శివకుమార్ కు తప్పిన ప్రమాదం

కర్ణాటక కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారం కోసం శివకుమార్ హెలికాప్టర్ లో బయలు దేరారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను ఓ డేగ ఢీకొట్టింది.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం డీకే శివకుమార్‌ ముళబాగిలులో ఎన్నికల ప్రచారం కోసం మధ్యాహ్నం హెలికాఫ్టర్ లో బయలుదేరారు.ఆ హెలికాప్టర్ హోసకోట్‌ సమీపంలో ల్యాండ్‌ అవుతుండగా ఓ డేగ వచ్చి ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో డీకే శివకుమార్‌ కు ఏమీ కాకపోయినా, ఆయన కెమెరామెన్‌ కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం అతనికి చికిత్స అందించారు.కర్ణాటకలో ఈ నెల 10 పోలింగ్ జరగనుంది. కూత వేటు దూరంలో ఎన్నికలు ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడం కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది.  శివకుమార్ ఏడుసార్లు ఎంఎల్ఏ గా గెలిచి కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతల్లో ఒకరుగా ఉన్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో  ఆయన ముఖ్యభూమిక వహించారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. శివకుమార్ అత్యంత సంపన్న రాజకీయ నేతగా రికార్డుల్లోకెక్కారు

మల్లారెడ్డి పోలవరం వ్యాఖ్యలు.. నవ్వించారా.. నవ్వుల పాలయ్యారా?

తెలంగాణ మంత్రులలో  చామకూర మల్లారెడ్డిది ఒక విలక్షణ శైలి. ఆయన విమర్శలకు కానీ, పొగడ్తలకు కానీ హద్దులు ఉండవు. ఆయన చేప్పే మాటలు కోటలు దాటేస్తాయి. అయితే అందులో విషయం మాత్రం గడప దాటే పాటి కూడా ఉండదు. ఒక సారి కాదు పలు మార్లు ఆయన తన విలక్షణ, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలోకెక్కారు. విద్యాసంస్థల అధిపతిగా మల్లారెడ్డి సంపాదనపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. అటువంటి విమర్శలను ఆయన ఎన్నడూ పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. అయితే భూ కబ్జా ఆరోపణలపై ఆయన రేవంత్ రెడ్డికి సవాళ్లు విసిరి ఫన్ సృష్టించారు. ఆ తరువాత తన నివాసాలపై ఐటీ దాడులు జరిగిన  సమయంలో ఆయన విన్యాసాలు, ప్రసంగాలు ఏవీ కూడా ఆయనపై సానుభూతి కలిగించేవిగా కాకుండా నవ్వుకునేలా, నవ్వించేలాగే ఉన్నాయి. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ లో పోవలరం ప్రాజెక్టు పూర్తి విషయంలో చేసిన వ్యాఖ్యలు ఔరా అనిపించేలా ఉన్నాయి. ఆ ప్రాజెక్టును పూర్తి చేసే సత్తా సామర్ధ్యం తెలంగాణ ముఖ్యమంత్రికే ఉందని ఆయన వాకృచ్చారు. పనిలో పనిగా ఏపీలో నోరూ జారారు. తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇక్కడ స్థిరపడిన ఆంధ్రుల ఓట్లపై బీఆర్ఎస్ కన్నేసినట్లుగా కనిపిస్తోంది. అందుకే విశాఖ ఉక్కు విషయంలో ఉన్న పరువును గంగలో కలుపుకున్న బీఆర్ఎస్ అధినేతను ఆకాశానికెత్తేయడానికా అన్నట్లు ఏపీలో పోలవరం పూర్తి కావాలంటే ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడమొక్కటే మార్గమన్నారు. ఆ వెంటనే విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా కాపాడాలన్న కేసీఆరే దిక్కని అన్నారు. అక్కడితో ఆగలేదు. అవి రెండూ కావాలంటే అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలని మల్లారెడ్డి చెప్పారు. ఏదో ఏపీలో బీఆర్ఎస్ విజయం సాధించాలన్న ఆశాభావం వ్యక్తం చేసి ఊరుకోలేదాయన.. అక్కడ బీఆర్ఎస్ విజయం ఖాయమని ఢంకా బజాయించి మరీ చెప్పేశారు.  అయితే పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టనీ, అది పూర్తి చేయాలంటే కేంద్ర నిధులు అవసరమన్న సంగతిని మల్లారెడ్డి కన్వీనియెంట్ గా మరచిపోయారు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ ప్రతి నెలా మొదటి తేదీన ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్న సంగతిని విస్మరించి ఏపీలో అధికారంలోకి వచ్చేస్తామనీ, పోలవరం పూర్తి చేసేస్తామని మల్లారెడ్డి చెబుతున్న మాటల వెనుక ఉన్నది ముఖ్యమంత్రి ప్రాపకం కోసం పాకులాట వినా మరోటి కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఉక్కు ఫ్యాక్టరీ గురించి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. సొంత రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల సంగతి విస్మరించి పొరుగు రాష్ట్రంలో పరిశ్రమను ప్రైవేటీకరణ నుంచి కాపాడతామంటూ మల్లారెడ్డి చెబుతున్న మాటలు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు అన్న చందంగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవలే ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)లోనే బిడ్డింగ్ వేస్తానని హడావుడి చేసి సింగరేణి నుంచి బృందాన్ని కూడా పంపి తరువాత కేసీఆర్ చేతులెత్తేసిన విషయం గుర్తులేదా అని నెటిజన్లు మంత్రి మల్లారెడ్డిపై సెటైర్లు వేస్తున్నారు.   అయితే జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఆవిర్బవించిన ఇంత కాలానికి కూడా ఏపీలో ఒక్కటంటే ఒక్క సభ నిర్వహించని బీఆర్ఎస్ ఎప్పుడో ఏడాది తరువాత రాబోయే ఎన్నికలలో విజయం గురించి గప్పాలు కొట్టుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా తమ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని చెప్పుకోవడానికి ఏపీలో అభివృద్ధి లేమిని చూపితే చాలని తెలంగాణ మంత్రులు భావిస్తున్నారని విమర్శకులు అంటున్నారు. చిన్న గీతను పెద్దది చేయడానికి దాని పక్కన చిన్న గీత గీసినట్లుగా.. తెలంగాణ మంత్రులు ఏపీని, అక్కడి ప్రభుత్వ వైఫల్యాలనూ ఉపయోగించుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. 

కర్ణాటకలో దూసుకెళ్తున్న కాంగ్రెస్

కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుందని తేలింది. రెండో స్థానంలో బీజేపీ, మూడోస్థానంలో జెడీ(ఎస్) ఉంది. అయితే జేడీఎస్ ముఖ్య భూమిక వహించనుంది. జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టం.కన్నడ మీడియా సంస్థ ఎడీనా నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు రానున్నాయి. కర్ణాటకలో మే 10వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు రానుంది. మే 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 132 నుంచి 140 స్థానాల్లో కాంగ్రెస్ కైవసం చేసుకోనుందని ఎడీనా పేర్కొంది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 224. అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలవనుంది. 57 నుంచి 65 స్థానాల్లో ఆ పార్టీ గెలవనుందని సర్వే తెలియజేసింది. జనతాదళ్ (ఎస్) కింగ్ మేకర్ గా అవతరించనుంది. కింగ్ మేకర్ అయినప్పటికీ ఆ పార్టీకి 19  నుంచి 25 స్థానాలు రానున్నాయి.  కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల వారిగా ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ కర్ణాటక(31 నుంచి 37 స్థానాలు), ముంబయ్ కర్ణాటక (40 నుంచి 46), సదరన్ కర్ణాటక(26 నుంచి 32 ), బెంగుళూరు(16 నుంచి 20) స్థానాలు ఉన్నాయి. బిజేపీ హైదరాబాద్ కర్ణాటక(2 నుంచి 4)స్థానాలు, కోస్తా కర్ణాటక(10నుంచి 14 స్థానాలు), సెంట్రల్ కర్ణాటక ( 19 నుంచి 23 ) స్థానాలు కైవసం చేసుకోనుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానుందని సర్వే రిపోర్టును అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ మరో 100 ఏళ్ల వరకు అధికారంలో రాదని జోస్యం చెప్పారు. అస్సాం ముఖ్యమంత్రి కర్ణాటకలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్ణాటకలోని తూమకూరు అసెంబ్లీనియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొనడానికి ఆయన వచ్చారు. అవినీతి, అసమర్ధత నియోజకవర్గంలో రాజ్యమేలుతుందని బిశ్వాస్ చెప్పారు. ఇక్కడ 342 గ్రామాల్లో తాగునీరు, రోడ్ల  సౌకర్యం లేదు. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ స్వరూపం మారిపోతుందని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. ఎడీనా సంస్థ  సర్వే ప్రకారం కర్ణాటకలో కాంగ్రేస్ మెజారిటీ స్థానాల్లో గెలుచుకుంటుందని, అధికారంలో ఉన్న బీజేపీ ఓటమి ఖాయమని  ఘంటాపథంగా చెబుతోంది. ఇదిలా వుండగా కర్ణాటకలో బీజేపీ, కాంగ్రేస్ పార్టీలు నువ్వానేనా అన్నట్లు తలపడతాయని ఏసియా న్యూస్ జన్ కీ బాత్  ఓపినియన్ పోల్  జోస్యం తెలియజేసింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 11 వరకు 30 వేల మంది ఓటర్లను సర్వే చేస్తే ఈ విషయం వెల్లడైంది. కోస్తా కర్ణాటకలో అధికార పార్టీ పట్టు బిగుస్తోంది. సెంట్రల్ కర్ణాటకలో బీజేపీ  పరిస్థితి బాగా లేదు. 

