ఖమ్మం.. రాజకీయానికి కోటగుమ్మం
posted on May 4, 2023 @ 5:04PM
తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.. అన్నీ ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టునే తిరుగుతున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. గత ఏడాది ఖమ్మంలో నిర్వహించిన శంఖారావం సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత ఖమ్మం వేదికగా నిర్వహించిన తొలి సభ సైతం విజయవంతమైంది. వచ్చే ఎన్నికల నాటికి ఖమ్మం వేదికగా.. భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.
మరోవైపు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడిన తర్వాత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో సత్తా చాటిన టీఆర్ఎస్.. ఖమ్మం జిల్లాలో మాత్రం చతికిల పడింది. ఈ రెండు ఎన్నికల్లో ఒక్క టీఆర్ఎస్ అభ్యర్థి మాత్రమే గెలుపొందారు. ఈ నేపథ్యంలో పలు పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఆకర్షించి.. కారు పార్టీలోకి తెచ్చుకున్నారు కేసీఆర్. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జిల్లాలోని అన్ని స్థానాల్లో అభ్యర్థులు గంపగుత్తగా గెలవాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. మరోవైపు.. కేసీఆర్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలవకుండా.. ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్ని చేస్తామని ఇప్పటికే ఆ పార్టీ బహిష్క్రృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భీష్మ ప్రతిజ్జ చేసి.. ఆ దిశగా ఆయన వడివడిగా అడుగులు వేస్తున్నారు.
ఇంకోవైపు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేస్తా.. నేను రాజన్న బిడ్డనే కాదు.. పాలేరు బిడ్డను కూడా అంటూ ఆ పార్టీ కార్యాలయంతోపాటు తన నివాసానికి శంకుస్థాపనకు వేసిన రాయి సాక్షిగా ప్రకటించేశారు. ఇక మే 28న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జయంతి. ఆయన శతజయంతి సంవత్సరం ఆ రోజుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో 54 అడుగుల అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని.. జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించనున్నారు.
అయితే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదికగా... ఇంత హాట్ హాట్ టాపిక్‌గా ఎందుకు మారింది. అదీ తల పండిన రాజకీయ పార్టీల నేతలు, అధినేతలు.. ఈ ఖమ్మం వేదికగా ఎందుకు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అలాగే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల....సైతం ఖమ్మం జిల్లానే ఎందుకు టార్గెట్ చేసుకొన్నారూ అంటే రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పక్కనే ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభావం చాలా ఉందని వారు పేర్కొంటున్నారు. అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత.. అప్పడే జరిగిన ఎన్నికలు అంటే 2014 ఎన్నికల్లో సదరు జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సత్తా చాటాయని... అంతేకానీ ప్రత్యేక తెలంగాణ తీసుకు వచ్చానని చెప్పుకొన్న టీఆర్ఎస్ పార్టీని సదరు జిల్లా ప్రజలు ఆదరించలేదని.. అలాగే 2018 ఎన్నికల వేళ సైతం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పలు స్థానాల్లో సత్తా చాటాయని.. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ ఒక స్థానానికి మాత్రమే పరిమితమైందని వారు పేర్కొంటున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని ఈ ఖమ్మం జిల్లాకు అటు ఆంధ్రప్రదేశ్, ఇటు ఒడిశా, మరోవైపు చత్తీస్‌గఢ్ సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నాయని.. అదేవిధంగా జిల్లాలోని పలు ప్రాంతాలోని వారిపై ఆంధ్రవారి ప్రభావం అధికంగా ఉంటుందని వారు చెబుతున్నారు.
జిల్లాలో ఓ వైపు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంటే.. మరోవైపు కాసాని జ్జానేవ్వర్ సారథ్యంలో టీ టీడీపీ సూపర్ స్పీడ్‌గా వెళ్లోంటే.. ఇంకోవైపు గులాబీ బాస్ కేసీఆర్ సైతం.. కారు గెలుపు కోసం పక్కా ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నారు.
ఈ సారి ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని బావిస్తున్న బీజేపీ.. ఆ దిశగా తీవ్రంగా కృషి చేస్తోంది. ఇక బీఎస్పీ, వైఎస్సార్టీపీ సైతం ఈ ఎన్నికల్లో ఈ జిల్లాపై ఎంతో కొంత ప్రభావం చూపించనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో గెలిచిన అభ్యర్థుల పార్టీనే హైదరాబాద్‌లో అధికార పీఠాన్ని హస్తంగతం చేసుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు.