తెలంగాణావో నకిలీగుట్కాల తయారి?

పలురాష్ట్రాల్లో అసలుకు, నకిలీకి తేడా లేకుండా తయారు చేస్తున్న నకిలీగుట్కాల రవాణాకు ఆంధ్రప్రదేశ్‌ అడ్డాగా మారుతోంది. గుట్కాను, దాని ప్యాకింగ్‌ కవర్లను తెచ్చి నకిలీ ప్యాకెట్లు తయారు చేస్తున్నారని, తెలంగాణా ప్రాంతంలో రహస్యంగా ఈ నకిలీగుట్కా తయారీ ప్రారంభమైందని సమాచారం. తయారైన గుట్కాప్యాకెట్లను మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు సప్లయ్‌ చేస్తున్నారని  తెలిసింది. ఈ కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొనేది కలకత్తా నుంచి ఆంథ్రప్రదేశ్‌కు వలస వచ్చినవారేనని తెలుస్తోంది. వీరు కూలీల సహాయంతో ప్యాకింగ్‌ చేసి నకిలీగుట్కాలను పలు రాష్ట్రాల్లో అమ్మకాలు సాగిస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రత్యేకించి కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్న ఈ ముఠా కార్యకలాపాలు రోజురోజుకు విస్తరిస్తున్నాయని   తెలుస్తోంది. తాజాగా అదిలాబాద్‌ జిల్లా భైంసా పట్టణం నుంచి కబీరు మీదుగా మహారాష్ట్రలోని హిమాయత్‌నగర్‌ జిల్లా సోన్‌పట్టణానికి మూడు లక్షల రూపాయల విలువైన గుట్కాను రవాణా చేస్తున్న లారీని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. దాని డ్రైవర్‌కు కోర్టు రిమాండు విధించింది. వాహనానికి సరైన అనుమతి లేకుండానే తీసుకువెళుతుండగా తాము పట్టుకున్నామని ఎస్‌ఐ తోట సంజీవ్‌ తెలిపారు. ఇలానే ఇటీవల ఆంథ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన నకిలీగుట్కా లారీని మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. అప్పుడే నకిలీగుట్కా వ్యవహారం కొంత వెలుగులోకి వచ్చింది.  

స్థానికఎన్నికలతో కేంద్రనిధులకు లంకె?

స్థానిక ఎన్నికలు పూర్తయి ప్రజాప్రతినిధులు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు రాష్ట్రానికి కేటాయిస్తారు. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులపై ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. స్థానికంగా ఉండే సమస్యలను చూపిస్తూ రాష్ట్రం కుంటిసాకులు చెబుతోంది. ఆ సమస్యలకు స్థానిక ఎన్నికలకు అసలు సంబంధమే లేదు. అయినా రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుర్చీ ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అసలు స్థానిక ఎన్నికల కన్నా ఇతర కీలకమైన సమస్యలు ఆయన్ని ఇబ్బంది పెట్టాయి. ఉప ఎన్నికల ఫలితాలు చేదుగా ఉండటంతో ఆయన కూడా స్థానిక ఎన్నికల అవసరాన్ని గుర్తించారు. అదే స్థానిక ఎన్నికలు పూర్తయి పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు తమ క్యాడర్‌తో ఉండి ఉంటే మరికొన్ని స్థానాలు సాధించేవారమని సిఎం కూడా నమ్మారు. వాస్తవానికి స్థానిక ఎన్నికలను సర్పంచుల పదవీకాలం ముగిసిన ఆరునెలల్లోపే నిర్వహించాలి. అయితే ఉప ఎన్నికల తరువాత స్థానిక ఎన్నికలు జరపొచ్చని మొదట్లో భావించారు. అలానే అసెంబ్లీ ఉప ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాలని సిఎం అందరినీ ఆ డైరెక్షనులోకి తిప్పేశారు. అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందుగానే స్థానిక ఎన్నికలు పూర్తయి ఉంటే ఇప్పుడు గ్రామాలు కళకళలాడేవి. కేంద్రప్రభుత్వం విడుదల చేసే పదోఫైనాన్స్‌ నిధులు గతంలో ఆపేసిన విషయం పాఠకులకు తెలిసిందే. మరోసారి ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ గిరిజనాభివృద్థిశాఖ మంత్రి, అరకు ఎంపి కిశోర్‌చంద్రదేవ్‌ స్థానిక ఎన్నికలు నిర్వహించకుంటే నిధులు ఆపేస్తామని ప్రకటించారు.

సీమలో మళ్ళీ ఫ్యాక్షనిజం?

ఫ్యాక్షన్‌ గొడవలకు కేంద్రం రాయలసీమ. అందుకే ఈ సీమలోని ప్రతీప్రాంతంలోనూ మనుష్యులు రాటుదేలినట్లుంటారు. కయ్యానికి సై అనేలా గొడ్డుకారం తింటారు. ఆకలి, ఆగ్రహం రెండూ ఎక్కువగానే ప్రదర్శిస్తారు. ఇలాంటి ఈ సీమలో ప్రధానమైన జిల్లా అనంతపురం. ఆకలితో అలమటించే పేదైనా సీమలోని అతని ఇలాకాను బట్టి ఏ గ్రూపో నిర్ధారణక గురవుతుంది. ఒకగ్రూపు వ్యక్తి ఇంకో గ్రూపు అమ్మాయిని కూడా ఇష్టపడరు. నచ్చితే ప్రాణం పెడతాం లేకపోతే దాన్నే తీస్తామన్న సినిమాలో డైలాగుకు సీమలోని ఫ్యాక్షనిజానికి అంతటి లింకే ఉంది. ఫ్యాక్షనిస్టులు కూడా తమకు అనుకూలమైన పార్టీలను ఎంపిక చేసుకుంటారు. ప్రత్యేకించి గొడవ పడటానికి వీలుగా ప్రత్యర్థి పార్టీలను ఎంచుకుంటారు. కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీలు ఫ్యాకనిజానికి అడ్డాగా మారాయి. అయితే ఈ మూడిరటిలోనూ తాజాపార్టీ వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే. ఇదీ ఫ్యాక్షనిస్టుల పార్టీ అయినా కొత్తగా ఉద్భవించినందున సద్దుమణిగి ఉంటూ ఇతర పార్టీలతో సర్దుకుంటోంది. అయితే తెలుగుదేశం, కాంగ్రెస్‌ నేతలు ఎదురుపడితేఏ మాత్రం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. తాజాగా అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లిలో పాతకక్షలు తిరిగి రాజుకున్నాయి. కాంగ్రెస్‌ నేత సీతారామాంజనేయులును తెలుగుదేశం నేత వెంకటేశ్వర్లు స్కార్పియోతో ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామాంజనేయులను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు వెంకటేశ్వర్లు ఇంటిపై దాడికి తెగబడుతున్నారు. దీంతో ఇద్దరు ఫ్యాక్షన్‌తగదాలకు నాగరెడ్డిపల్లి వేదికగా మారుతోంది.  

