ఔను ఆ నులుగురు ఒకటయ్యారు!

కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చును. అదే కాంగ్రెస్ పార్టీ విలక్షణ లక్షణం. కాంగ్రెస్ నాయకులు తమలో తాము కొట్టు కుంటారు .. తిట్టుకుంటారు.. కానీ కురు పాండవుల లాగ వసరం అయితే ఒకటైపోతారు. వారి మధ్య  ఎన్నైనా విబేధాలు ఉండవచ్చును. కానీ, అవసరం అనిపిస్తే  అందరూ కలిసి పోతారు.  మళ్ళీ అంతలోనే విడిపోతారు. అయితే, బయటకు వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఏమిటన్నది పక్కన పెడితే, పార్టీలో ఉన్నంతవరకు కొట్టుకున్నా తిట్టుకున్నా చివరకు ఒకటై పోతారు. అందుకే  కాంగ్రెస్ రాజకీయాలు తెలిసిన పెద్దలు  కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువ కొట్టు కున్నప్పుడు కొట్టుకున్నా, ఎన్నికల అవసరం ఏర్పడినప్పుడు అంతా మరిచి పోయి పార్టీ విజయం కోసం కలిసి పనిచేస్తారని అంటారు.  ఇందుకో తాజా ఉదాహరణ  శుక్రవారం(ఏప్రిల్ 28)  నల్గొండ జిల్లాలో నిర్వహించిన నిరుద్యోగుల నిరసన సభ.  నిజానికి ఈసభ వారం రోజుల క్రితం ఏప్రిల్ 21 జరగవలసింది. అయితే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎవరితోనూ చర్చించకుండా ఏక పక్షంగా కార్యక్రమం ప్రకటించడంతో  జిల్లాకు చెందిన ఎంపీలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి కస్సుమన్నారు. రేవంత్ రెడ్డి దిగి వచ్చారు. ఏప్రిల్ 21న జరగవలసిన సభను ఆ ఇద్దరు ఎంపీలతో పాటుగా జిల్లాకు చెందిన మరో కీలక నేత  ప్రతిపక్ష మాజీ నేత, జానారెడ్డితోనూ చర్చించి ఏప్రిల్ 28కి వాయిదా వేశారు. అయినా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకులు ఈ సభకు హాజరవుతారా, హ్యాండిస్తారా అనే అనుమనాలు రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్నాయి. ఒకరిద్దరు రాకూదని కుడా కోరుకున్నారు. అయితే అనూహ్యంగా ముగ్గురు సీనియర్ నాయకులూ ఉత్తమ్ కుమార రెడ్డి, కోమటి రెడ్డి,  జానారెడ్డి  సభకు హాజరయ్యారు. అంతే కాదు విభేదాలను పక్కన పెట్టి ఒకే వేదికపైకి వచ్చి చేయి చేయి కలిపారు. అంతా ఐక్యంగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని కార్యకర్తల సాక్షిగా ప్రకటించారు. పార్టీ శ్రేణులకు భవిష్యత్తుపై భరోసా కల్పించారు. ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. ఇలా తాము ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ దృశ్యం కళ్లముందు కనిపించడంతో కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వాస్తవానికి రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న నేతలంతా నల్లగొండ జిల్లాకు చెందిన వారేనన్నది తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచి రేవంత్‌ను వారు జిల్లాలో అడుగు కూడా పెట్టనివ్వడంలేదు. అయితే ఇప్పుడు గతం గతః అన్నట్లుగా రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌, కోమటిరెడ్డి, జానారెడ్డి, వి.హనుమంతరావు వంటి దిగ్గజాలు ఒకే వేదికపైకి రావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.అయితే ఇది ఎంతకాలం ఉంటుంది అనేది ఒకటైతే నల్గొండ నేతలు తాత్కాలికంగానే అయినా సైలెంట్ అయినా, మెదక్ నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యే, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గా రెడ్డి కొత్త బాణిలో  అసమ్మతి రాగాన్ని శృతి చేస్తున్నారు. అందుకే, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చును..అంటారు. అంటున్నారు

విజయసాయిరెడ్డికి సీబీఐ పిలుపు..?!

ఓ వైపు ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. మరోవైపు వైయస్ వివేకా హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరినీ సీబీఐ అరెస్టు చేస్తోంది. నేడో రేపో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యం అని తేలిపోయింది.  దీంతో వైసీపీ ఒక విధమైన క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటోంది. అలాంటి వేళ.. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్కడని ఆ పార్టీలోని ఓ వర్గం సందేహంతో ప్రశ్నిస్తోంది.   2019 ఎన్నికల్లో  వైసీపీ విజయం సాధించి జగన్ సీఎం అవ్వడంలో  అన్నీ తానే అయి విజయసాయిరెడ్డి వ్యవహరించారని, అటువంటి విజయసాయి.. పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఎందుకు ముఖం చాటేశారని పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చ సాగుతోంది.  అయినా  ఇటీవలి కాలం వరకూ విజయసాయి ఎక్కడ ఉన్నా, ఏ పర్యటనలో ఉన్నా.. ట్విట్టర్ మరోవైపు విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నా.. ఎక్కడ పర్యటిస్తున్నా.. విపక్షాన్ని ఎండగట్టడంలోనూ తమ పార్టీ ముఖ్యమంత్రిని పొగడ్తలలో ముంచెత్తడంలోనూ ట్విట్టర్‌ వేదికగా స్పందించే వారనీ, అయితే ఇటీవల కాలంలో ఆయన ట్విట్టర్‌కు కూడా దూరంగా ఉంటున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.   ఏదో సినిమాలో నటుడు నూతన ప్రసాద్   దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అన్న డైలాగ్ చెప్పారు. ప్రస్తుతం అలాగే వైసీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.  అలాంటి వేళ విజయసాయిరెడ్డి  పార్టీకి అండగా నిలవాల్సింది పోయి.. విపక్ష నేతకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికే పరిమితమైపోవడంపై పార్టీ శ్రేణుల్లో పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి.  ఆయన సైలెన్స్ పార్టీకి డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్లుగా ఉందని భావిస్తున్నారు. గతంలో ఎప్పుడు ఆయన ఇంత సైలంగా ఉన్న సందర్భమే లేదనీ, అలాగే  ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లను టర్గెట్‌ చేస్తూ... విజయసాయి చేసే ట్వీట్లు సెటైరికల్ గా ఉంటూ ప్రత్యర్థి పార్టీని ఇబ్బందుల పాల్జేసేవనీ, అటువంటి విజయసాయి  ట్విట్టర్ వేదికగా చెప్పిన బర్త్‌డే విషెష్‌ పట్ల ఫ్యాన్ పార్టీలో సైతం విస్మయం  వ్యక్తమైంది. అయితే ఫ్యాన్ పార్టీలో చాలా కీ రోల్ ప్లే చేసిన విజయసాయిరెడ్డి ఇలా మౌనవ్రతం పట్టడం వెనుక ఉన్న కారణాలపై పరిశీలకులు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు.  వైయస్ వివేకా హత్య కేసు ప్రస్తుతం తుది దశకు చేరుకొందని.. అలాంటి వేళ.. ఆ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డి..  అలాగే ఈ హత్య కేసులో అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ కార్ డ్రైవర్ దస్తగిరి సైతం ఇటీవల మీడియా ముందు వైయస్ అవినాష్ రెడ్డి అండ్ కోపై విమర్శించారని.... అదే విధంగా వైయస్ సునీత కూడా ఈ కేసులో అసలు హంతుకులు ఎవరో బయటకు రావాలంటూ డిమాండ్ చేయడం.. ఇంకోవైపు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూడా  మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ వివేకాకు క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది.   ఇక సీబీఐ అయితే.. ఈ కేసును సాధ్యమైనంత త్వరగా ఛేదించేందుకు  అందివచ్చిన  ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటుందని.. ఆ క్రమంలో విజయసాయిరెడ్డిని సైతం సీబీఐ విచారించే అవకాశం ఉందనే ఓ చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఎందుకంటే..  వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారంటూ మీడియా ముందుకు వచ్చి తొలిసారిగా చెప్పింది విజయసాయిరెడ్డేనని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని సైతం విచారించే అవకాశం ఉందని.. ఆ క్రమంలో సీబీఐ నుంచి విజయసాయిరెడ్డికి పిలుపు వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆయన గ్రహించే.. ఆయన మౌనవ్రతం పాటిస్తూ లైమ్ లైట్ లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు.   మరోవైపు వివేకా హత్య కేసులో గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా ఆతడు పని చేస్తున్న తుమ్మలపల్లి యూరేనియం ఫ్యాక్టరీ ఉన్నతాధికారులను సైతం సీబీఐ అధికారులు పిలిపించుకొని ఉదయ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలిపై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అదే క్రమంలో విజయసాయిరెడ్డిని సైతం.. సీబీఐ పిలిపించుకొని.. ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది.

