కొడాలి నాని టీడీపీని వీడడానికి అసలు కారణమేంటి?
posted on Jul 9, 2012 @ 6:32PM
గత కొంత కాలంగా కొనసాగుతున్న సందిగ్ధత కు తెర తీస్తూ గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నాని ఈరోజు ఉదయం వైకాపా గౌరవ అధ్యక్షరాలు వై యస్ విజయమ్మ గారిని కలిశారు. నాని త్వరలోనే జగన్ పార్టీలో చేరడం ఖాయమని సంకేతాలు ఇస్తూ తెలుగు దేశం పార్టీ కూడా నానీ ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపధ్యం లో అటు జూనియర్ ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ ఇరువురు కూడా తమకు నానీ తెలుగు దేశం పార్టీని వీడడంతో ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. లోగడ తెలుగు దేశం పార్టీ నాయకత్వపు మార్పిడికి సంబంధించి నందమూరి కుటుంబంలోనూ పార్టీలోను కొన్ని అభిప్రాయ భేదాలు వున్నాయని, అందుకే జూనియర్ నానీ ని ఎగదోస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు తండ్రీకొడుకులు జూనియర్, హరికృష్ణ వాటిని ఖండించడంతో అవి నిజం కాదని తెలుస్తోంది. నానీ కూడా ఇవేమీ కావు, గుడివాడ ఓటర్లలో ఎక్కువ శాతం బీసీలు,ఎస్సీలు వున్నారు. వాళ్ళు రాను రాను తెదేపాకు దూరమవుతున్నారు. ఈ పరిస్తితులలో తను తెలుగు దేశంలోనే వుంటే వచ్చే ఎన్నికలలో గెలవడం కష్టమని పార్టీ నుండి వెళ్లిపోతున్నానని ఒక సందర్భంలో చెప్పడం జరిగింది.
అయితే, వీటితో పాటు గతంలో ఇంకో మాట కూడా వినవచ్చింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి రెడీ అవుతున్ననందమూరి బాలకృష్ణ గుడివాడ సీటు పై దృష్టి పెట్టారని, అందుకు చంద్రబాబు నాయుడు కూడా సరే అన్నారని కధనాలు వచ్చాయి. ఎన్ని కోణాలలో ఆలోచించినా, ఈ కారణమే సహేతుకంగా ఉందనీ, ఇదే అసలు కారణమయి వుండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.