సైకో సాంబ కేసులో పోలీసులకు కీలక ఆధారం లభ్యం

సైకో సాంబశివరావు పరారీలో పోలీసులకు కీలక ఆధారం లభించింది. గత మూడు రోజులుగా కొండపల్లి ఖిల్లాను జల్లెడవేస్తున్న పోలీసులుకు ఓ ప్రాంతంలో సాంబశివరావు కాలికి వేసిన గొలుసులు లభ్యమయ్యాయి. గొలుసు దొరికి ప్రాంతంలో రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. బండరాయితో గొలుసును కొట్టి తప్పించుకున్నట్లు వారు అనుమానిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గొలుసును తెంపుకున్న సైకో కొండపల్లి ఖిల్లా నుంచి తప్పించుకుని చుట్టు ప్రక్కల గ్రామాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ సైకో కోసం పోలీసులు గాలిస్తున్నారు.

చిక్కుల్లో కే.వి.పి.వియ్యంకుడు

దివంగతం వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి ఆత్మ స్నేహితుడైన కే.వి.పి. రామచంద్రరావు వియ్యంకుడు రఘురామ రాజు చిక్కుల్లో పడ్డారు. జగన్‌ అక్రమాస్తుల కేసులను విచారిస్తున్న జె.డి.లక్ష్మీనారాయణ సెల్‌ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ను బైట పెట్టిన రఘురామరాజు ఇప్పుడు తీవ్ర టెన్షన్‌కు గువరుతున్నట్లు తెలిసింది. అనవసరంగా లక్ష్మీనారాయణతో పెట్టుకున్నానని ఆయన తనను వదిలిపెట్టేటట్లు లేడని రఘురామరాజు వాపోతున్నట్లు తెలిసింది. ఎమ్మార్‌ విల్లాలను కొనుగోలు చేసిన రఘురామ రాజు ఆ కేసు విషయమై గతంలో సి.బి.ఐ. ఎదుట హాజరయ్యారు. అప్పట్లో లక్ష్మీనారాయణ విచారణ పేరిట రఘురామరాజును వేధించారు. దీనిని మనసులో పెట్టుకున్న రఘరామరాజు అప్పట్లో లక్షీనారాయణపై కోర్టులో కేసు వేస్తూ తనకు వ్యతిరేకంగా ఆయనతో పాటు ఎ.బి.ఎన్‌. ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జె.డి ఉద్దేశ్య పూర్వకంగా విచారణ సమాచారాన్ని ఆంధ్రజ్యోతికి లీక్‌ చేస్తున్నారని చెబుతూ తన వాదనలకు మద్దతుగా అప్పట్లో జె.డి. కాల్‌ లిస్ట్‌ను కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ కేసుపై ఒక అడుగు వెనుకకు వేసిన జె.డి. లక్షీనారాయణ తాను విచారణ సమాచారాన్ని మీడియాకు లీక్‌ చేయలేదని  కోర్టుకు చెప్పారు. జె.డి. సమాధానంతో సంతృప్తి చెందిన  రఘురామరాజు అప్పట్లో తన కేసును ఉపసంహరించుకున్నారు. అప్పటి నుంచి జె.డి. లక్ష్మీనారాయణ తన హిట్‌లిస్ట్‌లో రఘురామరాజును పెట్టుకున్నారు. సమయం కోసం వేచి చూస్తుండగా సాక్షిమీడియా జె.డి. కాల్‌ లిస్ట్‌ను బైట పెట్టింది. దీని సాకుగా తీసుకుని జె.డి. సాక్షిమీడియా ప్రతినిధి, ఒక సి.ఐ.తో పాటు రఘురామరాజుపై కూడా కేసు పెట్టారు. దీంతో బెంబేలెత్తి పోయిన రఘురామరాజు ఈ కేసులో తన పేరును తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ వేయగా శుక్రవారం కోర్టు దానిని కొట్టి వేసింది. ఈ కేసుకొట్టి వేయడంతో రఘురామరాజు డీలా పడినట్లు తెలిసింది. క్షత్రియుడైన రఘురామరాజు తన కుమార్తెను వెలమ కులానికి చెందిన  కే.వి.పి. రామచంద్రరావు కుమారిడికి ఇచ్చి వివాహం చేశారు. వై.ఎస్‌. హయాంలో రఘు రామరాజు కూడా బాగా లబ్ది పొందినట్లు సమాచారం.