పులివెందుల సస్పెన్స్ థ్రిల్లర్

సస్పెన్స్ నవలలు, సస్పెన్స్ సినిమాలకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా పొలిటికల్ సస్పెన్స్ నడుస్తోంది.  కడప జిల్లా వాసులు ఆసక్తిగా చర్చించుకుంటున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో ప్రధాన సూత్రధారి వైఎస్ అవినాష్ రెడ్డి. కడప పార్లమెంట్ మెంబర్ అయిన అవినాష్ రెడ్డి గత నాలుగు సంవత్సరాలలో పెద్దగా ప్రజలకు కనిపించింది లేదు. 2019 మార్చి 15వ తేదీన జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య తరవాత పరిణామాలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడిచిన రెండు నెలలుగా మీడియాలో అంతా  అవినాష్ పైనే చర్చ జరిగింది. వారం రోజులుగా ఆచ్చ తగ్గుముఖం పట్టి ఇప్పుడు దాదాపు అదృశ్యమైంది.  దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్న అవినాష్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. నియోజకవర్గంలొగడనగడపకు కార్యక్రమంలో పాల్గొంటున్నారు.  ఇది ఒక వైపు నడుస్తుంటే.. మరో వైపు సీబీఐ అధికారులు అవినాష్ వెంట నీడలా అనుసరిస్తున్నారు.  అవినాష్ పర్యటనల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వెంటాడుతున్నారు.  ఢిల్లీ, హైదరాబాద్ నుండి వచ్చిన సీబీఐ బృందం ఏ క్షణంలోనైనా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవచ్చన్న వదంతులు కడపలో జోరుగా షికారు చేస్తున్నాయి. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో మకాం వేసి ఉన్న సీబీఐ బృందం ఓవరితోనూ మాట్లాడటం లేదు. సీబీఐ మౌనం వెనుక వ్యూహం ఏమిటో అర్దం కాక స్థానిక వైసీపీ శ్రేణులు అయోమయంలో పడిపోయాయి. అయితే సీబీఐ వేచి చూసే ధోరణి అవలంబిస్తోందని కొందరు బాహాటంగానే చెబుతున్నారు. వివేకా హత్య కేసు తమను ఇంత ఇబ్బంది పెట్టదని తొలుత వైసీపీ భావించినా, సీబీఐ, ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలతో అన్ని ముందు జాగ్రత్తలూ తీసుకోవాల్సి వచ్చింది. మైసూరు నుంచి విజయ్ కుమార్ గురూజీని, గుజరాత్ నుంచి పరిమళ్ నత్వానీని వైసీపీ అధిష్ఠానం రంగంలోకి దింపింది. ఆంధ్రప్రదేశ్ లోని పెద్ద పారిశ్రామిక వేత్తల సమూహం విజయ్ కుమార్ గురూజీని పనిలో పెట్టగా, బీజేపీ అధినాయకత్వం పరిమళ్ నత్వానీని రంగంలోకి దించింది.రాజ్యసభకు పంపించిన వైసీపీని పరిమళ్ నత్వాని సరైన సమయంలో ఆదుకున్నాడని కడప వాసులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఏప్రిల్ 30లోగా అవినాష్ అరెస్టు ఖాయమని పందాలు కాసి ఔత్సీహికులు కొందరు జేబులు ఖాళీ చేసుకున్నారని తెలుస్తోంది. వివేకా హత్య కేసులో ఒకే రోజు 18 మందికి నోటీసులిచ్చి హడావుడి చేసిన సీబీఐ ఎందుకు వేచి చూస్తోందో ఎవరికీ అంతుబట్టడం లేదు. అరెస్టు చేయాలనుకుని కోర్టు ఆదేశాలతో వెనక్కు తగ్గిన సీబీఔ ఇంకా కడపలోనే  ఎ:దుకు మకాం పెట్టిందో అనేది మరో సస్పెన్స్. తనను అరెస్టు చేస్తే ఆందోళనలకు దిగవద్దంటూ అభిమానులకు సంకేతాలిచ్చిన అవినాష్, ఇప్పుడు అదేమీ పట్టనట్టు పార్టీ కార్యక్రమాల్లో మునిగిపోయారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనతో వివేకా హత్య కేసు పరిశోధనలో కీలక మార్పులు జరిగాయనీ, వివేకా హత్య కేసు కూడా మిగిలిన కేసుల్లా నత్తనడకలా సాగబోతోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ భాస్కరరెడ్డి అరెస్టు జరిగినంత పకడ్బందీగా  అవినాష్ అరెస్టు కూడా జరగబోతోందని కడపలో కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.

వారం పాటు తెలంగాణలో పాలన స్టాండ్ స్టిల్!?

తెలంగాణ ప్రభుత్వం అత్యంత  ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సెక్రటేరియట్ లోకి విపక్ష నేతలూ, సామాన్యులనే కాదు అధికార పార్టీ ఎమ్మెల్యేలకూ నో ఎంట్రీయే. సచివాలయ ప్రారంభోత్సవం అయితే ఆర్భాగంగా చేసేశారు కానీ, సచివాలయంలో ఉద్యోగుల విధినిర్వహణ, సచివాలయంలోనికి వారు ప్రవేశించాల్సిన మార్గం తదితర అంశాలపై ఒక క్లారిటీకి రాకపోవడంతో ప్రారంభం అయిన మరుసటి రోజు నుంచే అంతా గందరగోళంగా మారిపోయింది.   సోమవారం (మే 1)న సీఎస్ ను కలవడం కోసం సచివాలయానికి బయలు దేరిన కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టెలిఫోన్ భవన్ వద్దే పోలీసులు నిలువరించి సచివాలయంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదని అడ్డుకున్నారు. సరే అదే రోజు సచివాలయాన్ని సందర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా అనుమతి లేదంటూ అక్కడి భద్రతా సిబ్బంది వెనక్కు పంపేశారు. ఇదే అనుకుంటే.. సచివాలయ ఉద్యోగులకు సైతం ప్రవేవం లేదంటూ సెక్యూరిటీ సిబ్బంది ఆపేశారు.  ఏ గేటు నుంచి ఎవరికి ఎంట్రీ అన్న విషయంలో ఉన్నతాధికారులు ఎటువంటి క్లీరిటీ ఇవ్వకపోవడంతో సెక్రటేరియెట్ నో ఎంట్రీ భవన్ గా మారిపోయిందని చెబుతున్నారు.  దీంతో రాష్ట్ర సచివాలయం ప్రారంభం రోజు నుంచే అన్నిశాఖల అధికారులు విధులు నిర్వర్తిస్తారని చెప్పిన ప్రభుత్వం మాటలు అమలులోకి రాకుండా పోయాయి. సచివాలయంలో ఉద్యోగులు విధులు నిర్వర్తించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసేశామని ప్రభుత్వం ప్రకటించేసింది. అంతే కాదు  తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్ నుంచి శాఖలకు సంబంధించిన పైళ్లను నూతన సచివాలయానికి తరలించేందుకు మూడ్రోజులు గడువు కూడా విధించింది. అలాగే ఏ సమయంలో ఏ శాఖలను తరలించాలన్న గైడ్ లైన్స్ తో  ఆధికారులకు ఆదేశాలు  కూడా జారీ చేసింది.  కానీ ప్రభుత్వం విధించిన గడువు సరిపోలేదో... ఆయా శాఖలకు కేటాయించిన ఫ్లోర్లలో మౌలిక సదుపాయాలు కల్పించలేదో  కారణమేదైనా  కొన్నిశాఖలకు చెందిన ఫైళ్లు, డేటా తరలింపు పూర్తి కాలేదు.  ఇంటర్నెట్ సౌకర్యం సైతం కల్పించలేదు. దీంతో సచివాలయం ప్రారంభం అయ్యిందే కానీ అక్కడ పనులు మొదలు కాలేదు. ఉద్యోగులు ఖాళీగా ఉంటున్నారు. మొత్తం మీద సచివాలయంలో పూర్తి స్థాయిలో ఉద్యోగులు విధులు నిర్వర్తించేందుకు కనీసంలో కనీసం వారం రోజులు పడుతుందని సంబంధిత అధికారులే అంటున్నారు.   అంటే తెలంగాణలో పాలన కనీసం వారం రోజుల పాటు స్తంభించిపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు.  