బాలినేనికి పొమ్మనలేకే పొగబెట్టారా?

వైసీపీకి ఒకదాని తరువాత ఒకటిగా వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి జగన రెడ్డికి సమీప బంధువు, మాజీ మంత్రి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి అలకపాన్ను ఎక్కారు. పార్టీలో తనకు వరుసగా ఎదురౌతున్న అవమానాలపై తిరుగుబావుటా ఎగురవేసి.. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న బాలినేని ఆ పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడం పార్టీలో సంచలనం రేపింది. స్వల్ప అస్వస్థత కారణంగా హైదరాబాద్ లో ఉంటున్న ఆయన తన అసంతృప్తి కారణంగా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కాక ఆరోగ్య కారణాల కారణంగా  వైదొలగుతున్నట్లు చెబుతున్నారు. అధికారికంగా ఆయన ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం ఈయకపోయినా.. బాలినేని పార్టీ పదవికి రాజీనామా చేశారంటూ పార్టీ వర్గాలలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో బాలినేనికి పార్టీలో పెద్దగా గుర్తింపు లేకుండా పోయింది. తాజాగా ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్కాపురం పర్యటన సందర్భంలో కూడా ప్రోటోకాల్ రగడ జరిగింది. బాలినేనిని సీఎం వచ్చే హెలిప్యాడ్ దగ్గరకు అనుమతించకపోవడంతో కార్యక్రమంలో పాల్గొనకుండా వెనుదిరిగారు. ఆ తర్వాత సీఎంవో నుంచి కాల్ రావడంతో మళ్లీ వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై ముఖ్యమంత్రి జగన్‌తో పాటూ కనిపించారు. అయినా కూడా ఆయన ముభావంగా కనిపించారు. మొత్తం మీద బాలినేని ఎపిసోడ్ వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి సమీప బంధువే  పార్టీపైన అలిగి పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధపడటం సంచలనం సృష్టిస్తోంది. ఇదంతా టీకప్పులో తుపానే అంటూ పార్టీ నేతలు డౌన్ ప్లే చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ బాలినేని నిర్ణయం పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదని అంటున్నారు.  

మద్యం కుంభకోణంలో మరో కుదుపు! కవితకు బిగిసిన ఉచ్చు

ఢిల్లీ  మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవితకు మరిన్ని చిక్కులు తప్పవనిపిస్తోంది. ఈ కేసులో  ఇప్పటికే పీకల్లోతు కూరుకుపోయిన కవితకు తాజాగా ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ గా మారడంతో ఆమె చుట్టూ మరింతగా ఉచ్చుబిగిసుకుందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.   ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబు. ఈ కేసులో ఇప్పటికే దినేష్ అరోరా అప్రూవర్‌గా మారగా.. ఇప్పుడు బుచ్చిబాబు కూడా అప్రూవర్‌గా మారారు. దీంతో మరోసారి మద్యం కుంభకోణంలో కవిత పాత్ర విషయం ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ తన చార్జిషీట్ లో కవిత పేరును ప్రస్తావించింది. పలు మార్లు ఇప్పటికే ఆమోను విచారించింది.  ఈ కుంభకోణంలో  కవితకు సన్నిహితులుగా ఉన్నవారిని విచారించి, కొందరిని అరెస్టు చేసిన సీబీఐ ఇప్పడు తాజాగా బుచ్చిబాబు అప్రూవర్ గా మారడంతో కవితను కూడా అరెస్టు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టయ్యారు.   కాగా ఇప్పటికే కవితన కూడా ఈ కేసులో పలుమార్లు విచారించిన ఈడీ తొలి నోటీసులు సీఆర్పీసీ 160 కింద ఇవ్వగా  ఆ తరువాత మాత్రం సీఆర్పీసీ 91 కింద నోటీసు ఇచ్చింది. అంటే తొలి సారి ఆమెను ఆమె నివాసంలో విచారించినప్పుడు ఆమె వివరణ మాత్రమే తీసుకుంది. అయితే ఆ తరువాత నుంచి మాత్రం ఆమె విచారణ కోసం ఎక్కడకు రమ్మంటే అక్కడకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ విధంగానే ఆమెను ఈడీ ఢిల్లీకి పిలిపించుకుని మరీ విచారించింది. తాజాగా బుచ్చిబాబు అప్రూవర్ గా మారడంతో ఇక కవిత అరెస్టే తరువాయి అన్న చర్చ సర్వత్రా సాగుతోంది. ఇదే కుంభకోణంలో ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్’కు నోటీసులు జారీ చేసి విచారించింది.  అన్నిటికీ మించి బుచ్చిబాబు అప్రూవర్ గా మారడానికి ముందే  మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఈ కేసుకు సంబంధించి వరుస లేఖలతో సంచలనాలకు తెర తీస్తున్నాడు.  జైలు నుంచి సుఖేష్ విడుదల చేసిన లేఖలో కవిత ప్రస్తావన తీసుకురావడం, ఆమెతో చేసిన వాట్సాప్ చాటింగ్ ను బయట పెట్టడం అప్పట్లో కలకలం రేపింది.   తాజాగా  కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ గా మారడంతో ఇక కవితను ఈడీ అరెస్టు చేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్

ఈ నెల 30న  హైదరాబాద్లో కొత్త సచివాలయ కాంప్లెక్స్ ప్రారంభమైన తర్వాత బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టింది. మే ఒకటిన  బీఆర్ఎస్ అధ్యక్షుడు  కేసీఆర్ బిజేపి యేతర పార్టీలను కూడగట్టడంలో ఢిల్లీలో  నిమగ్నం కానున్నారు.  ఎలాగైనా కేంద్రంలో బీజేపీని  అధికారంలో రాకుండా చేయాలన్నది కేసీఆర్ తాపత్రయం. లోకసభ ఎన్నికలు 2014లో జరుగనున్నాయి. సమయం తక్కువగా ఉంది. బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి  కేసీఆర్ కు ఇదే  మంచి సమయం . కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ అని గతంలో కాళ్లకు చక్రాలు కట్టుకు తిరిగిన  కేసీఆర్ ఇప్పుడు రూటు మార్చాడు. కేవలం బీజేపీ మాత్రమే టార్గెట్. తన కూతురు  మద్యం కేసులో చిక్కుకోవడం, మళ్లీ బీజేపీ అధికారంలో వస్తే దర్యాప్తు వేగవంతమై శిక్షలు పడతాయన్న భయమే కేసీఆర్ ను బీజేపీ ప్రధాన శత్రువు అయ్యేలా చేసింది. తన కూతురును సీబీ ఐ వేధిస్తుందని మాట మాత్రమైనా కేసీఆర్ అనలేదు. కూతురుకు అన్యాయం  జరుగుతుందని  మీడియాతో కూడా అనడం లేదు. కూతురు ప్రస్తావన లేకుండానే బీజేపీని విమర్శిస్తున్నారు. తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్ర బిజేపీకి మేత దొరికినట్టయ్యింది. ఈ స్కాంలో కేటీఆర్ పేరు వినిపిస్తుంది.  ప్రతీరోజు బీజేపీ నేతలు కూతురు, కొడుకులను విమర్శించడం కేసీఆర్ సహించలేకపోతున్నారు.ఈ కారణంగా జాతీయ రాజకీయాల మీద కేసీఆర్ మమకారం పెంచుకున్నారు. పార్టీకి చెందిన ముఖ్యులు దాదాపు 200 మంది ఢిల్లీలోని  భవన నిర్మాణ శంఖు స్థాపన పనుల ప్రాంభోత్సం సందర్బంగా   అప్పట్లో  హాజరయ్యారు. ఎంఎల్ఏలు, ఎంఎల్ సిలు, ఎంపీలు, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్భాటంగానే శంఖుస్థాపన జరిగింది. కొత్తగా ఏర్పాటైన ఈ నూతన భవన ప్రారంభోత్సవం  తర్వాత నేరుగా కేసీఆర్ కర్ణాటక వెళ్లనున్నారు. అక్కడ  ఎన్నికలు జరుగుతున్నాయి. జెడీఎస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. మాజీ ప్రధాని దేశ గౌడ కేసీఆర్ తో  ఇటీవలె ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల ప్రచా రంలో పాల్గొనాలని దేవ గౌడ అభ్యర్థించారు. ముఖ్యమంత్రి కేసీఆర్  గత సంవత్సం డిసెంబర్ 14 తర్వాత  ప్రస్తుతం ఆయన ఢిల్లీకి బయలుదేరబోవడం రాజకీయ వర్గాల్లో  ఆసక్తి రేకెత్తించింది.పూర్తిగా  జాతీయ రాజకీయాలపైనే ఆయన ఫోకస్ పెడుతున్నారు. టీఆర్ఎస్ కు ఢిల్లీలో స్వంత స్థలం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 2020లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించింది. కేసీఆర్ 2021 సెప్టెంబర్ లో భవన శంఖు స్థాపన చేసి కేవలం 20 నెలల వ్యవధిలో భవన నిర్మాణానికి  పూనుకున్నారు. ప్రస్తుతం అదే భవన ప్రారంభోత్సవానికి కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు.   