బ్రాంది షాపులను ప్రారంభిస్తున్న ఎం.ఎల్‌.ఎ.లు

గతంలో (సుమారు 20ఏళ్ల క్రితం) ప్రభుత్వసారా దుకాణాలుండేవి. కాలం మారింది. ఈ హైటెక్‌ కాలంలో మద్యం దుకాణాలను ఎపిబీసిఎల్‌ అవుట్‌లెట్ల పేరిట ప్రభుత్వమే నిర్వహించనుంది. నాడు సారాదుకాణాల ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రులు వచ్చేవారు. నేడు ఈ కౌంటర్లు నేరుగా స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. ఎక్సయిజ్‌ పరిథిలో నిర్వహించే ఈ అవుట్‌లెట్లు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారే 637 ప్రారంభంకానున్నాయి. దీనికి కారణం ఈ 637మద్యం దుకాణాలకు లైసెన్సులు మంజూరు కాలేదు. మద్యం దుకాణాలు తీసుకోవటానికి ఎవరూ ముందుకు రాకపోవటంతో ప్రభుత్వమే నేరుగా నడపాలని నిర్ణయం తీసుకుంది.   దీని వల్ల నిర్ణీతవేళల్లో కౌంటర్‌ సేల్స్‌ జరిపినా ఆదాయం తగ్గదని లెక్కలు కట్టింది. దీంతో ఎక్సయిజ్‌శాఖ నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది. పదవీవిరమణ చేసిన ఉద్యోగులను సూపర్‌వైజర్లుగా నియమించి ముగ్గురిని అవుట్‌సోర్సింగ్‌గా తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని కోసం ఈపాటికే ఎక్కడెక్కడ అవుట్‌లెట్‌లు పెట్టాలనే విషయమై ప్రాంతాల వారీగా నివేదిక సిద్ధమైంది. జిల్లాల వారీగా ఎక్కడ అవుట్‌లెట్‌లు ప్రారంభించాలో వివరాలు కూడా పంపించారు. జిల్లాలోని ఎక్సయిజ్‌ డిసిలు కూడా ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ అవుట్‌లెట్‌ల వల్ల బార్‌ల్లో  గంటల కొద్దీ చేసే కాలక్షేపాలకు, క్రైమ్‌కు చెక్‌ పెట్టవచ్చని ఎక్సయిజ్‌శాఖ కమిషనరు సమీర్‌శర్మ భావిస్తున్నారని తెలిసింది.  

బరితెగిస్తున్న ఇసుక మాఫియా ?

రాష్ట్రంలో ఇసుక మాఫియా బరితెగిస్తోంది. తాజాగా మహబూబ్‌ నగర్‌ జిల్లా మక్తల్‌ ఎం.ఎల్‌.ఎ. దయాకర్‌ రావు ఇసుక మాఫియా ఆగ్రహానికి గురయ్యారు. ఇసుక కోసం హత్యలు చేసేందుకు కూడా మాఫివయా ముటాలు వెనుకాడడంలేదు. అక్రమంగా ఎందుకు ఇసుక తరలిస్తున్నారని పోలీసులు ఆపేయటంతోనూ, రెవెన్యూ శాఖ దాడులు చేయడంతోనూ తవ్వకందార్లు ఎంతకైనా తెగిస్తున్నారు. రాష్ట్రంలో భారీగా నిర్మాణాలు జరుగుతున్న సమయంలో ఇసుక రవాణా కోర్టు తీర్పుకారణంగా ఆపేశారు. దీన్ని స్థిరీకరించేందుకు కోర్టు కానీ, అధికారులు కానీ ఎక్కువగా చొరవ చూపకపోవటంతో అక్రమమార్గాల్లో ఇసుకను తరలిస్తున్నారు. ఎక్కువ డబ్బు పోసి ఇసుకను కొనుక్కుని నిర్మాణాలు చేపట్టలేమని బిల్డర్లు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.     దొంగచాటుగా ఇసుక కొంటే కేసులు, ఫైనులు కూడా కట్టాల్సివస్తోందంటున్నారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక ఒక కీలకమైన సమస్యగా మారింది. ఖమ్మం జిల్లాలో గోదావరి ఇసుకను రెండు ట్రాక్టర్లలో తరలిస్తుంటే రెవెన్యూశాఖ దాడులు చేసి కేసులు నమోదు చేసింది. అలానే తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోనూ ఇసుకరవాణాదారులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ ఎమ్మెల్యే దయాకర్‌రావు ఇసుకమాఫియా బెదిరింపులను ఎదుర్కొన్నారు. కేవలం రెండు లోడుల ఇసుకను అక్రమంగా ఎందుకు తరలిస్తున్నారని ఆయన ప్రశ్నించినందుకు బెదిరింపులు ఎదురయ్యాయి. దీనిపై దేవరకద్రపోలీసుస్టేషనులో ఎమ్మెల్యే మాఫియాపై కేసు పెట్టారు.

షిర్డీసాయి విగ్రహాలు ఎందుకు పాలుతాగుతున్నాయి?

గురుత్వాకర్షణ శక్తి వల్ల షిర్డీసాయి విగ్రహాలు పాలు తాగాయని విజ్ఞానశాస్త్రవేత్తలు, బీఇడి కళాశాల ప్రిన్సిపాల్‌ తదితరలు వివరిస్తున్నారు. కాదు, ఇది నిజంగా సాయి మహిమే అని భక్తులు నమ్ముతున్నారు. అంతేకాకుండా చూడండని పిలిచి సాయివిగ్రహాలకు పాలు తాగిస్తున్నారు. ఇది అనంతపురం జిల్లాలోని హిందూపురం, లేపాక్షి, పరిగి మండలాల్లో అద్భుతదృశ్యంగా పలువురిని ఆకట్టుకుంటోంది. జనాలు తండోపతండాలుగా పాలు కొనటం సాయివిగ్రహానికి తాగిస్తూ ఆనందిస్తున్నారు. ఈ విషయం తెలియని వారికి వివరించి మరీ ఈ వింతను చూపిస్తున్నారు.   గతంలో వినాయక విగ్రహాలు పాలుతాగినట్లే సాయి విగ్రహాలు ఈ జిల్లాలో పాలుతాగాయి. హిందూపురం పట్టణంలోని పలుప్రాంతాల్లో ఎక్కడ చూసినా సాయి విగ్రహం పాలుతాగుతోందన్న అంశంపైనే చర్చ నడుస్తోంది. లేపాక్షి మండలం కూరాకుపేటలో మహిళలు కలిసికట్టుగా వచ్చి బాబా విగ్రహాలకు పాలు తాగించి భజనలు చేశారు. పరిగిలోని సాయిసేవామందిర్‌ప్రాంతంలోనూ ఒకటే హడావుడిగా కనిపించింది. కర్నాటక రాష్ట్రంలోని పావగడలో కూడా ఇదే విషయమై ఆసక్తి నెలకొంది. ఏమైనా సాయి మహిమ వర్ణించలేమని ఆయన భక్తులు కీర్తిస్తున్నారు.