పాక హోటల్ లో ఇడ్లీ భేష్.. వెంకయ్య

వెంకయ్యనాయుడు.. మాజీ ఉపరాష్ట్రపతి.. అంతకంటే ముందు రాజకీయ నాయకుడు, కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు.. యిలా అన్ని దశలూ సక్సెస్ ఫుల్ గా దాటి వచ్చిన నేత. రాజకీయ నాయకుడిగా గానీ, కేంద్ర మంత్రిగా కానీ, ఆ తరువాత ఉప రాష్ట్రపతిగా కానీ ఆయన ఎక్కడా వివాదాల జోలికి వెళ్ల లేదు. వివాదరహితుడిగానే పేరొందారు. తన వాక్చాతుర్యంతో, వాగ్ధాటితో తోటి రాజకీయ నాయకులనే కాకుండా సామాన్యులను సైతం మెప్పించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందే సమయంలో ఆయన ఏపీకి న్యాయం కోసం గళమెత్తారు. కొన్ని హామీలు పార్లమెంటు సాక్షిగా సాధించగలిగారు కానీ, ఆ తరువాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కీలక శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టినా పార్లమెంటు సాక్షిగా పొందిన హామీలను అమలు చేయించే విషయంలో సొంత ప్రభుత్వాన్నే ఒప్పించలేకపోయారు. అయితే వాటిపై అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ గళమెత్తి.. సొంత ప్రభుత్వానికే తలనొప్పిగా  మారారు. అంతే ఆయనకు పదోన్నతి అంటూ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయించి ఏకంగా ఉపరాష్ట్రపతి కుర్చీలో కూర్చోబెట్టేసి రాజకీయాలకు దూరం చేసేసింది  మోడీ సర్కార్. ఉప రాష్ట్రపతిగా రాజకీయాలు మాట్లాడకూడదన్న విలువకు కట్టుబడి ఆయన ఏపీ ప్రయోజనాల గురించి నోరెత్తలేదు. ఆయన ఉప రాష్ట్రపతిగా వెళ్లడం వల్ల ఏపీకి నష్టం జరిగిందనే వారూ లేకపోలేదు. అయితే అదంతా గతం. తన మొత్తం పొలిటికల్ కెరీర్ అంతా బీజేపీ కోసం పాటుపడిన వెంకయ్యకు ఉప రాష్ట్రపతిని చేసి పార్టీ రుణం తీర్చుకుందని చెప్పుకోవడానికి లేకుండా.. మరో సారి ఆ అవకాశం ఇవ్వకుండా.. రాష్ట్రపతి అయ్యే చాన్స్ కూడా ఇవ్వకుండా బలవంతపు రిటైర్మెంట్ ఇచ్చేసింది మోడీ సర్కార్. ఈ విషయంలో తన అసంతృప్తిని సన్నిహితుల వద్ద వ్యక్తం చేసుకోవడానికి మాత్రమే పరిమితమైన వెంకయ్యనాయుడు.. బహిరంగంగా మాత్రం హుందాగా.. రిటైర్మెంట్ లైఫ్ గడిపేస్తున్నారు. తెలిసిన వారూ, అభిమానించే వారు ఆహ్వానిస్తున్న కార్యక్రమాలకు హాజరౌతూ.. ప్రసంగాలలో  ఏవో మంచి మాటలు చెబుతూ కాలం గడిపేస్తున్నారు. తాజాగా ఆయన విజయవాడలోని మునిసిపల్ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న ఎస్ఎస్ఎస్ హోటల్ లో కూర్చుని ఇడ్లీలు తిన్నారు. ఆ ఎస్ఎస్ఎస్  హోటల్ గుబురు చెట్ల నీడలో ఉండే ఓ పాక హోటల్. చక్కగా అందరూ బొంబాయ్ చట్నీ అనే శనగపచ్చడి, అల్లం చట్నీ, కారప్పొడి, నెయ్యితో ఇడ్లీలను ఆరగించిన వెంకయ్య నాయుడు ఆ హోటల్ యజమానిని అభినందించి, గతంలో కూడా ఓ సారి తాను ఇక్కడ ఇడ్లీలు తిన్న విషయాన్ని చెప్పి ఊరుకోకుండా అలవాటు ప్రకారం ఇడ్లీల ప్రాశస్థ్యం, వాటి వల్ల ఆరోగ్యానికి చేకూరే  మేలు వంటి విషయాలపై కూడా ప్రసంగించేవారు. బలవర్ధకమైన మన భారతీయ సంప్రదాయ వంటలను, రుచులను కాపాడుకోవాలని సూచనా ఇచ్చేశారు. 

సరిహద్దులో ’విషం‘ కక్కిన బంగ్లా!

భారత్.. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం.. ఎప్పుడూ బీఎస్ఎఫ్ దళాలు గస్తీలో ఉంటాయి.. చీమ చిటుక్కుమన్నా.. కొంచెం అనుమానం వచ్చినా భద్రతా దళాలు అప్రమత్తమవుతాయి.. అలాంటి సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్ జరుగుతోందని సమాచారం అందడంతో.. సైన్యం అప్రమత్తమైంది.. సరిగ్గా అర్దరాత్రి ఇద్దరు వ్యక్తులు భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా.. వారిని వారిని బీఎస్ఎఫ్ దళం అడ్డుకుంది. వారిపై కాల్పులు జరపగా.. వారిద్దరూ తప్పించుకున్నారు. ఈ క్రమంలో వారు జారవిడిచిన చిన్న కూజా లాంటి బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు. అది ఎంటా అని చూడగా.. దెబ్బకు షాక్ అయ్యే విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు స్మగ్లర్లు బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి.. అక్రమంగా రవాణా చేయాలనుకున్న రూ.13 కోట్ల విలువైన పాము విషం. దానిని స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్‌ఎఫ్‌ వెల్లడించింది. బంగ్లాదేశ్ సరిహద్దులో అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం అందడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలోని హిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోష్‌పూర్ బీఓపీ ప్రాంతంలో.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత.. సుమారు 12.30 గంటల ప్రాంతంలో ఇద్దరు స్మగ్లర్లు దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. వారిపై సిబ్బంది కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే, ఓ సిసాను స్మగ్లర్లు వదిలిపెట్టి పోగా.. దానిని సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో పాము విషం ఉండటాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ సీసాపై రెడ్ డ్రాగన్ కో ‘మేడ్‌ ఇన్‌ ఫ్రాన్స్‌’ అని రాసి ఉందని.. బాటిల్‌లో ఉన్న విషం కోబ్రాదని అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హిలి ప్రాంతంలో BSF 137వ బెటాలియన్ స్వాధీనం చేసుకున్న రూ.13 కోట్ల విలువైన పాము విషాన్ని బలుఘాట్ అటవీ శాఖకు అప్పగించినట్లు రేంజర్ సుకాంత్ ఓజాన్ తెలిపారు.

