమ్ముడుపోయాడని ఎమ్మెల్యే దేవినేని ఉమ ఆరోపించటం, దానికి నాని తాను పైసా తీసుకోలేదని కుటుంబసాక్షిగా ఒట్టేసి చెబుతున్నానని తెలపటం రాష్ట్రవ్యాప్తంగా నానిపై సానుభూతిని కురిపిస్తోంది. ఎమ్మెల్యే ఉమ తన తమ్ముడు వై.కా.పా.కు వెడితే వదిలేసి తనపై పడటం గురించి నాని ప్రశ్నించిన తీరు కూడా సంచలనానికి వేదికైంది. అసలు వై.కా.పా.గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలవటం, జైలులో ఉన్న జగన్‌ను కలవటం వ్యక్తిగతంగా ఎందుకు భావించరని నాని ప్రశ్నించటం చర్చల్లో మసాలాను జోడించినట్లుంది. ఒకవేళ సస్పెన్షన్‌ను తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తే నాని తాను జగన్‌తో కలిసి పని చేయటానికైనా సిద్ధమేనని ముక్తాయింపుగా హెచ్చరిక చేయటం కొసమెరుపుగా పలువురు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సస్పెండ్‌ చేసినందునే తాను వై.కా.పా.లో చేరానని చెప్పుకోవటానికి నానికి టిడిపి ఛాన్స్‌ ఇచ్చినట్లు ఉందని అందరూ అంగీకరిస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ నాని వ్యవహారంలో మొత్తం మీద తొందరపడినట్లే కదా! అని నవ్వుకుంటున్నారు.

కొడాలి నాని వ్యాఖ్యలపై మండిపడ్డ టిడిపి నేతలు

టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. జైల్లో జగన్ రాసిన స్ట్రిప్టునే కొడానాని చదివారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. రాజకీయ దిగజారుడుతనానికి నాని తీరే నిదర్శనమన్నారు. నానికి మతి భ్రమించిందని, పిచ్చికుక్కలా మాట్లాడుతున్నారని విమర్శించారు.   నాని చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని మరో నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజ్యసభ సీట్లు అమ్ముకుంటే, నీకు టికెట్ ఇస్తే ఎంత డబ్బు ఇచ్చావని ప్రశ్నించారు నానిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కరెక్టే అని వర్లరామయ్య తెలిపారు.    

టిడిపి చంద్రబాబు సొంత ఆస్తి కాదు: కొడాలి నాని

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సొంత ఆస్తి కాదు అని, అది అన్నగారు స్థాపించిన పార్టీ అని అన్నారు. జగన్ తనకు వ్యక్తిగతంగా తెలిసిన మనిషి, గతంలో కూడా నాలుగైదు సార్లు కలిశానని, ఆయన ఇబ్బందులలో ఉన్నారని కలవడానికి వెళ్లానని ఆయన చెప్పారు. జగన్ వద్దకు వెళితే చంద్రబాబుకు కోపం అని తెలిసే, విజయమ్మ వద్దకు వెళ్ళానని, ఇంటి బయటకు వచ్చేసరికి సస్పెన్షన్ చేసినట్లు టీవీలలో వచ్చిందని ఆయన అన్నారు. ఎన్.టి.ఆర్.పై సవాలు చేసి ఓడిపోయి, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టిడిపిలోకి చంద్రబాబు వచ్చి, ఆ పార్టీని స్వాధీనం చేసుకున్నారని అన్నారు. తాను అసలు మాట్లాడకుండా ఉన్నా, జిల్లాకు చెందిన కొందరు కుక్కలను ఉసికొల్పి, తిట్టించి, చివరి ఆయన కూడా తిట్టారని నాని వ్యాఖ్యానించారు. కేంద్రంలో సోనియాగాంధీ, చిదంబరంలతో సంబందాలు పెట్టుకుని కాంగ్రెస్ కు టిడిపిని హోల్ సేల్ గా అమ్మేశారని చంద్రబాబుపై ఆరోపించారు. తనను సస్పెండ్ చేసినందుకు ఎన్.టి.ఆర్.ఆత్మ ఘోషిస్తుందని అన్నారు. రాజ్యసభ సీటును ముప్పై కోట్లకు అమ్ముకున్నారని ఆయన అన్నారు. ఎన్.టి.ఆర్. మాబోటి అభిమానుల కోసం పెట్టిన పార్టీ అని, నీ బోటి వాళ్ళ  కోసం పెట్టిన పార్టీ కాదని అన్నారు.  