ప్రణబ్‌కు వోటు ద్వారా జగన్‌కు మేలు జరగబోతోందా?

యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తోందా? లేదా? అన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో ఎంపి సబ్బంహరి నేరుగా ప్రణబ్‌ను కలిసి ఓ 20నిమషాలు పాటు మాట్లాడటం కూడా సంచలనమైంది. అయితే తామేమి మాట్లాడుకున్నామో పత్రికాప్రతినిధులకు చెప్పటానికి సబ్బంహరి ఇష్టపడలేదు. అయితే ఎన్నికల నేపథ్యమే కారణమై ఉంటుందన్నది పరిశీలనలో తేలింది. ఇటీవల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఢల్లీ వచ్చి ప్రధానితో మాట్లాడి వెళ్లాక ఆ పార్టీ తరుపున ప్రణబ్‌ను కలిసినది సబ్బంహరి ఒక్కరే. ప్రధాని తమ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీకి మద్దతు ఇవ్వాలని కోరారని అప్పట్లో వార్తలు వచ్చాయి.    విజయమ్మ తన కుమారుడు జగన్మోహనరెడ్డిని ఇడి దర్యాప్తు విషయంలో నెమ్మదించేలా చూడాలని ప్రధానిని కోరారని కూడా తెలిసిందే. అయితే ఎంపి సబ్బంహరితో ప్రధాని కోరిక మేరకు విజయమ్మ తమ పార్టీ మద్దతు గురించి తెలియజేశారని సమాచారం. ఒకవేళ ప్రణబ్‌కు మద్దతు ఇవ్వకుంటే ఇడిని తట్టుకోలేమని జగన్‌ భావించే విజయమ్మ ఢల్లీి ప్రయాణం ఫిక్స్‌ చేశారని రాజకీయ ఉద్దండులు అప్పట్లో  విశ్లేషించారు. ఏదేమైనా తప్పని సరి పరిస్థితుల్లో రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీకి వై.కా.పా. మద్దతు ప్రకటించే ఉంటుందని పరిశీలకులు తేలుస్తున్నారు. సబ్బంహరి చెప్పకపోయినా దీని గురించి త్వరలో ఎవరో ఒకరు వెల్లడి చేయకుండా దాచలేరన్నది జగమెరిగిన సత్యం. అయితే విషయం విజయమ్మ నోటి నుంచి వస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

21న వల్లభనేని వంశీ జంప్‌ ?

 కృష్ణాజిల్లాలో కొడాలినానీతో మొదలైన వలసలు ఎప్పటికి ముగుస్తాయో తెలియటం లేదు. నిన్న పోలిట్‌బ్యూరో అధికారిగా ఉన్న ఉప్పులేటి కల్పన, ఇప్పుడు గన్నవరంకు చెందిన వల్లభనేని కూడా లైన్‌ క్లియర్‌ అయ్యిందనే అనుకుంటున్నారు. ఈ నెల 21న వైసిపిలో చేరటానికి ముహూర్తం ఖరారైందని కూడా చెబుతున్నారు. అయితే ఇదే జిల్లాలో నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యకు మాత్రం వైసిపి లోకి వెళ్లే చాన్సు కనబడటంలేదు. ఇప్పటికే నూజివీడునుండి  వైసిపి నాయకుడుగా ఉన్న మాజీ ఎమ్మేల్యే ప్రతాప్‌ ఆయనను  వైసిపిలోకి రాకుండా అడ్డుకుంటున్నారని తెలుస్తుంది. లేదంటే చిన్నం కూడా ఇదే వరుసలో ఉండేవారు.     కృషజిల్లాలో తెలుగుదేశం నాయకులంతా క్యూ కట్టటానికి కారణం దేవినేని ఉమ అని తెలుస్తుంది. అంతేకాకుండా జూనియర్‌ ఎన్టీఆర్‌కి సన్నిహితులుగా ఉంటున్న వారందరికి చంద్రబాబునాయుడు వేటువేయటం తద్యమని తెలియటంతో పార్టీలో జంప్‌జిలానీలు ఎక్కువవుతున్నారు.  గత లోక్‌సభ ఎన్నికలప్పుడు చంద్రబాబునాయుడు ఎంపీగా పోటీచేయడానికి సరైన సమయంలో పార్టీ టికెట్‌ ఇవ్వకుండా ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్నారనేది వంశీ ఆరోపణ. తనకు దేవినేని నెహ్రూకు పార్టీలోని కార్యకర్తలకోసమే గొడవ జరిగినా చంద్రబాబునాయుడు పట్టించుకోలేదని కూడా వంశీ వాపోతున్నట్లు తెలిసింది.   ఈసారి ఎలాగూ తెలుగుదేశంపార్టీ తరపున టికెట్‌ ఇస్తారన్న గ్యాంరెంటీ లేక పోవడం కూడా ఒక కారణం. గన్నవరం ఎం.పి.టిక్కెట్‌  దాసరిబాలవర్ధనరావుకు , విజయవాడ టిక్కెట్‌  లింగమనేని రమేష్‌కు దక్కుతాయని సంకేతాలు అందటంతో తెలుగుదేశంపార్టీలో రాజకీయ భవిష్యత్‌ ఉండదని తెలుసుకున్న వంశీ, వైసిపి లోకి అడుగుపెట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ఇందుకు గాను విజయవాడలోని వంగవీటిరాధా, కొడాలినాని సపోర్టు కూడా ఉంది. ఇదే జరిగితే తెలుగుదేశం ఆవిర్భావానికి నాంది పలికి, రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన ఎన్‌టీఆర్‌ సొంత జిల్లాలో తెలుగుదేశం కనుమరుగవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆగస్టులో కిరణ్‌ కుమార్‌కు పదవీ గండం ?

