కర్ణాటకంలో కాసుల గలగల
posted on May 4, 2023 @ 11:06AM
విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్న పిల్లలను పెద్దలు డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయని అనుకుంటున్నావా..అని హెచ్చరిస్తారు. అంటే డబ్బులు చెట్లకు కాయవు, కష్టపడి సంపాదించాలని చెప్పడం అన్న మాట. కానీ, అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న కర్ణాటకలో.. డబ్బులు , అది కూడా కాస్తా కూస్తా కాదు కోట్ల రూపాయలు చెట్లకు కాస్తున్నాయి! అదేంటీ అని ఆశ్చర్యపోతున్నారా? అవును మరి.. మైసూరులో సోదాలకు వెళ్లిన ఐటీ అధికారులకు ఓ చెట్టుపై కోటి రూపాయలు కన్పించాయి. అధికారుల కళ్లు గప్పేందుకు ఓ కాంగ్రెస్ నేత కుటుంబసభ్యులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి ఈ సొమ్ము బండారం బయటపడింది.
అదలా ఉంటే ఈ ఎన్నికల్లో, ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న ప్రధాన పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ధనబలం ఉన్నవారితో పాటుగా, నేర చరితులకు పెద్దపీట వేశాయని, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది. ఈ వైఖరి గత ఎన్నికలతో పోలిస్తే మరింత పెరిగిందని ఏడీఆర్ ఆందోళన వ్యక్తంచేసింది. మే 10న జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీ నేతలు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఓ నివేదికను రూపొందించింది. మొత్తం 2,586 మంది అఫిడవిట్లను విశ్లేషించింది.
ఈ తాజా నివేదిక ప్రకారం ఎన్నికలో పోటీ చేస్తున్నఅభ్యర్ధులలో 42 శాతం మంది కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులున్నారు. బరిలో నిలిచిన మొత్తం మొత్తం 2,586 మంది అభ్యర్థుల్లో 1087 మంది (42 శాతం) కోటీశ్వరులని ఏడీఆర్ నివేదిక తెలిపింది. 2018 ఎన్నికల్లో యిది 35 శాతంగా ఉందని ఏడీఆర్ తెలిపింది. ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తి రూ.12.26 కోట్లుగా లెక్కగట్టింది. 2018 ఎన్నికల్లో ఈ సగటు రూ.7.5 కోట్లుగా ఉంది.
పార్టీల వారీగా చూస్తే, కాంగ్రెస్‌కు చెందిన వారు 97 శాతం మంది కోటీశ్వరులు కాగా.. బీజేపీ బరిలో నిలిపిన అభ్యర్థుల్లో 96 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. జేడీఎస్ నుంచి పోటీ చేస్తున్న వారిలో 82 శాతం మంది కోటీశ్వరులున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్ధులు మాత్రమే కాదు, స్వతంత్ర అభ్యర్ధులలోనూ కుబేరులకు కొదవ లేదని ఏడీఆర్ నివేదిక పేర్కొంది
ఏడీఆర్ విశ్లేషించిన జాబితాలో 901 మంది స్వతంత్రులున్నారు. వారిలో 215 మంది, అంటే 24 శాతం మంది కోటీశ్వరులు. వ్యక్తిగత ఆస్తుల విషయానికొస్తే.. కాంగ్రెస్ అభ్యర్థి యూసఫ్ షరీఫ్ రూ.1633 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా.. బీజేపీ అభ్యర్థి ఎన్ నాగరాజు రూ.1609 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రూ.1413 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు.
డబ్బు ఒక్కటే కాదు, బరిలో నిలిచిన అభ్యర్ధులలో నేర చరితులకూ కొదవలేదని, ఏడీఆర్ నివేదిక పేర్కొంది. నేర చరితులను బరిలో దించే విషయంలోనూ ప్రధాన పార్టీలు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 22 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ వెల్లడించింది. 2018లో క్రిమినల్ కేసులు ఉన్నవారి శాతం 15 అని తెలిపింది. మొత్తం 2,586 మంది అభ్యర్థుల్లో 581 మంది క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఇందులో 404 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని పేర్కొంది. 49 మంది అభ్యర్థులు మహిళల విషయంలో నేరారోపణలు ఎదుర్కొంటుండగా.. అందులో ఒకరిపై అత్యాచారం, 8 మందిపై హత్య, 35 మందిపై హత్యాయత్నం అభియోగాలు ఉన్నాయని ఏడీఆర్ నివేదించింది. కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థుల్లో 55 శాతం మంది నేరారోపణలు ఎదుర్కొంటుండగా.. బీజేపీలో 43 శాతం మంది ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. జనతా దళ్ సెక్యులర్‌కు చెందిన వారిలో 34 శాతం మందిపై నేరారోపణలు ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది.
మరోవైపు ఈ ఎన్నికల్లో మహిళలపై వరాల జల్లు కురిపించిన పార్టీలు.. వారికి టికెట్లు కేటాయింపులో మాత్రం మొండిచేయి చూపించాయి. 2018 ఎన్నికల్లో 8 శాతం మంది మహిళలు పోటీ చేయగా.. ఈ సారి వారి శాతం కేవలం 7 మాత్రమే. కేవలం 7 శాతం మందే బరిలో ఉన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 22 శాతం మందికి మహిళలకు టికెట్లు కేటాయించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో మొత్తం సీట్లలో కేవలం ఐదేసి శాతం మాత్రమే మహిళలకు కేటాయించాయి. జేడీఎస్ 6 శాతం మందికి టికెట్లు ఇచ్చింది. మొత్తానికి ఏడీఆర్ నివేదిక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ..అతి పెద్ద ప్రజాసామ్య దేశంలో ప్రజాస్వామ్య విలువలు మరో ..పది మెట్లు దిగజారిన నిజాన్ని నివేదించింది.