పబ్లిసిటీతో కొడాలి నానిని హీరో చేస్తున్న దేశం
posted on Jul 11, 2012 @ 9:34AM
ఒకానొకప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే హైటెక్ తెలివితేటలున్న పార్టీ అని అందరూ ప్రశంసించేవారు. కాలం మారింది. గేరు రివర్సయి ఇదే తెలుగుదేశం పార్టీ నేతలను కూడా తయారు చేస్తోందంటున్నారు. ఒక్క ఎన్టీఆర్‌పై వీరాభిమానం ఒలకబోసిన కొడాలి నానిని ఆ పార్టీ నేతను చేసేస్తోంది. తాను రాజీనామా చేస్తానని చెప్పకుండానే తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిందంటే నేను ఆ పార్టీలో లేనట్లే కదా అనటంలోనే నాని తనకు ఆ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో అర్థం అవుతోంది. పైపెచ్చు పెద్ద నేతకు ఇచ్చే కోట్లాది రూపాయలు తెలుగుదేశం బలంతో నెగ్గిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఇస్తున్నారని టిడిపి ప్రచారం చేస్తోంది. ఫలితంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశమే ఒక కొత్తనేతను అప్పగించినట్లుంది. 30కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొడాలి నానిని కొనాల్సిన అవసరం వై.కా.పా.కు ఉందా? ఎమ్మెల్యే దేవినేని ఉమ ఒక్కసారి ఆలోచించాలి? ఒకే కొన్నారనే అనుకుందాం కానీ, ఆ డబ్బు తీసుకున్న వాడి కాలు నిలువదు కాబట్టి ముందుసారి చంద్రబాబు దగ్గరికి నాని రావాల్సిన అవసరమేమిటీ? ఒక్కసారి ఆలోచించాలి.
ఉమ ఆరోపించేంత వరకూ తనకు అంత రేటు ఉందని తెలియని నాని ఇప్పుడు దానికన్నా ఎక్కువ అడగాలన్న ఆలోచన కూడా తెలుగుదేశం కల్పించినట్లుంది పరిస్థితి. ఎందుకంటే కొడాలి నానికి వై.కా.పా.కు వెళితే నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఎవరో జాతకం చెప్పారని ఎందుకు అనుకోవటం లేదు. క్రమశిక్షణ ఉన్న పార్టీగా నిరూపించుకునేందుకు వై.కా.పా.గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిసిన వెంటనే దేశం సస్పెన్షన్‌ను ప్రకటించింది కదా! అంతటితో ఆగొచ్చు కదా దిష్టిబొమ్మలు తగలేసి నాని మా తెలుగుదేశం పార్టీని వదిలేశాడని ఆ పార్టీయే డప్పుకొట్టుకుని చెప్పాల్సిన అవసరమేమిటీ? ఒక్క ఎమ్మెల్యే వెళితే మైలవరం,నూజివీడు, నందిగామ, కంచికచర్ల, గుడివాడల్లో నిరసన కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేయటం అవసరమా? లేక కార్యకర్తలను నాని వెనుక వెళ్లకుండా పార్టీ తరుపున ఇంకో నేతను తయారు చేసుకోవటం అవసరమా? ఏమైనా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన తెలుగుదేశం పార్టీయే నానిని రాష్ట్రవ్యాప్తంగా నేతగా వై.కా.పా.కు అప్పగిస్తోందని రాజకీయపరిశీలకులు, అనుభవస్తులు తేలుస్తున్నారు. ఇదే నిజం కూడాను. ఇకనైనా తమపార్టీకి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన తెలుగుదేశం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని సూచనలు వస్తున్నాయి.