టిడిపిలో ఎస్సీ వర్గీకరణపై అస్పష్టత!
posted on Jul 9, 2012 @ 7:44PM
తెలుగుదేశం పార్టీలో ఎస్సీ వర్గీకరణపై అస్పష్టత నెలకొంది. ఈ పార్టీ ప్రారంభం నుంచి గమనిస్తే అసలు ఈ వర్గీకరణ సమస్యకు టిడిపి అథినేత చంద్రబాబే ఆజ్యం పోశారు. ఆయన అథికారంలో ఉన్నప్పుడు ఈ వర్గీకరణ చేసేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తీవ్రమైన వ్యతిరేకతను తట్టుకోలేక, ప్రతిపాదించిన వర్గీకరణను అమలు చేయలేక చంద్రబాబు నలిగిపోయారు. మళ్లీ ఇదే సమస్యను బాబు తెలుగుదేశం పార్టీ తరుపున ఏకాభిప్రాయానికి వద్దామని లేవనెత్తారు. అసలు సమస్య లేవనెత్తగానే వస్తున్న నిరసనగళాలు బాబును ఆలోచింపజేస్తున్నాయి.
ఎస్సీల్లోని మాల, మాదిగల మధ్య ఏకాభిప్రాయం సాధించలేమని ఈ వర్గీకరణ సమస్యపై నలిగిన చర్చల్లో ఎప్పుడో తేలిపోయింది. పైగా ప్రత్యేకించి సోదరులుగా ఉండాల్సిన వారి మధ్య ఎవరు ఈ సమస్య తీసుకువచ్చినా విభేదాలు సృష్టించినట్లు అయ్యింది. బాబు ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఒకరు తన ఎపిపిఎస్‌సి సభ్యత్వ అనుభవంతో సమస్య తీవ్రతను విశదీకరించారు. తెలంగాణాలో మాలల పోస్టులు, ఆంథ్రాలో మాదిగల పోస్టులు మిగిలిపోతున్నాయని సమస్యను వివరించారు.
ప్రతీ జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడున్న పరిస్థితి ఆథారంగా వర్గీకరణ అమలు చేయకపోతే సమస్యలు పెరుగుతాయని ఆ మాజీ హెచ్చరించారు. దీంతో దళితుల అభ్యున్నతికి అవసరమైన కార్యాచరణ రూపొందిద్దామని చంద్రబాబు తన అస్పష్టతను అలానే ఉంచి సమావేశం ముగించారు. మాదిగ దండోరా రాష్ట్ర అథ్యక్షుడు మందాకృష్ణ వర్గీకరణను చంద్రబాబు అమలు చేయలేకపోయారని పలుమార్లు విమర్శించారు. ఈ సమావేశంలోనూ తెలుగుదేశం అస్పష్టత కొనసాగిందని తెలిస్తే మందా ఇంకెలా స్పందిస్తారో ఇంక మాటల్లో చెప్పనక్కర్లేదు.