 ఆగస్టు నెల అంటేనే రాజకీయనాయకులు బంబేలెత్తుతారు. ఎందుకంటె ఈ నెల  రాజకీయ సంక్షోభాలకు మారుపేరు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆగస్టు ఆయన్ని  ముప్పతిప్పలు పెట్టింది. ఎన్టీరామారావును   నాదేళ్ల భాస్కరరావునుండి వెన్నుపోటు పొడిచారు. సంవత్సరం తర్వాత  చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ ను గద్దె దింపి పార్టీని తన హస్తగతం చేసుకోవడం  కూడా ఈ నెలలోనే జరిగింది. మరి వచ్చే ఆగస్టు ఎలావుండ బోతోందో కొంచెం తెలుసుకుందాం. ఈ ఆగస్టు 8 నుండి 18 వరకు రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని  జ్యోతిశాస్త్రపండితులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి మారతారని కూడా ఘంటాపథంగా చెబుతున్నారు. కిరణ్‌కుమార్‌కు గత సంవత్సరం శని ఉచ్చదశలో ఉన్నందున ఏవరూ ఊహించని విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారని, ఈ సంవత్సరం కిరణ్‌కుమార్‌ జాతకంలో శని వక్రదశలో కన్యను చూడటం వల్ల ఆయనకు పదవీ గండం తప్పదని ఆయనకు ఆగస్టు అంతా క్షణం ఒక యుగంలా గడుస్తుందని కూడా చెబుతున్నారు. అలాగే ఆగస్టు 15న, కుజ శని కలయిక వల్ల కూడా రాష్ట్రరాజకీయాలలో పెను మార్పులు ఉంటాయన్నారు. అయితే ఈ మార్పులన్నీ  రాష్ట్రానికి మంచిదే అని కూడా చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మీడియాతో మాట్లాడతూ, ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించే వారికి గుడ్‌ లక్‌ చెప్పడం విశేషం. గతంలో రోశయ్య కూడా రాజీనామా చేయడానికి కొద్దిరోజుల ముందు విలేఖరులడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘‘నన్నేం చేయమంటారు . పదవికి రాజీనామా చేయంటారా?‘‘ అని ఆగ్రహంతో అన్నారు. తధాస్తు దేవతలు తధాస్తు అన్నారో ఏమోగాని కొద్ది రోజులకే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కిరణ్‌ కుమార్‌ తన పదవిపై కన్నేసిన వారికి గుడ్‌ లక్‌ చెప్పడం విశేషం.

జీసస్‌ ఆంధ్రాలో నీ ఆస్తులను కాపాడుకోలేవా?

రాష్ట్రంలోని పలు చోట్ల కోట్లాది రూపాయల విలువైన  సి.ఎస్‌.ఐ. ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయి. ఎప్పుడో చర్చిల పేరిట కొనుగోలు చేసిన ఈ ఆస్తుల విలువ బాగా పెరగడంతో కొందరు క్రిస్టియన్‌ పెద్దలతో కుమ్మక్కయి వీటిని స్వాహా చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ సియస్‌ఐ చర్చికి సంబంధించిన స్థలాలకు ఇదేపరిస్థితి దాపురించింది. మొదట విజయవాడలోని గాంథీ హిల్‌ సియస్‌ఐ ఆస్తిగానే వుండేది. తర్వాతి రోజుల్లో ఇది కొంత అన్యాక్రాంతం కాగా మరికొంత విక్రయించారు. కాలానుగుణంగా  గాంధీహిల్‌గాను, ప్లానెటోరియం సెంటరుగాను మార్చబడిరది. ఇప్పుడు ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. కోర్టు రోడ్డులో ఉన్న చర్చికాంపౌండ్‌లోని స్థలాలను కొందరు అడ్మిన్‌స్ట్రేటివ్‌ మెంబర్లు నిబంధనలను వ్యతిరేకంగా ఒక గార్డెన్‌ రెస్టారెంట్‌కి 99 సంవత్సరాలకు లీజుకిచ్చారు. మరికొందరు ఒక రియల్‌ఎస్టేట్‌ వ్యాపారికి అమ్ముదామనుకున్నప్పుడు దాన్ని అడ్డుకున్న వ్యక్తి కత్తిపోట్లకు గురై హాస్పటల్‌లో మరణించారు.     సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు సమీపంగా ఉన్న సియస్‌ఐ చర్చిది ఇదే కద. చాలా కాలం క్రింద దీన్ని షాపింగ్‌ కాంప్లెక్సులకు అద్దెకిచ్చారు. ఆ తర్వాత అది  ఆక్రమణకు గురైయింది. ఇప్పుడున్న ఆల్ఫాహోటల్‌ నుండి సియస్‌ఐ సిమెట్రీ ( స్మశానం ) ఇరువైపులా రోడ్డుకానుకున్న షాపింగ్‌ కాంప్లెక్సులు, హోటల్స్‌ అన్నీ సియస్‌ఐ ఆస్తులే. చర్చికున్న సమాధిస్థలాలు కూడా ఆక్రమణకు గురయ్యాయి. ఆల్ఫా హోటల్‌ ప్రక్కనున్న  పెట్రోలు బంకునుండి బస్టాపులవరకు అంతా ఆక్రమణే. ఇప్పుడున్న బిషప్‌లు వీటిని మళ్లీ స్వాదీన పరచుకుంటానికి గానూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మెదక్‌ చర్చి 1000 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. దీనికి అనుబందంగా చర్చి కాంపౌండ్‌లోనే  వృద్దుల శరణాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు ఉన్నాయి. రెవరెంట్‌ చార్లెస్‌ వాకర్‌ పాస్‌నెట్‌ ఈ చర్చిని 10 ఏళ్లపాటు కట్టించారు. ఆరోజుల్లో కరువు అధికంగా ఉండటం వల్ల కూలీలకు పనికి ఆహారం ఇచ్చేవారు. చర్చి ఎంట్రన్సు ఎత్తును అప్పటి నైజాం నవాబుగారి కోరిక మేరకు చార్మినార్‌ కంటె కొంచెం తక్కువ చేసారు. ఈ చర్చ్‌ ఆసియాలోకెల్లా పెద్ద చర్చిగా పేరుగాంచింది.