టిడిపి సస్పెండ్ పై కోర్ట్ కి వెళ్తా: కొడాలి నాని

తనను తెలుగుదేశం పార్టీ నుంచి అన్యాయంగా సస్పెండ్ చేసిందని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్నించారు. తను టిడిపిని వీడేది లేదని, తన సస్పెండ్ పై కోర్ట్ కి వెళ్తానని చెప్పారు. ఎన్.టి.ఆర్ ను వెన్నుపోటు పొడిచినట్లు తనను కూడా బయటకు పంపారని ఆయన ఆరోపించారు. కేంద్రంలో సోనియాగాంధీ, చిదంబరంలతో సంబందాలు పెట్టుకుని కాంగ్రెస్ కు టిడిపిని హోల్ సేల్ గా అమ్మేశారని చంద్రబాబుపై ఆరోపించారు. తనను సస్పెండ్ చేసినందుకు ఎన్.టి.ఆర్.ఆత్మ ఘోషిస్తుందని అన్నారు. నలబై చోట్ల ఎన్నికలు జరిగితే ఒక్క చోట గెలవలేదని, సిగ్గు లేకుండా పార్టీ అద్యక్షుడిగా ఉన్నారని అన్నారు. ఎన్.టి.రామారావుకు అభిమానినని, జూనియర్ ఎన్.టి.ఆర్ తనకు టిక్కెట్ ఇప్పించారని ఆయన చెప్పారు. జగన్ తనకు వ్యక్తిగతంగా తెలిసిన మనిషి, గతంలో కూడా నాలుగైదు సార్లు కలిశానని, ఆయన ఇబ్బందులలో ఉన్నారని కలవడానికి వెళ్లానని ఆయన చెప్పారు.

అన్నిట్లోనూ ఆరితేరిన విజయసాయిరెడ్డి?

మొత్తం అన్నిట్లోనూ ఆరితేరిన మేథావుల కోటాలో వై.కా.పా. అథినేత జగన్‌ ఆడిటర్‌ విజయసాయిరెడ్డిని లెక్కించవచ్చు. అసలు బెయిల్‌ రావటమే కష్టమైన (జగన్‌ఆక్రమాస్తుల)కేసులో నిందితుని(ఎ2)గా కొనసాగుతూనే సాయిరెడ్డి బాహ్యాప్రపంచంలో ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తనను తాను కాపాడుకుంటూ న్యాయసలహాలను చక్కగా పాటిస్తూ న్యాయస్థానం అనుమతితోనే తన అన్ని పనులూ ఆయన చక్కబెట్టుకుంటున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయసాయిరెడ్డి బయట ఉంటే జగన్‌ బయట ఉన్నట్లే అని లోతుగా ఆ కేసులు అథ్యయనం చేసిన న్యాయనిపుణులు అంటున్నారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి హస్తం లేకుండా ఎటువంటి పని చేయని జగన్‌ను బయటపడేసేందుకు సాయిరెడ్డి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ఇది వాస్తవమైనా కావచ్చు. ఎందుకంటే తిరుపతి దర్శనం తరువాత సాయిరెడ్డి మాట్లాడుతూ న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందంటూ తనపై వచ్చిన కేసును పట్టించుకోనట్లే మాట్లాడారు. అలానే జగన్‌ గురించి గొప్పగా అభివర్ణించారు. ఈ ప్రకటనను బట్టి సాయిరెడ్డి భవిష్యత్తులో జగన్‌ విడుదలకు ఉన్న అన్ని అవకాశాలూ పరిశీలిస్తున్నారని సమాచారం. అంతేకాకుండా హైకోర్టును తన న్యాయవాదులతో మాట్లాడుకునేందుకు ఢల్లీి వెళ్లాల్సి ఉంటుందని సాయిరెడ్డి విన్నవించుకున్నారు. హైకోర్టు కూడా ఈ నెల 20 నుంచి సెప్టెంబర్‌ 20 వరకూ ఎన్నిసార్లయినా ఢల్లీి వెళ్లిరావచ్చని స్పష్టం చేసింది. తన పనితో పాటు సాయిరెడ్డి స్వామికార్యం చక్కబెట్టుకురాగలరని వై.కా.పా.నేతలు ఆశిస్తున్నారు. ఇదెంత వరకూ నిజమో త్వరలో తెరపైనే చూడాలి మరి

