తెలంగాణ ఆ త్మ గౌరవానికి ప్రతీక ‘నీరా’ అట
posted on May 4, 2023 @ 2:43PM
ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న నీరాను నగరవాసులకు అందించే నీరా కేఫ్ ను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా.. నీరా అంటే ఆల్కహాల్ అని దుష్ప్రచారం ఉందని..ఇది దేవతలు తాగే వేదామృతమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తరతరాల నుంచి వస్తున్న గీత వృత్తి అని.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక నీరా కేఫ్ అని అన్నారు ఆయన.హుస్సేన్ సాగర్ తీరాన ప్రారంభమైన ‘నీరా’ కేఫ్ 2020 ఆగస్టులో శంఖుస్థాపన జరిగింది. అప్పట్లో ఈ కార్యక్రమానికి సీనియర్ అధికారులు, కేటీఆర్, దానం నాగేందర్, తలసాని తదితరులు హాజరయ్యారు. నీరా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అధికార పార్టీ ప్రభుత్వం పెద్ద ప్రచారమే చేసింది. నీరా తాగితే ఒంట్లో ఎనర్జీ వస్తుందని చెప్పి హుస్సేన్ సాగర్ తీరాన కేఫే ప్రారంభించి వ్యాపారం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి పక్షాలు నీరా అమ్మకాలను కమర్షియల్ చేయడం సహేతుకం కాదని వాదిస్తున్నాయి. బెల్ట్ షాపులతో విసిగి వేసారిన ప్రజలకు నీరా కేఫేలు మరిన్ని ఇబ్బందులు పెట్టొచ్చని పలువురు అంటున్నారు.
నీరా ఆల్కాహాల్ కాదని బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. ఖర్చూర చెట్ల కు సూర్యోదయం ముందు కట్టిన కుండలలో నీరా పడితే కిరణ జన్య సంయోగ క్రియ జరిగి నీరా తయారవుతుందని, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. నీరా తాజాగా ఉన్నప్పుడే ఔషధ విలువలు ఉంటాయని, ఫ్రిజ్లో స్టోర్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీరాతో బై ప్రొడక్టులు తయారవుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ , పాస్పరస్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నీరా ను ప్రమోట్ చేయడం వల్ల కల్లు గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో గౌడ కులస్థుల వోట్లను పొందడానికి నీరా దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ సమాజం యొక్క సెంటి మెంట్లు నీరా, కల్లు వంటి పానీయాలతో ముడి పడి ఉందని కేసీఆర్ విశ్వాసం. ఉపాధి కోల్పోతున్న కల్లు గీత కార్మికులకు నీరా అమ్మకాలతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందవచ్చని బీఆర్ఎస్ భావిస్తుంది.