తలైవా మాటలు టీడీపీకి మేలు

ప్రముఖ సినీ నటుడు రజనీ కాంత్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైనప్పటికీ తెలుగుదేశం పార్టీకి మేలు జరిగే మాటలు చాలానే మాట్లాడారు. చంద్రబాబు వల్లె హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది. ఇటీవల తాను హైదరాబాద్ వెళ్లినప్పుడు న్యూయార్క్ నగరాన్ని చూసిన అనుభూతి కలిగింది.  చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని తలైవా పొగడ్తల వర్షం కురిపించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సమీపంలోనే ఉండటం రజనీ కాంత్ ప్రసంగం తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యాయి.  రజనీకాంత్ రాజకీయాలలో రావాలని తమిళ ప్రజలు చాలా సంవత్సరాల నుంచి కోరుకుంటున్నారు. బాబా చిత్రం రజనీ  చివరి చిత్రం అని అందరూ అనుకున్నారు. తమిళనాడులో రజనీకాంత్ నటించిన ముత్తు సినిమా చాలా పేరు తీసుకువచ్చింది. ఆయన సినిమాలు ఓ వైపు విజయవంతం కావడం మరో వైపు రజనీ రాజకీయ ఆగమనంపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోవడం పారలల్ గా జరిగిపోయాయి. అయినా రాజకీయాలకు ఎప్పటికప్పుడు పుల్ స్టాప్ పెట్టాడు. సినిమాల్లో బిజీగా ఉంటూనే తమిళ ప్రజలతో మమేకమయ్యేవారు.  రజనీ కురిపించిన ప్రేమానురాగాల కోసం తమిళ ప్రజలు పరితపించేవారు. ప్రజలతో రజనీకి పెరిగిన బాండింగ్ వల్లే రజనీ రాజకీయాల్లో రావాలన్న ఆలోచనకు అంకురార్పణ జరిగింది. ఆయన ఒకసారి హైదరాబాద్ వచ్చిన సమయంలో బీపీ విపరీతంగా పెరిగి జూబ్లిహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు రజనీ రాజకీయాల్లో వచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. నాటి నుంచి రాజకీయాల గురించి మాట్లాడని ఆయన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో హాజరై చంద్రబాబును ఆకాశాన్నెత్తేశారు.  చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఏపీ నెంబర్ వన్ కావడం ఖాయమన్న గ్యారంటీ ఇచ్చారు రజనీకాంత్. రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని, రాజకీయాలు మాట్లాడవద్దని అనుభవం చెబుతుందని రజనీ మరో మారు రాజకీయాల పట్ల తన అయిష్టతను వ్యక్తం చేశారు.  చంద్ర బాబుతో తనకు 30 ఏళ్ల ఫ్రెండ్ షిప్ ఉందని, దేశ , విదేశాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తి అని పొగడ్తలతో ముంచెత్తారు. ఫలానా పార్టీకి ఓటు వేయాలి, ఫలానా అభ్యర్థిని గెలిపించాలని రజనీకాంత్ చెప్పకపోయినా చంద్రబాబును అభినందించడం టీడీపీకి మేలు జరిగినట్టయ్యింది. 

సీబీఐ వ్యూహాత్మకమా.. వెనకడుగా?

అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ చెబుతున్నదొకటి.. చేస్తున్నదొకటి చందంగా ఉందన్నవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ హైకోర్టుకు అవినాష్ ను అరెస్టు చేస్తామని విస్పష్టంగా చెప్పిన సీబీఐ, ఆ తరువాత ఎందుకో అరెస్టు విషయంలో పెద్దగా  పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ పై ఆ కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ఊరటను సునీత సుప్రీం కోర్టుకు వెళ్లి లేకుండా చేశారు. ఆ తరువాత ఏక్షణంలోనైనా అవినాష్ ను అరెస్టు చేసే అవకాశం ఉన్నా కూడా సీబీఐ ఎందుకో ఆ పని చేయలేదు. పోనీ ముందస్తు బెయిలు పిటిషన్ తెలంగాణ హై కోర్టులో విచారణ పూర్తి కావడం కోసం సీబీఐ వేచి చూస్తోందా? అని భావించడానికి ఇక ఇప్పుడు ఆస్కారం లేదు. ఆ విచారణ  వాయిదా పడినా..అనివాష్ ను సీబీఐ అరెస్టు చేయడానికి అడ్డంకులు ఏవీ లేవని తెలంగాణ హైకోర్టే విస్పష్టంగా చెప్పేసింది. ఆ వెంటనే అవినాష్ అరెస్టు జరుగుతుందని అంతా భావించారు. అయితే సీబీఐ ఇప్పుడు కూడా అడుగులు ముందుకు వేయడం లేదు. ఇక వివేకా హత్య కేసులో సీబీఐ మాత్రం దర్యాప్తు కొనసాగిస్తోంది. విచారణలంటూ గతంలో విచారించిన వారినే మళ్లీ మళ్లీ పిలిచి విచారించడం.. కొత్త వారికి నోటీసులు పంపడం చేస్తోంది.  అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి తీరాల్సిందే అని తెలంగాణ హైకోర్టులో ఆయన బెయిలు పిటిషన్ పై వాదనలు వినిపించిన సీబీఐ.. ఇప్పడు అవినాష్ ను అరెస్టు చేయడానికి  ఎటువంటి అడ్డంకులూ లేని పరిస్థితి ఏర్పడిన తరువాత కూడా ఎందుకు మీన మేషాలు లెక్కిస్తోందన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. అయితే సీబీఐ మీనమేషాలు లెక్కించడం కాదనీ, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని కొందరు అంటున్నారు. ఇప్పుడు అవినాష్ ను అరెస్టు చేయకుండా ఏ శక్తీ సీబీఐని ఆపలేదనీ, ఎప్పుడు, ఎలా అరెస్టు చేయాలన్న విషయం స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ నిర్ణయించుకుంటుందనీ అంటున్నారు. బంతి సీబీఐ కోర్టులోనే ఉంది. దానిని గోల్ లోకి ఎలా పంపించాలన్న ప్లాన్ సీబీఐ ఇప్పటికే వేసి ఉంటుందని అంటున్నారు.  న్యాయపరంగా చూస్తే అవినాష్ రెడ్డికి అన్ని తలుపులూ ప్రస్తురానికి మూసుకుని పోయాయి. దీంతో ఎపుడు ఏమి జరుగుతుంది అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.  ఇప్పటికే పార్టీ పరంగా, ముఖ్యమంత్రి జగన్ పరంగా అవినాష్ కు ఇక మద్దతు అభించే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవినాష్ ను దాటి సీబీఐ దర్యాప్తు మరింత ముందుకు వెళ్ల కుండా ఉంటే చాలన్నదే జగన్ అండ్ కో భావనగా కనిపిస్తోందని అంటున్నారు.  అవినాష్ కు సీబీఐ నోటీసుల తరువాత జగన్ రెండు సార్లు చేసిన హస్తిన పర్యటనలో ఆయన సంబంధితులతో అవినాష్ తోనే దర్యాప్తు ముగిసేలా చూడాలని కోరడానికే వెళ్లారని కూడా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యమనీ, ఇప్పుడో.. ఇహనో సీబీఐ ఆయనను అదుపులోనికి తీసుకోవడం ఖాయమని అంటున్నారు. 