దొంగవేబిల్లులతో ఎర్రచందనం స్మగ్లింగు

జొన్నల లోడుకు వేబిల్లు రాయించి ఎర్రచందనం స్మగ్లింగు చేస్తున్న తీరు నేరప్రపంచంలోనే ఓ వినూత్న పోకడగా భావించాలి. స్మగ్లింగు చేసే ముఠా ఏమో తమిళనాడుదైతే లారీ డ్రైవర్‌ మాత్రం పంజాబీ కావటం కూడా గమనార్హం. ఇంతకీ ఈ లోడు దొరకటానికి కారణం గంట క్రితమే చెకింగ్‌ అయ్యాక మళ్లీ చెకింగేమిటని లారీ డ్రైవర్‌ తనిఖీ చేయకుండా వేగంగా కదిలిపోవటమే. ఈ సమాధానమే ఒక చిత్రంగా ఉందని అనుమానించి వెంబడిస్తే లారీని ఇంకా వేగంగా డ్రైవర్‌ నడపటం, ఎస్సై దాన్ని వెంబడిస్తూనే తమ శాఖ ఉన్నతాథికార్ల ద్వారా సహాయం తీసుకోవటం, ఓ ఛేజింగ్‌ తరువాత ఆయన తన సిబ్బందితో లారీని ఆపటం ఓ మాస్‌చిత్రంలోని ఘటనలను కూడా తలపిస్తున్నాయి. ఈ ఘటనకు గుంటూరు జిల్లా వేదికైంది. ముందస్తుగా ఎర్రచందనం లోడు స్మగ్లింగు గుంటూరు జిల్లా మీదుగా జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గుంటూరు జిల్లా నకరికల్లు వద్ద ఇన్‌ఛార్జి ఎస్‌ఐ మల్లిఖార్జునరావు తన సిబ్బంది సాయంతో తనిఖీలు చేపట్టారు.     ఈ లోపు చెన్నయ్‌ నుంచి ఢల్లీకి వెళుతున్న లారీ ఒకదాన్ని ఆపమని సిబ్బందికి ఇన్‌ఛార్జి ఎస్‌ఐ ఆదేశాలిచ్చారు. వారు ఆపగానే డ్రైవర్‌ గంట క్రితమే చెక్‌ చేసి మళ్లీ చెకింగ్‌ అంటారేమిటని ఎదురు ప్రశ్నించి ఆపినట్లే ఆపి లారీని ముందుకు దూకించారు. దీంతో ఆ లారీ డ్రైవర్‌ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని ఆపమని కోరుతూ వెనుకనే పోలీసులు ఛేజింగ్‌ మొదలుపెట్టారు. దీంతో లారీ డ్రైవర్‌ వేగాన్ని పెంచాడు. అకస్మాత్తుగా వేగం పెంచడం అనుమానం బలపడటానికి కారణమైంది. వెంటనే ఇన్‌ఛార్జి ఎస్‌ఐ, తమ సిఐ బిలాలుద్దీన్‌కు సమాచారం అందించారు. ఆయన కూడా రాజుపాలెం ఎస్‌ఐను ఎదురు పంపించారు. ఈలోపు లారీని ఛేజింగ్‌ చేసిన ఇన్‌ఛార్జి ఎస్‌ఐ లారీకి అడ్డంగా తమవాహనం ఉంచి డ్రైవర్‌ సర్వేందర్‌సింగ్‌, క్లీనర్‌ను వేబిల్లులు చూపమన్నారు. దానిలో జొన్నల లోడు వేబిల్లులున్నాయి. లారీలో పరిశీలిస్తే పైరెండు వరుసలు జొన్నలలోడు కింద ఎర్రచందనం దుంగలు దాదాపు కోటిరూపాయలకు పైబడినది కనపడ్డాయి. దీంతో డ్రైవర్‌, క్లీనర్‌లతో పాటు తమిళనాడుకు చెందిన కుదూర్‌, కృష్ణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

ఖర్చు తెలుసుకోకుండానే రైల్వేస్టేషన్లలో కాయిన్‌వెండిరగ్‌ మిషన్లు?