కొడాలి నాని చంద్రబాబును విమర్శిస్తే ఊరుకోం: టీడీపీ నేతలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును విమర్శిస్తే గుడివాడకు వస్తాం.. వేటాడి మరీ కొం డతాం అంటూ టీడీపీ నేతలు, జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకులు కొడాలి నానిని హెచ్చరించారు. గురువారం స్థానిక విశ్వేశ్వరయ్య కూడలిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని దిష్టిబొమ్మను దహనం చేశారు.   ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొడాలి నాని సస్పెన్షన్‌తో టీడీపీకి శని వదిలిందన్నారు. అన్నం పెట్టిన నందమూ రి వంశానికే కొడాలి ద్రోహం చేశాడని విమర్శించారు. డబ్బులకు ఆశపడి జగన్ పంచన చేరడం నీచ రాజకీయానికి నిదర్శనమన్నారు. సుధాకర్ నాయుడు మా ట్లాడుతూ వెన్నుపోటుదారులను ఎన్నటికీ నమ్మరాదన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సహకారంతో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది చివరికి పార్టీకి వెన్నుపోటు పొడిచిన నాని పశువు కంటే హీనమన్నారు. టీడీపీ నాయకులు జంపాల మధు మాట్లాడుతూ లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్న జగన్‌కు నాని అమ్మడుపోయాడన్నా రు. ఇలా ఎంత మంది ఎమ్మెల్యేలను కొంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. కార్యక్రమం లో నగర టీడీపీ అధ్యక్షుడు ఫర్వేజ్, మైనారిటీ సెల్ రాష్ట్ర నాయకులు రుస్తుం ఖాన్, నాయకులు ఆకెపోగు ప్రభాకర్, హనుమంత రాయచౌదరి, జేమ్స్ డీవీ చం ద్ర, సంతోషమ్మ తదితరులు పాల్గొన్నారు.

వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌పార్టీ విజయవాడ లోక్‌సభ అభ్యర్ది దుట్టా?

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ నియోజక వర్గం నుంచి వై.ఎస్‌.ఆర్‌, కాంగ్రెస్‌పార్టీ తరఫున హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు పోటీ చేసే అవకాశం ఉంది. దివంగత వై.ఎస్‌. రాజశేఖర రెడ్డికి సన్నిహిత మిత్రుడైన దుట్టా రామచంద్రరావుకు ఈ మేరకు జగన్‌ స్పష్టమైన హామి ఇచ్చినట్లు తెలుస్తోంది. బి.సి. వర్గానికి చెందిన దట్టా రామచంద్రరావు వృత్తి రీత్యా వైద్యుడు. అయితే పేదలకు అతి తక్కువ ధరకే వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు.  నేషనల్‌ హైవే ` 5 విస్తరణ పనుల వల్ల కృష్ణాజిల్లాలో నివాశ ప్రాంతాలకు, పంటపొలాలకు నష్టం వాటిల్లుతుండడంతో నిరాహార దిక్షలు జరిపారు.స్ధానిక సమస్యలపై ఆయన ఎప్పుడు ప్రజలకు మద్దతుగా ఉండేవారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ తెలుగుదేశంలో ఉన్నప్పటికి ఏదో ఒకరోజు వై,ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఖాయం. గత లోక్‌ సభ ఎన్నికల్లో వంశీ కాంగ్రెస్‌ అభ్యర్ది లగడపాటి రాజగోపాల్‌పై పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్ళీ విజయవాడ నుంచి పోటీచేయడానికి ఇష్టపడడంలేదు. ఆయన గన్నవరం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. దీంతో విజయవాడ లోక్‌సభ  స్ధానం నుంచి డాక్టర్‌ దట్టా రామచంద్రరావును రంగంలోకి దింపడానికి జగన్‌ నిర్ణయించినట్లు తెలిసింది.

ఆంధ్రా గంజాయి సాగుకు ముంబయ్‌ మాఫీయా ఫైనాన్స్‌?

ఏజెన్సీ, సబ్‌ఏజెన్సీల్లోని పలు ప్రాంతాల్లో గంజాయి సాగుకు ముంబయ్‌ మాఫియా పెద్ద ఎత్తున ఫైనాన్స్‌ చేస్తునట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఈ సాగుకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగిఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పండిన గంజాయిని ఎవరి దృష్టిపడకుండా ఒడిశా రాష్ట్రంలోకి, ఇటు ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రానికి తరలిస్తున్నారు. అన్ని జిల్లాల ఏజెన్సీలకు అనుబంధమార్గాలు తెలిసిన రవాణాదారులు గంజాయిని చాలా తెలివిగా పక్క రాష్ట్రాలకు తీసుకువెళుతున్నారు. ఎంత నిఘా పెంచినా దొరకకుండా అడవిమార్గంలో తెల్లవారుజామున ఈ రవాణా సాగుతోందని సమాచారం.   విశాఖజిల్లా నర్సీపట్నం పోలీసులు మాకవరపాలెం, గొలుగొండ మండలాల్లో దాడులు చేసి 1650కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 50లక్షల రూపాయలుంటుందని అంచనా. పదిమందిని ఈ దాడిలో అరెస్టు చేశారు. ఒకవ్యాను, ఇండికా కారు, రెండు ద్విచక్రవాహనాలు, 70వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దాడి వల్ల ముంబయ్‌ మాఫీయాతో గంజాయిరవాణాదారులకు లింకులున్నాయని తేలింది. ఈ సాగు కోసం ముంబయ్‌మాఫియా ముందస్తుగా అడ్వాన్సులు పంపిస్తోందని, ఆ డబ్బులతో సాగు చేసి గంజాయిని రవాణాదారుల ద్వారా మాఫియా చెప్పిన రాష్ట్రానికి చేరవేస్తున్నారని సమాచారం. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి ఈ గంజాయిని తెలివిగా ముంబయ్‌ తీసుకువెళుతున్నారని నిఘావర్గాలూ భావిస్తున్నాయి.

