ఏపీఎస్ ఆర్టీసీలో మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్ విధానం
posted on May 5, 2023 @ 9:31AM
రైల్వే, విమాన ప్రయాణికులు తమ గమ్యస్థానానికి నేరుగా సర్వీసులు లేకపోతే.. మధ్యలో వేరొక చోట రైలు లేదా విమానం మారి ఎలా ప్రయాణిస్తారో అలాంటి ఏర్పాట్లను ఏపీఎస్ ఆర్టీసీలో అమల్లోకి తెస్తున్నారు. ఆర్టీసీ బస్సులో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు నేరుగా బస్సు లేకపోతే మధ్యలో వేరొక నగరం, పట్టణంలో బస్సు మారి వెళ్లేందుకు ఒకే టికెట్ తీసుకునే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు.
మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్ పేరిట దీనిని రూపొందించారు. ఉదాహరణకు అనంతపురానికి చెందిన ఓ ప్రయాణికుడు శ్రీకాకుళానికి వెళ్లేందుకు నేరుగా బస్సు ఉండదు. కొత్త విధానంలో అనంతపురం నుంచి విజయవాడకు ఒక బస్సులో వచ్చి, విజయవాడ నుంచి శ్రీకాకుళానికి వేరొక సర్వీసులో వెళ్లేందుకు ఒకే టికెట్ తో రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఇలా రెండు బస్సుల్లో ప్రయాణించేందుకు రిజర్వేషన్ చేసుకున్నాసరే కేవలం ఒక్కసారి మాత్రమే రిజర్వేషన్ ఛార్జి తీసుకోనున్నారు.
ప్రయాణికుడు తొలుత ఒక బస్సులో వెళ్లి ఓ పట్టణం లేదా నగరంలోని వేరొక బస్సులోకి మారేందుకు 2 నుంచి 22 గంటల గడువునిచ్చారు. ఆ సమయాల్లో ఉన్న సర్వీసులలో ముందుగానే రిజర్వేషన్ చేసుకోవచ్చు. మొత్తంగా 137 మార్గాల్లో ఈ విధానాన్ని తొలిసారి అమలుచేయనున్నారు. యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారాగానీ, ఆర్టీసీ ఆన్లైన్ పోర్టల్ ద్వారాగాని ఈ రిజర్వేషన్లు చేసుకునేందుకు వీలుంది. దేశంలోని ప్రభుత్వరంగ ఆర్టీసీల్లో ఏపీలోనే ఈ విధానం తొలిసారి అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ విధానం ప్రారంభం కానుంది.
ఎన్ని సంస్కరణలు తెచ్చినా చాలా కాలంగా ఆర్టీసీ నష్టాల్లోనే ఈదుతోంది.. ఒకే టిక్కెట్.. రెండు బస్సులలో ప్రయాణం..ఆర్టీసీని లాభాల బాట పట్టించడంలో సహాయకారిగా ఉంటుందా అనేది కాలమే నిర్ణయించాలి.