రైల్వేస్టేషన్లలో తరుచుగా ఏర్పడే చిల్లరకొరత నివారించాల్సిందే కానీ, పరిష్కారంగా ఏర్పాటు చేసే కాయిన్‌వెండిరగ్‌ మిషన్లు వల్ల అయ్యే ఖర్చు రైల్వే అథికారులు కనుక్కోకుండానే మిషన్లు పెట్టేయమని ఆదేశాలు జారీ చేసేసింది. పెద్దరైల్వేస్టేషన్లలో నాలుగు కాయిన్‌వెండిరగ్‌ మిషన్లు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ ఆదేశించింది. చిన్నస్టేషన్లలో రెండు మిషన్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఇప్పటి దాకా టిక్కెట్టు తీసుకునే ప్రయాణికులు, రైల్వే సిబ్బంది కూడా చిల్లర గురించి సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో రైల్వేశాఖ, కేంద్ర ఆర్థికశాఖను ఈ సమస్య పరిష్కారానికి సంప్రదించింది. బ్యాంకుల్లో కాయిన్‌వెండిరగ్‌మిషన్లు ఉంచారు కాబట్టి దాన్ని రైల్వేస్టేషన్లలో పెట్టుకోవాలని ఆ శాఖ సూచించింది. రైల్వేబోర్డు ఆ సూచన అందుకోగానే కాయిన్‌వెండిరగ్‌మిషన్లను ఏర్పాటు చేయాలని అన్ని జోనల్‌అథికారులకు ఆదేశాలు ఇచ్చింది. జోనల్‌ అథికారుల ద్వారా రైల్వేస్టేషన్లకు ఈ వెండిరగ్‌మిషన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఏటిఎం తరహాలో ఉండే ఈ మిషన్లు ఏర్పాటు చేయటానికి రూపాయి లైసెన్స్‌ఫీజుగా చెల్లించాలి. అలానే కరెన్సీ నోట్లు వేసి మీట నొక్కితే చిల్లర వచ్చేలా బ్యాంకులు ఈ వెండిరగ్‌మిషన్లు ఏర్పాటు చేశాయి. అయితే ప్రయాణీకుడు ఈ వెండిరగ్‌ మిషన్‌ ఉపయోగించుకుని చిల్లర తీసుకుంటే మరి కమిషన్‌ ఉంటుందా? లేదా? అన్న అంశం ఇంకా తెలియలేదు. ఒకవేళ రైల్వే సిబ్బందే దీన్ని వినియోగిస్తే మాత్రం కమిషన్‌ భారం ఎవరిపై పడుతుందన్నది కూడా అర్థం కాలేదు.  

శిల్పారామానికి పొంచి ఉన్న ముప్పు?

హైదరాబాద్‌ లో దర్శించనీయ ప్రాంగణంగా పేరు తెచ్చుకున్న శిల్పారామం ముప్పు ఉందని నగరవాసులు కలవర పడుతున్నారు. ఈ నెల 30న తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ తలపెట్టిన మిలియన్‌ మార్చ్‌ పేరుతో  తెలుగు వారికి ప్రాముఖ్యత గల  ఈ ప్రాంతాన్ని ఎంచుకుని దీనిని కూలగొట్టాలని పథకం వేసినట్లు తెలుస్తుంది. ఇది సెలవుదినాలల్లో  నగర పర్యాటకులను అలరించటమే కాక, ఆంద్రప్రదేశ్‌లోని అన్ని  జిల్లాలోనూ పేరెన్నిక గన్న అందమైన హస్తకళలను ప్రదర్శించే ప్రదేశంగా  పేరుంది. అంతేకాకుండా నగరంలో జరిగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తుంటారు. శిల్పారామం అనేక దేశాలకు చెందిన ప్రముఖులను కూడ ఆకర్షించే పర్యాటక కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకు ముందు   ముష్కర మూకలు ట్యాంకుబండ్‌పై ఉన్న విగ్రహాలను విద్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ సారి హుస్సేన్‌ సాగర్‌ లో ఉన్న బుద్దవిగ్రహాన్ని, రవీంద్రభారతిని కూడా వీరు విధ్వంస కాండలో చేర్చినట్లు తెలుస్తుంది. దీన్ని నివారించే దశలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. ప్రాంతాల పేరుతో జరుగుతున్న ఈ వినాశనాన్ని ప్రతి ఒక్కరూ నిరసిస్తున్నారు. 

నగరాల్లో లేడీ కిలాడీలు

ఇదివరలో చైన్‌ స్నాచర్లు ,పర్సుల దొంగలు , బ్యాంకులో నుండి డబ్బుతెస్తుండగా మాయమాటలతో మోసం చేసే ఘరానా దొంగలంతా మగవాళ్లే వుండేవారు. ఇప్పుడు కాలం మారింది మాకేం తక్కువ అనుకున్నారేమో మహిళలు కూడా అఘాయత్యాలకు తెగబడుతున్నారు. స్కూటీలమీద స్కార్ప్‌ కట్టుకుని మొఖం కనిపించకుండా రావడం అటూ ఇటూ చూసి వంటరిగా ఉన్న ఆడవారి మెడలోని గొలుసులు లాక్కుపోవడంతో ఈ ఆడదొంగలను పట్టుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇదివరలో ప్రొఫెషన్‌ దొంగలు వుండేవారు కాబట్టి దొంగతనం చేసిన పద్దతిని బట్టి దొంగలు ఎక్కడివారనేది పోలీసువారికి కొంత అవగాహన వుండేది. అయితే ఇప్పుడు పార్టీలకోసం, జల్సాలకోసం యువతరం దొంగతనాలు చేయడంతో పోలీసులకు కొత్తతరం దొంగలను పట్టుకొనడం పెద్ద సవాలుగా మారింది. ఈ నేపధ్యంలో ఈ లేడీ కిలాడీలు పోలీసులకు మరింత అసహనాన్ని కలిగిస్తున్నారు.