అనంతలో కరువుజాడ

వర్షాభావపరిస్థితులు, నీటి సదుపాయం లేకపోవటం, వ్యవసాయం చేయటానికి అనుకూలమైన వాతావరణం లేకపోవటం వంటి పలు అంశాలతో కరువుజాడలు మళ్లీ అనంతపురం జిల్లాలో కనిపిస్తున్నాయి. ఈ జిల్లాలో 1.81లక్షల హెక్టార్లలో వ్యవసాయం చేస్తారు. కానీ, ఈ ఏడాది 71వేల హెక్టార్లలో మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. సాధారణం కన్నా 74శాతం తక్కువ వర్షపాతం ఇక్కడ నమోదైంది.  దీంతో ధైర్యం చేసి పంటవేసి నష్టపోవటం ఇష్టం లేక రైతులు అస్సలు ఆ ఊసే ఎత్తటం లేదు. పండ్లతోటలు, ఇతర ఆదాయవరులపై వారు ఆధారపడనున్నారు. పశుగ్రాసానికి కూడా కొరత ఏర్పడిరది. దీంతో పాడిపరిశ్రమ కూడా కునారిల్లుతోంది. జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులు  నెలకొన్నాయని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.   ఒకవైపు ప్రభుత్వసాయం అందక, మరోవైపు బ్యాంకర్ల జులుం కూడా అనంతపురం జిల్లారైతును కుదేలు చేసింది. జిల్లా రైతులు సాధారణంగా వ్యవసాయం చేసే ప్రాంతంలో సగం కన్నా తక్కువగా సాగు చేస్తున్నందున వ్యవసాయ శాఖ పరంగా  ఈ ప్రాంతాన్ని కరువుప్రాంతంగా గుర్తించారు. ముందస్తుగా రాష్ట్రప్రభుత్వానికి ఈ కరువు సమాచారాన్ని పంపించారు. దానితో పాటు జిల్లా యంత్రాంగం కూడా కరువు రైతులను ఆదుకునే విషయంలో అప్రమత్తమైంది. కలెక్టర్‌ దుర్గాదాస్‌ కరువు ప్రాంత రైతులకు బ్యాంకురుణాలు ఆపకుండా తక్షణం అందించాలని ఆదేశాలిచ్చారు. ఇప్పటి వరకూ చేసిన జాప్యం నివారించి తక్షణచర్యలకు సిద్ధం కావాలని బ్యాంకర్లను కోరారు.

గోల్డ్‌స్కీమ్‌ పేరుతో గోల్డ్‌స్కాంలు

నిన్నటిదాకా డిపాజిట్లు సేకరించిన కొన్ని బ్యాంకుల గురించి, వాటి మోసాల గురించి బాధితుల గోడు తెరకెక్కింది. నేడు బంగారు షాపుల్లో  కొత్తగా గోల్డ్‌స్కీమ్‌ అమలు చేస్తున్నామంటూ వినియోగదారులను మోసం చేస్తున్న సంఘటనలు రాష్ట్రంలో పలుచోట్ల  వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వరంగల్‌ జిల్లాలోని ఏటూరునాగారంలో ఈ తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఒక్కసారి బంగారం కొనలేని వారందరికీ సువర్ణావకాశం అన్న ప్రకటనలు పలువురిని ఆకట్టుకున్నాయి. నెలనెలా కొంతసొమ్మును చెల్లించి చివర్లో దాని విలువైన బంగారాన్ని తీసుకోవచ్చని దుకాణదారులు ప్రకటనలు జారీ చేశారు. పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవారిని చూసి మథ్యతరగతి వర్తకులూ ఇదే తరహాలో పథకాలను ప్రవేశపెట్టారు. ప్రభుత్వఉద్యోగులు, చిన్న ఉద్యోగులు  ఈ తరహాపథకాలకు ఆకర్షితులవుతున్నారు. దుకాణదారులు ఏజెంట్లను పెట్టుకుని మరీ ఈ పథకాలు నడుపుతున్నారు. దీంతో ఏజెంట్లు తమ కమిషన్‌ కోసం తమ దుకాణప్రత్యేకతను సెంటిమెంటుతో మిక్స్‌చేసి మరీ చెబుతున్నాడు. ఎప్పుడైతే సెంటిమెంటును ఏజెంటు టచ్‌ చేశాడో వెంటనే ఆ గోల్డ్‌సేవింగ్స్‌ స్కీమ్‌ వినియోగదారునికి నచ్చేస్తోంది. ఇలా బంగారం వర్తకుడు లక్ష్మినారాయణ ఓ కోటిరూపాయలకు పైచిలుకు గోల్డ్‌సేవింగ్స్‌ స్కీమ్‌ పేరిట సేకరించి ఉడాయించారు. దీంతో నెలనెల పొదుపు చేసుకున్న మధ్యతరగతి, పేదలు ఘొల్లుమంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నిందితులు కూడా ఆ మొత్తం డబ్బు పూర్తిగా ఖర్చు అయ్యాక పోలీసులకు చిక్కుతున్నారు.