విశాఖవాసుల నుంచి నిరసన

విశాఖపట్టణం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అని రెండునెలల క్రితం అనౌన్స్ చేసినప్పటికీ నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తొలగలేదు. ఏప్రిల్ 23, 2015న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అయితే,  2020లో, రాష్ట్రం ఒక చట్టం ద్వారా అమరావతి, విశాఖపట్నం మరియు కర్నూలు అనే మూడు రాజధాని నగరాలను నోటిఫై చేసింది. ఈ నోటిఫై తర్వాత విశాఖలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి.  విశాఖలో జనజాగరణ సమితి ఆధ్వర్యంలో 'అమరావతి సత్యం - మూడు రాజధానులు భ్రమ' అనే అంశంపై యువజన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల ప్రతినిధులు, పెద్దఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. విలువైన భూములు దోచుకునేందుకే వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందని... సదస్సులో పాల్గొన్న యువత అభిప్రాయపడింది. సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని జనజాగరణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చాలనే కొత్త సంప్రదాయానికి తెరలేపడం మంచిది కాదన్నారు. ప్రజలను గందరగోళ పరచకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. విశాఖలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంలో వైఎస్ ప్రభుత్వం మనసు మార్చుకుంది. విశాఖ పెట్టుబడులకు ఆహ్వానించింది. రెండ్రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్   సుమ్మిట్లో ముఖ్యమంత్రి వైజాగ్ రాజధాని అని అనౌన్స్ చేశారు. నేను కూడా విశాఖకు వచ్చేస్తానని హామి ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనౌన్స్ చేసే సమయానికి అమరావతి రాజధాని కేసు విషయం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది. సుప్రీంలో కేసు విచారణ దశలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ రాజకీయ కారణాలచేత వైజాగ్ క్యాపిటల్ అని అనౌన్స్ చేశారని ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మెన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అమరావతి క్యాపిటల్ అని హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. రాజధాని విషయంలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జనజారణ సమితి మరోసారి ఆందోళన చేపట్టనుంది. బుధవారం ముఖ్యమంత్రి జగన్ వైజాగ్ , విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు.ఇదే అవకాశంగా తీసుకున్న జనజాగరణ సమితి జగన్ కు వ్యతిరేక ప్లెక్సీలను వైజాగ్ లో అంటించింది. ‘‘రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం, సుస్వాగతం అనే ప్లెక్సీలు వైజాగ్ లో అడుగడుగునా దర్శనమిస్తున్నాయి.   

ఔను వాళ్లిద్దరూ కలిశారు.. ఇక వైసీపీ పని దబిడి దిబిడే!

తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు పొడుపు ఖరారైందన్న సంకేతాల మధ్య వైసీపీలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లిపోయింది. అందుకే ఆ పార్టీ నాయకులు జనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ వంటి స్టార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శలే కాదు దూషణలకు కూడా వెనుకాడటం లేదు. ఒక ఎమ్మెల్యే అయితే జనాగ్రహాన్ని తట్టుకోలేక, సొంత పార్టీ శ్రేణులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోవడాన్ని సహించలేక సొంత పీఏపైనే చేయి చేసుకుని ఫ్రస్ట్రేషన్ ను బయటపెట్టుకున్నారు. ఇక ఆ పార్టీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణం రాజు తాజాగా తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిశాయంటే వైసీపీ ఔట్ అని వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలూ కలిస్తే వసీపీ బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోవడం తథ్యమన్నారు.  ఏపీకి విశాలమైన తీర ప్రాంతం ఉంది. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనలు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే..  ఆ విశాల  తీర ప్రాంత గర్భంలో  వైసీపీ కలిసిపోతుందని రఘురామ రాజు జోస్యం చెప్పారు. నెల్లూరు టు శ్రీకాకుళం, రాయలసీమ యిలా  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అధ్వానంగా ఉందని ఆయన అన్నారు.  అవినాష్ రెడ్డి అరెస్టుపై  దాగుడుమూతల పర్వం  సాగుతున్నప్పటికీ.. ఆయన అరెస్టు కావడం ఖాయమన్న అభిప్రాయాన్ని రఘురామ రాజు సోమవారం(మే1)  రచ్చబండ లో భాగంగా మీడియాతో చెప్పారు.  యిప్పటికే ఏపీ ప్రజలు రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడాలంటే వైసీపీని వదిలించుకోకతప్పదన్న నిర్ణయానికి వచ్చేశారని రఘురామకృష్ణం రాజు అన్నారు.  ఇక తెలుగుదేశం, జనసేన పార్టీలతో బీజేపీ కూడా కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి  చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన రఘురామ రాజు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం చూస్తుంటే బీజేపీకి తెలుగుదేశం, జనసేనలతో కలవక తప్పదనే అనిపిస్తోందన్నారు.  రానున్న ఎన్నికల్లో  రాష్ట్రంలో రెండవ స్థానంలో  అధికార వైసీపీ కచ్చితంగా ఉంటుంది. యిది యిప్పటికే ప్రజలు తీసేసుకున్న నిర్ణయం. సో ప్రజల నిర్ణయాన్ని గౌరవించి రాష్ట్రంలో విపక్షాలన్నీ ఏకం కావాలి. అవుతాయి అని రఘురామ అన్నారు.  క్షేత్రస్థాయిలో ఇప్పటికే టిడిపి, జనసేన కార్యకర్తలు కలిసి పని చేస్తున్నారు.  అంటే రెండు పార్టీల క్యాడర్ ఎప్పుడో కలిసిపోయింది. యిప్పుడు నాయకులు కలుస్తున్నారు. అది వారికి అనివార్యంగా పార్టీ క్యాడర్ మార్చేసింది. దీంతోనే వైసీపీకి బ్యాడ్ టైం మొదలైంది అని రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు.  రాష్ట్రంలో గతం లో వైసీపీకి 50 % ఉన్న ఓటు బ్యాంక్  గణనీయంగా తగ్గింది. టీడీపీ కి కష్టకాలంలోనూ  40% ఓటు బ్యాంకు ఉండగా, ఇప్పుడు అది భారీగా పెరిగిందని చెప్పిన వైసీపీ రెబల్ ఎంపీ.. ఏ విధంగా చూసినా వైసీపీ రానున్న ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుని అధికారాన్ని కోల్పోవడం ఖాయమని చెప్పారు. 

లోకేష్ పాదయాత్రలో జనసేన జెండా రెపరెప!

ఏపీ  రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై స్పష్టత వచ్చేసింది. నిన్న మొన్నటి దాకా పొత్తులు, ఎత్తులు, సమీకరణాలపై నెలకొన్న అస్పష్టత మబ్బులు విడిపోయినట్లు విడిపోతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పొత్తు ఖాయమన్న సంకేతాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి.  తెలుగుదేశం అధినేత  చంద్రబాబునాయుడితో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌  తాజాగా జరిపిన సుదీర్ఘ భేటీ అనంతరం ఈ రెండు పార్టీలే కాదు.. బీజేపీ కూడా వీటితో కలిసి అడుగులు వేయడం తథ్యమన్న సంకేతాలనిచ్చింది.   బీజేపీ తన భవిష్యత్  రాజకీయ అవసరాల కోసం తటస్థంగానో.. లేకపోతే తెలుగుదేశం, జనసేన కూటమికి దూరంగా ఉన్నా.. లోపాయికారీ మద్దతు మాత్రం తెలుగుదేశం, జనసేన కూటమికే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం- జనసేన పొత్తు మాత్రం ఖాయమన్న సంకేతాలు చంద్రబాబు, పవన్ తాజా భేటీ ద్వారా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.  ప్రభుత్వ వ్యతిరేక ఓటును  చీల నివ్వనంటూ పదే పదే చెప్పిన, చెబుతున్న పవన్ కల్యాణ్ తాజాగా బాబుతో జరిపిన భేటీతో జనసైనికులకు ఇక ఎలాంటి సందేహాలకూ తావు లేకుండా మనం తెలుగుదేశంతోనే కలిసి నడుస్తున్నామన్న సంకేతాలు ఇచ్చేశారు. పవన్ సినిమాలలో బిజీగా ఉండి.. ఎన్నికలు దగ్గరపడుతున్నా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో అనుమానంలో ఉన్న జనసైనికులకు తాజా బేటీతో స్పష్టత ఇవ్వడమే ఈ బేటీ ఉద్దేశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. యిక ఈ భేటీ తరువాత  జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ , సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన ఇక ఎటువంటి సందేహాలకూ తావు లేకుండా చేసింది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం లేకుండా పొత్తులు ఉంటాయని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.  ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పొత్త విషయంలో అధికారిక ప్రకటన కంటే ముందే ప్రజలలోకి ఆ విషయాన్ని తీసుకు వెళ్లాలని యిరు పార్టీలూ నిర్ణయానికి వచ్చినట్లు పరిశీలకులు చెబుతున్నారు. జనసేనాని వారాహి యాత్రకు ముందే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు కలిసి పని చేసే వాతావరణం ఏర్పడేందుకు పవన్, చంద్రబాబు తాజా భేటీ దోహదం చేస్తుందని అంటున్నారు.  రెండు పార్టీలూ కూడా క్షేత్రస్థాయిలో  క్యాడర్‌ను పొత్తుకు అనుకూలంగా సన్నద్ధం చేయడం కోసమే.. తాజా భేటీ జరిగిందని అంటున్నారు.  అంటే  ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై చేసే ఆందోళనలో ముందు ముందు రెండు పార్టీలు కలిసి పాల్గొనే వాతావరణం ఏర్పడేందుకు ఈ భేటీ దోహదం చేసిందని అంటున్నారు.  ఈ భేటీ తరువాతే లోకేష్ పాదయాత్రలో జనసేన జెండాల రెపరెపలు మొదలయ్యాయి.  దమ్ముంటే అన్ని సీట్లకూ పోటీ చేయండి  అని  తెలుగుదేశం, జనసేన పార్టీలను సవాల్ చేస్తూ వైసీపీ ఆడుతున్న మైండ్‌గేమ్‌ కు ఈ భేటీ ఫుల్ స్టాప్ పెట్టేసినట్లేనని అంటున్నారు.      

