అకాల వర్షాలతో అన్నదాత అలో లక్ష్మణా!
posted on May 4, 2023 @ 2:28PM
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరలకే కొంటామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఒక్క గింజ కూడా వదలకుండా కొనుగోలు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు కేసీఆర్ అయినా రైతులకు భరోసా కలగడం లేదు. గత అనుభవాలు వారికి ప్రభుత్వ ప్రకటనలపై నమ్మకం లేకుండా చేసింది. అందుకు తగ్గట్టే యిప్పటికింకా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి...పంట నష్టం అంచనా వేసే కార్యక్రమం యింకా ప్రారంభమే కాలేదు.
తడిసిన ధాన్యం కొనుగోళ్లకు ఇరు రాష్టాల్లో ముందుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వరి, మక్క,జొన్న తదితర పంటలను తక్షణమే కొనుగోలు చేయాలి. ధాన్యం సేకరణలో తడిసిన ధాన్యం సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ విషయంలో అవసరమైతే నిబంధనలు సడలించైనా సేకరణ ప్రారంభించాలి. అకాల వర్షాలకు కల్లాలే కాదు రైతుల కళ్లు కూడా నీటితో నిండిపోయాయి. అకాల వర్షాలు అన్నదాతలను ఆగంఆగం చేశాయి. చేతి కందిన పంటలను దారుణంగా దెబ్బతీశాయి. అటు నేలవాలిన పంటలు, ఇటు ధాన్యం కుప్పల్లో వస్తున్న మొలకలు చూసి రైతాంగం బెంగటిల్లుతోంది. అన్న దాతను ఆదుకునే దిశగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు యింత వరకూ ఒక్క అడుగు కూడా వేయలేదు.
అటు కేంద్రమూ ముందుకు రాలేదు. రాష్ట్రప్రభుత్వాలైతే ఆదుకుంటామంటూ ప్రకటనలైనా చేశాయి. కేంద్రం నుంచి ఆ మాత్రం భరోసా కూడా రాలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలు రైతన్నకు భరోసా, ఆత్మస్థైర్యం యివ్వవు. వారికి సాయం అందితేనే భరోసా వస్తుంది. ఆత్మస్థైరం వస్తుంది. నష్టపరిహారం యిచ్చి తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తే సరిపోదు.. మళ్లీ పంట వేయడానికీ రైతుకు సహాయం అందాలి. ప్రభుత్వాధినేత ప్రకటనలు యింకా కార్యరూపం దాల్చలేదు. రైతుకు సహాయం అందడం లేదు. కానీ రాజకీయ విమర్శల వేడి మాత్రం అకాల వర్షాల సాక్షిగా అగ్నిపర్వతం బద్దలై లావా ప్రవహించినట్లు ప్రవహిస్తోంది. కల్లాలలో ధాన్యం నీటిలో ఉండగానే రాజకీయ విమర్శల జోరు జడివానగా మారి రైతు ఆశను చంపేస్తోంది. రైతు కష్టంలో ఉన్నప్పుడైనా రాజకీయాలను పక్కన పెట్టి ఆదుకునే విషయానికే పరిమితం కావాలి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ నేతలూ, మంత్రులూ అకాల వర్షంతో అన్నదాత కుదేలైనా కేంద్రం స్పందించడం లేదంటూ బాధల్లో ఉన్న రైతుల ముందే విమర్శల పురాణం విప్పుతున్నారు.
ఏపీలో అయితే ముఖ్యమంత్రి సమయం అంతా సమీక్షల్లోనే గడిపేస్తున్నారు. అన్నదాతను ఆదుకోవాలనీ, ఏ ఒక్క రైతూ కూడా బాధపడకూడదనీ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేసేస్తున్నారు. అయితే రైతులను ఆదుకునే దిశగా ఒక్క అడుగూ పడిన దాఖలాలు లేవ.