విషతుల్యంగా మారిన విశాఖ ఫార్మాసిటి

విశాఖ ఫార్మాసిటీలలోని ఐదుఫార్మా కంపెనీలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ధృవీకరించటంతో జిల్లా కలెక్టర్‌ లవ్‌అగర్వాల్‌ నోటీసులు జారీ చేయనున్నారు. కంపెనీ ప్రారంభించటానికి ముందే ప్రభుత్వం కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని నిర్దేశిస్తోంది. ప్రతీ పరిశ్రమల జోనల్‌కార్యాలయాల్లో ఈ నిబంధనల జాబితా ప్రదర్శిస్తుంటారు. వాటిలో కాలుష్యం వెదజల్లేలా పరిశ్రమలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరిస్తోంది. ఆ హెచ్చరికలు అటు అథికార్లు, ఇటు పారిశ్రామికవేత్తలు నిర్మాణ, ప్రారంభ సమయాల్లో పెడచెవిన పెడుతున్నారు. ఓ రెండు, మూడేళ్లలో కోట్లాది రూపాయల టర్నోవర్‌తో కంపెనీ విస్తరించాక కానీ, కాలుష్యం పెరిగిందన్న ఫిర్యాదులు అథికారులకు చేరవు. అప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలంటూ అథికారులు సీరియస్‌ అవుతుంటారు. కానీ, మొదట్లో ఫైలు తమ వద్ద ఉన్నప్పుడు కాలుష్యం వెదజల్లే యూనిట్లను అనుమతించబోమని అథికారులు పారిశ్రామికవేత్తలకు ఎందుకు స్పష్టం చేయటం లేదు? ఆమ్యామ్యాల కోసమా? లేక నేతల రికమెండేషన్‌కు జడుస్తున్నారా? అప్పుడే కనుక, కాలుష్యం పెరిగితే కంపెనీ మూసివేయాల్సి వస్తుందని హెచ్చరిస్తే పారిశ్రామికవేత్తలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేవారు. ఆ తరువాత కాలుష్యం పెరగటానికి కారణాలపై విశ్లేషించాల్సిన శ్రమ అథికారులకు తప్పుతుంది. విశాఖజిల్లాలోని ఫార్మాసిటీ కాలుష్యం అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. జిల్లా కలెక్టర్‌ నేరుగా ఈ సమస్య పరిష్కారంలో నిమగ్నమయ్యారు. మైలాన్‌, వేగ్నేశ, యాక్టస్‌, అకేషియా, విజయ ఫార్మాకంపెనీలకు ఆయన సీఆర్‌పీసీ 133 కింద నోటీసులు జారీ చేయనున్నారు. అలానే తాజాగా  తెలంగాణాప్రాంతంలోని అదిలాబాద్‌ వద్ద ఫార్మాకంపెనీలపై కూడా కాలుష్యం వెదజల్లుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. షామీర్‌పేట్‌ మండలంలోని గ్రామాలన్నీ ఆ కంపెనీల వల్ల కాలుష్యమయమవుతున్నాయి. సాయంత్రం ఏడుగంటల తరువాత కంపెనీలు కాలుష్యాన్ని వదులుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఆ రహదారిలో వెళ్లే పాదాచారులు తాము భరించలేనంత దుర్గంధం వెలువడుతోందంటున్నారు.

బి.సి.లు చంద్రబాబును నమ్మరా?

2012 ఉప ఎన్నికల్లో పరాజయం తెలుగుదేశం పార్టీ అథినేత నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల్లో తీవ్రమైన మార్పును తీసుకువచ్చింది. ఇంకా రెండు సంవత్సరాల సమయమున్నా సమీక్షలు, సమన్వయ సమావేశాలతో బిజీబిజీగా ఉన్న ఆయన ఇటీవల బిసిలకు తమ పార్టీ తరుపున వంద అసెంబ్లీస్థానాలు కేటాయిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఆ తరువాత ఇతర సమావేశాల్లో పడి మళ్లీ బిజీ అయిన చంద్రబాబును తాజాగా బిసికులసంఘాలు సన్మానించాయి. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో వందస్థానాల నుంచి బిసిలు పోటీ చేస్తున్నందున వారి గెలుపుబాధ్యత కులసంఘాలే తీసుకోవాలని కోరారు. తానిచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వస్తే నిధులు కూడా మంజూరు చేస్తానని చంద్రబాబు బిసి సంఘాలకు హామీ ఇచ్చారు. కులసంఘాల నాయకులు కూడా చంద్రబాబు మాటలకు స్పందించారు. ముందస్తుగా బిసిలకు వంద స్థానాలు ప్రకటించినందున తాము తెలుగుదేశం పార్టీకి కట్టుబడి పని చేస్తామని బిసి సంఘాల నేతలు  ప్రకటించారు. తమవారి గెలుపుద్వారా రాజ్యాధికారం సాధించుకోవాలన్న పిలుపుకు అనుగుణంగానే తాము పని చేస్తామని బిసి సంఘాలు తెలిపాయి. తెలుగుదేశంతో మమేకమై పని చేస్తేనే భవిష్యత్తు ఉంటుందన్న ఆశ తమకు ఏర్పడిరదని ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు. ఏదేమైనా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పటి నుంచి గెలుపు కోసం బిసి సంఘాలను దువ్వటం మొదలుపెట్టారు. ఈయన తీసుకున్న ఈ చర్యల వల్ల ఇతర జాతీయపార్టీలూ బిసిలకు తప్పనిసరిగా వందస్థానాలు కేటాయించాల్సి వస్తుందని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. మరి ఒకే కులం నుంచి ఇద్దరు పోటీ చేస్తే సంఘాలు కూడా గెలుపు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలవా? అసలు బి.సి.లు నిజంగా చంద్రబాబును నమ్ముతారా? గెలుపు కోసం కులసంఘాలను నమ్ముకుని బాబు  ఆశలపందిరి అల్లుకోవటం ఎంతవరకూ ఫలితానిస్తుందో భవిష్యత్తులోనే తేలుతుంది.