భారీగా భూములు కొనుగోలు చేసిన కవిత.. ఈడీ అభియోగం!

ఢిల్లీ  మద్యం కుంభకోణంలో  ఈడీ అధికారులు తాజాగా  దాఖలు చేసిన మూడో ఛార్జ్ షీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె భర్త అనిల్ పేరు కూడా చేర్చారు. ఈ చార్జిషీట్ లో కవితపై కీలక అభియోగాలు మోపారు. ప్రధానంగా  సౌత్ గ్రూప్ కు సంబంధించిన కీలక విషయాలను ఈడీ ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. ఎమ్మెల్సీ కవిత ఆమె భర్తతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, వైసిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డిపై ఈడీ అభియోగాలు మోపింది. తాజా చార్జిష్టీట్లో పలు కీలక అంశాలను, పలు కొత్త కోణాలను పొందుపరిచింది. మద్యం వ్యాపారంతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలక సమాచారాన్ని ఈడీ ఈ చార్జిషీట్ లో పొందుపరిచింది.  మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ, కవిత, శరత్ చంద్రారెడ్డిలతో కూడిన సౌత్ గ్రూప్ 100 కోట్ల ముడుపులు హవాలా రూపంలోనే ఇచ్చారన్న దర్యాప్తు సంస్థ. ముడుపులు యివ్వడం ద్వారా తమకు అనుకూలంగా మద్యం పాలసీ రూపొందేలా  చేశారనీ, దీంతో హోల్ సేల్, రిటైల్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ భారీగా లబ్ది పొందిందని దర్యాప్తు సంస్థ ఈడీ పేర్కొంది. హవాలా రూపంలో నగదు బదిలీ, ముడుపులు చెల్లింపుతో పాటు భూముల కొనుగోళ్ళ వ్యవహారాలను కూడా ఈడీ ఈ చార్జ్ షీట్ లో పొందు పరిచింది.  అలాగే కీలకమైన  వాట్సాప్, సిగ్నల్, ఈ మెయిల్, కాల్ డేటా, హోటల్ రికార్డ్స్ ను జత చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, బుచ్చిబాబు, మాగుంట రాఘవ తాజాగా వెల్లడించిన కీలక సమాచారాన్ని కూడా ఛార్జ్ షీటులో పొందుపరిచారు. ఛార్జిషీటులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనిష్ సిసోడియా, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ, బీఆర్ ఎస్ ఎంఎల్ సి కవితపై పలు అభియోగాలు మోపింది.  ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో కవిత అరుణ్ పిళ్ళై ద్వారా హైదరాబాద్ లో భూములు కొన్నారని,  భూముల కొనుగోలుకు పిళ్ళై బ్యాంకు అకౌంట్ల ద్వారానే నగదు లావాదేవీలు జరిగాయనీ పేర్కొంది. హైదరాబాద్ లో కవిత మూడు ఆస్తులు కొనుగోలు చేశారని, తనకు వున్న రాజకీయ పలుకుబడి కారణంగా తక్కువ రేటుకు కవిత భూములు దక్కించుకున్నారని ఈడి పేర్కొంది. ఈడి ఛార్జిషీటులో కవిత తో పాటు భర్త అనిల్ కుమార్ పేరును ప్రస్తావించిన ఈడి హైదరాబాద్ కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్ పేరునూ ప్రస్తావించింది. లిక్కర్ లాభాలతో భూములు కొనేందుకు కవిత కు ఫీనిక్స్ కు చెందిన శ్రీహరి సహకరించారని పేర్కొంది.  