భార్య మహిమ ఏంటో సుధామూర్తి చెప్పేశారు!

భారత సంతతికి చెందిన రిషి సునాక్.. గతేడాది యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవి చేపట్టిన తొలి భారతీయ సంతతి వ్యక్తి సునాక్. అంతేకాదు, ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తికి స్వయానా అల్లుడైన రిషి.. అత్యంత పిన్న వయసులోనే బ్రిటన్ ప్రధాని అయిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. ఈ నేపథ్యంలో  నారాయణ మూర్తి భార్య, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సతీమణి తల్లి అయిన సుధామూర్తి తన కుమార్తె అక్షతా మూర్తి గురించి  కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె ఆమె భర్తను అతి పిన్న వయసులోనే   ప్రధానిని చేసిందన్నారు. ఈ మేరకు ఆమో మాట్లాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.   నేను నా భర్తను వ్యాపారవేత్తను చేశాను.. నా కుమార్తె తన భర్తను చిన్న వయసులోనే యూకే ప్రధానిని చేసిందంటూ భార్య మహిమఅంటే అదీ అన్నారు సుధామూర్తి. భర్తను భార్య ఎలా మారుస్తుందో చూడండి... కానీ నా కుమార్తె తన భర్తను మార్చుకున్నట్లుగా నేను నా భర్తను మార్చలేక పోయానని ఆమె చమత్కరించారు.  ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన అక్షతామూర్తి 730 మిలియన్ పౌండ్ల సంపదతో శక్తిమంతమైన మహిళగా నిలిచారు.  కాగా, తన కుమార్తె ప్రధాని రిషి జీవితం, ఆహారపు అలవాట్లను మార్చిందని సుధామూర్తి పేర్కొన్నారు. నారాయణమూర్తి కుటుంబం ప్రతి గురువారం ఉపవాసం ఉండే సంప్రదాయాన్ని పాటిస్తోంది. దీంతో తమ అల్లుడు రిషి కూడా గురువారాల్లో ఉపవాసం ఉంటున్నారని సుధామూర్తి చెప్పారు. ప్రతి వ్యక్తి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందనేది నానుడి.  ఇదే ఫార్ములా విదేశాలలో..విదేశీయులకు కూడా అప్లై అవుతుందా..? అంటే సుధామూర్తి ఔననే అంటున్నారు. 

అధికారం కోసం విలువలకు తిలోదకాలు..?

అధికారమే లక్ష్యంగా బీజేపీ విలువలకు తిలోదకాలిచ్చేస్తోందంటూ  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు శివసేననునిలువునా చీల్చి.. ఏక్ నాథ్ షిండే వర్గానికి మద్దతు నిచ్చి షిండేను సీఎం పీఠం మీద కుర్చోబెట్టిన బీజేపీ.. ఇప్పుడు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు బీజేపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత మహా ఉప ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం పీఠంపై కూర్చో పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఎన్సీపీ ఎమ్మెల్యేలు, ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు షిండేతో భేటీ అయ్యారన్న వార్తలు అత్యంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అలాగే షండేతో మహాబలేశ్వర్ లో ఉద్ధవ్ థాక్రే భేటీ అయ్యారన్న వార్తలు కూడా మహా రాజకీయలను వేడెక్కించాయి.  వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఫడ్నవీస్ ని   ముఖ్యమంత్రి  చేయాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. షిండేనీ, ఆయనతోపాటు ఎన్సీపీ నాయకుడు శరద పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ ని ఉప ముఖ్యమంత్రులుగా చేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉందన్న వార్తలు వినవస్తున్నాయి. ఈ భేటీల నేపథ్యంలో రానున్న రోజులలో  మహారాష్ట్ర రాజకీ యాల్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అధికారం కోసం ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలతో మహారాష్ట్ర రాజకీయాలు జాతీయ వార్తలలో గత కొద్ది కాలంగా ప్రాధాన్యత ను సంతరించుకుంటున్నాయి. రానున్న రోజులలో ఎలాంటి మలుపులకు దారి తీస్తాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.

ఫిర్యాదులు రాకున్నా విద్వేష ప్రసంగాలపై కేసులు.. సుప్రీం

ప్రజలను రెచ్చగొట్టేలా చేసే విద్వేష ప్రసంగాలపై గతంలో మూడు రాష్ట్రాలకు జారీ చేసిన ఆదేశాల పరిధిని సుప్రీంకోర్టు దేశమంతటికీ వర్తింపజేసేలా విస్తృతం చేసింది. ఈ తరహా ఉపన్యాసా లపై ఫిర్యాదులు రాకున్నప్పటికీ కేసులు నమోదు చేయాల్సిందేనని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది. దేశ లౌకికత్వానికి తీవ్ర హాని కలిగించే నేర పూరిత చర్యలుగా విద్వేష ప్రసంగాలను అభి వర్ణించింది. గత ఏడాది అక్టోబరు 21న తామిచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లుగా వీటిపై కేసులు నమోదులో జాప్యం జరిగితే కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని జస్టిస్ కె. ఎం. జోసెఫ్, జస్టిస్ బి. వి. నాగరత్నం ధర్మాసనం హెచ్చరించింది.  విద్వేష ప్రసంగాలు చేసిన వ్యక్తులు ఏ మతా నికి చెందిన వారైనా చట్టం ముందు నిలబెడాల్సిందేనని పేర్కొంది. గతంలో ఢిల్లీ, ఉత్త ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. రాజ్యాంగ పరిరక్షణ, దేశ ప్రజలందరి సంక్షేమం దృష్ట్యా చట్టబద్ద పాలన కొనసాగేలా చూడాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల డీజీపీలకు ఆదేశా లిచ్చింది. విద్వేష ప్రసంగాలపై కేసులు దాఖలు చేసేలా ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై   విచారణ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితిపైనా పిటిషన్లు రావడంతో ధర్మాసనం తాజా ఉత్తర్వులిచ్చింది. కొంతకాలం క్రితం నుంచి మతపరమైన అల్లర్లు పెరగటంపై సుప్రీంకోర్టు ధర్మాసన ప్రస్తుత ఉత్తర్వు మంచి ఫలితానిస్తుందని న్యాయ కోవిదులు  అంటున్నారు.

నితీష్ పౌరోహిత్యం వెనుక రహస్యం ఏమిటంటే?

