ఇకపై ఆన్‌లైన్‌లో పాల బుక్కింగ్
posted on Jul 11, 2012 9:21AM
ఆన్‌లైన్‌లో పాలు బుకింగ్ చేసుకునే సదుపాయం రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లో ప్రారంభమైంది. త్వరలో ఈ సదుపాయం రాష్ట్రంలోని అన్ని నగరాలకు విస్తరిస్తుంది. ముందస్తుగా హైదరాబాద్‌నగరంలో పెరిగిన పాల అవసరాలను తీర్చేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. ఎక్కువ మొత్తంలో పాలు రోజూ కొనుగోలు చేసేవారికి ఈ ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. వెబ్‌సైట్‌లో తమ వివరాలు తెలిపి బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిబ్బంది పాలు సరఫరా చేస్తారు. తొలిప్రయోగంలో ఎక్కువగా పాలు వినియోగించే హోటల్స్, ఇస్‌క్రీమ్‌లు తయారీదారులకు ఈ ఆన్‌లైన్ పాల సదుపాయం ఉపయోగపడుతోందని పశుసంవర్థకశాఖామంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. దీని కోసం ప్రత్యేకించి ఒక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ వాసులు ఈ`సేవ, మీ`సేవ కౌంటర్ల ద్వారా డబ్బులు చెల్లిస్తే ఇంటికే పాలను సరఫరా చేస్తారని చెప్పారు. అలానే బ్యాంకుల ద్వారా డబ్బులు చెల్లించినా పాల సరఫరా జరుగుతుందన్నారు. అయితే పాలు పెద్దమొత్తంలో అవసరమైన వారికి తొలుత సరఫరా చేస్తున్నామని చెప్పారు. త్వరలో తక్కువ పాల అవసరమైన వారికీ సరఫరా చేస్తామని వివరించారు. పాలు సరఫరా చేసేవారికి రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండా వారు ఇంటి వద్దకే వచ్చి పాలు అందజేస్తారన్నారు.