నిరసన సెగలతో ఫ్రస్ట్రేషన్.. సొంత పీఏ చెంప ఛెళ్లు.. వైసీపీ ఎమ్మెల్యే నిర్వాకం

వైసీపీ నాయకుల్లో  ఫ్రస్ట్రేషన్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. దీంతో వారేం చేస్తున్నారో,  ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియకుండా వ్యవహరిస్తున్నారు. ఒక మంత్రిగారు మీ కోసం మా ప్రభుత్వం ఎంతో చేస్తోంది. అయినా మీరు చప్పట్లు కొట్టడం లేదంటూ జనంపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు యిస్టముంటే మాకు ఓట్లేయండి లేకపోతే మానేయండి అంటే వార్నింగ్ లాంటి వ్యాఖ్యలు చేశారు. యిది జరిగిన రోజు వ్యవధిలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే సొంత పార్టీ వారే సమస్యలపై నిలదీసే సరికి తట్టుకోలేక సొంత పిఏపైనే చేయి చేసుకున్నారు. అదీ బహిరంగంగా జనం మధ్యలో.. యింతకీ ఆ పీఏ చేసిన నేరమేమిటంటే జనంపైకి దూసుకెళుతున్న ఎమ్మెల్యేను వారించడమే.. ఔను ఎమ్మెల్యే కన్నబాబురాజు అచ్యుతాపురం మండలంలోని మత్స్యకార గ్రామం పూడిమడకలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో సొంత పార్టీకే చెందిన మంత్రి అమర్నాథ్ వర్గీయులు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏపీఐఐసీ పైపులైన్ ప్యాకేజీ ఇప్పించడంతో పాటు గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మత్స్యకార యువతకు ఉపాధి కల్పించాలంటూ ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ గోబ్యాక్ నినాదాలు చేశారు. సొంత పార్టీ నేతలే నిలదీయడంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వారిపైకి కన్నబాబురాజు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఆయన పీఏ నవీన్ వర్మ వారించే క్రమంలో ఆయన చేయి పట్టుకుని వెనక్కిలాగారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే.. పీఏ చెంప ఛెళ్లుమనిపించారు. అనంతరం పోలీసుల జోక్యంతో సొంతపార్టీ నేతల నిరసనల మధ్యే కార్యక్రమం  కొనసాగింది. గతంలో కూడా ఈ ఎమ్మెల్యే దురుసువర్తన వార్తలకు ఎక్కింది. తనకు విద్యాదీవెన పథకం మంజూరు కాలేదని తెలిపిన విద్యార్థిపై ఎమ్మెల్యే గతంలో దురుసుగా ప్రవర్తించారు. కొద్దిరోజుల క్రితం మునగపాక మండలం నాగులాపల్లిలో గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. మళ్ల శంకర్ అనే వ్యక్తి ఇంటి వద్దకెళ్లి ఆయన కుమార్తెను అమ్మఒడి పథకం అందిందా అని ప్రశ్నించారు. అందిందని ఆమె తెలిపింది. తాను ఐటీఐ పూర్తిచేశానని విద్యాదీవెన మంజూరు కాలేదని శంకర్ కుమారుడు శివాజీ ఎమ్మెల్యేకు తెలిపాడు. నువ్వు చదువుకున్న పాఠశాల యాజమాన్యానికి మంజూరైందని ఎమ్మెల్యే వివరించారు. వాళ్లకు మంజూరైనప్పుడు తనకు చెప్పడమెందుకని యువకుడు ఎదురు ప్రశ్నవేశాడు. దీంతో ఎమ్మెల్యే కన్నబాబు తీవ్రంగా స్పందిస్తూ పథకం మంజూరై కూడా ఎదురు ప్రశ్నవేస్తావా? ఇక్కడి నుంచి వెళ్లు అంటూ ఆ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లకోసం మళ్లీ మా వద్దకు రారా అని శివాజీ ఎదురు సమాధానం చెప్పేసరికి మరింత ఆగ్రహించిన ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడుతున్నావ్. పళ్లు పీకేస్తా అంటూ విద్యార్థిపైకి దూసుకువెళ్లారు. ఎమ్మెల్యే ప్రవర్తన అప్పట్లో చర్చనీయాంశమైంది. పథకాలు అందరికీ అందించలేని అధికార ప్రతినిధులు.. వాటి గురించి ప్రశ్నిస్తే..ఇలా దురుదుగా ప్రవర్తించడమేమిటని ప్రజలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఢిల్లీ మద్యం కుంభకోణం.. కవితకు మరిన్ని చిక్కులు!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో  తెలంగాణ ముఖ్యమంత్రి తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిండా మునిగినట్లేనా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఈ కేసులో ఈడీ తాజాగా దాఖలు చేసిన మూడో చార్జిషీటులో పేర్కొన్న అంశాలు సంచలనంగా మారాయి. డాక్యుమెంట్లు, పత్రాలు, వాట్సాప్ చాట్‌లు, ఈ మెయిల్స్ పత్రాలను కూడా ఈడీ  ఈ చార్జిషీట్ లో పాటుగా కోర్టుకు సమర్పించింది.  దీంతో  యిప్పటి వరకూ ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ల తో పోలిస్తే ఈ మూడో చార్జిషీట్  మరితం బలంగా, పకడ్బందీగా ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చార్జిషీట్ లో పొందు పరిచిన అంశాల మేరకు.. కవిత కు సంబంధించిన అంశాలే ప్రముఖంగా ఉన్నాయని అంటున్నారు. కవిత హైదరాబాద్ లో కొన్న బూములు.. ఏవి, ఎక్కడ కొన్నారు.. యిందుకు సొమ్ములు ఏ విధంగా చెల్లించారు వంటి వివరాలను పొందుపరిచారు.  వీటిని కవిత నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో  ఉన్న సమాచారం ఆధారంగానే కాకుండా, మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, ఆమె బినామీగా చెబుతున్న పిళ్లై లు విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగానే ఈడీ అధికారులు ఈ చార్జిషీట్ లో ఆ వివరాలు పొందుపరచడం సాధ్యమైందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. మూడు రోజుల కిందట ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ అయ్యాడన్న ప్రచారం జరిగింది.  ఈడీ వర్గాల లీకుల మేరకే ఈ ప్రచారం జరిగిందని అంటున్నారు.  బుచ్చిబాబు నిజంగా అప్రూవర్ గా మారారా, లేదా అన్న విషయంలో స్పష్టత లేకపోయినా, ఆయన కవిత ఆర్థిక వ్యవహారాలు.. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆదాయాలు.. ముడుపులు.. పెట్టుబడులు భూముల గురించి మొత్తం  ఈడీ అధికారుల ముందు వెల్లడించినట్లుగా అయితే ఈ తాజా చార్జిషీట్ లో తేటతెల్లం అయ్యిందని అంటున్నారు.  ఒక ఆడిటర్ తన క్లయింట్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చెప్పారంటే.. ఆషామాషీగా ఉండదని, తాను చెప్పిన విషయాలను సంబంధించిన ఆధారాలు ఉంటేనే ఆయన చెబుతారని అటున్నారు.   ఇక కవిత  బినామీగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిళ్లై  యిప్పటికే అప్రూవర్ గా మారారు. తరువాత కోర్టులో కాదని పేర్కొన్నప్పటికీ అప్పటికే ఆయన బ్రేక్ అయిపోయారనీ, ఆయన చెప్పిన అంవాల ఆధారంగానే ఈడీ  కేసును పకడ్బందీగా దర్యాప్తు చేస్తూ కవిత చుట్టూ ఉచ్చు బిగించిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   కాలు ఫ్రాక్చర్ అయ్యిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  గత ఇరవై రోజులుగా  ఎక్కడా కనిపించడంలేదు. ఈ మధ్యలో  ఒక సారి మాత్రం సుప్రీంకోర్టులో తాన పిటిషన్ పై త్వరగా విచారణ కావాలని  మెన్షన్ చేయించారు.  అవన్నీ పక్కన పెడితే ఈడీ తాజా చార్జ్ షీట్ ప్రకారం కవిత డిల్లీ మద్యం కుంభకోణంలో పూర్తిగా చిక్కుల్లో పడ్డారని తేటతెల్లమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కునుకు తీసినందుకు ఫలితం.. సస్పెన్షన్..!

గుజరాత్ ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో కునుకు తీశారన్న కారణంగా ఓ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఎంతో మంది రాజకీయ నాయకులు, మంత్రులు, చివరాఖరికి ప్రధాన మంత్రులు కూడా బహిరంగ సభలలో, కీలక సమావేశాలలో కునుకు తీసిన పలు సంఘటనలు టీవీలలో ప్రత్యక్షంగా వీక్షించిన అనుభవం ప్రజలకు ఉంది. అసెంబ్లీ సమావేశాలలో, పార్లమెంట్ సెషన్ లలో హాయిగా నిద్రపోతూ కనిపించిన నేతలూ ఉన్నారు. మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ అయితే.. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో పలు సమావేశాలలో, సభలలో హాయిగా నిద్రపోతున్న ఘటనలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. వారెవరి మీదా పడని సస్పెన్షన్ వేటు.. గుజరాత్ లోని   భుజ్ లో  ఓ అధికారిపై పడింది. యింతకూ యిది  జరిగిందెక్కడంటే..  2001 నాటి గుజరాత్ భూకంప బాధితులకు పునరావాసంలో భాగంగా ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లకు సంబంధించి భుజ్ లో పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సీఎం పటేల్ ప్రసంగిస్తుండగా.. సభికుల్లో ముందు వరుసల్లో కూర్చున్న ఓ అధికారి కునుకు తీస్తున్నట్లు కనిపిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఆయన్ను భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్ గా గుర్తించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే రాష్ట్ర పట్టణాభివృద్ధి విభాగం ఆ అధికారిని విధుల నుంచి సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపినందున నిబంధనల ప్రకారం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకొంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కునుకు తీసే అలవాటును.. ముఖ్యమంత్రి పాల్గొనే ఇలాంటి ముఖ్య కార్యక్రమాల్లో కూడా పాటిస్తే ఎలా మాస్టారు.. అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అంతే కాదు.. మీరేమైనా ప్రధాన మంత్రా లేకపోతే మంత్రా అలా ఎలా నిద్రపోతారంటూ సెటైర్లు వేస్తున్నారు. 

మద్యం కుంభకోణంలో కేసీఆర్ అల్లుడు

మద్యం కుంభకోణం కేసులో ఈడీ మూడో సప్లిమెంటరీ ఛార్జీ షీటును దాఖలు చేసింది. దీనిని కోర్టు పరిగణలోకి తీసుకుంది. మొత్తం నాలుగు ఛార్జీషీట్లను దాఖలు చేసింది. తాజా ఛార్జీషీటులో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్ పైన ఈడీ కీలక అభియోగాలు మోపింది. కవిత పేరును పలుమార్లు ప్రస్తావించింది. ఈ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ ది కీలక పాత్ర అని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సౌత్ గ్రూప్ కు లాభం కలిగించేలా వ్యవహరించారని పేర్కొన్నారు. లిక్కర్ వ్యవహారంలో అరుణ్ పిళ్లై... కవితకు ప్రతినిధిగా వ్యవహరించినట్లు పేర్కొన్నది. లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాల ద్వారా హైదరాబాద్ లో భూములు కొన్నట్లు ఈడీ పేర్కొంది. ఫీనిక్స్ ద్వారా భూములు కొన్నట్లు ఈడీ పేర్కొంది. తాజా ఛార్జీషీటులో ఫీనిక్స్ శ్రీహరి, కవిత భర్త అనిల్ పేర్లను ప్రస్తావించింది. ఫీనిక్స్ శ్రీహరి పాత్రపై ఈడీ అందులో పేర్కొంది. శ్రీహరి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు పేర్కొంది. శ్రీహరి నుండి కవిత 25వేల చదరపు అడుగుల స్థలం కొన్నట్లుగా ఉందని పేర్కొంది. మార్కెట్ వ్యాల్యూ రూ.1760 కాగా, కవిత రూ.1260 చెల్లించినట్లుగా పేర్కొందని సమాచారం. ఇక ఎన్గ్రోత్ క్యాపిటల్ లో అనిల్ భాగస్వామిగా ఉన్నట్లు పేర్కొంది.కెసీఆర్ కూతురుతో బాటు అల్లుడు ఈ స్కాంలో ఉండటం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

టి. కాంగ్రెస్ లో నాలుగు దిక్కులూ ఒకటైనాయి!