 ప్రతిపక్ష పార్టీలు సిద్దాంత,  రాజకీయ విభేదాలన్నిటినీ వదిలి ఏకం అయితే కానీ 2024 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఎ హ్యాట్రిక్ అడ్డు కోవడం అయ్యేపని కాదు. ఈ విషయంలో  కాంగ్రెస్ మొదలు బీఆర్ఎస్ వరకూ అన్ని పార్టీలూ, అందరు నాయకులలో ఏకాభిప్రాయం వుంది.  అందులో అనుమానం లేదు. అన్ని పార్టీలూ ఏకం అయినా ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే పరిస్థితి లేదనీ అంతకంటే ముఖ్యంగా ప్రతిపక్షల ఐక్యత అయ్యే పని కాదనీ జాతీయ రాజకీయాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. సర్వేలూ అదే చెపుతున్నాయి.   రాజకీయ విశ్లేషణలు, సర్వేలు ఎలా ఉన్నా  విపక్ష పార్టీలు మాత్రం ఐక్యతా యత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి జేడీఎస్ అధ్యక్షుడు నితీష్ కుమార్  ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్  జోడీ  వెనక ఉన్న అసలు  కారణం ఏదైనా విపక్షాలను ఏకంచేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.  నితీష్, యాదవ్ జోడీ కాలికి బలపం కట్టుకుని మరీ కాంగ్రెస్సేతర పార్టీల నాయకులను కలిసి  విపక్ష పార్టీల ఐక్యత అవశ్యకతను వివరిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి  మమతాబెనర్జీ, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ ( ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఇలా ఉత్తర భారత దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులు అందరినీ కలుస్తున్నారు. అయితే ఎందుకో ఏమో కానీ ఇంత వరకు నితీష్ కుమార్ దక్షిణ భారత దేశంలో కాలు పెట్టలేదు. ఖమ్మంలో జరిగిన భారత రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) ఆవిర్భావ సభకు నితీష్ వస్తానని రాలేదు. అలాగే  తమిళనాడు ముఖ్యమత్రి స్టాలిన్ ఇటీవల నిర్వహించిన సామాజిక న్యాయ సదస్సుకు కూడా నితీష్ దూరంగానే ఉన్నారు.  ఆర్జేడీ తరపున బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు కానీ జేడీయు తరపున నితీష్ కుమార్ హాజరవుతారని అనుకున్నా ఆయన రాలేదు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ దక్షిణ భారత దేశంలో ఎందుకు పర్యటించ డం లేదు? ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో నితీష్ కంటే ఒకడుగు ముందున్న తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎందుకు కలవడం లేదు? అలాగే ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఏపీ  మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఒరిస్సా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ను ఎందుకు  కలవలేదు?  ఇలా నితీష్ కుమార్  దక్షణ భారత దేశం ప్రాంతీయ నాయకులను కలవక పోవడం యాధృచ్ఛికమా? వ్యూహత్మకమా? అనే ప్రశ్న ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.   అదలా ఉంటే.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి కాంగ్రెస్ పార్టీతో కళ్యాణం జరిపించే పౌరోహిత్య బాధ్యతలను ఎందుకు భుజానికి ఎత్తుకున్నారు? (ఒకప్పుడు ఈ పనిని కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ సమర్ధవంతగా నిర్వహించారు) అంటే రాష్ట్ర రాజకీయాల్లో నెగ్గుకు రావాలంటే, జాతీయ స్థాయిలో తన ఇమేజ్ పెంచుకోవడం అవసరమని ఆయన గుర్తించడం ఒక కారణం అయితే రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో కాంగ్రెస్ తో సయోధ్య పెంచుకుని ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్ధిగా తెరపికొచ్చే చక్కటి, చిక్కటి వ్యూహంతోనే నితీష్ కుమార ,కాంగ్రెస్ సారధ్యంలో ప్రతిపక్షాలను ఏకంచేసే బాధ్యతను నెత్తికి ఎత్తుకున్నారని జాతీయ మీడియాలో వ్యూహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా  లేకున్నా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ తో జట్టుకట్టేందుకు సిద్దంగా లేని, బీఆర్ఎస్, వైసీపీ, బీజీడీ, టీడీపీ వంటి  పార్టీలను నితీష్ టచ్ చేయడంలేదనీ, అలాగే  ఆల్రెడీ కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్  ను ఆయన కలవ లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే  భవిష్యత్ లో ఐక్యతా యత్నాలు కొనసాగుతాయని అంటున్నారు. మరో వంక నితీష్ ఎత్తుగడను కాంగ్రెస్ నాయకులు కొందరు పసిగట్టినందునే అయితే రాహుల్ కాకుంటే ప్రియాంక  అంటూ ప్రియాంకా వాద్రా పేరును తెరపైకి తెచ్చారని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంపై ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం కుదరడం దాదాపు అసాధ్యమే అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అలాగే  2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం అయ్యేపని కాదని రాజకీయ పరిశీలకులే కాదు, వివిధ పార్టీల నాయకులు కూడా  భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కానీ, అసలు సినిమా తెర మీదకు రాదని అంటున్నారు. అంతవరకూ ఐక్యతా ప్రవచనాలు వినిపిస్తూనే ఉంటాయని అంటున్నారు.

కర్నాటకం.. కాంగ్రెస్ కు ఖర్గే షాక్!

రెండు వారాల్లో.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. మే 10 న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు రోజు రోజుకు దిగజారి పోతున్నాయా? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా, వచ్చిన చక్కని అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ చేజేతులా జార విడుచు కుంటోందా? అంటే అవుననే అనవలసి వస్తోంది. నిజానికి, కర్ణాటకలో అడ్డదారిన అధికారంలోకి వచ్చిన బీజేపీ మూడేళ్ళలోనే ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చినా.. ప్రజల మన్ననలు పొందలేక పోయింది. ముఖ్యంగా అవినీతి విషయంలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఒకరితో ఒకరు పోటీపడి మరీ అవినీతిని పెంచుకుంటూపోయారు. చివరకు,సొంత పార్టీ నాయకులే, 40 శాతం ముడుపులు చెల్లించనిదే సర్కార్ చెల్లింపులు జరగవని ఆరోపించారు.  అంతే కాదు, ఎన్నికల ప్రకటనకు ముందు నుంచి కూడా వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలలో ప్రభుత్వ వ్యతిరేకత పతాక స్థాయికి చేరిన సంకేతాలొచ్చాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పైపైకి పాకింది.. స్పష్టమైన ఆధిక్యతతో హస్తం పార్టీ అధికారంలోకి రావడం  ఖాయమనే స్పష్టమైన సంకేతాలొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మూడింట రెండువంతుల మెజారిటీతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని సర్వేలు మాత్రమే కాదు, రాజకీయ విశ్లేషకులు కూడా క్లియర్ కట్  గా చెప్పేశారు. నిజానికి బీజేపీ రాష్ట్ర  నాయకత్వం చేతులెత్తేసింది. నీట ముంచినా పాల ముంచిన మీదే భారమని రాష్ట్ర నాయకత్వం ఎన్నికల భారాన్నిజాతీయ నాయకత్వం అనే మోడీ షా జోడీ భుజస్కందాలపై ఉంచింది. అయినా  ఆ ఇద్దరూ గుజరాత్ ఫార్ముల అప్లై చేసినా 75 నియోజక వర్గాల్లో అభ్యర్ధులను మార్చినా పెద్దగా ఫలితం కనిపించ లేదు సరికదా, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ సహా మరికొందరు ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కాషాయం వదిలి కాంగ్రెస్ గూటికి చేరారు.  అయితే,కాంగ్రెస్ అగ్ర నేతలు గత అనుభవాలను మరిచి అనవసర వివాదాలకు తలుపులు తీయడంతో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ గ్రాఫ్ నేల చూపులు చూస్తోందని అంటున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ కు కొంత ఎడ్జ్ ఉన్నప్పటికీ, కాంగ్రెస్, బీజేపీల మధ్య మార్జిన్ తగ్గుతూ వస్తోందని లేటెస్ట్ సర్వేలు స్పష్తం చేస్త్నున్నాయి.అంతేకాదు  అల్టిమేట్ గా  హంగ్ తప్పక పోవచ్చని తాజా సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముఖ్యమంత్రి బొమ్మైఅవినీతిని ఆయన సామాజిక వర్గం లింగాయత్ లకు అంటగట్టారు. ఇది లింగాయత్ సామాజిక వర్గం ఓటర్లను కొంత మేర హర్ట్ చేయడంతో, స్వయంగా సిద్దరామయ్య  ముఖ్యమంత్రి బొమ్మైని ఉద్దేశించి మాత్రమే తాను వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచుకోవలసి వచ్చింది.  అంతకు ముందే, పీసీసీ చీఫ్, డీకే శివకుమార్ మీడియా మీద చిర్రుబుర్రులాడారు, చులకన చేసి మాటలాడి జర్నలిస్టుల ఆగ్రహానికి గురయ్యారు.   ఇవన్నీ ఒకెత్తు అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన విష సర్పం వ్యాఖ్య పెను దుమారమే సృష్టించింది. కలబుర్గిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోదీని విష సర్పంతో పోల్చారు. మోడీ ఒక విష సర్పం, విషం ఉందా లేదా అని నాకి చూస్తే చచ్చి ఊరుకుంటారని ఖర్గే అన్నారు. అయితే, మాట తూలిన వెంటనే ఖర్గే, తప్పు దిద్దుకునే ప్రయత్నం చేశారు, తన వ్యాఖ్యలు మోడీపై కాదని, బీజేపీపై అని ఖర్గే వివరణ ఇచ్చుకున్నారు. కానీ, అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. జాతీయ మీడియా గతాన్ని తవ్వి తీసి  కాంగ్రెస్ నాయకుల దురుసు వ్యాఖ్యలు  ఎప్పుడెప్పుడు పార్టీ విజయావకాశాలను ఎలా దేబ్బతీసిందో ప్రజల ముందుంచింది. ఖర్గే అనుచిత వ్యాఖ్యల రగడ ఎన్నికలు పూర్తయ్యే వరకూ కొనసాగేలా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  కాంగ్రెస్ నాయకులు గతంలో కూడా మోడీని వ్యక్తిగతంగా విమర్శించి దెబ్బ తిన్నారు.  2007, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని మౌత్ కా సౌదాగర్ (మృత్యు వ్యాపారి) అని దూషించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది. అలాగే, 2014 లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మోడీని ‘నీచుడు’ (నీచ్ ఆద్మీ) అని దూషించారు. మోదీ ఎప్పటికీ ప్రధాని కాలేరని ప్రగల్బాలు పలికారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి చాయ్ అమ్ముకోమని ఎద్దేవా చేశారు. ఆ ఎన్నికల్లో ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే.. మూడు దశాబ్దాల తర్వాత... బీజేపీ ఒంటరిగా సంపూర్ణ మెజారిటీ సాధించింది.చరిత్రను తిరగ రాసింది. కాంగ్రెస్ పార్టీ, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా  50 సీట్లకు పరిమితం అయింది . ఇక రాహుల్ గాంధీ విషయం అయితే చెప్పనే అక్కరలేదు. 2019 ఎన్నికల్లో, ‘చౌకీ దార్ చోర్ హై’అంటూ మోదీని దొంగను చేసి , బీజేపీ బలాన్ని 283 నుంచి 303కు పెంచారు. కాగా ఖర్గే గత సంవత్సరం జరిగియన్ గుజరాత్ ఎన్నికల్లో మోదీని రాక్షస రాజు రావణుని పోల్చారు.ఏమి జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే.,ఇక ఇప్పడు ఖర్గే స్వరాష్ట్రం కర్ణాటకలో, ప్రధాని మోడీని విష సర్పంతో పోల్చారు. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. నిజంగానే, కర్ణాటకలోనూ అదే జరిగితే, అందుకు ఖర్గేనే బాధ్యత వహించవలసి ఉంటుందని అంటున్నారు.

15వ శతాబ్దపు స్మారక కట్టడం కూల్చివేత.. సీనియర్ ఐఏఎస్ కు విజిలెన్స్ నోటీసులు

15వ శతాబ్దపు స్మారక కట్టడాన్ని కూల్చివేసి భవన నిర్మాణం చేపట్టిన ఢిల్లీ జల్ బోర్డు మాజీ సీఈవో  ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ విభాగం నోటీసులు జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఉదిత్ ప్రకాష్ రాయ్ ఢిల్లీ జల్ బోర్డు సీఈవోగా ఉన్న సమయంలో 15వ శతాబ్దానికి చెందిన స్మారక చిహ్నాన్ని కూల్చివేశారంటూ విజిలెన్స్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఇదే విషయంలో ఢిల్లీ జల్ బోర్డు కు చెందిన ఐదుగురు అధికారులకు కూడా షోకాజ్ నోటీసులు అందాయి.   ఈ నోటీసులకు రెండు వారాలలోగా సమాధానం ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ విభాగం  ఆదేశాలిచ్చింది. ఇక కూల్చివేతకు గురైన భవనం పఠాన్న కాలం నాటి రాజవంశానికి చెందిన ప్యాలెస్. ఇది ఢిల్లీలోని లజ్ పత్ నగర్ సమీపంలోని జలవిహార్ ప్రాంతంలో ఉంది. ఆ భవనాన్ని వాస్తవానికి జల్ బోర్డ్ పురావస్తు శాఖకు అప్పగించాల్సి ఉంది. ఇందుకోసం ప్రక్రియ కొనసాగుతుండగానే ఆ భవనాన్ని కూల్చి వేసి ప్రకాశ్ రాయ్ భవంతిని నిర్మించారు. వాస్తవానికి ప్రస్తతం ఆయన ఢిల్లీ జల్ బోర్డులో లేరు. ఆయనకు మిజోరం బదలీ అయ్యింది. ఆ భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన కుటుంబం అందులోనే నివసిస్తోంది. కాగా స్మారక చిహ్నం కూల్చివేతపై చర్యలు తీసుకోవాలని బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. నిత్యం అవినీతి వ్యతిరేక పోరాటం గురించి పాట్లాడుతూ సింప్లిసిటీ అంటూ గొప్పలు చెప్పుకునే కేజ్రీవాల్ తన అధికార నివాస సుందరీకరణకు రూ.45 కోట్లు వ్యయం చేశారు. జల్ మండల్ మాజీ సీఈవో స్మారక చిహ్నాన్ని, పదిలంగా కాపాడుకోవలసిన చారిత్రక కట్టడాన్ని కూల్చివేసి భవంతిని నిర్మించుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   పదిహేనవ శతాబ్దపు స్మారక చిహ్నాన్ని పడగొట్టేస్తుంటే  భారత పురావస్తు శాఖ  నిద్రపోతోందా అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మండి పడ్డారు. ఈ విషయంపై వివరణ ఇవ్వడమే కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆమె లేఖ రాశారు. అలాగే స్మారక చిహ్నం కూల్చివేతపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాశారు.   

కేజ్రీవాల్ చెప్పింది ఒకటి చేసింది ఇంకొకటి

అరవింద్ కేజ్రీవాల్ ... పరిచయం అవసరం లేని పేరు. అవును, నడుస్త్ఘున్న చరిత్రలో దేశ ప్రజలు అందరికీ సుపరిచితమైన కొద్ది మంది జాతీయ రాజకీయ ప్రముఖుల్లో  ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఒకరు.  ఢిల్లీ పీఠం నుంచి దేశాన్ని ఏలుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే అయినా, దేశ రాజధాని ఢిల్లీని పాలిస్తున్న ప్రభువు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్. అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారి 2011 ఏప్రిల్లో రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించారు. 2012  నవంబర్లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. 2013 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 60 ఏండ్లుగా ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ఆధిపత్యం చలాయించగా, చారిత్రాత్మకంగా ఆప్ అధికార పీఠాన్ని దక్కించుకోగలిగింది. కేజ్రీవాల్ 2015లో రెండవసారి, 2020లో మూడవసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. గతేడాది మార్చిలో పంజాబ్ ఎన్నికల్లో గెలిచి చారిత్రాత్మక విజయం సాధించారు. రెండు రాష్ట్రాలను స్వాధీనం చేసుకున్న మొదటి ప్రాంతీయ నాయకుడిగా కేజ్రీవాల్ దేశ దృష్టిని ఆకర్షించగలిగారు.  అయితే, చిత్రంగా అవినీతి వ్యతిరేక ఆందోళనను ఆసరా చేసుకుని రాజకీయ అరంగేట్రం చేసిన అరవింద్ కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇతర కేసుల సంగతి ఎలా ఉన్నా, ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో కేజ్రీవాల్ ప్రభుత్వం పీకల లోతుకు మునిగి పోయిందనే అభిప్రాయం బలపడుతోంది. ఈ కేసులో ఇప్పటికే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కుడిభుజం అనుకునే, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా  అరెస్టయ్యారు.రెండు నెలలకు పైగా జైల్లోనే ఉంటున్నారు. బైలు ఇచ్చేందుకు కూడా న్యాయస్థానాలు తిరస్కరిస్తున్నాయి. మరో వంక ఇదే లిక్కర్ కేసులో ఆయన సీబీఐ నుంచి నోటీసులు అందుకున్నారు. విచారణకు హాజరయ్యారు. అరెస్ట్ అవుతారా లేదా అనేది పక్కన పెడితే పెడితే, కేజ్రీవాల్ ఇమేజ్ అయితే   మసక బారింది. మరకల మయంగా మారిపోయింది.  అదలా ఉంటే, ఇప్పడు అరవింద్ కేజ్రివాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన క్లీన్ ఇమేజ్ పై మరో మరక వచ్చి పడింది. ముఖ్యమంత్రి అధికార నివాసం సుందరీకరణకు రూ.45కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేశారాని అది కూడా, దేశమంతా కరోనా మహమ్మారి బారిన పడి ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంత ఖర్చుచేశారని వచ్చిన  మీడియా కథనం ఆధారంగా బీజేపీ ఆందోళనకు దిగింది . ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. దీంతో  ఆమ్ఆద్మీ పార్టీ బీజేపీ  మధ్య మరో రచ్చ మొదలైంది. నిజానికి, ముఖ్యమంత్రి అధికార నివాసానికి అవసరమైన మరమత్తులకోసం ప్రజాధనం ఖర్చుచేయడం పెద్ద నేరంమేమి కాదు..అయితే ..అరవింద్ కేజ్రీవాక్ చెప్పింది ఒకటి చేసింది మరొకటి. అందుకే  ముఖ్యమంత్రి అధికార నివాసం సుందరీకరణ వివాదంగా మారింది. నిజాయితీ, సింప్లిసిటీ అంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ తన వాగ్దానాలను తప్పుతున్నారని, మోసం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విమర్శించారు.  నిజానికి అరవింద్ కేజ్రివాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేముందు, ముఖ్యమత్రి అయిన తర్వాత కూడా తమ జీవన్ శైలి మారదని, కార్లు, బంగ్లాలు ఉండవాణి ..చెప్పుకొచ్చారు. చివరకు తొలిసారి ప్రమాణ స్వీకారానికి ఆయన మెట్రో రైల్లో వచ్చి, తమ సింప్లీసిటీ చాటుకున్నారు. అలాంటి కేజ్రీవాల్, ఇలా నాలుగు పడక గదుల ఇంటి సుందరీకరణకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏమిటనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు ఆప్ నేతలు, మోడీతో పోలిక తెచ్చి  అంతే  ఘాటుగా స్పందించారు.  డొనాల్డ్ ట్రంప్ 3 గంటల పర్యటనకు రూ.80కోట్లు ఖర్చు చేశారు.మధ్యప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రులు. విమానాల కోసం రూ.200 కోట్లు కేటాయించుకున్నారు. ఈ విషయాలపై చర్చించేందుకు ఎవరికీ ధైర్యం లేదు  అని ఆమ్ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్  అన్నారు. కేజ్రీవాల్ ఉంటున్న ఇంట్లో పైకప్పు స్లాబ్ మూడుసార్లు కూలిపోయిందని, ఇంటికి మరమ్మతులు చేయాలని పీడబ్ల్యూడీనే చెప్పిందని ఆమె తెలిపారు.కేజ్రీవాల్ ప్రస్తుతం ఉంటున్న బంగ్లా 1942లో నిర్మితమైందని, అది శిథిలావస్థలో ఉందని ప్రియాంక్ అన్నారు. ఓసారి కేజ్రీవాల్ తల్లిదండ్రులు ఉంటున్న గది పైకప్పు స్లాబ్ ఊడిపోయిందని అన్నారు. ఢిల్లీ సీఎం ఇంటి నిర్మాణ విలువ కంటే ఆరు ఎకరాల్లో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ నివాస మరమ్మతులు, పెయింటింగ్ కే ఎక్కువ ఖర్చయిందని ప్రియాంక అన్నారు.

సైకిల్ ఎక్కనున్న రాజాసింగ్

ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కోవాలని అనుకుంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.  మహమ్మద్ ప్రవక్తపై విద్వేష ప్రసంగం చేసి బీజేపీ నుంచి సస్పెండ్ కు గురైన రాజాసింగ్ మూడునెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. కానీ పార్టీ నాయకత్వం తనను  దూరం పెట్టడంతో తీవ్ర మనస్థాపం చెందడంతో బీజేపీ నుంచి రాజాసింగ్ వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది. రాజాసింగ్ ఇటీవలె బర్త్ డే వేడుకలు జరుపుకున్నప్పటికీ పార్టీ నాయకత్వం హాజరు కాలేదు. కానీ తెలంగాణ బీజేపీ చీఫ్ మాత్రం ఫోన్లో విషెస్ తెలిపారు. మళ్లీ ఎటువంటి చర్చలు జరపకపోవడం విశేషం. ఎన్నికలు ఇంకా ఆరునెలలు కూడా లేవు. తన రాజకీయ భవిష్యత్తు ఏమిటి? అనే డోలాయామాన పరిస్థితిలో పడ్డాడు రాజాసింగ్. ఎక్కడ  పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కోవాలనుకుంటున్నారు ఆయన. టిడీపీ తెలంగాణ చీఫ్ కాసానితో చర్చలు జరిపారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన యోచిస్తున్నారు. 2009లో టీడీపీలో చేరి కార్పోరేటర్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2014లో బీజేపీ తీర్థం పుచ్చుకుని గోషామహల్ నుంచి మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్లీ అదే పార్టీ నుంచి 2018లో రెండో సారి గెలిచారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కావడం విశేషం. 

బంతి ఇప్పుడు సీబీఐ కోర్టులో.. ఏ క్షణంలోనైనా అవినాష్ అరెస్ట్?

అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అవినాష్ రెడ్డికి ఉన్నఅన్నిదారులూ మూసుకుపోయాయి. ఇప్పుడు బంతి  సీబీఐ కోర్టులో ఉంది. తలుచుకుంటే ఏ క్షణమైనా అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడవచ్చు. వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైసీపీ నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పును జూన్ 5కు వాయిదావేసింది. సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయమూర్తి ఈ రోజు తీర్పు వెలువరించలేమని చెప్పి.. వెకేషన్ బెంచ్  కు మార్చుకుంటారా? అని అడిగారు. అయితే ఇది అత్యవసరమనీ, తీర్పు వెంటనే ఇవ్వాలనీ అటు అవినాష్ తరఫు న్యాయవాదులూ, ఇటు సీబీఐ తరఫు న్యాయవాదులూ కూడా కోరారు, అయితే  అత్యవసరమైతే చీఫ్ జస్టిస్ బెంచ్ కు వెళ్లాలని న్యాయమూర్తి  జస్టిస్ సురేంద్ర సూచించారు. దీంతో  అవినాష్ తరఫు న్యాయవాదులు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు మెన్షన్ చేశారు.  అయితే సుప్రీం కోర్టు ఈ విషయంలో విస్పష్ట డైరెక్షన్ ఇచ్చినందున తాను ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోనని హైకోర్టు చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. అంతకు ముందు జస్టిస్ సురేంద్ర బెంచ్ లో వాదనలు పూర్తయిన తరువాత విచారణను జూన్ 5కువాయిదా పడింది.  ఆ సందర్భంగా  అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలా లేదా అన్నది సీబీఐ ఇష్టం. ఈ మేరకు దర్యాప్తు సంస్థలకు న్యాయపరంగా ఎలాంటి ఆటంకాలు లేవు అని కోర్టు స్పష్టం చేసింది.  ఆ తరువాత  సీజే బెంచ్ కూడా ఇప్పటికప్పుడు విచారణ చేపట్టడం కుదరదని స్పష్టంచేసింది.   కనీసం రెండు వారాలు అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని అవినాష్ లాయర్లు .. సీజేని  కోరినా..  సుప్రీంకోర్టులో ఈ కేసు విషయంలో సీజేఐ వ్యాఖ్యలు చూసిన తర్వాత కూడా ఇలా ఎలా ఒత్తిడి చేస్తారని సీజే అవినాష్ లాయర్లను ప్రశ్నించారు. అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు.  దీంతో సీబీఐ అనుకుంటే ఏ క్షణంలోనైనా అవినాష్ ను అరెస్టు చేయవచ్చు. అవినాష్ లాయర్లు కూడా ఇదే చెప్పారు. సీబీఐఅవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలున్నాయని వారు తెలిపారు. 

అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ తీర్పు వాయిదా

వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన శుక్రవారం కూడా తీర్పు రాలేదు. ఈ పిటీషన్ పై సుదీర్ఘంగా విచారణ సాగినప్పటికీ తీర్పు ఇవ్వలేమని  బెంచ్ పేర్కొంది. రేపటి నుంచే హైకోర్టుకు సెలవులు ఉన్నాయి కాబట్టి తీర్పు కోసం సుదీర్ఘ విచారణ జరిపినప్పటికీ న్యాయమూర్తి ఎవరూ ఊహించని విధంగా వాయిదా వేసారు.  అత్యవసరమైతే చీఫ్ కోర్టుకు వెళ్లాలని న్యాయమూర్తి సూచించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ తీర్పు  ఇన్ని రోజులు రిజర్వ్ పెడితే బాగుండదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సీబీఐ తన పని తాను చేసుకుపోవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు. సుప్రీం కోర్టు డైరెక్షన్ ప్రకారం ఈ కేసులో తాము జోక్యం చేసుకోబోమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జూన్ 5 కి వాయిదా పడింది. 

సేఫ్ ఫార్మాను అన్ సేఫ్ చేసిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న రాజధానిని గాలికొదిలేసి మూడు రాజధానులు తెస్తానంటున్న వైసీపీ ప్రభుత్వం తాజాగా మరో రాజధానిని కూడా తయారు చేస్తోంది. దేశంలోనే అధికంగా గాంజాయి సప్లై చేస్తున్న రాష్ట్రంగా పేరు సంపాదించిన ఆంధ్రప్రదేశ్ కీర్తి ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా విస్తరించింది.  నరసరావు పేటలోని సేఫ్ ఫార్మాలో తయారైన డ్రగ్స్ ప్రపంచంోని అన్ని దేశాలకూ ఎగుమతి అవుతున్నాయని జతీయ మీడియా ప్రచురించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఈ వార్తా కథనంతో సేఫ్ ఫార్మా డ్రగ్స్ దందా ప్రపంచానికి తెలిసింది.   గత మూడు రోజులుగా జిల్లాలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కర్యక్రమంపై స్పందించిన వైసీపీ నేతలు చంద్రబాబును విమర్శించడమే కాకుండా.. కోడెల శివప్రసాద్ పేరును, ఆయన మరణానికి కారణాలను చర్చించారు. అంటే సేఫ్ ఫార్మా విషయం వారికి ముందే తెలుసని అందుకే కోడెల ప్రస్తావన తెచ్చారని మీడియా మిత్రులు చెబుతున్నారు.  1982లో స్థాపించిన సేఫ్ ఫార్మా గతంలో డాక్టర్ కోడెల అధీనంలో ఉండేది.  వైసీపీ అధికారంలోకి  వచ్చిన తరువాత సేఫ్ ఫార్మాని బలవంతగా  లాక్కొని కోడెల మరణానికి వైసీపీ కారణమయ్యారని నరసరావుపేట ప్రజలు బాహాటంగానే చెప్పుకుంటారు. నొప్పుల నివారణకు వినియోగించే ట్రమడాల్  అనే డ్రగ్ ఉత్పత్తికి  కోడెల అంగీకరించకపోవడమే  ఆయన ఆత్మ హత్యకు కారణమని ఆయన అభిమానులు అంటున్నారు. దీంతో కోడెలపై కక్ష కట్టిన వైసీసీ గ్యాంగ్ఆయనను వేధించి  చివరకు ఆయన చావుకు కారణమయ్యారని వారి వాదన. తాజాగా  ఫిబ్రవరి 27వ తేదీన సుడాన్  దేశంలో అక్కడి కస్టమ్స్ అధికారులు 21 కోట్ల రూపాయల విలువైన ట్రమడాల్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.  సేఫ్ ఫార్మా తయారు చేసిన డ్రగ్స్   సుడాన్ ద్వారా మిగిలిన దేశాలకు సరఫరా అవుతున్నాయని  అధికారులు గమనించారు. ఈ డ్రగ్స్ ను ఎక్కువగా  ఉగ్రవాదులు వినియోగిస్తున్నారనీ, వారి కోసమే ఈ డ్రగ్ ప్రత్యేకంగా తయారౌతోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన తీగను లాగితే.. దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లోని నరసరావుపేటలో ఉన్న సేఫ్ ఫార్మాస్యూటికల్స్ ప్రయివేట్ లిమిటెడ్ అనే కంపెనీ చరిత్ర బయటకు వచ్చింది. డ్రగ్స్ కంట్రోల్ మీడియా సర్వీసెస్ అనే  ఆర్గనైజేషన్ ఈ నెల 26న ఈ విషయాన్ని పేర్కొంది. బెంగళూరు తో సహా మరికొన్నినగరాలలో పరిశీలించిన అధికారులు సేఫ్ ఫార్మా డైరెక్టర్ శనగల శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు.   మరో డైరెక్టర్ గాదె కనిగిరి ప్రస్తుతం అందుబాటులో లేరని తెలుస్తోంది. వీరు ఇరువురూ  2020 మే 13వ తేదీన ఈ కంపెనీ డైరెక్టర్లుగా ఎంట్రీ ఇచ్చారు. 2019 సెప్టెంబర్ 16న కోడెల మరణం తరువాత కొత్త బోర్డు ఏర్పాటైంది. ఈ స్మగ్లింగ్ తో వైసీపీ ఎంపీకి కూడా సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సేఫ్ ఫార్మాకు ఆర్డర్లు భారీ స్థాయిలో అందడం కొసమెరుపు. 

కమలానికి విజయం ఎంతో దూరం!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వేడి భగ్గుమంటోంది. నిజానికి, మే 10న జరిగేది అసెంబ్లీ ఎన్నికలే అయినా, ఈసంవత్సరం చివరి వరకు  మరో ఆరేడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, అలాగే, 2024 లోక్ సభ ఎన్నికలకు కర్ణాటక ఫలితాలు  టర్నింగ్ పాయింట్ కావడంతో, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను  అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ, చేజారిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు అందిపు చ్చుకు నేందుకు కాంగ్రెస్, అధికారం కోసం హంగ్ కలలు కంటున్న జేడీఎస్ మాత్రమే కాకుండా కర్నాటక ఎన్నికలు జాతీయ స్థాయిలో కూడా అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటక ఎన్నికలలో విజయం ఎవరిదన్న దానిపై ఇప్పటి వరకూ వచ్చిన పలు ప్రీ పోల్ సర్వేలు రాష్ట్రంలో హంగ్ అనివార్యం అని పేర్కొన్నాయి. అయితే తాజాగా కర్నాటక ఎన్నికలపై శ్రీ ఆత్మసాక్షి సర్వే మాత్రం ఆ రాష్ట్రంలో బీజేపీకి విజయం చాలా దూరం అని పేర్కొంది.  కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి అవసరమైన స్థానాలను సాధిస్తుందనీ, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అయిన 113 స్థానాల కంటే ఎక్కువ స్థానాలనే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని పేర్కొంది.   శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ 115 నుంచి 127 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక  ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విజయం సాధించే స్థానాలు 77 నుంచి 88 వరకూ ఉండోచ్చని తేల్చింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుందనీ, హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందనీ అంచనాలున్న జేడీఎస్ 29 నుంచి 36 స్థానాలకు పరిమితమౌతుందనీ శ్రీ ఆత్మసాక్షి సర్వే తేల్చింది. ఇతరులు మూడు నుంచి ఎనిమిది స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.  ఆత్మసాక్షి సర్వే 2018లో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసిన సర్వే అంచనాలు కచ్చితంగా రావడంతో తాజా ప్రీపోల్ సర్వేపై కూడా రాజకీయ పరిశీలకులు విశ్వసనీయత వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ ఆత్మసాక్షి సర్వే బీజేపీ 102 నుంచి 105 స్థానాలలో విజయం సాధిస్తుందని అంచనా వేయగా.. ఆ పార్టీ 104 స్థానాలలో విజయం సాధించింది. అదే విధంగా కాంగ్రెస్ 76 నుంచి 78 స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయని పేర్కొనగా ఆ పార్టీ 78 స్థానాలలో విజయం సాధించింది. అలాగే జేడీఎస్ కు 35 నుంచి 38 స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేస్తే ఆ పార్టీ 37 స్థానాలలో గెలుపొందింది. ఈ సారి కర్నాటకలో  కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది.  రాష్ట్రంలో హంగ్ పరిస్థితి లేదని ఆ సర్వే తేల్చింది.