అసమ్మతి, తిరుగుబాటు, ఆరోపణలు, నాయకత్వ లోపం ఈ నాలుగూ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండే గుణాలు. వీటిని ప్రజాస్వామిక లక్షణాలని కాంగ్రెస్ ఎంత వెనకేసుకుంటూ వచ్చినా, ఈ గుణాలతో కాంగ్రెస్ రాజకీయంగా వెనుకంజ వేస్తూనే ఉంటుంది. ఇది గతం. వర్తమానం బహుశా బవిష్యత్తు కూడా. తెలంగాణ కాంగ్రెస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. 2019 పార్లమెంటు ఎన్నికలలో మూడు స్థానాలను గెలిపించి కాంగ్రెస్ కు తెలంగాణ ఓటర్లు కొత్త  ఊపిరి పోశారు. వీరిలో ఒకరు అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు కాగా, మరొకరు ఇప్పటి టీపీసీసీ చీఫ్.  మూడో వ్యక్తి ఎప్పుడూ అసమ్మతి గ్రూపు వైపు నిలబడే నేత. వీరందరినీ ఏకతాటిపైకి తెచ్చే బాధ్యత భుజాన వేసకున్న సీనియర్ నేత జానారెడ్డి ఈ విషయంలో కొంత ముందడుగు వేశారు.  రేవంత్, ఉత్తమ్, వెంకటరెడ్డిలను ఒక్క తాటిపైకి తెచ్చి జానా తన పంతం నిలబెట్టుకున్నారు. అయితే ఒకే వేదికపై ఇక్యతనుచాటిన నలుగురూ ఈ ఐక్యతను ఎన్నికల వరకూ కొనసాగిస్తారా అన్నది అనుమానంగేనా ఉంది. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ, సచివాలయ ప్రారంభోత్సవం వంటి  కార్యక్రమాలతో దూసుకు పోతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీని గడ్డిపోచకన్నా హీనంగా చూస్తోంది. బీఆర్ఎస్ కార్యక్రమాలను తప్పుపడుతున్న బీఆర్ఎస్ కార్యాక్రమాలను తప్పు పడుతున్న ఇతర రాజకీయ పార్టీల నేతలను అర్భకులుగా అభివర్ణించడం కేసీఆర్ మార్క్ రాజకీయాలను సూచిస్తోంది. మరో వైపు ప్రశ్న పత్రాల లీకేజీ, రైతు సమస్యలు, తాజాగా నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ ఎన్నికల వేళ  ఐక్యంగా ఉండాలన్న తలంపుతో ఉంది.  ఉద్యమాల చరిత్ర ఉన్నతెలంగాణ గడ్డపై అనేక సంవత్సరాలుగా చెప్పుకోదగిన పరిణామాలు జరగలేదనే చెప్పాలి.  2014 తరువాత ఈ పదేళ్లలో స్తబ్దుగా ఉన్నసామాజిక వాతావరణాన్ని చైతన్యపరిచేందుకు రేవంత్ రెడ్డి నడుం బిగించారు. గాంధీభవన్ లో నేతల ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో వీరు మారరు అని ప్రజలు భావిస్తున్న తరుణంలో పార్టీ రాష్ట్ర నేతలు ఒక్క మాటపై నిలబడడంతో కాంగ్రెస్ నాయకత్వంలో కొత్త ఆశలు చిగురించాయి.  నహైదరాబాద్ ఓఆర్ఆర్ ను 30  సంవత్సరాల లీజు వ్యవహారంలో వెయ్యి కోట్లు చేతులు మారాయని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి కంప్లెయింట్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు.  30వ తేదీన  ప్రారంభమైన తెలంగాణ సచివాలయానికి తమ పార్టీ అధ్యక్షుడిని రాకుండా అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఏది  ఏమైనా  ఇంత కాలానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం  ఒక్కటికా పోరాడాలని తీసుకున్ననిర్ణయం పట్ల తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

ఘనత చాటుకుంటే సరిపోదు.. కళ్లకూ కనబడాలి!

స్వరాష్ట్రం సాధనతో పాటు ..తెలంగాణ పునర్నిర్మాణలంలోనూ పురోగమనం.. చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ అన్నట్లుగా సాగుతోంది. అభివృద్ధి, సంక్షేమం గురించి అధికార బీఆర్ఎస్ ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా.. అంతకు మించి రాష్ట్రంలో అవినీతి గురించిన విమర్శలు వినవస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధితో సమానంలో వైఫల్యాలూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం తెలంగాణ మోడల్ అంటూ చేసుకుంటున్న ప్రచారం.. విపక్షాల అవినీతి ఆరోపణల ముందు వెలవెలబోతోంది. ముఖ్యంగా టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ, ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితపై ఆరోపణలు, ఈడీ, సీబీఐ విచారణల తరువాత కేసీఆర్ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారిందనడంలో సందేహం లేదు. అయితే పొరుగున ఉన్న ఏపీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత అభివృద్ధి, సంక్షేమం విషయంలో కచ్చితంగా మెరుగ్గా ఉందని చెప్పడానికి మాత్రం ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. అందుకే తెలంగాణ మోడల్ అంటూ  సొంత భుజాలను తడుము కోవడం కంటే ముందే తెలంగాణ మంత్రులు ఏపీలో అభివృద్ధి లేమి, అందని సంక్షేమం గురించి ముందుగా ప్రస్తావిస్తూ వస్తున్నారు.  ఇకపోతే తెలంగాణ సచివాలయ నిర్మాణం, ప్రారంభాన్ని మహోజ్వల ఘట్టంతో పోలుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, శ్రేణులు చేస్తున్న హడావుడి, ఆర్బాటం, సచివాలయంపై అక్కడ పని చేయాల్సిన ఉద్యోగులే పెదవి విరవడంతో తుస్సుమన్నట్లైంది. ఉద్యోగులకు పని చేసుకోవడానికి అవసమైనంత విశాలంగా వివిధ శాఖలకు కేటాయించిన ప్రదేశం లేదని ఉద్యోగులు సచివాలయ ప్రారంభానికి ముందే అసంతృప్తి వ్యక్తం చేశారు.  వాస్తవానికి కేసీఆర్ ఏం చేసినా ఘనంగా చేస్తారు. ఆర్భాటంగా చేస్తారు. గోటితో పోయే దానికి గొడ్డలి ఉపయోగిస్తారు. అలాగే  కొత్త సచివాలయ నిర్మాణం విషయంలో అవసరానికి మించి ఆర్భాటం చేశారు. అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుందంటూ అడ్వర్టైజ్ మెంట్లు గుప్పించారు.   నిర్మాణ సమయంలో వీలైనన్ని సార్లు సందర్శించి పర్యవేక్షించారు. అలా పర్యవేక్షించిన ప్రతి సారీ కొత్త కొత్త సూచనలు చేశారు.  మొత్తానికి  265 అడుగుల ఎత్తుతో 28 ఎకరాల్లో నిర్మించారు. మొత్తం 10,51,676 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం ఉంది. మొత్తం ఏడు అంతస్తులు నిర్మించగా.. ఒక్కో అంతస్తు 14 అడుగుల ఎత్తు ఉంటుంది. తొలి రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉంటాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో మంత్రుల కార్యాలయాలు, ఇతర శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ కొత్త సచివాలయం నిర్మించినట్లు  కేసీఆర్ చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఒక్క వర్షానికే నీరు చేరడం, ఫిల్లర్ బీటలు వారడం, సచివాలయం వ్యయంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వకపోవడంతో  కేసీఆర్ చెబుతున్నంత హైప్ కొత్త సచివాలయానికి రావడం లేదు.   ఇక అన్నిటికీ మించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం నాడు సచివాలయంలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు రేవంత్ సచివాలయానికి బయలు దేరగా ఆయనను పోలీసులు టెలిఫోన్ భవన్ వద్దే అడ్డుకున్నారు.   ఎంపీనైన తననే అడ్డుకుంటున్నారంటే ఇక సామాన్యులను అసలు సచివాలయం వైపు కన్నెత్తి చూడనిస్తారా అని ప్రశ్నించారు. రేవంత్ సచివాలయానికి బయలుదేరడం, ఆయనను పోలీసులు నిలువరించడం అటుంచి.. ఏకంగా సచివాలయ విజిటర్స్ గేటునే ప్రారంభం జరిగిన మరుసటి రోజునే మూసి వేయడం విమర్శలకు తావిస్తోంది.    

థాయ్ ల్యాండ్ లో చీకోటి అరెస్టు.. తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు

తెలుగు రాష్ట్రాలలో  చీకోటి ప్రవీణ్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గుడివాడ క్యాసినో వ్యవహారంతో ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన చీకోటి ప్రవీణ్ కు తెలుగు రాష్ట్రాలలో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలు అప్పట్లో వెలుగులోకి వచ్చాయి. అటువంటి చీకోటి ప్రవీణ్  తాజాగా   థాయ్ లాండ్ లో అరెస్ట్ అయ్యాడు.   ప‌ట్టాయా లోని ఏషియన్ పట్టాయా అనే ల‌గ్జ‌రీ హోట‌ల్ లో  భారీ ఎత్తిన గ్యాంబ్లింగ్ జ‌రుగుతోందంటూ అందిన సమాచారం మేరకు థాయ్ ల్యాండ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిర్వహించిన దాడుల్లో  ఈ ఘ‌ట‌న‌లో  అరెస్టయిన వారిలో చీకోటి ప్రవీణ్ కూడా ఉన్నాడు. ఈ దాడిలో  మొత్తం 92 మందిని అరెస్టు చేయగా వారిలో 80 మందికిపైగా భారతీయులే కావడం విశేషం. ఆ అరెస్టయిన వారిలో చీకోటి ప్రవీణ్ కూడా ఉన్నాడు. నిందితుల నుంచి రూ. 20 కోట్ల న‌గ‌దు, కెమెరాలు, 92 ఫోన్స్ ,మూడు నోట్ బుక్స్ ను స్వాధీనం చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. కాగా  ఈ హోటల్ ను ఏప్రిల్ 27 నుంచి మే 1(సోమవారం) వరకూ బుక్ చేసుకున్నారనీ, ప్రత్యేకించి కాసినో కోసమే దీనిని బక్ చేసుకున్నారని  థాయ్ ల్యాండ్ పోలీసులు చెబుతున్నారు.   అదలా ఉంటే థాయ్ లాండ్ లో క్యాసినో కింగ్ చీకోటి ప్ర‌వీణ్ అరెస్ట్ వార్త ఒక్క సారిగా తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టించింది. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించిన క్యాసినోతో చీకోటి ప్రవీన్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంబంధాలపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాకుండా, ప్రవీణ్ కు కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నాయకులకు సంబంధాలున్నాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతే కాకుండా  రాజకీయాలకు అతీతంగా  తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకులతో చీకోటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనీ కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పట్లో తెలుగుదేశం నేతల   గుడివాడ  కేసినో వ్యవహారంపై ఈడీ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు.  ఆ తరువాత ఈ వ్యవహారంలో కొంత కాలం స్తబ్దత నెలకొంది. తెలుగుదేశం నాయకుల ఫిర్యాదును ఈడీ పట్టించుకోలేదన్న విమర్శలు కూడా అప్పట్లో వెల్లువెత్తాయి. అయితే హఠాత్తుగా గత ఏడాది జులైలో ఈడీ చీకోటి ప్రవీణ్ కు చెందిన  కార్యాలయాలు, నివాసాలలో  దాడులు నిర్వహించింది.  ప్రవీణ్ ల్యాప్ టాప్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ప్రవీణ్ ను విచారించింది. ఈ వ్యవహారం అంతా అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి,  చీకోటి వెనుక రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బడా నేతలు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి  చీకోటి ప్రవీణ్ ఫోన్ లో, ల్యాప్ టాప్ లో  తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రవీణ్ నిర్వహించిన క్యాసినోలకు వెళ్లిన కస్టమర్ల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలకూ చెందిన పలువురు ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్లు కూడా అప్పట్లో బాగా ప్రచారమైంది.   ఆ తరువాత ఇన్నాళ్లకు చీకోటి ప్రవీణ్ థాయ్ ల్యాండ్ లో క్యాసినో నిర్వహిస్తూ అరెస్టయ్యాడన్న వార్త మళ్లీ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అప్పట్లో చీకోటి నిర్వహించిన క్యాసినోకి వెళ్లారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ఆందోళన వ్యక్తమౌతోంది. మళ్లీ చీకోటి ప్రవీణ్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంబంధాలపై తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అలాగే  అప్పట్లో చీకోటి నివాసాలపై   దాడుల సందర్భంగా సేకరించిన సమాచారం ఆధారంగా  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈడీ విచారించిన సంగతి విదితమే. అలాగే తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి సన్నిహితుడైన ఒకరిని కూడా అప్పట్లో ఈడీ విచారించినట్లు వార్తలు వచ్చాయి.  ఈ నేపథ్యంలోనే థాయ్ ల్యాండ్ లో  చీకోటి అరెస్టు వార్తతో మరోసారి తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులతో  చీకోటి ప్రవీణ్ చీకటి సంబంధాలపై పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది. 

మళ్లీ కామన్ సివిల్ కోడ్

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది.ఈ ప్రణాళికలో వివాదాస్పద అంశం కామన్ సివిల్ కోడ్ చేరింది. తాము అధికారంలో వస్తే కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు జెపీ నడ్డా ప్రకటించారు. కర్ణాటకలో మే 10వ తేదీన పోలింగ్ జరగనుంది.  కర్ణాటకలో కామన్ సివిల్ కోడ్ అమలు చేసి తీరుతామని నడ్డా హామీ ఇచ్చారు. కామన్ సివిల్ కోడ్ అమలుకు భారత రాజ్యాంగం కూడా చెబుతుందని ఆయన చెబుతున్నారు. భారత దేశంలో కామన్ సివిల్ కోడ్ కేవలం గోవాలో మాత్రమే అమలవుతుంది. యూనిఫాం సివిల్ కోడ్ దేశానికి అత్యవసరమని మోడీ ప్రభుత్వం తొలినుంచి చెబుతూనే ఉంది. భారతీయ జనతా పార్టీ విధానాల్లో కామన్ సివిల్ కోడ్ అతిముఖ్యమైనది. యూనిఫాం సివిల్ కోడ్ అనేది భారత రాజ్యాంగం ఆర్టికల్ 44లో స్పష్టంగా  పొందుపరిచింది. భారత స్వాతంత్యం వచ్చాక వివిధ మతాలు కామన్ సివిల్ కోడ్ ను వ్యతిరేకిస్తున్నాయి. ఇస్లాం మాత్రం ముస్లిం పర్సనల్ లా అమలు చేయాలని చెబుతోంది. భారత దేశంలో గత కొన్ని దశాబ్దాల నుంచి కామన్ సివిల్ కోడ్ వివాదాస్పదమౌతూనే ఉంది.  వివాహాలు, విడాకుల విషయాల్లో కామన్ సివిల్ కోడ్ , ముస్లిం పర్సనల్ లా వేర్వేరుగా ఉన్నాయి. కామన్ సివిల్ కోడ్ అమలు చేయడానికి ఇది సరైన సమయం కాదని చాలామంది వాదిస్తున్నారు. కొత్త సమస్యలు లేవనెత్తుతాయన్నారు. భారత దేశం వంటి వైవిధ్యమైన దేశంలో కామన్ సివిల్ కోడ్ అమలు కావడం కష్టమేనని సామాజిక విశ్లేకులు అంటున్నారు.